ఆటో ఇమ్యూన్‍ వ్యాధులకు.. ఇకపై చెక్‍…@ పెరిఫెరల్‍ ఇమ్యూన్‍ టోలరెన్స్..!!

(పెరిఫెరల్‍ ఇమ్యూన్‍ టోలరెన్స్ పై పరిశోధనకు గానూ…
2025 సం।।రానికి నోబెల్‍ బహుమతి వచ్చిన సందర్భంగా…)

తన అందం, చందం, అభినయంతో దేశవ్యాప్తంగా యువతను ఉర్రూత లూగించిన ఓ దక్షిణాది సినీతార ‘‘మయోసైటిస్‍’’ అన్న కండరాల వ్యాధితో బాధపడినట్లు మనం మీడియాలో చూసే ఉంటాం. కండరాల వాపు వల్ల, కండరాలు బలహీనపడడం ఈ వ్యాధి ప్రధానలక్షణం. మయోసైటిస్‍ అనేది ఒక అటో ఇమ్యూన్‍ డిసీజ్‍. శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ శరీరంలోకి ప్రవేశించిన వ్యాధి జనక జీవులపై దాడి చేయకుండా, సొంత శరీరంలోని కణాలపై దాడి చేయడం ఆటో ఇమ్యూన్‍ వ్యాధుల ప్రధానలక్షణం. ఈ ఆటో ఇమ్యూన్‍ వ్యాధులను పూర్తిగా నియంత్రించేందుకు చేసిన పరిశోధనలకు గానూ.. 2025వ సం।।రానికి ఫిజియాలజి లేదా మెడిసిన్‍ విభాగంలో అమెరికాకు చెందిన మేరీ బ్రన్‍కో, ఫ్రెడ్‍ రామ్స్డెల్‍ మరియు జపాన్‍కు చెందిన షిమోన్‍ సకగుచి అన్న ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్‍ బహుమతి ప్రకటించారు. ఈ నేపథ్యంలో రోగ నిరోధక వ్యవస్థ, దాని పనితీరు మరియు ఫెరిఫెరల్‍ ఇమ్యూన్‍ టోలరెన్స్ గురించి మనమూ… తెలుసుకుందాం..!

రోగ నిరోధక వ్యవస్థ (Immune System) అంటే…

వ్యాధికారక సూక్ష్మ జీవుల నుండి శరీరం తనను తాను రక్షించుకునే సామర్థ్యాన్ని రోగ నిరోధక శక్తి అంటారు. బ్యాక్టీరియా, వైరస్‍, ప్రోటోజోవన్ల వంటి అనేక రకాల సూక్ష్మ జీవులు ప్రతిరోజూ మన శరీరంలోకి ప్రవేశించినప్పటికీ, చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే వ్యాధులకు కారణమవుతాయి. వ్యాధి జనక యాంటీజెన్స్ను ఎదుర్కొనేందుకు మన శరీరం యాంటీ బాడీస్‍ను తయారు చేయడం వల్ల మనం వ్యాధుల బారి నుండి రక్షణ పొందుతాము. రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో సహకరించే వివిధ రకాల కణాలు, కణజాలాలు, అవయవాల సముదాయాన్ని రోగనిరోధక వ్యవస్థ అని అంటారు.
రోగ నిరోధక వ్యవస్థను అది రోగ నిరోధక శక్తిని పొందే విధానాన్ని బట్టి 2 రకాలుగా విభజించవచ్చు. అవి i. సహజ రోగ నిరోధక శక్తి (Innate Immune System) ii. ఆర్జిత రోగ నిరోధక శక్తి (Adaptive Immune System)

i) సహజ రోగ నిరోధక శక్తి: జీవులు తాము పుట్టుకతోనే వ్యాధిజనక జీవులను శరీరంలోకి ప్రవేశించకుండా నిరోధించేందుకు కలిగి ఉన్న శక్తిని ‘‘సహజరోగనిరోధక శక్తి (Innate Immune System) అంటారు. వ్యాధిజనక జీవులు శరీరంపై దాడిచేసినపుడు ఇది వెంటనే క్రియాశీలం అవుతుంది.
ఇది దీర్ఘకాలిక రోగ నిరోధక శక్తి, దీనిలో మన శరీరం స్వయంగా యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది.
ఈ రోగ నిరోధక వ్యవస్థలో వ్యాధికారక జీవులను నిరోధించడానికి కొన్ని అవరోధాలు (Barriers) మరియు రక్షణ విధానాలు ఉంటాయి.

వ్యాధి జనక జీవులు జీవి శరీరంలోకి ప్రవేశించినపుడు వాటిని నిరోధిచేందుకు జీవి శరీరంలో అవరోధాలు ఉంటాయి. అవి క్రింది రకాలుగా ఉంటాయి.
i) భౌతిక పరమైన అవరోధాలు (Physical Barriers): వీటిలో చర్మం, శరీరంపై నున్న వెంట్రుకలు, సిలియా (శ్వాస కోశ మార్గంలోని కేశాల వంటి నిర్మాణాలు), జీర్ణాశయాంతర ప్రేగులు మొ।।నవి ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిలో మొదటి వరుసను ఏర్పరుస్తాయి. మన చర్మం వ్యాధికారక క్రిములు మన శరీరంలోకి ప్రవేశించకుండా భౌతిక అవరోధంగా నిలుస్తుంది. మన ముక్కు, చెవులలో నిశ్లేష్మస్తరం కూడా ఒక రక్షణ అవరోధం, ఇది వ్యాధి కారకక్రిములు లోపలికి వెళ్లేముందు, వాటిని బంధిస్తుంది.
ii) శారీరక అవరోధాలు (Physiological Barriers): మనం తిన్న ఆహారం కడుపులోకి వెళ్ళిన తరువాత ఆహార అణువులను విచ్ఛిన్నం చేయడానికి మన జీర్ణ వ్యవస్థ హైడ్రో క్లోరిక్‍ ఆమ్లాన్ని (HCI) స్రవిస్తుంది. ఈ ఆమ్లం యొక్క తీవ్రత కారణంగా ఆహారంతో పాటు మన శరీరంలోకి ప్రవేశించే సూక్ష్మ జీవులు ఆహారం జీర్ణమయ్యే క్రమంలో నశించిపోతాయి. నోటిలోని లాలాజలం మరియు కళ్ళలోని, కన్నీళ్ళు కూడా యాంటీబయాటిక్‍ లక్షణాన్ని కలిగిఉండి, రోజంతా బహిర్గతమై ఉన్నప్పటికీ వ్యాధికారకాల వృద్ధిని అనుమతించవు.

iii.కణసంబంధిత అవరోధాలు (Cellular Barriers): భౌతిక, శారీరక అవరోధాలు వ్యాధికారక క్రిములను నిరోధిస్తున్నప్పటికీ, కొన్ని వ్యాధికరక క్రిములు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇలాంటి క్రిములను ల్యూకోసైట్లు(WBC), న్యూట్రోఫిల్స్, లింఫోసైట్లు, బేసోఫిల్స్, ఇసినోఫిల్స్ మరియు మోనోసైట్లు లాంటి కణాలు నిరోధిస్తాయి. ఇవి రక్తం మరియు శారీరక కణజాలాలో ఉంటాయి.
iv.సైటో కైనిన్‍ అవరోధాలు (Cytokine Barriers): సైటోకైనిన్స్ కణాల విభజన, వృద్ధిని నియంత్రిస్తాయి. మన శరీరంలోని ఒక కణం వైరస్‍ దాడికి గురైతే, కణం స్వయం చాలితంగా ఇంటర్‍ఫెరాన్‍లు అనే ప్రోటీన్లను స్రవించడంలో సైటోకైనిన్‍లు తోడ్పడతాయి. ఈ ప్రొటీన్లు వైరస్‍ సోకిన కణం చుట్టూ పూతను ఏర్పరిచి, దాని చుట్టూ ఉన్న ఇతర కణాలను తదుపరి ఇన్ఫెక్షన్ల నుండి నిరోధిస్తాయి. సహజ రోగ నిరోధక వ్యవస్థలో ఇంకా ఈ క్రింది కణాలు పాల్గొంటాయి.
i) ఫాగోసైట్లు – ఇవి శరీరమంతా తిరుగుతూ వ్యాధి కారక క్రిములను భక్షిస్తాయి.
ii) మాక్రోఫెజస్‍ – ఇవి ప్రసరణ వ్యవస్థల గోడలపై కదులుతూ అక్కడ ఇన్ఫెక్షన్లను నిరోధిస్తాయి.
iii) మాస్ట్కణాలు – ఇవి గాయాలను నయం చేస్తాయి. ఇవి హిస్టమిన్‍ అనే ప్రొటీన్‍ను విడుదల చేస్తాయి.
iv) న్యూట్రోఫిల్స్, ఇసినోఫిల్స్, బేసోఫిల్స్: ఇవన్నీ అత్యంత విష పూరిత ప్రొటీన్లను కలిగి ఉండి, వ్యాధి జనక జీవులపై దాడి చేసి, వాటిని నాశనం చేస్తాయి.
v) సహజ కిల్లర్‍ కణాలు: ఇవి వ్యాధి సోకిన కణాలను నాశనం చేసి, ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని నియంత్రిస్తాయి.
vi) డెన్డ్రిటిక్‍ కణాలు: ఇవి ప్రారంభ ఇన్ఫెక్షన్లకు కేంద్ర బిందువులైన కణజాలాలలో ఉంటాయి. ఈ కణాలు ఇన్ఫెక్షన్‍ను గ్రహించి యాంటీజెన్‍ ప్రెజంటేషన్‍ ద్వారా మిగిలిన రోగ నిరోధక వ్యవస్థకు సందేశాన్ని పంపుతాయి.

II) ఆర్జిత రోగ నిరోధక శక్తి (Adaptine Immunity ): పుట్టుకతో కాకుండా, కాలక్రమేణా మన శరీరం పొందే రోగ నిరోధక శక్తిని ఆర్జిత రోగ నిరోధక శక్తి లేదా అనుకూల రోగ నిరోధక శక్తి (Adaptive Immunity) అంటారు.
మన శరీరానికి ఏదైనా వ్యాధి సోకినపుడు, ఈ రోగ నిరోధక వ్యవస్థ ఆ వ్యాధి కారకాలను గుర్తించి, వాటిని జ్ఞాపకం పెట్టుకొని ఉంటుంది. రెండవసారి ఆ వ్యాధి కారకాలు (యాంటీజెన్స్) మన శరీరంపై దాడి చేస్తే, వాటిని ఎదుర్కొనేందుకు ప్రతి దేహాలను (యాంటీబాడీస్‍) రూపొందించి, వ్యాధికారకాలపై దాడిచేస్తుంది.

i) నిర్ధిష్టత (specifity): ఈ రోగ నిరోధక వ్యవస్థ వివిధరకాల వ్యాధి కారకాలను గుర్తించి, హానికరమైన, హానికరంకాని వాటిని వేరు చేసి వాటిని నాశనం చేయడానికి మార్గాలను రూపొందించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
ii) వైవిధ్యం (diversity): ఈ వ్యవస్థ ద్వారా మన శరీరం ప్రొటోజోవా నుండి వైరస్‍ల వరకు అనేక రకాల వ్యాధి కారకాలను గుర్తిస్తుంది.
iii) శారీరక మరియు శరీరానికి వెలుపలి కణాల మధ్య తేడాను గుర్తించడం (Differentiate between self and non self): ఈ రోగ నిరోధక వ్యవస్థ ద్వారా మన శరీరం శారీరక కణాలు, శరీరానికి వెలుపలి కణాలను గుర్తించి, వేరు చేసే సామర్థ్యం ఉండడం వల్ల, శరీరానికి వెలుపలి కణం శరీరంలోకి ప్రవేశిస్తే వెంటనే తిరస్కరిస్తుంది.
iv) జ్ఞాపకశక్తి (memory): ఈ రోగ నిరోధక శక్తి ద్వారా మనశరీరం ఏదైనా ఒక వ్యాధికారకాన్ని ఎదుర్కొన్న తరువాత, దానిని నాశనం చేయడానికి రోగ నిరోధక వ్యవస్థను క్రియాశీలం చేస్తుంది. ఆ వ్యాధికారకానికి ప్రతిస్పందనగా ఏ ప్రతిరోధకాలు (యాంటీబాడీస్‍) విడుదలయ్యాయో అది గుర్తించుకొని, తదుపరి అవి మళ్ళీ ప్రవేశించినపుడు వాటిని గుర్తించి యాంటీబాడీస్‍ ద్వారా వాటిపై దాడి చేస్తుంది.

ఆర్జిత రోగ నిరోధక వ్యవస్థలో బి-సెల్స్ (B-Cells), టి-సెల్స్ (T-Cells) అనే రెండు రకాల కణాలు పాల్గొంటాయి. ఈ కణాల గురించి అవగాహన చేసుకోవాలంటే మనం ముందుగా రక్తం మరియు లింఫోటిక్‍ సిస్టమ్‍ గురించి తెలుసుకోవాలి.
రక్తం- దానిలోని భాగాలు: రక్తం మనశరీరం అంతటా ప్రవహిస్తూ మన శరీరంలోని కణాలు మరియు కణజాలాలకు కావలసిన ఆక్సిజన్‍ మరియు పోషకాలను అందిస్తుంది. రక్తంలో 55 శాతం ప్లాస్మా ఉండగా, మిగిలిన 45 శాతం రక్తంలోని వివిధ కణాలు ఉంటాయి. రక్తం మన శరీర బరువులో 8శాతం
ఉంటుంది. సగటు వయోజన వ్యక్తి శరీరంలో 5-6లీ।।రక్తం ఉంటుంది.

రక్తంలో ఉన్న కణాలలో i. ఎర్రరక్త కణాలు (ఎరిత్రోసైట్లు), ii తెల్లరక్తకణాలు (ల్యూకోసైట్లు) iii. రక్తఫలకికలు-ప్లేట్‍లెట్స్ (థాంబో సైట్స్) అనే 3 రకాల కణాలు ఉంటాయి.
i) ఎర్రరక్త కణాలు (ఎరిత్రోసైట్లు): ఎర్రరక్తకణాలలో హిమోగ్లోబిన్‍ అనే ప్రొటీన్‍ ఉంటుంది. హిమోగ్లోబిన్‍లో ఐరన్‍ అధికంగా ఉంటుంది. ఇది రక్తానికి ఎరుపురంగును ఇస్తుంది. ఇవి ఎముకమజ్జలో ఉత్పత్తి అవుతాయి. వీటి ప్రధాన విధి శరీరంలోని వివిధ కణజాలాలు మరియు అవయవాలకు ఆక్సిజన్‍ ను రవాణా చేయడమని చెప్పవచ్చు.
ii) తెల్లరక్తకణాలు (ట్యూకోసైట్లు): వీటిలో హిమోగ్లోబిన్‍ ఉండదు. అందువల్ల ఇవి వర్ణరహితంగా ఉంటాయి. వీటిలోని కణికల ఆధారంగా వీటిని కణికాభ కణాలు (గ్రాన్యులోసైట్స్) 2. కణికాభ రహిత కణాలు (ఏగ్రాన్యులోసైట్స్) అని రెండు రకాలుగా విభజిస్తారు.
i) గ్రాన్యులోసైట్స్: వీటిని తిరిగి 3 రకాలుగా విభజిస్తారు. i. ఇసినోఫిల్స్ ii. బేసోఫిల్స్ iii. న్యూట్రోఫిల్స్
ii) ఏగ్రాన్యులోసైట్లు: వీటిని తిరిగి 2 రకాలుగా విభజిస్తారు. అవి i. లింఫోసైట్లు, ii. మోనోసైట్లు. లింఫోసైట్లను తిరిగి 3 రకాలుగా విభజిస్తారు. అవి: 1 బి-సెల్స్ (B-Cells), 2. టి-సెల్స్ (T-Cells), 3. న్యాచురల్‍ కిల్లర్‍ సెల్స్ (NK-Cells) ఫెరిఫెరల్‍ ఇమ్యూన్‍టోలరెన్స్ను అర్థం చేసుకోవాలంటే బి-సెల్స్, టి-సెల్స్ల గురించి సమగ్రంగా అవగాహన చేసుకోవాలి.
iii) రక్తఫలకికలు (థ్రాంబోసైట్లు): ఇవి ఎముక మజ్జలో ఉత్పత్తి అవుతాయి. శరీరానికి ఏదైనా గాయమై రక్తస్రావం జరిగినపుడు రక్తం శరీరంలో నుండి బయటకు ప్రవహించడాన్ని నిరోధించి, రక్తం గడ్డ కట్టడంలో ఇవి సహాయపడతాయి.

లింఫోటిక్‍ సిస్టమ్‍:
మన శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి, కణితుల (Tumors) వ్యాప్తికి కారణమయ్యే వ్యాధికరకాల దాడి నుండి రక్షించడంలో పాల్గొనే రోగ నిరోధక వ్యవస్థ యొక్క అవయవాలను లింఫోయిడ్‍ అవయవాలు అంటారు వీటి సమూహన్ని లింఫోటిక్‍ వ్యవస్థ అంటారు. వీటిలో ఎముకమజ్జ, రక్తనాళాలు, శోస రసగ్రంధులు శోసరసనాళాలు, థైమస్‍, ప్లీహం మరియు లింఫోయిడ్‍ కణజాలం యొక్క వివిధ సమూహాలు ఉంటాయి.
రక్తం మరియు రక్త ప్రసరణ వ్యవస్థ అనేది జాతీయ రహదారి అయితే లింఫోటిక్‍ వ్యవస్థ అనేది ఆ జాతీయ రహదారి నుండి విభజించబడిన గ్రామీణ రహదారులాంటివని చెప్పవచ్చు.

రోగ నిరోధక వ్యవస్థలో బి, టి సెల్స్ ప్రాధాన్యత:
మానవ శరీరంలో దాదాపు 30-50 ట్రిలియన్ల కణాలుంటాయి. ప్రతీకణం పైభాగంలో కొన్ని ఉపరితల ప్రొటీన్లు ఉంటాయి. ఈ ఉపరితల ప్రొటీన్లు కణం యొక్క గుర్తింపు చిహ్నాలుగా పనిచేస్తాయి. ఈ గుర్తింపు చిహ్నాలుగా వ్యవహరించే ప్రొటీన్లను సీడీమార్కర్స్ అని పిలుస్తారు. సీడీ అనగా క్లస్టర్‍ ఫర్‍ డిఫరెన్సియేషన్‍. ఈ గుర్తింపు చిహ్నాల ఆధారంగా శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ శారీరక కణాలు మరియు శరీరానికి వెలుపలి కణాలను సులువుగా గుర్తిస్తుంది.

రోగ నిరోధక వ్యవస్థలో అనేక రోగనిరోధక కణాలు
ఉన్నప్పటికీ, ఆర్జిత రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన బి-సెల్స్ మరియు టి-సెల్స్ విశిష్టమైనవి అని చెప్పవచ్చు. ఇవి రెండూ ఎముక మజ్జలో ఉద్భవిస్తాయి. అయితే బి-సెల్స్, ఎముక మజ్జలోనే ఉండి వ్యాధికారక జీవులను ఎదుర్కొనేందుకు తగు శిక్షణ పొందుతాయి. కానీ టి-సెల్స్ ఎముక మజ్జ నుండి థైమస్‍ గ్రంథిలోకి వెళ్ళి అక్కడ వ్యాధికారక జీవులను ఎదుర్కొనేందుకు కావలసిన శిక్షణ పొందుతాయి. అయితే బి-సెల్స్ మరియు టి-సెల్స్ వాటి శరీర ఉపరితలం పై భాగంలో ప్రత్యేకమైన ప్రొటీన్లను కలిగి ఉంటాయి. అవి శరీరంలోకి ప్రవేశించిన వ్యాధికారక జీవులను పట్టుకునే విధంగా పాకెట్‍లాగా ఉంటాయి. అందుకే వీటిని రిసెప్టార్లు (గ్రాహకాలు) అంటారు. శరీరంలోకి ఏవైనా వ్యాధికారక యాంటీజెన్‍లు ప్రవేశించినపుడు బి-సెల్స్ పైన ఉన్న రిసెస్టార్లు యాంటీబాడీలుగా వ్యవహరించి యాంటీజెన్లను బంధించి నాశనం చేస్తాయి. అయితే టీ-సెల్స్ మరింత ప్రత్యేకమైన విధి నిర్వహణను ప్రదర్శిస్తాయి. ఈ రకమైన విది నిర్వహణకు టీ-సెల్స్లోని టీ-హెల్పర్‍ సెల్స్ మరియు టీ-సైటో టాక్సిక్‍ సెల్స్ అనేవి తోడ్పాటునందిస్తాయి. టీ-సెల్స్లోని మిగిలిన కణాలతో పోలిస్తే ఈ రెండు కణాలు ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటాయి. ఇందులో భాగంగా టీ-హెల్పర్‍ సెల్స్ బి-సెల్స్ను ప్లాస్మా కణాలుగా విభజించి యాంటీ బాడీలను ఉత్పత్తి చేసేందుకు సహకరిస్తాయి. ఇక రెండవ సెల్స్ అయిన టీ-సైటోటాక్జిక్‍ సెల్స్ లేదా కిల్లర్‍ సెల్స్ అనేవి శరీరంలోని క్యాన్సర్‍ కణాలను, వ్యాధి సోకిన కణాలపై నేరుగా దాడి చేసి వాటిని నాశనం చేస్తాయి. తద్వారా వ్యాధికారకాలు మరిన్ని కణాలకు సోకకుండా నియంత్రిస్తాయి.

టీ-సెల్స్లో కనుగొనబడిన మూడవ రకం కణాన్ని సప్రెసర్‍ టీ-సెల్స్ అని పిలుస్తారు. వీటినే రెగ్యులేటరీ టీ-సెల్స్ అని కూడా వ్యవహరిస్తారు. 2025 సంవత్సరానికి నోబెల్‍ బహుమతి ఈ రెగ్యులేటరీ టీ-సెల్స్పై పరిశోధనకే లభించింది.

రోగనిరోధక వ్యవస్థలో బి,టి-సెల్స్ నిర్మాణాత్మక పాత్ర:
బీ-సెల్స్ మరియు టీ-సెల్స్ వ్యాధిజనక క్రిముల (యాంటీజెన్స్)ను నియంత్రించేందుకు రెసెఫ్టార్స్ను కలిగి ఉంటాయని ముందే తెలుసుకున్నాము. యాంటీజెన్స్ అనగా ఒకరకమైన ప్రొటీన్లు. ఇవి ఈ రిసెప్టార్స్ (గ్రాహకాలు)ను ఉత్తేజపరుస్తాయి. మనశరీరంలోని బి-సెల్స్ మరియు టీ-సెల్స్ విదేశీకణాలపైనే కాకుండా మన శరీరంలోని సొంత కణాలపై (చర్మకణాలు, కాలేయ కణాలు, మూత్రపిండ కణాలు) కూడా దాడి చేస్తూ ఉంటాయి. ఏ, బీ-సెల్స్ మరియు టీ-సెల్స్ అయితే సొంత శరీర కణాలపై దాడిచేస్తాయో అలాంటి వాటిలో బీ-సెల్స్ను అవి యాంటీజెన్స్ను ఎదుర్కొనేందుకు శిక్షణ పొందిన ఎముక మజ్జలో మరియు టీ-సెల్స్ అవి యాంటీజెన్స్ను ఎదుర్కొనేందుకు శిక్షణపొందిన థైమస్‍ గ్రంథిలో నుండి తొలగించబడతాయి. లేదా నాశనం చేయబడతాయి. అయితే ఇది పరిపూర్ణం కాదు. ఆసక్తికరంగా సొంత శరీరకణాలపై దాడిచేసే కొన్ని బీ-సెల్స్ మరియు టీ-సెల్స్ ఎముక మజ్జ నుండి, థైమస్‍ గ్రంధి నుండి నాశనం కాకుండా తప్పించుకొని లింఫోటిక్‍ (శోసరసనాళాలు) నాళాలోకి ప్రవేశిస్తాయి. ఇలా ప్రవేశించిన బి-సెల్స్ మరియు టీ-సెల్స్ సొంత శరీరకణాలపై దాడి చయకుండా టీ-సెల్స్లోని మూడవ రకానికి చెందిన సప్రెసర్‍ టీ-సెల్స్ వాటిని పూర్తిగా నియంత్రిస్తాయి లేదా అణిచివేస్తాయి.

మన శరీరంలోని ప్రతీకణం ఒక ప్రత్యేకమైన గుర్తింపు చిహ్నాలను కలిగి ఉంటాయని వాటిని సీడీ మార్కర్స్ అంటారని ముందే చెప్పుకున్నాము. టీ-హెల్పర్‍ సెల్స్ కలిగి ఉన్న సీడీ-మార్కర్స్ను సీడీ-4+ (CD-4+) మార్కర్స్ అని, టీ-సైటో టాక్జిక్‍ లేదా కిల్లర్‍ సెల్స్ కలిగి ఉన్న మార్కర్స్ని సీడీ-8+ (CD-8+) మార్కర్స్ అని పిలుస్తారు. (ప్రొటీన్‍ కలిగి ఉన్నట్లయితే + గుర్తుతో సూచిస్తారు).
అయితే టీ-సెల్స్లో మూడవ రకమైన సప్రెసర్‍-టీసెల్స్ లేదా రెగ్యులేటరీ టీ-సెల్స్ అనేవి సీడీ-25+ (CD-25+) అన్న విశిష్టమైన సీడీ మార్కర్లను కలిగి ఉంటాయి. రెగ్యులేటరీ టీ-సెల్స్ అన్నవి ‘టీ-రెగ్‍సెల్స్’ అన్న పేరుతో బాగా ప్రాచుర్యం పొందాయి.
ఎముక మజ్జ, థైమస్‍ గ్రంధుల నుండి తప్పించుకొని లింపోటిక్‍ సిస్టమ్‍లోకి ప్రవేశించిన బీసెల్స్, టీ-సెల్స్ను నియంత్రించేందుకు టీ-రెగ్‍సెల్స్ కొన్ని ప్రత్యేకమైన స్రావాలను స్రవించి, సొంత శారీక కణాలపై దాడిచేయకుండా వాటిని అణచివేస్తాయి, అయినా అవి మాట వినకపోతే వాటిపై నేరుగా దాడిచేసి టీ-రెగ్‍సెల్స్ వాటిని నాశనం చేస్తాయి.

రోగనిరోధక సహనం – రకాలు (Types of Immunity toleranee):
ఈ విధంగా సొంత శారీక కణాలపై దాడి చేయకుండా మన రోగనిరోధక వ్యవస్థచే నియంత్రించబడితే దానినే రోగినిరోధక సహనం (Immune toleranee) అంటారు. ఈ రోగ నిరోధక సహనాన్ని 2 రకాలుగా విభజించవచ్చు. అవి i) కేంద్రీయ రోగ నిరోధక సహనం (central immune system), ii) పరధీయ రోగనిరోదక సహనం (periferal immune system).
1) కేంద్రీయ రోగనిరోధక సహనం (central immune tolerance):
రోగనిరోధక రక్షక కణాలైన బీ-సెల్స్ మరియు టీ-సెల్స్ సొంత శారీరక కణాలపైన దాడిచేయకుండా, శరీరంలోకి ప్రవేశించిన విదేశీ కారక జీవులను ఎదుర్కొనేందుకు ఎముక మజ్జ మరియు థైమస్‍ గ్రంధిలో శిక్షణ పొందుతాయి. (ఈ థైమస్‍ గ్రంథి మన శరీరంలో ఉరఃపంజరంలోని ప్రక్కటెముకలను కలిపే మధ్యభాగం (stem) కింద ఉంటుంది. తైమస్‍ గ్రంథినే ‘‘బాలగ్రంథి’’ అంటారు. వయసు పెరిగే కొద్దీ, ఈ గ్రంథి పరిమాణం క్షీణిస్తూ ఉంటుంది). అయినప్పటికీ వాటిలో కొన్ని బీ-సెల్స్, టీ-సెల్స్ సొంత శారీరక కణాలపై దాడిచేస్తూ ఉంటాయి. అలాంటి కణాలు ఎముక మజ్జ మరియు థైమస్‍ గ్రంధి నుండి Apoptosis అన్న క్రియద్వారా తొలగించబడతాయి. దీనినే కేంద్రీయ రోగనిరోధక సహనం అంటారు. ముందే చెప్పుకున్నట్లు ఇది పరిపూర్ణం కాదు.
(తరువాయి వచ్చే సంచికలో)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *