చాడ బౌద్ధ పురావస్తు ప్రదేశ సందర్శన

2025 మే 20న, డెక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ ట్రస్ట్ చైర్మన్‍ ఇంజినీర్‍ వేదకుమార్‍ మణికొండ గారు, తెలంగాణ రాష్ట్రం భువనగిరి జిల్లాలోని చాడ బౌద్ధ పురావస్తు ప్రదేశాన్ని సందర్శించారు. ఇది ఎంతో ప్రాచీనమైన, సంస్కృతితో నిండిన బౌద్ధ స్థలం.ఈ సందర్శన సమయంలో అక్కడ పురావస్తు శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న తవ్వక పనులు కూడా పరిశీలించబడ్డాయి.
ఈ సందర్శనలో ఆయనతో పాటు ప్రఖ్యాత పురావస్తు నిపుణులు ప్రొఫెసర్‍ కె.పి.రావు, ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త, హైదరాబాద్‍ విశ్వవిద్యాలయ మాజీ ఆచార్యులు శ్రీ బాబ్జీరావు, ఆర్కియోలాజికల్‍ సర్వే ఆఫ్‍ ఇండియా (ASI) మాజీ అధికారి, డాక్టర్‍ ప్రవీణ్‍, బౌద్ధ పురావస్తు రంగంలో పరిశోధకుడు, శ్రీ నాగరాజు, పురావస్తు శాఖ అధికారి, తెలంగాణ ప్రభుత్వం మరియు వారి సహచరులు పాల్గొన్నారు.

ఈ సందర్శనలో ప్రదేశంలో ఉన్న బౌద్ధ స్థూపం, విహార సముదాయం మరియు ఇతర నిర్మాణ అవశేషాలను పరిశీలించారు. ప్రాచీన కట్టడాల నిర్మాణ శైలి, చరిత్రలో వాటి ప్రాముఖ్యత గురించి నిపుణులు విలువైన సమాచారం పంచుకున్నారు. తవ్వకాల సమయంలో చారిత్రక నిర్మాణ అవశేషాలు, బౌద్ధ విహార నిర్మాణపు భాగాలు, స్తూపపు భాగాలు, మరియు పురాతన మట్టికొమ్ములు, విగ్రహావశేషాలు వెలికి తీయబడ్డాయి. నిపుణులు ఈ తవ్వకాలను నిశితంగా పరిశీలిస్తూ, వాటి నిర్మాణ శైలి, కాలానికి సంబంధించిన వివరాలు, చరిత్రపట్ల వెలుగులోకి తీసుకువచ్చే విషయాలపై చర్చించారు.
ఈ ప్రదేశం క్రీస్తుపూర్వం మొదటి శతాబ్దం నుండి బౌద్ధుల ఆధ్యాత్మిక కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్నదన్న అంచనాకు తవ్వకాల నుండి లభిస్తున్న ఆధారాలు బలం ఇస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా వేదకుమార్‍ మణికొండ గారు మాట్లాడుతూ, చాడ వంటి బౌద్ధ ప్రదేశాలను సంరక్షించడం అనేది తెలంగాణ యొక్క బహుళ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటానికి కీలకమని తెలిపారు. ప్రభుత్వం, శాస్త్రవేత్తలు, ప్రజాసంఘాలు కలిసి ఈ పురావస్తు ప్రదేశాన్ని రక్షించేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రాంతానికి చారిత్రక ప్రాధాన్యతను గుర్తించి, విస్తృత స్థాయిలో తవ్వకాలు, పూర్వవైభవ పునరుద్ధరణ, డాక్యుమెంటేషన్‍ చేయాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో స్థానిక ప్రజల భాగస్వామ్యంతో వారసత్వ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని చర్చ జరిగింది.
ఈ సందర్శన ద్వారా చాడ ప్రాంత పురావస్తు ప్రాధాన్యతను మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి, ఇటువంటి విలువైన చారిత్రక ప్రదేశాలను సంరక్షించేందుకు ఒక ముందడుగు వేసారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *