ఒక్కోసారి మన కళ్ళముందు జరిగే మార్పులను కూడా మనం సరిగా గుర్తించలేం. కానీ అంతరిక్షం నుండి నేలపై ఏదైనా, ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఒక్క అంగుళమంత చిన్న తేడా వచ్చినా పసిగట్టడం సాధ్యమేనా అంటే… నిస్సందేహంగా సాధ్యమేనంటున్నారు శాస్త్రవేత్తలు. ఇండియా, అమెరికాల సంయుక్త భాగ స్వామ్యంతో గత జులై 30న ప్రయోగించిన నైసార్ శాటిలైట్‍కు ఇలాంటి సామర్థ్యాలు మెండుగా ఉన్నాయని, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం వినియోగించిన కారణంగా నైసార్ ప్రపంచ ఉపగ్రహ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలవనున్నదని వారు నొక్కి వక్కానిస్తున్నారు. మరోవైపు వైజ్ఞానిక శాస్త్ర ఔత్సాహికులు అబ్బో… చీమల కదలికలను కూడా చిటికెలో పసిగడుతుందే.. అని అబ్బురపడుతున్నారు. ఈ నేపథ్యంలో నైసార్ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం..!!
అసలు NISAR (నైసార్) అంటే..?
NASA (నాసా), ISRO (ఇస్రో) సింథటిక్ అపెర్చర్ రాడార్‍కు సంక్షిప్త రూపమే నైసార్. తొలిసారిగా ఇండియా, అమెరికా అంతరిక్ష సంస్థలు నాసా, ఇస్రోలు సంయుక్తంగా ఈ ఉపగ్రహాన్ని నిర్మించాయి. ఈ ఉపగ్రహ జీవిత కాలం 5 సంవత్సరాలు (2025-30). ప్రాజెక్ట్ వ్యయం దాదాపు 1.5 బిలియన్ డాలర్లు. భూమికి 747 కి।।మీ ఎత్తులో ఉన్న సన్‍సింక్రోనస్ పోలార్ ఆర్బిట్‍లో గత జులై 30న తిరుపతి జిల్లాలోని సతీశ్‍ధావన్ స్పేస్‍సెంటర్ నుండి జీఎస్‍ఎల్వీ-ఎఫ్16 రాకెట్ నైసార్‍ను విజయవంతంగా ప్రవేశపెట్టింది.
మరి SAR (సార్) అంటే..??
సింథటిక్ అపెర్చర్ రాడార్‍ను SAR(సార్) అని అంటారు. సాధారణంగా రాడార్లు పరిమాణంలో పెద్దగా ఉన్న డిష్ యాంటెన్నాల ద్వారా మైక్రో తరంగాలు లేదా రేడియో తరంగాల రూపంలో సంకేతాలను బయటికి విడుదల చేస్తాయి. ఆ తరంగాలు పరావర్తనం చెంది అదే డిష్ యాంటెన్నాల ద్వారా తిరిగి రాడార్లను చేరుతాయి. రాడార్లు వాటిని స్వీకరించి, విశ్లేషించడం ద్వారా ఆ తరంగాలు ఏ వస్తువు మీదైతే పడ్డాయో ఆ వస్తువు రాడార్ నుండి ఎంత దూరంలో ఉంది, దాని నిర్మాణం, ఆకృతి, ఒక వేళ ఆ వస్తువు కదులుతూ ఉన్నట్లయితే దాని వేగాన్ని కూడా ఖచ్చితంగా నిర్ధారిస్తాయి.
SAR అనేది ఒక ప్రత్యేకమైన ఇమేజింగ్ రాడార్. మరీ పెద్ద పరిమాణంలో ఉన్న యాంటెన్నా లాంటి నిర్మాణాలను అంతరిక్షంలోకి పంపడం సాధ్యపడనపుడు, SAR లను ఉపయోగిస్తారు. దీనిలో అధునాతన సాంకేతికత, అల్గారిథమ్స్, గ్రౌండ్ బేస్డ్ రాడార్‍ను అనుసరిస్తూ, వాటికన్నా మెరుగైన పనితీరును ప్రదర్శిస్తూ స్పష్టమైన చిత్రాలను తీసి గ్రౌండ్ స్టేషన్‍కు పంపిస్తాయి.
నైసార్ – లక్ష్యాలు

i) భూకంపాలు, అగ్నిపర్వతాలు, కొండచరియలు విరిగిపడడం లాంటి భూ ఉపరితల మార్పులను నిరంతరం పరిశీలించడం.
ii) హిమానీనదాలు మరియు ధ్రువపు మంచు పలకల ద్రవీభవనం ద్వారా సముద్ర మట్టం పెరుగుదలను పర్యవేక్షించడం
iii) అటవీ విస్తీర్ణంలో మార్పులను గుర్తించడం
iv) పంటవిస్తీర్ణం మరియు పంటలలో సంభవించే మార్పులు నేలలో కలిగే మార్పులు నిరంతరం పరిశీలించడం ద్వారా వ్యవసాయ ప్రణాళిక మరియు ఆహార భద్రతకు తోడ్పాటునందించడం.
v) చిత్తడి భూములలో కాలానుగుణంగా సంభవించే మార్పులు, పర్యావరణ స్థితిగతులను నిరంతరం పరిశీలించడం.
నైసార్ – విశిష్టతలు :
డ్యుయల్ ఫ్రీక్వెన్సీ సార్స్ (Dual Frequency SARS)
i) నైసార్ ఉపగ్రహంలో రెండు రకాలైన సింథటిక్ అపెర్చర్ రాడార్లు వినియోగించబడ్డాయి. గతంలో ఏ దేశ ఉపగ్రహాలలో కూడా ఇలా రెండు రకాల రాడార్లను వినియోగించలేదు. అవి a) L-బ్యాండ్ SAR b) S-బ్యాండ్ SAR. ఈ రాడార్లను ఉపయోగించి ఒకే సమయంలో, ఒకే ప్రదేశం నుండి అనేక చిత్రాలు, అనుబంధ చిత్రాలను కూడా తీయవచ్చు. L-బ్యాండ్, S-బ్యాండ్ రాడార్లను వినియోగించి భూమిని అన్నిరకాల వాతావరణ పరిస్థితుల్లోనూ అనగా దట్టమైన మేఘాలు, పొగ, వర్షము మరియు పొగమంచు ఆవరించినపుడు కూడా రాత్రి, పగలూ స్పష్టంగా పరిశీలించవచ్చు. ఈ రెండు రాడార్లు విభిన్న తరంగదైర్ఘ్యాలతో పనిచేయడం వల్ల భూమి ఉపరితలంపై సంభవించే విబిన్న రకాల మార్పులను హైరిజల్యూషన్ సామర్థ్యంతో గుర్తించవచ్చు.
a) L-బ్యాండ్ SAR: ఈ రాడార్‍కు అధిక తరంగదైర్ఘ్యం ఉంటుంది (24 సెం.మీ). అందువల్ల ఈ రాడార్ నుండి వెలువడే మైక్రోతరంగాలు దట్టమైన అడవులు, ఇసుక, మంచులాంటి భౌతిక రాశులలోకి సులువుగా చొచ్చుకు వెళతాయి. అదేవిధంగా భూ ఉపరితలంలో సంభవించే అతిస్వల్ప కదలికలను కూడా ఇది గుర్తిస్తుంది. కిరణజ్యసంయోగక్రియ ద్వారా ఒక చెట్టుకాండంలో వాతావరణం నుండి గ్రహించబడిన కార్బన్ నిల్వచేయబడి ఉంటుంది. దీనినే ట్రీ ట్రంక్ బయోమాస్ అంటారు. దీని ద్వారా భూమిమీద ఉన్న కార్బన్ స్టాక్‍ను అంచనావేయవచ్చు. ఈ టీట్రంక్ బయోమాస్‍ను L-బ్యాండ్ సార్ ఖచ్చితంగా నిర్ధారిస్తుంది.
b) S-బ్యాండ్ SAR: ఈ రాడార్‍కు స్వల్ప తరంగదైర్ఘ్యం (12 సెం.మీ) ఉంటుంది. అందువల్ల ఈ రాడార్ నుండి వెలువడే మైక్రో తరంగాలు ఎక్కువ లోతులోకి చొచ్చుకు పోలేవు. కానీ పంట పొలాలు, సముద్రాలు, నదులు, చెరువుల లాంటి విస్త•త పరిమాణంలో నీటినిల్వ కలిగిన ప్రదేశాలను ఇది స్పష్టంగా గుర్తించి ఫొటోలు తీస్తుంది. సోయాబీన్, మొక్కజొన్న మరియు చెరకులాంటి పంట మొక్కల పెరుగుదల మరియు వాటి ఎదుగుదల స్థాయిలను నిర్దిష్టంగా గుర్తిస్తుంది.

L-బ్యాండ్, S-బ్యాండ్ రాడార్లు సంయుక్తంగా పనిచేయడం వల్ల ఏదైనా ఒక నిర్దిష్టప్రదేశానికి చెందిన చిత్రాలను సమగ్రంగా తీయవచ్చు. L-బ్యాండ్, S-బ్యాండ్ రాడార్లను రెండు వేర్వేరు ఉపగ్రహాలలో వినియోగించి ఏదైనా ఒక ప్రాంతాన్ని ఒకే ప్రదేశం నుండి, ఒకే సమయంలో ఫోటోలు తీయలేము. ఆ ప్రదేశంలో తదుపరి ఏవైనా మార్పులు సంభవిస్తే ఆ మార్పులను ఈ రెండు వేర్వేరు ఉపగ్రహాలు పసిగట్టలేవు.
ఒకే ఉపగ్రహంలో రెండు SARలను అమర్చడం ఒక సాంకేతిక సవాల్‍గా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. అందుకే నైసార్ ఉపగ్రహ రూపకల్పనకు 10 సంవత్సరాల సమయం పట్టిందని వారు చెబుతున్నారు.
ii) Sweep SAR మరియు wide swath imaging:
Sweep అనగా విస్తృత పరిశీలన మరియు Swath అనగా విశాల ప్రదేశం అని చెప్పవచ్చు. Sweep SAR అన్నది SARలో వచ్చిన అధునాతన సాంకేతికతగా శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఈ సాంకేతికత ద్వారా ఉపగ్రహం 240 కిలోమీటర్ల విశాలమైన ప్రదేశాన్ని 3-10 మీ।। నిడివితో స్పష్టమైన చిత్రాలను తీయవచ్చు. ఈ సామర్థ్యంతో భూ అంతర్భాగంలోని టెక్టానిక్ ప్లేట్ల కదలికలు, వరద ప్రభావిత ప్రాంతాలను నిరంతరం పరిశీలించడం వల్ల విపత్తు నిర్వహణ, వాతావరణంలో వచ్చే అనూహ్య మార్పులను ఇట్టే పసిగట్టవచ్చు.
iii) డిప్లాయబుల్ యాంటెన్నా: మడతపెట్టడం, విప్పడం మరియు పరిస్థితులకనుగుణంగా స్వయం సర్దుబాటు చేసుకోగల సామర్థ్యం కల్గి, స్వల్ప పరిమాణం నుండి విస్తృత స్థాయికి మార్పులు చెందగలిగిన సామర్థ్యం ఈ యాంటెన్నాలకు ఉంటుంది. నైసార్‍లో కూడా 12 మీ।। నిడివితో విప్పగలిగే యాంటెన్నా ఉంటుంది. దీనిని అంతరిక్షంలోకి ప్రయోగించినపుడు ఇది విస్తృత పరిమాణం కలిగిన రిఫ్లెక్టర్‍గా పనిచేస్తుంది. బంగారు పూత కలిగి, బ్యాడ్మింట్ కోర్టు అంత విశాలాన్ని కలిగి ఉంటుంది. ఈ సమయంలో ఇది నిర్దిష్ట ప్రాంతం నుండి విభిన్న కోణాలలో, విభిన్న పదార్థాల నుండి కనిష్టీకరించిన ద్రవ్యరాశితో, ఉపగ్రహం పంపే సంకేతాలను స్వీకరించి, అత్యున్నత ఇంజనీరింగ్ నైపుణ్యంతో ఎలాంటి అవరోధాలు లేకుండా ఆ సంకేతాలను స్కాన్ చేస్తుంది. ఒక ఉపగ్రహానికి ఇంత పెద్ద రిఫ్లెక్టర్‍ను అమర్చడం ప్రపంచంలో ఇదే మొదటిసారి అని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.
iv) ఆర్బిటల్ మెకానిక్స్ మరియు కవరేజ్ స్ట్రాటజీ: నైసార్ భూమి నుండి 747 కి।।మీ. ఎత్తులో ఉన్న సన్ సింక్రోనస్ పోలార్ ఆర్బిట్‍లో ప్రవేశపెట్టబడింది. ఈ ఆర్బిట్ 98.4 డిగ్రీల వంపును కలిగి ఉంటుంది. ఈ వంపు అనేది ప్రతి 12 రోజుల కొకసారి భూమండలాన్ని పునఃపరిశీలిస్తూ స్పష్టమైన చిత్రాలు తీయడానికి కావలసిన వెలుతురు (Lighting)ను అందిస్తుంది. తద్వారా పంటల ఎదుగుదలలో వచ్చే కాలానుగుణ మార్పులు మరియు కొండ చరియలు విరిగిపడడం లాంటి స్వల్పకాలిక పక్రియలను సులువుగా గుర్తించవచ్చు.

నైసార్ రూపకల్పనలో ఇస్రో, నాసాల పాత్ర:
భూ ఉపరితలంలో సంభవించే మార్పులను క్షుణ్ణంగా పరిశీలించి, ఆ మార్పులను విస్పష్టంగా చిత్రీకరించగల శాటిలైట్ వ్యవస్థ అవసరమని నాసా భావించింది. దాని రూపకల్పనకు జర్మన్ ఏరోస్పేస్ సంస్థ డీఎల్‍ఆర్‍తో భాగస్వామ్యం వహించాలనుకుంది. అయితే జర్మన్ సంస్థకు బిజీ షెడ్యూల్ ఉండడంతో, నాసా సొంతంగానే ఉపగ్రహాన్ని రూపొందించుకోవాలనుకుంది. ఈ లోగా నాసా బడ్జెట్‍కు అమెరికా ప్రభుత్వం కోతపెట్టడంతో పునరాలోచనలో పడింది. ‘‘వెదకబోతున్న తీగ కాలికి తగిలిందన్నట్టు’’ తక్కువ ఖర్చుతో నాణ్యమైన ప్రయోగాలు చేస్తున్న ఇస్రో ఆ సంస్థకు ఎదురైంది. ఇస్రో 2008లో చంద్రయాన్-1, 2009లో రీశాట్-2 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఈ రెండింటిలోనూ ‘‘సార్’’ పరికరాలు ఉన్నాయి. దీన్ని గమనించి నాసా ఇస్రో వైపు మొగ్గింది. అలా 2014లో నాసా, ఇస్రో భాగస్వామ్యంతో నైసార్ మిషన్‍కు అంకురార్పణ జరిగింది. నైసార్ రూపకల్పనలో నాసా, ఇస్రోలు కింది విధంగా కీలక పాత్ర పోషించాయి.
i) నాసా: L-బ్యాండ్ SAR, 12 మీ।। యాంటెన్నా, జీపీయస్ కంట్రోల్‍తో పాటు సాలిడ్ స్టేట్ రికార్డర్ మరియు టెలికామ్ సిస్టమ్ లాంటి ఇతర వ్యవస్థల రూపకల్పనలో నాసా కీలక పాత్ర పోషించింది.
ii) ఇస్రో: S-బ్యాండ్ SAR, శాటిలైట్‍బస్ (1-3K), జీఎస్‍ఎల్వీ ఎఫ్-16 లాంఛర్, సోలార్ అర్రేస్ (Solar arrays), డేటా హ్యాండ్లింగ్ విభాగాల రూపకల్పనలో ఇస్రో ప్రధాన భూమిక వహించింది.
గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ల ద్వారా మిషన్ ఆపరేషన్‍లో రెండు సంస్థలు ఇతోధిక పాత్ర పోషించాయి. ఉపగ్రహ రూపకల్పన, ప్రయోగంలో సమాన భాగస్వామ్యం ప్రాతిపదికన నైసార్ మిషన్‍ను నాసా, ఇస్రో చేపట్టాయి. ప్రాజెక్ట్ వ్యయం దాదాపు 1.5 బి।। డాలర్లు కాగా, నాసా 1.19 బి।। డాలర్లు ఖర్చు పెట్టింది. ఇస్రో తాను అనుసరించిన చౌక ఇంజనీరింగ్ విధానాలు కారణంగా కేవలం 90 మిలియన్లు మాత్రమే ఖర్చు చేసింది.
నైసార్ – ఎలా పనిచేస్తుంది:
ముందే చెప్పుకున్నట్లు నైసార్‍ను భూమి నుండి 747 కి।।మీ ఎత్తున్న సూర్య అనువర్తిత కక్ష్యలోకి గత జులై 30న ప్రయోగించారు. దీని బరువు 2392 కిలోలు. 90 రోజుల తరువాత పని ప్రారంభిస్తుంది. ఇందులో తొలిసారిగా అధునాతన స్పేస్ సార్ పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. దీని వల్ల సంబంధిత ప్రాంతం మొత్తాన్ని వేగంగా త్రీడీలో పరిశీలించడం సాధ్యమవుతుంది. భూమిపైనున్న అన్ని ప్రాంతాలను 12 రోజులకొకసారి పరిశీలిస్తుంది. 97 ని।।ల కొకసారి భూమిని చుట్టేస్తుంది.
నైసార్ రోజుకు 80 టెరాబైట్ల డేటాను వెలువరిస్తుంది. ఈ లెక్కన ఒక రోజులు 512 గిగాబైట్ల సామర్థ్యమున్న 150 హార్డ్ డ్రైవ్‍లను ఇది నింపుతుంది. ఈ డేటా ప్రాసెసింగ్, నిల్వ, పంపిణీ మొత్తం క్లౌడ్ ద్వారా సాగుతుంది. దీన్ని ఉచితంగా ఎవరైనా పొందవచ్చు.

అనువర్తనాలు:
నైసార్‍లో అత్యుత్తమ పనితీరు గలిగిన డ్యుయల్ ప్రీక్వెన్సీ రాడార్లు ఉండడం, ప్రతి 12 రోజులకొకసారి భూమిని పునఃపరిశీలించే సౌలభ్యం కారణంగా భూగ్రహంపై శాస్త్రవేత్తలకున్న అంచనాల్లో సమూల మార్పులు వచ్చే అవకాశం ఉంది. శాస్త్రవేత్తలకు రియల్‍టైమ్ యాక్షనబుల్ డేటాను ఎప్పటికప్పుడు అందించడం వల్ల వాతావరణ మార్పులు, విపత్తు నిర్వహణలో వేగవంతమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంటుంది.
పర్యావరణ పరిరక్షణ: L-బ్యాండ్ SAR, దట్టమైన అడవులలో సంభవించే మార్పులు, అటవీ నిర్మూలనను ట్రాక్ చేయడంలో అద్భుత పనితీరును ప్రదర్శిస్తుంది. తద్వారా UNREDD+ (Reducing Emissions from deforestation and forest degredation in developing courtries) కార్యక్రమం కింద ఇంటర్నేషనల్ కార్బన్ అకౌంటింగ్, జీవవైవిధ్యాన్ని పరిరక్షించడంలో సహాయపడుతుంది.
అదే విధంగా చిత్తడి భూముల మ్యాపింగ్, నీరు, వృక్ష సంపదలో వచ్చే కాలానుగుణ మార్పులను గ్రహించడం వల్ల వలస జాతులను (Migrated Spices) కలిగి ఉన్న ఆవాసాల పర్యావరణ ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం, భూమివినియోగానికి సంబంధించిన విధాన నిర్ణయాలలో ప్రజోప యోగకరమైన నిర్ణయాలు తీసుకునేందుకు దోహదపడుతుంది.
వాతావరణం మరియు క్రయోస్పియర్ (ధ్రువప్రాంతాల) పర్యవేక్షణ:
హిమానీనదాలు మరియు ధ్రువ ప్రాంతాల మంచు పలకలలో సంభవించే మార్పులను అధిక ఖచ్చితత్వంతో నైసార్ గ్రహిస్తుంది. తద్వారా గ్రీన్‍ల్యాండ్, అంటార్కి టికా, హిమాలయాల మంచు స్వరూపంలో వచ్చే మార్పులను వేగంగా సంగ్రహించి, ప్రపంచ సముద్ర మట్టం పెరుగుదల లాంటి మార్పులను వాతావరణ విభాగాలకు చేరవేస్తుంది. అదేవిధంగా శాశ్వత మంచు (Permafrost) కారణంగా ధ్రువప్రాంతాల భూకదలికలలో వచ్చే మార్పుల ద్వారా సంభవించే పెను విపత్తులను కూడా నైసార్ ముందే పసిగడుతుంది.
ప్రకృతి వైపరీత్యాలు మరియు విపత్తు సంసిద్ధత:
భూకంపాలు, అగ్నిపర్వతాలు, కొండచరియలు విరిగి పడడం మరియు హిమనదీయ సరస్సు విస్ఫోటనాలు Glacial lake outburst floods (GLOF) లాంటి వినాశకర విపత్తులు వేగంగా సంభవిస్తూ ఉంటాయి. నైసార్ అటువంటి విపత్తులు సంభవించడానికి కొన్ని రోజులు మరియు వారాల ముందే భూమిలోపల సంభవించే అతి చిన్న కదలికలను గుర్తించే సామర్థ్యం కలిగి ఉంది. ఆగ్నేయ ఆసియా, పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ మరియు ఆండీస్ పర్వతాలు లాంటి దుర్బల ప్రాంతాలలో ఈ ముందస్తు హెచ్చరికలు అక్కడి స్థానిక ప్రభుత్వాలు ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి వీలు కల్పిస్తాయి.
ఆహార భద్రత మరియు వ్యవసాయ ప్రణాళిక:
నేలలోని తేమ స్థాయిలు, మొక్కల ఆరోగ్యస్థితి, నీటి పారుదల తీరుతెన్నుల ఆధారంగా నైసార్ నేల స్థితిగతులను నిర్ధారిస్తుంది. తద్వారా పంటల ఎదుగుదల, నీటి వనరుల నిర్వహణకు అనుసరించాల్సిన ఖచ్చితమైన విధానాలకు నిర్దిష్టమైన సమాచారాన్ని అందిస్తుంది. వ్యవసాయ దిగుబడులకు వర్షపాతంపై ఆధారపడే దేశాలలో ఆహార సరఫరా గొలుసులు మరియు వాతావరణ ఆధారిత స్మార్ట్ వ్యవసాయంలో పెట్టుబడులకు సంబంధించి తగు నిర్ణయాలు తీసుకోవడంలో ఈ సమాచారం ఉపకరిస్తుంది.
పట్టణ మౌలిక సదుపాయాలు మరియు ఆపత్సమయ నిర్హణ:

ఉన్నట్టుండి భూమికుంగిపోవడం, డ్యాములు మరియు వంతెనలు తీవ్ర ఒత్తిడికి లోను కావడం, భూగర్భజలవనరులు వేగంగా క్షీణించడం వేగవంతమైన పట్టణీకరణకు తెరవెనుక నున్న చీకటి కోణాలు. నైసార్ యొక్క ఇంటర్ ఫెరోమెట్రీ నగరాలు, పట్టణాలలోని నిర్దిష్ట ప్రాంతంలోని నేల ఒక్క అంగుళం కుంగినా గుర్తించగలదు, డ్యాములు, వంతెనలలోని లోపాలను కూడా పసిగట్టగలదు. తద్వారా పట్టణ ప్రణాళిక నిపుణులకు సరైన నగర ప్రణాళికలను రూపొందించడంలో నైసార్ ద్వారా అందే సమాచారం చక్కగా ఉపయోగపడుతుంది.
గ్లోబల్ సైన్స్ ప్రగతికి, డేటా ప్రజాస్వామ్యకరించడంలో:
విలువైన, ఉపయోగకరమైన డేటాను అందించడంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక పరిశోధనా సంస్థలు ఉన్నాయి. కానీ వాటి నుండి డేటాను స్వీకరించి, వినియోగించడం ఖర్చుతో కూడిన వ్యవహారం. కానీ నైసార్ అనేది ఓపెన్-యాక్సెస్ ఫ్లాట్ ఫామ్. తను సేకరించిన డేటాను విశ్లేషించి కొన్ని గంటల్లో శాస్త్రవేత్తల ప్రపంచానికి అందుబాటులో ఉంచుతుంది. ఈ రకమైన డేటా ప్రజాస్వామీకరణ, ప్రతి ఒక్కరూ పరిశోధనా పక్రియలో సౌకర్యవంతంగా పాల్గొనడానికి వీలు కల్పిస్తుంది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు అధునాతన జియోస్పేషియల్ డేటాను ఉపయోగించి, నామ మాత్రపు ఖర్చుతో, మార్పులకు అనుగుణగా, స్థిరమైన పర్యావరణ వ్యవస్థల రూపకల్పనకు మరియు ఎకో ఫ్రెండ్లీ విధానాలను అభివృద్ధిపరచడానికి తోడ్పడుతుంది.
వైజ్ఞానిక దౌత్యం మరియు ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల:
నైసార్ మిషన్, ఇండియా-అమెరికాల మధ్య స్పేస్ టెక్నాలజీ సహకారంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. నైసార్‍ను సూర్యానువర్తిత కక్ష్యలో ప్రవేశపెట్టిన మొదటి రాకెట్‍గా జీఎస్‍ఎల్వీ-ఎఫ్16 చరిత్ర సృష్టించింది. ఏతావాతా ఇండియా-అమెరికాల మధ్య వాతావరణ మార్పులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇచ్చి పుచ్చుకోవడం, దైపాక్షిక సంబంధాల మెరుగుదలకు ‘నైసార్’ దారులు పరిచింది.
అంతర్జాతీయ వాతావరణ విధానాల రూపకల్పన మరియు నాయకత్వం:
నైసార్ నేల సమగ్రస్వరూపం, ధ్రువప్రాంతాలతోని మంచు కరుగుదల, నేల ఉపరితలంలోని తేమ స్థాయిలకు సంబంధించి అత్యంత ఖచ్చితమైన విశ్వసనీయ సమాచారం అందజేస్తుంది. ఈ సమాచారం సుస్థిరాభివృద్ధి లక్ష్యాలతో భాగమైన వాతావరణ మెరుగుదల, ఆహారభద్రత, సుస్థిర పట్టణాల నిర్వహణకు తగు విధానాల రూపకల్పనలోనూ, వాటికి నాయకత్వం వహించడంలోనూ ఉపకరిస్తుంది.
భవిష్యత్ బహుపాక్షిక ఉపగ్రహ ప్రయోగాలకు నమూనా:
డ్యుయల్ ఫ్రీక్వెన్సీ రాడార్లను ఒకే ఉపగ్రహంలో అమర్చి, పనిచేయించడం ద్వారా భవిష్యత్‍లో యూరోపియన్ యూనియన్, జపాన్, ఆఫ్రికన్ స్పేస్ సిస్టమ్స్ లాంటి సంస్థలతో బహుళ పాక్షిక అంతరిక్ష మిషన్‍లను ప్రయోగించడానికి నైసార్ ఒక నమూనాగా నిలుస్తుంది. తద్వారా మరింత సమగ్రమైన, సుస్థిరమైన ప్రపంచ వాతావరణాన్ని సృష్టించేందుకు తోడ్పడుతుంది.
సవాళ్లు :
i) డేటా వాల్యూమ్ మరియు డేటా ప్రాసెసింగ్: నైసార్ రోజుకు 80 టెరాబైట్ల డేటాను సృష్టిస్తుంది. దీనిని సంగ్రహించి నిల్వ చేసేందుకు అవసరమైన క్లౌడ్ ఆధారిత వ్యవస్థలను రూపొందించడం సవాలుతో కూడుకొన్నది.
ii) స్థిరత్వం మరియు దీర్ఘకాలిక విలువ: నైసార్ జీవితకాలం 5 సంవత్సరాలు. దీనిని స్థిరంగా కొనసాగించడానికి మరియు వాతా వరణంలో విపరీత మార్పులు వచ్చే కొద్దీ దీనిలోని సాంకేతిక పరిజ్ఞానాన్ని అనగా రాడార్ల సామర్థ్యం, మల్లీస్పెక్ట్రల్ లేదా ఏఐ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానంతో
ఉన్నతీకరించాల్సి వస్తుంది. తదుపరి మిషన్‍లకు కొనసాగింపుగా ఉండేందుకు ఎప్పటికప్పుడు అప్‍గ్రేడ్ చేసేందుకు వీలుగా మార్పులు చేయాల్సి రావడం సంక్లిష్టతలతో కూడిన వ్యవహారంగా చెప్పవచ్చు.
iii) బహుళ పాక్షిక సహకారం: నైసార్, ఇండియా – అమెరికాల మధ్య ఉన్నతస్థాయి సాంకేతిక సహకారానికి నమూనాగా నిలిచింది. అయితే ప్రస్తుత సంక్షోభిత ప్రపంచంలో దీనిని విభిన్న దేశాలు ఏ మేరకు అందిపుచ్చుకొని సుస్థిర అంతర్జాతీయ సమాజ రూపకల్పనకు సహకరిస్తాయనేది వేచి చూడాల్సి ఉంది.
చివరగా: ప్రస్తుతం ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య చూసినా పరస్పర అపనమ్మకం, అవిశ్వాసాలతో సంఘర్షణా పూరిత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సైన్స్ ద్వారా, అంతర్జాతీయ సవాళ్ళను ధీటుగా ఎదుర్కొని, దేశాల మధ్య సరిహద్దుల కతీతంగా ప్రజాస్వామీకరణ, సహకారం, సుస్థిర ప్రగతి సాధనకు నైసార్ ఒక నమూనాగా నిలిచింది. ఇండియా-అమెరికాల మధ్య చిగురించిన ఈ ఒరవడిని మిగిలిన ప్రపంచమంతా అందిపుచ్చుకొని సంఘర్షణలు లేని వసుధైక జగతిని ఆవిష్కరించడంలో నిర్మాణాత్మక పాత్ర పోషించాలని మనమూ ఆశిద్దాం.
-పుట్టా పెద్ద ఓబులేసు,
స్కూల్ అసిస్టెంట్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
రావులకొలను, సింహాద్రిపురం, కడప,
ఎ : 9550290047