
ప్రకృతి ఎప్పుడూ ఒకే స్థితిలో ఉండదు. ఆరు ఋతువులూ ప్రభావితం చేస్తాయి. ఆకురాలడం నుంచి చివురు చిగురించి పరిఢవిల్లుతుంది. ఆరు ఋతువుల చకభ్రమణంలోని విభిన్న వాతావరణాల్లోంచి వివిధ ప్రయోజనాలూ, మనుగడకు అవసరమైన స్థితులూ ప్రజలకు అందుతాయి. విలక్షణతలతో విలసిల్లడం ప్రకృతి సహజలక్షణం. ప్రకృతిలోని ఈ విలక్షతలకు భంగం కలిగించడం వల్లనే పర్యావరణ సంక్షోభం సంభవిస్తుంది. ప్రజల నిత్య జీవితాలకు భద్రత లేకుండా పోతుంది.
ప్రకృతి విలక్షణతలకు భంగం కలిగించే అంశాలు బహుముఖీనమైనవి. ప్రకృతి విచ్ఛిన్నతకు మానవ తప్పిదాలే కారణమవడం పాక్షిక సత్యమే. వారు నిర్మించుకున్న సామాజిక వ్యవస్థలు అనుసరిస్తున్న విధానాలు కారణం. ప్రజల బాగోగులు చూడటానికి ఆ వ్యవస్థలు కొన్ని విధానాలకు రూపకల్పన చేసి ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తాయి. ఆ విధానాల రూపకల్పనలోనూ, వాటి అమలులోనూ విశాల ప్రజానీకపు అవసరాలు, వారి మనుగడకు, సుస్థిరతకు యిచ్చే ప్రాధాన్యతను బట్టి ఆ సమాజపు అభివృద్ధి, నాగరికత ఆధారపడి వుంటుంది.
ఇవాళ ప్రపంచ దేశాలన్నీ ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. వాతావరణ మార్పులు, నీటికొరత, గాలి, భూమి కాలుష్యం, అరణ్యాల క్షీణత, జీవవైవిధ్యం వంటి సమస్యలు, పర్యావరణాన్నే కాదు, ప్రజల జీవనాధారాలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
ప్రస్తుత ఉత్పత్తి విధానాలు లాభాలకోసం ప్రకృతిని వాణిజ్యీకరించి, వస్తువులుగా మార్చి, మనుషులను కేవలం వినియోగదారులుగా మారుస్తున్నాయనీ, పర్యావరణ సంక్షోభాలకూ, ఆర్థిక సంక్షోభాలకూ లాభాపేక్షే లక్ష్యంగా రూపొందిన విధానాలే కారణమని ప్రపంచ ఆర్థిక వేత్తలు, మేధావులూ అభిప్రాయపడుతున్నారు.
పర్యావరణ పరిరక్షణతో సామాజిక న్యాయతత్వాన్ని అనుసంధానించిన భావన ఎకో సోషలిజం. నీరు, గాలి, భూమి, అరణ్యాల వంటి సమస్త ప్రకృతి వనరులూ సమాజానికి చెందినవి కావాలి. ప్రతి ఒక్కరినీ భాగస్వామిగా చూడాలి. సమాన్యాయం, వనరుల సమగ్ర వినియోగం, సుస్థిర అభివృద్ధి దీని ప్రధాన లక్ష్యాలు. ప్రజాస్వామ్య పర్యావరణ న్యాయం అవసరం.
ఉత్పత్తి – వినియోగం అనేది ప్రకృతి వనరుల సహజత్వాన్ని దెబ్బతీసి పర్యావరణానికి నష్టం కలిగించకుండా నూతన ఆర్థిక, సామాజిక వ్యూహాలు రచించాలి. గ్రామీణ ప్రజల భాగస్వామ్యం, సహజవనరుల సామూహిక నిర్వహణ, సహజవనరులపై ఆధారపడ్డ పేదప్రజల, రైతుల, కూలీల, అరణ్య ఆధారిత ఆదివాసీల హక్కుల రక్షణకు కృషి చేయాలి.
భవిష్యత్ తరాల సుస్థిరతను దృష్టిలో వుంచుకొని ప్రణాళికలు తయారు చేయాలి. సమాజంలో సమానత్వం, సహజ వనరుల వినియోగంపై నిరంతర పర్యవేక్షణ లేకుండా పర్యావరణ సంక్షోభాన్ని అధిగమించలేము. దీర్ఘకాలిక పరిష్కారం కోసం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాల్లో మనమూ భాగస్వామ్యం కావాలి.
(మణికొండ వేదకుమార్)
ఎడిటర్