పర్యావరణ సామ్యవాదం!

మానవులు జీవనచక్రాన్ని విచ్ఛిన్న పరచుకున్నారు. ఈ విచ్ఛిన్నం వారి దైవిక అవసరాల కోసం జరిగింది కాదు. ప్రకృతిని జయించుకునేందుకు వారు ఏర్పరచుకున్న సామాజిక సంస్థ వల్ల జరిగింది. సంపదను పెంపొందించుకోవటం కోసం చాలా వాటిని అతిక్రమించారు. గౌరవించాల్సిన వాటిని గౌరవించలేదు. పాటించవలసిన వాటిని పట్టించుకోలేదు. ఫలితంగా ఒక వైషమ్యం ఏర్పడింది. ప్రకృతి నియమాలను దాటి ప్రవర్తించడం వల్ల ఇటువంటి వైషమ్యం పుడుతుంది. కాబట్టే పర్యావరణ సంక్షోభం. ఈ సంక్షోభం ప్రకృతి, పర్యావరణాలకే కాదు. అంతిమంగా అది మానవ మనుగడ కోసం జరుగుతున్న సంక్షోభం. ఏ జీవన చక్రాన్ని మనిషి విధ్వంసం చేశాడో ఇప్పుడు తిరిగి దానిని ఏర్పచుకోవాలి. ఆ జీవన చక్రం బ్రద్ధలైంది.
ఈ భూమండలాన్ని ఇంతగా దుస్థితికి తెచ్చిన ఖ్యాతి అంతిమంగా పెట్టుబడికే దక్కుతుంది. పెట్టుబడి మనలను మనుషులుగా కాకుండా వినియోగదారులుగా చూస్తుంది. పెట్టుబడి దృష్టిలో భూమాతకు వేరే ఉనికి లేదు. అదొక ఖనిజాల పుట్ట. ముడి ఖనిజాల గుట్ట. నిజానికి ప్రపంచంలో ఇన్ని రకాల అసమతుల్యతలకు కారణం కాపిటలిజమే. పెట్టుబడి సౌఖ్యాలను ఉద్భవింపజేస్తుంది. ఆ సౌఖ్యాల పట్ల ఆకర్షణను పెంచుతుంది. అది అందింపజూపే సుఖ, సౌఖ్యాల సకల సౌకర్యాలకు మానవులను బానిసలను చేస్తుంది. పైగా అది ఆడంబరాలను కూడా నేర్పుతుంది. అది తక్కువ మంది సౌఖ్యాల కొరకు ఎక్కువమందిని అన్న వస్త్రాలు, కనీస సౌకర్యాలు కూడా లేని వారిగా మిగులుస్తుంది. దుబారాను పెంచిపోషిస్తుంది. ఒకవైపు మిలియన్ల కొద్దీ ప్రజలు ఆకలికై అలమటిస్తుంటే, అల్పసంఖ్యాకులను భోగవంతులుగా మారమని ప్రలోభపెడుతుంది.

పెట్టుబడిదారీ వాదం చేతిలో ప్రతిదీ సరుకే. క్రయ, విక్రయ చర్యల మధ్య దాని జిహ్వ లాభాన్ని మాత్రమే కోరుతుంది. అది నీటిని, గాలిని, నేలను అమ్ముతుంది. వారసత్వ, ప్రాచీన సంస్క•తులను, న్యాయాన్ని, నైతికతను, చావును కూడా సరుకుగానే ప్రమోట్‍ చేస్తుంది. అంటే ప్రతి దానినీ పెట్టుబడి అధీనంలోకి తేగలదు. అమ్మేయగలదు. చివరకు ‘వాతావరణ మార్పు’ అంశాన్ని కూడా వ్యాపారంగా మార్చివేసిందనే విమర్శకూడా ఉంది. ఇయాన్‍ యాంగస్‍ తన ‘రెడ్డర్‍ షేడ్‍ ఆఫ్‍ గ్రీన్‍’ అన్న రచనలో కటువుగానే విమర్శకు పెట్టాడు ఈ ధోరణిని.
అయితే తన వాదన ఏమంటే ‘వాతావరణ మార్పు’ అనేది సమస్త మానవాళిముందు రెండు గొప్ప అవకాశాలను పెట్టింది. ఒకటి కాపిటలిజం నడిచిన మార్గంలో, మృత్యుదారిలో కొనసాగుతూ ఉండటం ఒకటైతే, రెండవది జీవితం పట్ల గౌరవాన్ని కలిగి ఉండి ప్రకృతితో సామరస్యపూర్వక దారిలో నడిచేందుకు సమాయత్తం కావటం. ఈ రెంటిలో ఏది ఎంచుకోవాలనేది వ్యక్తుల పర్యావరణ స్పృహ, చైతన్యాలతో పాటుగా భవిష్యత్తుపట్ల ఎటువంటి ఎరుకను బాధ్యతను మనం కలిగి ఉంటామనే దానిపై ఆధారపడి ఉంటుంది.

వాస్తవానికి అర్ధశతాబ్దం క్రిందటే బ్యారీ కామనర్‍ తన రచనల్లో ఈ అంశం చర్చించాడు. సోషలిజం, సైన్స్లు సంయుక్త ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందని ప్రతిపాదించాడు. ఏ శాస్త్ర రచనల వెలుగులైనా పెట్టుబడి స్వాధీనంలో ఉండి పోతాయి. విశ్వశ్రేయస్సు లోకకళ్యాణం లాంటివి గానీ, బహుజన సంక్షేమంకానీ పెట్టుబడికి పట్టని విషయాలు. మానవ సమాజాలకు మిగిలిన ప్రాకృతిక వ్యవస్థలకూ మధ్య సాధారణ జీవక్రియ విషయంగా పెరుగుతూ వస్తున్న అంతరాన్ని కామనర్‍ గుర్తించాడు. ఒక హెచ్చరిక కూడా చేశాడు. ‘వర్తమాన ఉత్పత్తి విధాన వ్యవస్థ ఆత్మవిధ్వంసకం’ అన్నాడు. అంతే కాకుండా ‘మానవ నాగరికతా వికాస క్రమం ఆత్మాహత్యా సదృశ్యం’ అని వ్యాఖ్యానించాడు.
పరిమిత వనరులకు, అనంత లాభాపేక్షగల పెట్టుబడికి మధ్యగల నిరవధిక ఘర్షణతోనే ప్రపంచం నడుస్తున్నది. భూమిని ఎంతగా మనం అఖండమైనదనుకున్నా, అది పరిమితమైనదే. వాతావరణం, సముద్రాలు, అరణ్యాలు ఎంత విశాలమైనవని మనం భావించినా అవీ పరిమితమైనవే. పెట్టుబడి మనం కలిగి ఉన్న పరిమిత వనరులపై వత్తిడిని పెంచుతున్నది. మనం ఎంతగా కోరుకున్నప్పటికీ భూమికి గల పునరుత్పాదక సామర్థ్యం మన కోరికల మేరకు పెరగదు. ప్రజలు ఎంతగా వనరులు వృధాకు పాల్పడుతున్నారో, ఆ వేగానికి తగినట్లుగా వృధాను వనరుగా మార్చే శక్తి భూమికి క్షీణిస్తున్నది. వృదా అవుతున్న వేగానికి సరిసమానంగా వ్యర్థాలు వనరులుగా మారే పక్రియా వేగం తక్కువవుతున్నదని శాస్త్రవేత్తలు పలు నివేదికలు ఘోషిస్తున్నాయి.

ఇలా ఉంటే 20వ శతాబ్దపు ఆర్థికవేత్తలు, ముఖ్యంగా అభివృద్ధిని విశ్వసించిన అర్ధశాస్త్రవేత్తలు ఆర్థిక కార్యకలాపాలను విస్త•తపరచటం ద్వారా పేదరిక నిర్మూలన జరిగిపోతుందని భావించారు. దానినే ప్రోత్సహించారు. ఇక జీవ శాస్త్రవేత్తలు జీవన ప్రమాణాలను పెంచడం ద్వారా సాంక్రమిక వ్యాధులను నిర్మూలించగలమనే అచంచల విశ్వాసం కనబరిచారు. తీరా యిప్పుడు పునరాలోచిస్తే ఈ రెండు శిబిరాలూ తప్పేనని తేలుతుంది. ఎందుకంటే మన మధ్య యింకా ఆకలి, దారిద్య్రం, క్షామం, కరువు, కాటకాలు తాండవం చేస్తున్నాయి. 20 శతాబ్దం ఉత్తరార్థం నుంచి మలేరియా, కలరా, ఎయిడ్స్ లాంటి వ్యాధులూ ప్రబలాయి. భయంకరమైన వ్యాధులను వైరస్‍లు, ఇతర సూక్ష్మజీవులు కలుగజేస్తున్నాయి. అంటే దీనర్థం పెట్టుబడిదారీవాదం అటు పేదరికాన్ని అంతం చేయటంలో కానీ, ఇటు వ్యాధులను నిర్మూలనపరచటంలోగానీ ఆశక్తమైందని తెలుస్తున్నది. ఆర్థికాభివృద్ధి ఒక్కటే సకల సమస్యలను పరిష్కరించదు. సమతూకంతో కూడిన సుస్థిరాభివృద్ధికి యింకేదో ప్రత్యామ్నాయం కావాలి. ఆ ప్రత్యామ్నాయమే ఇకో సోషలిజం. పర్యావరణ సామ్యవాదం. ఆ దిశగా మహాజనవాళి ఆలోచనసాగాలి. ఆచరణ కూడా కావాలి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *