రాయి రాయి రాపిడితో నిప్పుపుట్టినా, వెదురుపొదల గాలిచేరి పాట పుట్టినా, అవసరాలు తీరుటలో సాధనాలు ముఖ్యం, సాధనాలు పుట్టుకయే విజ్ఞానపు గమ్యం అన్న విజ్ఞుల మాటలు అక్షర సత్యాలు. నేటి కన్నా రేపు మరింత సౌఖ్యమైన, సౌకర్యవంతమైన భవిష్యత్‍ను పొందాలన్న మానవుని నిరంతర తపన, వైజ్ఞానిక రంగంలో అనేక నూతన సాంకేతికతలను సృజియించింది. అలా మానవాళిని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితిలోకి నిలిపే మరో వినూత్న సాంకేతిక పరిజ్ఞానమే క్యూటీ. క్యూటీ అంటే క్వాంటం టెక్నాలజీ. మనదేశంతో పాటు, మన దేశంలోని విభిన్న రాష్ట్రాలు క్వాంటం టెక్నాలజీకి అమిత ప్రాధాన్యమిస్తున్నాయి. అంతేకాదు, ఐక్యరాజ్యసమితి 2025వ సంవత్సరాన్ని ‘‘ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటం సైన్స్ అండ్ టెక్నాలజీ’’గా ప్రకటించడం, క్వాంటం టెక్నాలజీకి ఉన్న విశేష ప్రాముఖ్యతను తెలుపుతోంది. ఈ నేపథ్యంలో క్వాంటం టెక్నాలజీ యొక్క విశిష్టతలను, విశేషాలను మనం కూడా తెలుసుకుందాం.
అసలు క్వాంటం టెక్నాలజీ అంటే..!!
‘‘క్వాంటా’’కు ఏకవచన రూపాన్ని క్వాంటం అంటారు. ఇది లాటిన్ పదం. ఏదైనా భౌతిక చర్యలో పాల్గొన్న భౌతిక రాశి యొక్క విభజించదగిన అతి చిన్న రూపాన్ని ‘‘క్వాంటం’’ అంటారు. లాటిన్ భాషలో క్వాంటం అనగా మొత్తం (An Amount), ఎంత (How Much) అని అర్థం.
ఏదైనా ఒక భౌతికరాశిలోని అణువులు మరియు అతి సూక్ష్మ ప్రాథమిక కణాల ప్రవర్తనను లేదా స్వభావాన్ని వివరించే సాంకేతికతను ‘‘క్వాంటం సాంకేతికత’’ (Quantum Technology) అంటారు. ఏదైనా ఒక భౌతిక రాశిలోని పరమాణువులు, ఎలక్ట్రాన్లు, ప్రోటాన్ల వంటి సూక్ష్మ కణాల ప్రవర్తనను సంపూర్ణంగా ఈ సాంకేతికత ద్వారా అర్థం చేసుకోవచ్చు.
మాక్స్ ఫ్లాంక్, ఆల్బర్ట్ ఐన్‍స్టీన్, నీల్స్బోర్, ష్రోడింగర్ వంటి శాస్త్రవేత్తలు క్వాంటం సాంకేతికత పైన విశేష పరిశోధనలు చేశారు. వారి పరిశోధనలు ఆధునిక భౌతిక శాస్త్ర ఆవిర్భావానికి పునాది వేశాయి.
వెర్నర్ హైసెన్ బర్గ్ అన్న జర్మన్ భౌతిక శాస్త్రవేత్త ఆధునిక క్వాంటం మెకానిక్స్కు పునాది వేస్తూ 1925లో ఒక కీలక పరిశోధనా పత్రాన్ని ప్రచురించారు. దీనికి గానూ ఇతనికి 1932లో నోబెల్ బహుమతి లభించింది. హైసన్ బర్గ్ తన పరిశోధనా పత్రాన్ని ప్రచురించి 2025 నాటికి ఒక శతాబ్దం పూర్తి కావడాన్ని స్మరించుకోవడానికి మరియు క్వాంటం సాంకేతికత పట్ల ప్రజలలో అవగాహన పెంచడానికి ఐక్యరాజ్యసమితి 2025వ సంవత్సరాన్ని అంతర్జాతీయ క్వాంటం సైన్స్ అండ్ టెక్నాలజీ సంవత్సరంగా ప్రకటించింది.
క్వాంటం సాంకేతికత – ఎలా పనిచేస్తుంది
క్వాంటం ఫిజిక్స్ యొక్క మూలభావనల ఆధారంగా సాధారణ సాంకేతికతతో పోలిస్తే, క్వాంటం సాంకేతికత మెరుగైన పనితీరును ప్రదర్శిస్తుంది. క్వాంటం సాంకేతికత మాత్రమే ప్రదర్శించే కొన్ని ప్రత్యేక లక్షణాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి క్వాంటం సాంకేతికత పనితీరులో కీలకపాత్ర పోషిస్తాయి.
i) క్వాంటం సూపర్ పొజిషన్:
సాంప్రదాయ భౌతిక శాస్త్రంలో ఒక కణానికి ఏ సమయంలోనైనా ఒక నిర్దిష్టస్థానం ఉంటుంది. మనం కొంత వరకు ఖచ్చితత్వంతో దాని స్థానాన్ని గుర్తించగలం. కానీ క్వాంటం ఫిజిక్స్లో ఏదైనా ఒక కణం ఒక నిర్దిష్ట స్థితిలో కాకుండా, ఒకే సమయంలో బహుళ స్థితులలో, స్థానాలలో ఉంటుంది.
ఉదా।। ఒక లైట్ స్విచ్ ఆన్ లేదా ఆఫ్ అనే నిర్దిష్ట స్థితిలో ఉంటుంది. కానీ ఒకే సమయంలో ఆన్, ఆఫ్ రెండు స్థితులలో ఉండవచ్చు. అణువులు, ఎలక్ట్రాన్లు, ప్రోటాన్ల వంటి కణాలు, కణస్థితిలోనూ మరియు తరంగ స్థితిలో ఉండడాన్ని ‘‘సూపర్ పొజిషన్’’ అంటారు. చెరువులో ఏదైనా అలికి ఏర్పడినప్పుడు ఒక అలఏర్పడి, అది అలా కదులుతుండగానే మరో అల ఏర్పడి మొదటి అలలో కలిసిపోయిన చందంగా క్వాంటం సూపర్ పొజిషన్‍లో కూడా ఒక స్థితి మరో స్థితిలో కలిసిపోయి కణాలు బహుళ స్థితులలో ఉంటాయి.
ii) క్వాంటం ఎంటాంగిల్ మెంట్:
ఒక కణం సూపర్ పొజిషన్‍లో ఉన్నప్పుడు ఆ కణంలో జరిగే మార్పు, అది ఎంత దూరంలో ఉన్నప్పటికీ వాటి మధ్య దూరంతో సంబంధం లేకుండా తక్షణమే మరొక కణాన్ని ప్రభావితం చేయడాన్ని క్వాంటం ఎంటాంగిల్‍మెంట్ అంటారు. ఈ దృగ్విషయాన్ని 1964లో జాన్ బెల్ అన్న భౌతిక శాస్త్రవేత్త నిరూపించాడు. క్వాంటం ఎంటాంగిల్ మెంట్ స్థితి నందు కణాలు ఒకదానితో మరొకటి అనుసంధానించబడి, స్వతంత్రంగా వర్ణించలేని స్థితిలో ఉంటాయి. సంక్లిష్ట సమస్యలను క్వాంటం ఎంటాంగిల్ మెంట్ విధానం ద్వారా తక్షణమే పరిష్కరించేందుకు వీలుగా క్వాంటం అల్గారిథంలు రూపొందించబడ్డాయి.
iii) క్వాంటం టెలీ పోర్టేషన్:
తెలియని క్వాంటం స్థితిని ఎక్కువ దూరాలకు బదిలీ చేయడాన్ని క్వాంటం టెలీ పోర్టేషన్ అంటారు.
iv) క్వాంటం ఇంటర్‍ఫెరెన్స్:
ఇంటర్ ఫెరెన్స్ అనగా జోక్యం చేసుకోవడం అని అర్థం. సబ్ అటామిక్ కణాలు సూపర్ పొజిషన్ స్థితిలో ఉన్నప్పుడు తమని తాము ఇతర కణాలతో సంకర్షణ చెందడం ద్వారా పరస్పరం బలోపేతం కావడం లేదా రద్దు కాబడినట్లయితే ఆ దృగ్విషయాన్ని క్వాంటం ఇంటర్ ఫెరెన్స్ అంటారు. క్వాంటం ఇంటర్ ఫెరెన్స్ 2 రకాలుగా ఉంటుంది. అవి
i) కన్‍స్ట్రక్టివ్ ఇంటర్ ఫెరెన్స్ (నిర్మాణాత్మక జోక్యం):
సబ్ అటామిక్ కణాలు ఒకదానితో మరొకటి సంకర్షణ చెంది బలోపేతం కావడాన్ని ‘కన్‍స్ట్రక్టివ్ ఇంటర్ ఫెరన్స్’’ అంటారు.
ii) డిస్ట్రక్టివ్ ఇంటర్ ఫెరెన్స్ (విధ్వంసక జోక్యం):
సబ్ అటామిక్ కణాలు ఒకదానితో మరొకటి సంకర్షణ చెంది రద్దు కావడాన్ని ‘‘డిస్ట్రక్టివ్ ఇంటర్ ఫెరెన్స్’’ అంటారు. ఉదా।।కు మళ్ళీ చెరువులో అలలు అన్న ఉదా।।ను పరిశీలిస్తే, చెరువులో రెండు రాళ్ళను వేయడం వల్ల, రెండు అలలు లేదా తరంగ సమూహాలు ఏర్పడతాయని భావించినట్లయితే, కొన్ని ప్రదేశాలోల రెండు అలలు లేదా తరంగాల ఎత్తైన బిందువులు లేదా శిఖరాలు ఢీకొంటాయి. ఫలితంగా పెద్ద తరంగం ఏర్పడుతుంది. మరికొన్ని ప్రదేశాలలో ఒక అల లేదా తరంగం యొక్క ఎత్తైన బిందువు మరొక అల లేదా తరంగం యొక్క దిగువు బిందువు లేదా పతన బిందువును ఢీకొంటుంది. దీంతో రెండూ రద్దు అవుతాయి.
iii) క్వాంటం అబ్జర్‍వెన్స్ (క్వాంటం పరిశీలన):
సబ్ అటామిక్ స్థాయిలో కణాలు సూపర్ పొజిషన్‍లో ఉన్నప్పుడు ఒకదానితో మరొకటి పరస్పరం చర్య జరిపి, వాటి స్థితులను మార్చుకోవడాన్ని క్వాంటం అబ్జర్‍వెన్స్ లేదా క్వాంటం మెజర్‍మెంట్ అని కూడా అంటారు. ఈ స్థితిలో కణాలు సూపర్ పొజిషన్ నుండి ఒక నిర్దిష్టమైన స్థితిలోకి మారతాయి. ఇలా మారడాన్ని వేవ్ ఫంక్షన్ పతనం (wave function collapse) లేదా క్వాంటం ప్రాపర్టీ పతనం (Collapse Quantum Property) అంటారు.
క్వాంటం సాంకేతికత – అనువర్తనాలు:

i) క్వాంటం మెకానిక్స్ :
20వ శతాబ్దంలో క్వాంటం మెకానిక్స్ అనే కొత్త శాస్త్రం ప్రారంభమైంది. ఇది పరమాణువులు, ఎలక్ట్రాను, ప్రోటాన్లు వంటి సూక్ష్మ కణాల ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుంది. ముందే చెప్పుకున్నట్లు క్వాంటం మెకానిక్స్ పురోగతి, ఆధునిక భౌతిక శాస్త్ర అభివృద్ధికి పునాది వేసింది. క్వాంటం మెకానిక్స్ ప్రకారం సూక్ష్మ కణాలు సాంప్రదాయ భౌతిక శాస్త్రనియమాలను పాటించవు. వాటి ప్రవర్తన అనిశ్చితంగా ఉంటుంది. వాటి ప్రవర్తనను ప్రాబబులిటీ వేవ్స్ ద్వారా వివరించవవచ్చు. ఇది సూపర్ పొజిషన్, ఎంటాంగిల్‍మోట్ వంటి కొత్త భావనలను పరిచయం చేసింది.
ప్రయోజనాలు:
- నేడు మన నిత్య జీవితంలో భాగమైన స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్ పనితీరుకు క్వాంటం మెకానిక్స్ సూత్రాలే ఆధారం.
- స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లలో వినియోగించే ట్రాన్సిస్టర్లు, లేజర్లు, అటామిక్ గడియారాలను క్వాంటం మెకానిక్స్ నియమాల ఆధారంగానే తయారు చేస్తారు.
ii) క్వాంటం కమ్యునికేషన్: క్వాంటం కమ్యునికేషన్ విధానంలో సుదూర ప్రాంతాలకు సమాచారాన్ని సురక్షితంగా ప్రసారం చేయవచ్చు. సాంప్రదాయ డిజిటల్ కమ్యూనికేషన్ విధానంలో సందేశాలను ‘‘కీ’’లను ఉపయోగించి డీ క్రిప్ట్ చేసి ఎన్‍క్రిప్ట్ చేస్తారు. మరియు సాంప్రదాయ బైనరీ బిట్స్ (0 లేదా1) లలో ప్రసారం చేస్తారు. కానీ క్వాంటం కమ్యూనికేషన్‍లో క్వాంటంకీ డిస్ట్రిబ్యూషన్ (QKD) విధానం, ఎన్‍క్రిప్షన్ కీలను వినియోగించ డానికి బదులుగా క్యూబిట్స్ (Q Bits)ను వినియోగించి సందేశాలను డీ కోడ్ మరియు ఎన్‍కోడ్ చేసి ప్రసారం చేస్తారు.
క్వాంటం కీ డిస్ట్రిబ్యూషన్ (QKD) విధానంలో క్వాంటం ఎన్ క్రిప్షన్ అనే సాంకేతికత ద్వారా ఫోటాన్లను ఉపయోగించి క్యూబిట్స్ (Q Bits)ల ద్వారా ‘‘కీ’’లను రూపొందిస్తారు. ఇవి చాలా సున్నితంగా ఉంటాయి. అందువల్ల వాటిని హ్యాక్ చేయడం అసాధ్యం. ఒక వేళ హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తే క్వాంటం సూత్రాల ప్రకారం ఫోటాన్లతో తయారు చేయబడిన ‘‘కీ’’లు వాటి స్వరూపాన్ని మార్చుకుంటాయి.
ప్రయోజనాలు:
i) బ్యాంకింగ్ రంగం:
క్వాంటం ఎన్‍క్రిప్షన్ విధానంలో ఆన్‍లైన్‍లో బ్యాంకింగ్ లావాదేవీలను సురక్షితంగా నిర్వహించవచ్చు.
ii) రక్షణ రంగం :
సైనిక, ప్రభుత్వానికి చెందిన విలువైన సమాచారాన్ని సురక్షితంగా భద్రపరచడానికి క్వాంటం కమ్యూనికేషన్ త్పోడుతుంది.
iii) పర్సనల్ కమ్యూనికేషన్:
వ్యక్తిగత సమాచారం సురక్షితంగా ప్రసారం కావడానికి ఈ సాంకేతికత తోడ్పడుతుంది.
క్వాంటం కంప్యూటింగ్:
గత మూడు దశాబ్దాలుగా క్వాంటం కంప్యూటింగ్ రంగం విస్తృతంగా అభివృద్ధి చెందింది.
సాంప్రదాయ కంప్యూటర్లు సాధారణ బైనరీ బిట్లు (0,1) ఆధారంగా పనిచేస్తే, క్వాంటం కంప్యూటర్లు క్యూ బిట్ల (Qbits) ఆధారంగా పనిచేస్తాయి. ఒక క్యూబిట్ ఒకేసారి 0 గానీ, 1 గానీ కాకుండా, రెండూ కలిసిన స్థితిలో మరొక క్యూబిట్ స్థితి మీద ప్రభావం చూపగలదు. దీనినే ఎంటాంగిల్ మెంట్ అంటారు.
సూపర్ పొజిషన్, ఎంటాంగిల్ మెంట్ సామర్థ్యాల వల్ల క్వాంటం కంప్యూటర్లు సంక్లిష్ట సమస్యలను పరిష్కరించే సామర్థ్యం మెరుగు పడడంతో పాటు, వేగం కూడా పెరుగుతుంది. సాధారణ కంప్యూటర్ ఒక సమస్యను పరిష్కరించడానికి ఒక్కో మార్గాన్ని వెతుక్కుంటూ వెళుతుంది. క్వాంటం కంప్యూటర్లు ఒకేసారి అన్ని మార్గాల్లో పరిష్కార మార్గాలను అన్వేషిస్తాయి.
ప్రయోజనాలు:
i) సూపర్ ఫాస్ట్ కాలిక్యులేషన్: క్వాంటం కంప్యూటర్లు క్లిష్టమైన గణిత సమస్యలను సెకన్లలో పరిష్కరించగలవు. ఇవే సమస్యలను సాంప్రదాయ కంప్యూటర్లు పరిష్కరించడానికి వేల సం।।రాలు పట్టవచ్చు.
ii) డ్రగ్ డిజైనింగ్: క్వాంటం కంప్యూటర్లు అణువుల ప్రవర్తనను అనుకరించగలవు, ఇది కొత్త మందుల అభివృద్ధిని వేగిర పరుస్తుంది.
iii) ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్: క్వాంటం కంప్యూటర్లు AI అల్గారిథమ్‍లను మరింత శక్తివంతంగా మార్చగలవు.
ప్రగతిపథంలో క్వాంటం కంప్యూటింగ్:
గూగుల్, ఐబీఎమ్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు ఇప్పటికే క్వాంటం కంప్యూటర్ల అభివృద్ధిలో శరవేగంగా అడుగులు వేస్తున్నాయి. ఇవి భవిష్యత్‍లో మెడిసిన్, ఫైనాన్స్, సైంటిఫిక్ రీసెర్చ్ వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకు రాగలవని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు.
క్వాంటం సిమ్యులేషన్:
సిమ్యులేషన్ అనగా అనుకరణ. పెద్ద క్వాంటం వ్యవస్థలను అర్థం చేసుకోవడానికి లేదా సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడానికి క్వాంటం సిమ్యులేషన్ విధానాన్ని వినియోగిస్తారు.
ఒక క్వాంటం వ్యవస్థ, మరొక క్వాంటం వ్యవస్థను ఉపయోగించి దానిని అనుకరిస్తే దానిని నియంత్రించడం మరియు అధ్యయనం చేయడం సులభం. క్వాంటం సిమ్యులేటర్లు అదే నియమాల ప్రకారం పనిచేస్తాయి. కాబట్టి వాటికి క్వాంటం మెకానిక్స్ నియమాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు.
ప్రయోజనాలు:
మిస్ ఫోల్డెడ్ ప్రొటీన్ల వల్ల అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి జన్యు సంబంధిత వ్యాధులు ఏర్పడతాయి. క్వాంటం సిమ్యులేషన్లు ఈ ప్రొటీన్ల మడతలను అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి. అలాగే ఈ వ్యాధులను నయం చేయడంలో తోడ్పడుతాయి.
క్వాంటం సెన్సింగ్ & మెట్రాలజీ:
ఇది ఒక అధునాతన సెన్సార్ టెక్నాలజీ. ఇది అణు స్థాయిలో కదలికలో మార్పులను, విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాలను విశ్లేషించడం ద్వారా అత్యంత ఖచ్చితమైన కొలతలను గుర్తించేందుకు తోడ్పడుతుంది.
ప్రయోజనాలు:
i) వైద్యరంగం:
క్వాంటం సెన్సర్లు మన శరీరంలోని తలెత్తే అతి చిన్న మార్పులను వెంటనే గుర్తించగలవు. తద్వారా క్యాన్సర్ వంటి మొండి వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చు.
ii) భూ కంపాలు, పర్యావరణ పరిశీలన:
క్వాంటం సెన్సర్లు భూకంపాలను ముందుగానే గుర్తించగలవు. తద్వారా భారీస్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించవచ్చు. అదేవిధంగా వాతావరణంలో తలెత్తే విపరీత మార్పులను కూడా ముందస్తుగా గుర్తించవచ్చు.
క్వాంటం పదార్థాలు:
క్వాంటం మెటీరియల్స్ను సోలార్ సెల్స్ మరియు శక్తి సమర్థవంతమైన పరికరాలైన బ్యాటరీలు, ఆరోగ్యరంగంలో సెన్సర్లు మరియు ఇమేజింగ్ డివైజెస్ వంటి డయాగ్నస్టిక్ పరికరాల తయారీలో వాడతారు.
క్వాంటం టెక్నాలజీ, పరిమితులు:
క్వాంటం-టెక్నాలజీతో బహుళ ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి.
i) అవుట్‍పుట్ అబ్జర్వెన్స్:
ఈ విధానంలో క్వాంటం కంప్యూటేషన్ పక్రియ పూర్తయిన తరువాత అవుట్ పుట్ ద్వారా వచ్చిన సమాచారాన్ని తిరిగి పొందినట్లయితే డేటా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది.
ii) డీ కోహెరెన్స్:
క్వాంటం సాంకేతికత ద్వారా గణన చేసేటప్పుడు స్వల్ప స్థాయిలో ఆటంకం కలిగినా మొత్తం గణన పక్రియ అంతా నిలిచి పోతుంది. దీనినే డీకోహెరెన్స్ అంటారు.
iii) భద్రతాపరమైన సమస్యలు:
క్వాంటం ఎన్‍క్రిప్టెడ్ సమాచారాన్ని డి క్రిప్షన్ సామర్థ్యం కలిగిన అక్రమ వినియోగదారులు సులువుగా పొందగలిగే అవకాశం ఉంటుంది. తద్వారా కమ్యూనికేషన్ మౌళిక సదుపాయాలు దోపిడీకి గురయ్యే అవకాశం ఉంది.
iv) దోష దిదుద్దబాటు:
క్వాంటం కంప్యూటింగ్‍లో దోష దిద్దుబాటుకు అవకాశం ఉండదు. గణన పక్రియలో ఒక్క దోషం తలెత్తినా మొత్తం గణన పక్రియ అంతా నిలిచిపోతుంది.
v) క్వాంటం గేట్లు : హై ఎండ్ కంప్యూటింగ్ అప్లికేషన్లు అధిక క్యూబిట్లు మరియు అధిక క్వాంటం గేట్లు పరిమితిని ఎదుర్కొంటున్నాయి.
క్వాంటం సాంకేతికత – ఇండియా : మన దేశంలో క్వాంటం సాంకేతికతను ప్రోత్సహించడం కోసం భారత ప్రభుత్వం ఈ క్రింది చర్యలు చేపట్టింది.

నేషనల్ క్వాంటం మిషన్ :
క్వాంటం సాంకేతికత ఆధారిత ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి, క్వాంటం టెక్నాలజీ మరియు అప్లికేషన్స్ లో (QTA) మన దేశాన్ని అగ్రగామి దేశాలలో ఒకటిగా నిలపడానికి, QTAలో శాస్త్రీయ మరియు పారిశ్రామిక పరిశోధనలను పెంచడానికి మరియు ప్రోత్సహించడానికి మరియు శక్తివంతమైన, వినూత్నమైన పర్యావరణ వ్యవస్థను సృష్టించడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం 2023లో ఈ మిషన్‍ను ఆమోదించింది.
లక్ష్యాలు:
- సూపర్ కండక్టింగ్ మరియు ఫోటోనిక్ టెక్నాలజీ వంటి వివిధ ఫ్లాట్ ఫామ్‍లపై రాబోయే 8 సం।।రాలలో 50-1000 క్యూబిట్ల సామర్థ్యం కలిగిన క్వాంటం కంప్యూటర్‍లను అభివృద్ధి చేయడం.
- మన దేశంలో 2000 కి।।మీ కంటే ఎక్కువ పరిధిలో ఉన్న గ్రౌండ్ స్టేషన్ల మధ్య సురక్షితమైన ఉపగ్రహ ఆధారిత క్వాంటం కమ్యూనికేషన్లను అభివృద్ధిని చేయడం.
- ఇతర దేశాలతో సుదూర క్వాంటం కమ్యూనికేషన్లను అభివృద్ధి పరచడం.
- శ్రీ 2000 కి।।మీ పరిధిలో ఇంటర్-సిటీ క్వాంటం ‘‘కీ’’ పంపిణీ మరియు మల్టీనోడ్ క్వాంటం నెటవర్క్లను అభివృద్ధి పరచడం.
ప్రధాన దృష్టి (Focus):
అణుగడియారాలలో, అధిక సున్నితత్వంతో కూడిన మాగ్నెటోమీటర్లు, కమ్యూనికేషన్లు మరియు నావిగేషన్, అదేవిధంగా ఖచ్చితమైన సమయనిర్ధారణకు అవసరమైన అణు వ్యవస్థల అభివృద్ధిపై ఈ మిషన్ దృష్టి సారిస్తుంది.
సూపర్ కండక్టర్లు, టోపోలాజికల్ పదార్థాలు మరియు సెమీ కండక్టర్ నిర్మాణాలు వంటి వివిధ క్వాంటం పదార్థాల రూపకల్పన మరియు సంశ్లేషణపై కూడా ఈ మిషన్ దృష్టి సారిస్తుంది.
క్వాంటం పరిశోధన సౌకర్యం:
క్వాంటం సాంకేతికత రంగంలో పరిశోధన మరియు శిక్షణను ముందుకు తీసుకెళ్ళడానికి భారత సైన్యం మద్యప్రదేశ్‍లోని మిలిటరీ కాలేజ్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్, ఇంజనీరింగ్ నందు క్వాంటం ల్యాబ్‍ను స్థాపించింది.
QEST(క్వెస్ట్) : క్వాంటం టెక్నాలజీ రంగంలో పరిశోధనా సౌకర్యాలను మెరుగుపరచడానికి భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ విభాగం క్వెస్ట్ (క్వాంటం ఎనేబుల్డ్ సైన్స్ & టెక్నాలజీ) ఇనిషియేటివ్‍ను ప్రారంభించింది.
Q Sim Tool Kit : ఇది పరిశోధకులు మరియు విద్యార్థులు క్వాంటం కంప్యూటింగ్ యొక్క ఆచరణాత్మక అంశాలను నేర్చుకోవడంలో మరియు అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. అదే విధంగా క్వాంటం కోడ్ నైపుణ్యాలను సంపాదించడానికి, అలాగే నిజమైన క్వాంటం హార్డ్వేర్‍ను రూపొందించడానికి ఒక వేదికను అందిస్తుంది.
సెంటర్ ఫర్ డెవలప్‍మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (C-DOT): ఇది మనదేశంలో ప్రముఖ టెలికం పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ. క్వాంటం రీ డిస్ట్రిబ్యూషన్ (QKD)తో ఉత్పత్తులను అభివృద్ధి చేసి ఈ రంగంలో పరిశోధనలను కొనసాగిస్తోంది.
తొలి క్వాంటం వ్యాలీ:
దేశంలోనే తొలిసారిగా ఆంధప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఐబీఎం, టీసీఎస్ మరియు ఎల్ & టీలతో ఇటీవల అవగాహన ఒప్పందం కుదుర్చుకొంది.
ప్రైవేటు సంస్థల తోడ్పాటు:
గూగుల్, ఐబీఎం వంటి టెక్ దిగ్గజాలు, BOSONQ,QRD Lab మరియుQ PiAI వంటి భారతీయ స్టార్టప్ కంపెనీలు కూడా మన దేశంలో క్వాంటం సాంకేతికతను అభివృద్ధి పరచడంలో తోడ్పాటునందిస్తున్నాయి.
చివరిగా: ఐక్యరాజ్యసమితి 2025వ సంవత్సరాన్ని క్వాంటం టెక్నాలజీ సం।।రంగా ప్రకటించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో మరిన్ని పరిశోధనలు జరిగే అవకాశం ఉంది. తద్వారా క్వాంటం ఎనర్జీ, క్వాంటం బ్యాటరీలు, క్వాంటం ఇంటర్నెట్ వంటి వినూత్న ఆవిష్కరణలు సాకారమై, పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభించి, మనదేశం కూడా క్వాంటం టెక్నాలజీ రంగంలో గ్లోబల్ పవర్‍గా ఎదగాలని ఆశిద్దాం.
-పుట్టా పెద్ద ఓబులేసు,
స్కూల్ అసిస్టెంట్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
రావులకొలను, సింహాద్రిపురం, కడప,
ఎ : 955029004