
నిత్యజీవితంలో ప్రతిరోజూ జాగ్రత్తగా పాటించవలసిన విషయాలను మనుషులు సహజంగానే నిర్లక్ష్యం చేస్తుంటారు. దానివల్ల అనేక రకాల కష్టాలకు నష్టాలకు గురవుతారు. ఈ కష్టనష్టాలు సుదీర్ఘ కాలం కొనసాగవచ్చు. కొన్నిసార్లు ప్రాణాంతకం కావచ్చు. కొన్నిసార్లు శాశ్వతం కావచ్చు. నిర్లక్ష్యం చేయబడుతున్న అంశాలను ప్రజలకు గుర్తుచేసి అప్రమత్తం చేయడం కోసం, సరైన ఆచరణకోసం ఒకో అంశానికి ఒకో ప్రత్యేక దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరపుకోవడం మనకు తెలుసు. ప్రతినెలా కొన్ని ఉంటాయి. చారిత్రిక ప్రాధాన్యతను బట్టి, సంఘటనల ప్రాతినిధ్యాన్ని బట్టి ప్రతినెలా కొన్ని దినోత్సవాలుంటాయి.
ప్రపంచ సుస్థిరతకోసం, ప్రజలమధ్య స్నేహసంబంధాలకోసం, వనరుల వినియోగం కోసం, ప్రపంచశాంతి కోసం, ఆరోగ్యకర ప్రపంచం కోసం ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలమధ్య అనేక ఒప్పందాలు జరిగాయి. వాటి అమలులో అన్ని దేశాలు నిబద్ధతతో ఉండాలి. కాని ఆచరణలో వైఫల్యాల వల్ల ఫలితాలు సాధించడంలో విఫలమవుతున్నాయి. ఈ ప్రపంచ దినోత్సవాలు ఆయా వ్యవస్థలలో కదలికలు తెస్తాయి.
ఐక్యరాజ్య సమితి నిర్ణయానుసారమో, సంబంధిత వ్యవస్థల సూచనవల్లనో ఈ తేదీలు నిర్ణయించబడతాయి. ఆ తేదీలలో ప్రపంచ వ్యాప్తంగా ఆయా అంశాలపై ప్రదర్శనలు, చర్చలు, ప్రచారాలు, సమావేశాల ద్వారా ప్రజలలో అవగాహన పెంచి కార్యోన్ముఖులను చేయడానికి ఈ దినోత్సవాలు స్ఫూర్తినిస్తాయి.
ప్రకృతి, పర్యావరణం, వైద్యం, ఆరోగ్యం, భూమి, జల సంబంధాలు, వివిధరకాల కాలుష్యాలు, క్రీడలు, కళలు, సంస్కృతి, భాష, ప్రపంచశాంతి వంటి పలు అంశాల గురించి ఈ దినోత్సవాలు జరుపుకుంటున్నాం.
ఈ జులై 1న జాతీయ వైద్యుల దినోత్సవం, 2న ప్రపంచ క్రీడా జర్నలిస్టుల దినోత్సవం, 3న ప్లాస్టిక్ రహిత ప్రపంచ దినోత్సవం, 11న ప్రపంచ జనాభా దినోత్సవం, 12న పేపర్ బ్యాగ్ డే దినోత్సవం, 20న అంతర్జాతీయ చదరంగ దినోత్సవం, 28న ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం వంటి వివిధ ప్రపంచ దినోత్సవాలను జరుపుకుంటున్నాం.
ఇవన్నీ ఆయా రంగాలలో విశిష్టమైనవే. కనుక అన్నిటినీ గౌరవించాలి. విజయవంతంగా జరుపుకోవాలి. ఇవి శారీరక, మానసిక ఆరోగ్యాలకు, మేధోవికాసానికి దోహదపడే అంశాలే.
మనిషి జీవితం ఏఏ అంశాలపై ఆధారపడి వుందో ఆ అన్ని అంశాలపట్ల సరైన అవగాహన కలిగి వుండాలి. ఆ అంశాల గుణదోషాలను అర్థం చేసుకోవాలి. రావాల్సిన మార్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆచరణల పట్ల విచక్షణతో మెలగాలి.
ఈ దినోత్సవాలు జరుపుకోవడంలో ప్రధాన ఉద్దేశం యిదే. వీటిని సద్వినియోగం చేసుకొని మన జీవితాలను మెరుగుపరుచుకుందాం.
(మణికొండ వేదకుమార్)
ఎడిటర్