‘‘స్వంత కథ’’

(గత సంచిక తరువాయి)
సరే. మళ్లీ మనం మా బాపు పరవస్తు జియ్యరు స్వామి గారి వద్దకు వెళ్లుదాం. ఆయనా, ప్రజాకవి కాళోజీ నారాయణరావుగారు ఇద్దరూ 1915వ సంవత్సరంలోనే మడికొండ గడ్డమీద జన్మించారు. వారిద్దరు సమకాలికులు. ఇద్దరు కూడా హన్మకొండలోని ‘‘మర్కజీ’’ స్కూలు విద్యార్థులే. మా బాపు ‘‘తహెతానియా’’ అంటే మిడిల్‍ స్కూలు అయిపోగానే టీచర్‍ ట్రేయినింగ్‍ కోర్సు చేసి ఏకోపాధ్యాయ పాఠశాలలో టీచర్‍ ఉద్యోగం 1935లో సంపాదించినాడు. మరాఠ్వాడా గ్రామాలలో టీచర్‍గా పనిచేస్తూ 1948 పోలీస్‍ యాక్షన్‍ పూర్తికాగానే హైద్రాబాద్‍ నగరానికి పర్మనెంటుగా తబాదలా అయినాడు.
ఇక మా అమ్మ జగన్నాధమ్మ. ఆమె తిరునగరి వంశానికి సంబంధించినది. ఆమె పుట్టినిల్లు హైద్రాబాదు నగరం. ఆమె పేరు పుట్టుక వెనుక కూడా ఒక పిట్ట కథ ఉంది. ఆమె నాయనగారు అంటే నా మాతామహుడు ఒక భక్తుడు. కాలి నడకన పుణ్యతీర్థాలకు సంచారం చేసేవాడు. ఒకసారి ఆయన ఓఢ్రదేశంలోని పూరీ జగన్నాథ దేవాలయానికి వెళ్లి వచ్చేసరికి ఆయన అర్థాంగి అంటే మా అమ్మమ్మగారు ఆడ పిల్లకు జన్మనిచ్చిందట. జగన్నాధుని దర్శనానంతరం పుట్టిన బిడ్డ కావున జగన్నాధమ్మ అని నామకరణం చేసాడట. ఆయన కవి, పండితుడు. గొంతెత్తి శ్రావ్యంగా పాండు రంగని కీర్తనలు పాడేవాడట. అపుడపుడు ఆరవ నిజాం మెహబూబ్‍ అలీ పాషా దర్బారుకు వెళ్లి ఒక పద్యమో, పంచరత్నాలో పాడితే నవాబుగారు సంతసించి ఒక అష్రఫీ (బంగారు నాణెం) ఇచ్చేవాడట. ఆయన అట్లా వచ్చిన అష్రఫీలన్నీ జమచేసి ఒక బంగ్లా కట్టుకున్నాడట. మా మాతామహుడి వంశపారం పర్య లక్షణాల వలన నాకు సాహిత్యాభిలాషా, సంచార సుగుణాలు అబ్బినవని నా అభిప్రాయం.
నాకు నా బాల్యదశలో మా ఇల్లు మా కుటుంబమే నా మొదటి పాఠశాలగా మారింది. ఇల్లు ఇల్లంతా విద్యాగంధ సువాసనలే. మా అమ్మమ్మకు రెండు కండ్లూ కనిపించవు. అయినా మా పెద్దక్క ఆమెకు కథల పుస్తకాలు చదివి వినిపిస్తుంటే సందర్భానుసారంగా ఆమె నవ్వుతూ ఏడుస్తూ ఆ కథలు వినేది. తాను కూడా తన మనవరాళ్లకు కట్టుకథలు, పిట్టకథలు వినిపించేది.• ఇంట్లో మా అమ్మా, బాపు, అక్కలు అందరూ చదువరులే. లైబ్రరీల నుండి పుస్తకాలు తెప్పించుకుని చదివేవారు.
నా అదృష్టం కొద్ది నాకు పాలు, పాట, రంగురంగుల బొమ్మల కథల పుస్తకాలు ఏకకాలంలో తొలి బాల్యదశలో పరిచయం అయినాయి. అదెట్లా అంటే ఇంటిపని వంటపని అంతా అయినాక మా అమ్మ నన్ను పక్కలో పండబెట్టుకుని, పాలు త్రాగిస్తూ, తను చేతిల చందమామ, రంగుల బొమ్మల కథల పుస్తకం పట్టుకుని ఏకదీక్షగా చదువుకుంటూ ఆ అక్షరాల ప్రపంచంలో లీనమైపోయేది. నేను పాలు తాగినంత సేపు తాగి కడుపునిండినాక పాట కోసమో, పదం కోసమో అమ్మ ముఖంవైపు తల ఎత్తి చూసేసరికి అమ్మముఖం చందమామ కథల పుస్తకం వైపు తిరిగి ఉండేది. నేను మళ్లీ ఆ పత్రిక వైపు ముఖం తిప్పి చూసేవాడిని.
అదొక రంగురంగుల ప్రపంచం. బొమ్మల ప్రపంచం. ఆ బొమ్మలన్నీ నన్నే చూస్తూ, నాతో మాట్లాడుతున్నట్లుగానే అనిపించేది. రాక్షసులను, మాంత్రికులను, దయ్యాలను చూస్తుంటే భయం అనిపించి, దేవతలు, దేవుండ్లు, పక్షులు, జంతువుల బొమ్మలు తెలియని సంతోషాన్ని కలిగించేవి. అక్షరజ్ఞానం లేని నాకు రంగు రంగుల బొమ్మల ద్వారా జ్ఞానమార్గం లోకి ఓం ప్రథమంగా అడుగుపెట్టాను.
రంగుల బొమ్మల తర్వాత పాటలు నా బాల్య జీవితాన్ని, కాంతిమయంగా వెలిగించాయి. మా ఇల్లు ఇల్లంతా కూచుంటే ఒక కథ నిలుచుంటే ఒక పాటలా ఉండేది. మా అమ్మది కమనీయమైన కంఠస్వరం. పాటలో ఒక పదాన్ని విడగొట్టి, విడగొట్టిన విరామంలో ఒక తీగలాంటి అలౌకిక రాగాన్ని తీసేది. బాలుడినైన నాకు ఆ పాట ఆర్థం కాకున్నా ఆ రాగం నన్ను బలంగా పట్టుకుని వెంటాడేది. ఆ పాటలు, ఎప్పుడు, ఏ కాలంలో ఎవరు రాసారో ఎవరికీ ఇప్పటికీ తెలియదు.

‘ఆచ్చి పిట్టమ్మా – పిట్టరావే పిట్టా – పిల్లల్లా తల్లీ.
కోలా తేవే పిట్టా – కోమాండ్లా తల్లీ.
రావే రావే పిట్టా – రతనాల పిట్టా.
మా చిన్ని నాయినా – ఏందుకేడ్చిండు.
ఏడ్వాకూ ఏడ్వాకూ – ఒ చిన్న నాయినా
ఏడిస్తే నీ కండ్లూ – నీలాలూ కారు
నీ కండ్లా నీలాలూ – నే జూడాలేను.
నా చిన్ని నాయినా – ఎక్కడాడి వచ్చే
తంగేడు చెట్టు క్రిందా – రింగాడి వచ్చే.
ఏడ్వాకూ ఏడ్వాకూ – నా చిన్ని నాయినా
ఏడిస్తే నీ మామ – బుద్దులూ చెప్పు.’
అమ్మ పాడే మరో భజన గీతం నన్ను మంత్రించి, మరిపించి, మురిపించేది.
‘రండయ్యో, రండయ్యో – పండారీ పురమునకూ
పదామూ రండయ్యో.- రంగా శ్రీరంగా
ఏదీ గతినాకూ.’ – పండరి పురమున
ఇటుక రాతిపై పడుకుని ఉన్నాడే.

మా చిన్నప్పుడు మేం చాలా బక్క ప్రాణులం. ఊఁ అంటే రోగాలు. ఆఁ అంటే రోగాలు. మాకు రోగాలు వస్తే రాత్రుళ్లు నిద్రలు లేకపోయేది. శివరాత్రి జాగారాలే. అమ్మకు పగలంతా చాకిరితో నడుములు విరిగేపని. ఒళ్లు హూనం హూనం అయ్యి రాత్రి పూట మొద్దు నిద్రపోయేది. మేం జ్వరం బాధతో మూలుగుతుంటే మా బాపుకు నిద్రపట్టకపోయేది. మా పక్కన పడుకుని జోకొడుతూ ఆ అంటూ రాగాలాపన మొదలు పెట్టగానే మా మూలుగులు ఆగిపోయేవి.
బుజబుజ రేకుల బుజ్జయ్యా – కథ చెబుతా విను కన్నయ్యా
కాకి బజారుకు పోయిందీ – మాంసం ముక్కా తెచ్చిందీ
చెట్టు మీదా కూచుందీ – నక్కా ఒకటి వచ్చిందీ
మాంసం మ్కును చూసింది….
ఇట్లా పాటను అసువుగా అప్పటికప్పుడు కల్పించి రాగయుక్తంగా పాడేవాడు. మా అమ్మాబాపులు మాకు వారసత్వ సంపదగా ఆస్తులను ఇవ్వకున్నా కథలను, పాటలను దండిగా, మెండుగా ఇచ్చారు. అమ్మ చెప్పే ఆవు-పులి కథ వింటుంటే నాకు దుఃఖం ముంచుకొచ్చేది. ‘‘చేపా చేపా ఎందుకెండలేదు’’ చివర్ల ఓ చీమ చెప్పిన జవాబు విని కిలకిలా నవ్వేది. మా నాయనమ్మ చెప్పే జిత్తులమారి నక్కబావ కథలు ఆమె ప్రారంభించక ముందే మాకు నవ్వులు వచ్చేవి. ఇల్లు అలుకుతూ అలుకుతూ చివరికి తన పేరునే మరిచిపోయిన ఈగ కథ కూడా మాకు ఇష్టంగా ఉండేది. మనుషులను తినే పెద్ద పులి అన్నా, పగబట్టే పాములన్నా కరిచే కుక్కలన్నా మాకు భయం ఉండి రాత్రుళ్లు కలల్లోకి వచ్చి మమ్మల్ని రాత్రిపూట మేల్కొల్పేవి. కొంచెం పెద్దగయినాక దొంగలు మా కలల్లోకి వచ్చి మమ్మల్ని భయపెట్టేవారు.
ఇక మా బాపు సర్కారీ ప్రాథమిక పాఠశాలకు ‘‘సదర్‍ సాబ్‍’’ అంటే హెడ్‍మాస్టర్‍. ఎండాకాలం సెలవులలో ఆయన స్కూలు గ్రంథాలయం నుండి తెలుగు పిల్లల కథల పుస్తకాలు పట్టుకొచ్చేవాడు. ఇక ఆ నెలన్నర ఇంటిల పుస్తకాల పండుగ. ప్రతి కథకు బొమ్మలుండేవి. కథ మధ్యలో బొమ్మల్ని చూస్తూ ఊహ లోకాలలో తేలిపోయేవారం. ప్రతి కథ చివరలో కథకు సంబంధించిన పాట రాగయుక్తంగా ఉండేది.
చిట్టి పొట్టి కథలు, పాటలు చందమామ పత్రిక దాటి పిల్లల నవలా పఠనం, టీచర్‍గా పనిచేస్తున్న మా చిన్నక్క వెంకటమ్మ పుణ్యమా అని ప్రారంభమయ్యింది. ఆమె తన స్కూలు నుండి ఒక అద్భుతమైన నవల పట్టుకొచ్చి నా జీవితాన్ని ఒక మలుపు త్రిప్పి కొత్త మజిలీలోకి ప్రవేశపెట్టింది. అది ఆర్‍.కె. నారాయణ్‍ రాసిన ‘‘స్వామి స్నేహితులు’’ తెలుగు అనువాద నవల. దాంతో నాకు నా ఊహలోకాల కొత్త ద్వారాలు తెరుచుకున్నాయి. స్వామి పాత్ర నా (Alter Ego) ఆత్మకు ప్రతిబింబ మయ్యింది. నా లోపలి మనోవీధులు మరింత విశాలమైన్నాయి. మా అమ్మా, బాపుకు గ్రంథాలయంలో సభ్యత్వం ఉన్నందున నాతో నవలలు తెప్పించుకునేవారు. అట్లా నాకు కొన్ని పిల్లల నవలలు దొరికాయి. పోలవరపు శ్రీహరి రావు రాసిన ‘‘బజారు బిడ్డలు’’ గొల్లపూడి మారుతీరావు రాసిన ‘‘రజనీకాంత్‍’’ గీతా సుబ్బారావు రాసిన ‘‘పారిపోయిన బఠానీ’’ పిల్లల నవలలు నా రాబోయే ‘‘భవిష్యత్‍ చిత్ర పటాన్ని’’ చిత్రిక పట్టటమే గాక తీర్చిదిద్దాయి.

అది డిటెక్టివ్‍ నవలలు సాహిత్య లోకాన్ని రాజ్యమేలుతున్న కాలం. నేను కౌమార దశను దాటి నవ యవ్వన ప్రాంగణంలో కాలిడుతున్న కాలం. ఇంట్లో అందరూ ఆ పుస్తకాలు చదువుతున్నపుడు వారందరి కన్నా ముందే నేను వాటిని కరకరా పరపరా నమిలి మింగేసేవాడ్ని. కొమ్మూరి సాంబశివరావు, టెంపోరావు, విశ్వప్రసాద్‍ల రచనలు నాకు ప్రాణప్రదమైన్నాయి. నా రక్తంలోని సాహస ప్రవృత్తిని అవి రెచ్చగొట్టటమే గాక చక్కిలిగింతలు పెట్టే ఆ లలిత లలిత శృంగారం నాలో ‘‘నిద్ర పోతున్న చెరువులో నీలి అలల్లాగ’’ ప్రకంపనాలు సృష్టించేవి. చిన్న పిల్లలు డిటెక్టివ్‍ పుస్తకాలు చదువరాదని మా బాపు హిత బోధ చేసినా మనం మాత్రం ‘‘హమ్‍ నహీఁ సుద్‍రింగే’’ బాపతు.
ఒక రోజు సాయంకాలం మల్లెపందిరి క్రింద మంచమేసుకుని, కాలు మీద కాలువేసుకుని పురుసత్‍గ కొమ్మూరి సాంబశివరావు ‘‘నల్లతేలు’’ డిటెక్టివ్‍ నవల చదువుతుంటే పానకంలో పుడకలా మా ట్యూషన్‍సార్‍ వచ్చి ‘ఏమోయ్‍! నువ్వు డిటెక్టివ్‍ నవలలు కూడా చదువుతావా? ఇట్లయితే నువ్వు బాగుపడ్డట్టే! పదిసార్లు రాసినా నువ్వు హెచ్‍.ఎస్‍.సి పరీక్షలు పాస్‍ కావు అని ఘోరాతిఘోరంగా కోపిష్ఠి విశ్వామిత్రుడిలా శపించాడు.
ఆ తర్వాత నేను ఇంకా ఇంకా బాగా చెడిపోయాను. స్కూలు చదువులు, పాఠ్య పుస్తకాలు రసవిహీనంగా, రంగు రుచి వాసనా లేని ఇసుప గుగ్గిళ్లలాగా అనిపించసాగాయి. తరగతి గదిలో ఒక మూల ఆఖరి బెంచీలో ఆసీనుడనై ఇలను వదిలి కలల్లో, ఊహల్లో రంగుల లోకాల్లో తేలిపోయేవాడిని.
ఆ తర్వాత రోగం ముదిరి పైత్యం పెరిగింది. ఏకంగా స్కూలుకు డుమ్మాకొట్టి గ్రంధాలయాల్లో కూచుని గంటలు, గంటలు పుస్తకాల రుచి మరిగాను. వరుసగా పదిరోజులు స్కూలు మానేసినందున ఇంటికి కబురందిన వార్త నాకు తెలిసి, దేహ శుద్దికి శంకించి ఆపైన జంకి బైరాగీటిక్కెట్టు మీద బెజవాడ బండీ పట్టుకున్నాను. ఆ నగరంలో మురమరాలు బుక్కుతూ అందులోకి గల్లా ఉప్పు, పచ్చి మిరపకాయ ముక్కలు నంచుకుంటూ, సర్కారీ నల్లాల క్రింద మూతి పెట్టి నీళ్లు త్రాగుతూ, ‘‘ఉప్పులు-ఉపోసాలు’’ పడుతూ ఇండ్ల అరుగుల మీదా, బజారుల్లోని ఫుట్‍పాత్‍ల మీదా నిద్రపోతూ, బైరాగులతో, సన్యాసులతో కొన్ని దూరాలు నడుచుకుంటూ ‘‘బజారు బిడ్డ’’ వలె బ్రతికి ఇంటిమీది మనాదితో గృహోన్మఖుణ్ణి అయినాను. నా దేశ సంచారానికి అది తొలిమెట్టు. అప్పటికి నాకు సంజీవ్‍దేవ్‍, రాహుల్‍ సాంకృత్యాయన్‍లు పరిచయం కాలేదు. ఆదినారాయణ ఇంకా పుట్టలేదు.
త్రికరణశుద్దిగా వాంఛించి, ఏరీ కోరి హెచ్‍ఎస్‍సీ పరీక్షలు నిర్లక్ష్యంగా సగంసగం రాసి ఉద్దేశ్యపూరకంగానే, విజయవంతంగా విఫలమైనాను. ఆ విధంబుగా పూజ్యులైన నా మాతా, పితరులకు నేనొక సమస్యాత్మక పుత్ర రత్నాన్ని కూడా అయినాను.
నేరం నాది కాదు నాలోపల నరనరాల్లో ప్రవహించే నా పూర్వుల రక్తానిది. జన్యు కారణ సంభూతుడిని. నా రక్తంలో సంచార తత్వానికి నా పూర్వీకులు కూడా బాధ్యులే. (తరువాయి వచ్చే సంచికలో)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *