మననం చేసుకోవడానికి సౌలభ్యమున్న తెలుగు పద్యం రంగస్థల రూపు ధరించి సామాన్యుడిని సులువుగా ఆకట్టుకుంది. పాట దానిని మించి ఇటీవల రోజుల్లో సినిమా ద్వారా కూడా అలరిస్తోంది. గాంధీజీ ప్రభావం గురించి సాహిత్యం గురించి చెప్పుకోవాలంటే పాటలనే తొలుత పేర్కోవాల్సి ఉంటుంది. ‘‘ఆంధ్ర సాహిత్య చరిత్రలో గాంధీయుగం చిరస్మరణీయం, స్వర్ణయుగం’’ అని అంటారు స్వాతంత్య్ర సమరయోధులు కోదాటి నారాయణరావు!
ఇటు తెలుగు సాహిత్యం వైపు చూస్తే మేరు శిఖరంగా కనిపించే కవి దామరాజు పుండరీకాక్షుడు. ఆయన ‘శ్రీ గాంధీనామం మరువం మరువం’ వంటి ప్రఖ్యాతమైన పాటలతోపాటు విలువైన పద్యనాటకాలు కూడా రాశారు. పద్యనాటకాలతో పాటు ‘శాంతారాం’ ఏకాంకిక, ‘అహింసాజ్యోతి’ ఖండకావ్యం మొదలైనవి పుండరీకాక్షుడి రచనలే! ‘నవయుగారంభం’లో ‘నాంది’ పద్యం ఇలా ఉంటుంది.
కత్తులు లేవు
శూలమును
గాండివమున్
మొదలే హుళక్కి
నోరెత్తి ప్రచండ
వాక్పటిమ నేనియు జాటడు
వైరి మీద దండెత్తగ సేన లేదు
బలహీనము కాయము
కోపతాపముల్ బొత్తిగ సున్న
అట్టి
ఘనమూర్తి
మనోబలశాలి గాంధి
జేయెత్తి నమస్కరించి
స్మరియించెదె నెపుడు స్వరాజ్య సిద్ధికిన్
‘గాంధీ విజయం’ నాటకంలోనే
మరో నాంది పద్యం ఇలా సాగుతుంది:
ఎవ్వని శాంతమూర్తియని
యెల్లరనారతమున్ భజింతురో
యెవ్వడధర్మమార్గమున
నించుకయేనియు కాలుబెట్టడో
యెవ్వడు
లోకమంతట నహింసయె యుత్తమమంచు జాటెనో
అవ్వరమూర్తి
గాంధిఋషి కంజలి మోడ్చి నమస్కరించెదన్
తెలుగులో తొలి రాజకీయ నాటకాలు పద్యరూపంలో రాసిన దామరాజు పుండరీకాక్షుడు (1896 జూన్ 5- 1975 నవంబర్ 10) గుంటూరు ప్రాంతంలో గొప్పగా రాణించిన న్యాయవాది. స్వాతంత్య్రానంతరం ‘రామరాజ్యం’ అనే పత్రికను కూడా స్థాపించి నిర్వహించారు. ‘గాంధీ మహోదయం’, ‘గాంధీ విజయం’, ‘పాంచాల పరాభవం (పంజాబు దురాగతాలు)’, ‘రణభేరి’, ‘ద్వితీయ ప్రపంచ సంగ్రామ చరిత్ర’, ‘స్వరాజ్య సౌధము’ అనే ఐదు నాటకాలు 1915 నుంచి భారతదేశపు స్వాతంత్య్ర ఉద్యమాన్ని, మహాత్ముని విజయాన్ని రూపు కట్టే సృజనాత్మక ప్రయత్నాలు! దామరాజు పుండరీకాక్షుడి నాటకాలు నిషేధించడానికి బ్రిటిష్ పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశం జరిపి తన చట్టాలకు కొత్తగా పదును బెట్టిందని అంటారు! అంటే భారతీయ భాషల్లో గాంధీజీ జీవితం ఆధారంగా వచ్చిన తొలి నాటకం ‘గాంధీ మహోదయం’ అయి ఉండాలి! దీని మీద గట్టి పరిశోధన చేసి నిగ్గు తేల్చాల్సి ఉంది. ఎవరు చేస్తారు? ఎప్పుడు చేస్తారు?
‘‘మాకొద్దీ తెల్లదొరతనము’’ పాట రాసిన గరిమెళ్ళ సత్యనారాయణ ‘సైతాను ప్రభుత్వము’ అనే పాటలో చివరి చరణంలో ఇలా అంటారు: ‘నూలుపోగు మీద రాజ్యమూగుతున్నదండి బాబు సీమనూలు తెంచితేను సితికిపోవునండి బాబు’! గాంధీజీ స్వాత్రంత్య్ర సమర శంఖారావాన్ని మురళీగానంతో పోలుస్తూ బసవరాజు అప్పారావు రాసిన ‘‘వేణునాదము మోగుతుందండోయ్’’ అనేపాటలో
‘‘భారతదేశపు దాస్యము బాపగ
పయనమాయ మోహన గాంధీ
చావో జయమో! తేలందే యీ
జన్మకు మళ్ళీ కనబడరండోయ్’’
– అని అంటారు.
చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులుగారి ‘భరతఖండంబు చక్కని పాడియావు’ అనే తేటగీతి పద్యం చాలా ప్రసిద్ధమైందే ఆరోజుల్లో! ఉప్పు సత్యాగ్రహాన్ని అందమైన ‘స్వరాజ్యలక్ష్మి పెండ్లి జూడ, రారే రమణులారా’ అనే పాట చాలా సుప్రసిద్ధమైందే. కానీ ఈ కవి పేరు తెలియ రాలేదు. త్రిపురనేని రామస్వామి ‘వీరగంధము తెచ్చినారము’ గీతంతో పాటు దుగ్గిరాల గోపాలక•ష్ణయ్య పాట కూడా ప్రఖ్యాతమే!
‘‘ముప్పయి కోట్ల ప్రజలు – రాంభజన
పంజర బంధమైనవారు
బంధాలు తెంపుకొని – రాంభజన
అవతలా పడాలి’’ అంటూ సాగి
ఆకట్టుకుంది.
‘‘లాఠీ దెబ్బలకేమి బెదరాం, బెదరాం
మేటి తుపాకీకి – బెదరాం, బెదరాం
మా గాంధీనే మేం – నమ్మేం నమ్మేం
మరి ఇతరులను మేము – నమ్మాం నమ్మాం’’
అని మధ్యలో సాగే దామరాజు పుండరీకాక్షుడి
‘శ్రీ గాంధీనామం’ చాలా గొప్ప గీతం!
‘ఎవడీ యర్థ దిగంబరేశ్వరుడు’ అని గుర్రం జాషువా ‘బాపూజీ’ కావ్యంలో పద్యం ప్రారంభిస్తే, ‘స్వరాజ్యరథం’లో బలిజేపల్లి లక్ష్మీకాంతం కవి ‘‘తరి గాంధీయుగ మేగుదెంచె…’’ అంటూ తన పద్యాన్ని మొదలుపెడతారు.
‘క్విట్ ఇండియా’ నినాదపు ఆగ్రహాన్ని వివరిస్తూ జాషువా ‘దొరలారా, పొండు మీ ఇండ్లకున్’ అంటూ ఆ పద్యాన్ని ముగిస్తారు.
‘గోచిపాత గట్టుకుని జాతి మానంబు
నిలిపినట్టి ఖద్దరు నేతగాడు
విశ్వసామరస్య విజ్ఞాన సంధాత
కామిత ప్రదాత, గాంధీతాత!’ – అని
‘బాపూజీ’ ఖండకావ్యంలోనే జాషువా మరోచోట అంటారు.
‘‘గాంధీజీ
ఒక్క అడుగు వేసాడా,
లక్షమంది కదులుతారు!’’

అని కాళోజీ నారాయణరావు అంటారు, ఇది అక్షర లక్షల కవితా వాస్తవం! ‘కొల్లాయి గట్టితేనేమి…’ అనే ప్రఖ్యాత గీతం రాసిన బసవరాజు అప్పారావు విదేశీవస్త్ర బహిష్కరణ గురించి ఉద్బోధ చేస్తూ – ‘రాట్నము’ అనే గీతంలో –
‘‘సిగ్గు లేదా నీకు – శరము లేదా?
అన్నమైనా లేక బీదలల్లాడుతుంటేను
సీతాకోక చిలుకలాగ సీమగుడ్డ కట్టి తిరుగ’’ అంటూ-రవ్వలు రాలుస్తారు. అలాగే ‘‘గాంధి మహాత్ముడు బయలుదేరగా కలకలనవ్వింది – జగత్తు కలకల నవ్విందీ’’ అనే మనోహర గీతాన్ని కూడా వారే రాశారు.
కరుణశ్రీ ‘‘లేచిపోయినవి పోలీసుల టోపీలు వందలు వేలు రాబందులట్లు’’ అంటూ క్విట్ ఇండియా ఉద్యమ పద్యాన్ని ప్రారంభించగా, దాశరథి కృష్ణమాచార్య ‘‘అతని ప్రతి అడుగు గురుతు ఆలయమై తల యెత్తును’’ అని ‘ఎవరి పాద చిహ్నములివి’ అనే పాటలో అంటారు.
‘‘కట్టుకున్నది అంగ వస్త్రము’’ అంటూ చుక్కబొట్ల సత్యనారాయణమూర్తి రాసిన పాటలో ‘‘గాంధీ కంటెను సామ్యవాదులు కలరె? లోకములో’’ అని ప్రశ్నిస్తారు.
‘‘వయస్సు మీరిన బడుగు
వయస్సు లేని నిసువు
అన్యాయం సమక్షంలో అగ్రమహోదగ్రమూర్తి’’ అంటూ
‘‘అతడు సామాన్య వ్యక్తి
అతడసామాన్య వ్యక్తి’’ అని మొదలయ్యే కవితలో శీశ్రీ అంటారు.
‘‘మతం తలవక గతం తడవక
ద్వేషం రోషం సకలం మరచి’’ అని
వేదుల సత్యనారాయణమూర్తి ‘జాతీయపతాకం’ అనే కవితలో చెబుతారు. ఇలా ఎంతమందని ఈ కవులను గురించి చెప్పడం?
దువ్వూరి రామిరెడ్డి వంటి మరెంతోమంది కూడా గాంధీ గీతాలను స•జించారు. గాంధీజీ హత్య కావడం కూడా ఎందరో తెలుగు కవులను కలచి వేసింది.
తుమ్మల సీతారామమూర్తి ‘అమరజ్యోతి’ ఖండికలోని ఓ పద్యంలో…
‘‘మనుజుడవు గావు, నీవు కోమటివి గావు
బడలి పోయిన భారతీయుడవు గావు
కావు గాంధివి. లోకములనెల్ల
జూపు నిరవధికామర జ్యోతివోయి’’ – అని విలపిస్తారు.
ఇదే సందర్భంలో కొడవటిగంటి కుటుంబరావు ‘ఆంధ్రమహిళ’ 1948 ఫిబ్రవరి సంచికలో గాంధీజీకి నివాళులు అర్పిస్తూ రాసిన ఒక వ్యాసంలో ‘‘తనను నాశనం చేసిన అధర్మం ఎటువంటిదో ప్రజలకు చూపడానికే అవతారపురుషులు ఉపకరిస్తారు. గాంధీజీ మనకు తన మృతి ద్వారా హిందూ మతావేశకుల నగ్న స్వరూపం చూపగలి’’గారని అంటారు.
‘గాంధీతత్వం’ అనే ప్రసంగ వ్యాసంలో త్రిపురనేని గోపీచంద్ ‘‘ఆయన దృష్టి పూర్తిగా మన పూర్వ సంస్కారాన్ని పునాదిగా పెరిగిన దృష్టి. మానవునిలో మంచితనం ఉంది. ఎప్పుడూ ఉంటుంది కానీ, విభిన్న కారణాల వల్ల అది మరుగునపడి ఉంది. ఆ మరుగును తొలగిస్తే మానవుడు తన పరిస్థితుల్ని అధిగమించి ఎదుగ గలుగుతా’’డని భావిస్తారు.
దేవులపల్లి కృష్ణశాస్త్రి ఒక వ్యాసంలో ‘‘ఈయన మన కళ్ళు మిరుమిట్లు గొలపడు. ఈయన కైలాస శిఖరం కాదు. దేశం అంత జలాశయం గాంధీ. గాంధీ గంగానది. దానిలో అమృతం మీకూ, నాకూ అందరికీ అహరహమూ అన్ని పనులకూ అందుబాటులో ఉంటుంది’’ అంటారు.
‘‘గాంధీని విడదీసి భారతదేశాన్ని చూస్తే దేశం అంతా కొత్తగా, మనది కాదన్నట్టుగా కనిపిస్తుం’’దని కవి దేవరకొండ బాలగంగాధర్ తిలక్ అంటే, మహాకవి దాశరథి కృష్ణమాచార్య ‘‘హిమాలయాలను గురించి, గంభీర సముద్రాలను గురించి సమగ్రంగా చెప్పగలగడం ఎంత అసాధ్యమో, మహాత్మాగాంధీ వ్యక్తిత్వాన్ని గురించి చెప్పగలగడం కూడా అంత అసాధ్యం’’ అని అంటారు. ‘‘ప్రథమ భారత ప్రభుత్వాధ్యక్ష పదవిని ఒక స్త్రీ ముఖ్యంగా తాను ఆద్యంతంగా అభ్యదయం కోరే ఒక హరిజన యువతి రావాలని కోరా’’డని గాంధీజీ గురించి రచయిత్రి కనుపర్తి వరలక్ష్మమ్మ అంటారు.
‘‘వ్యక్తుల ద్వారా గౌతమ బుద్ధుడు, ఏసుక్రీస్తు అహింసా సిద్ధాంతాన్ని ప్రయోగిస్తే; సంఘం ద్వారా గాంధీ వాటిని ప్రయోగించారు’’ అని ప్రఖ్యాత సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావు విశ్లేషించారు. పాతికేళ్ళ వయసులో స్వాతంత్య్ర సమరయోధులై కఠిన కారాగారశిక్షను 1921-22 కాలంలో పొందిన అడివి బాపిరాజు ‘‘హిమాలయోత్తుంగ శృంగగీతం’’ రాయటమే కాక ‘నరసన్న పాపాయి’, ‘ద్వేషము’ వంటి గాంధీజీ భావనల ఆధారమైన గొప్ప కథలు కూడా రాశారు.
‘సత్యాగ్రహం’ విధానం మీద రాయసం వెంకట శివుడు, సురవరం ప్రతాపరెడ్డి, గూడా నరహరి రావు, దుర్గాబాయిగార్లు; స్వదేశీ ఉద్యమం గురించి కనుపర్తి వరలక్ష్మమ్మ, బందా కనకలింగేశ్వరరావు వంటివారు; అస్పృశ్యత గురించి కాళోజీ, దేశవిభజన నేపథ్యంగా చలం వంటివారు, ఇంకా విశ్వనాథ సత్య నారాయణ, పాలగుమ్మి పద్మరాజు కథా సాహిత్యాన్ని విస్తృతంగా సృజించారు.

ఇక నవలల విషయంలో గాంధీజీ ప్రభావం గురించి చెప్పాలంటే ఉన్నవ లక్ష్మీ నారాయణ ‘మాలపల్లి’, వేలూరి శివరామశాస్త్రి ‘ఓబయ్య’, విశ్వనాథ సత్యనారాయణ ‘వేయిపడగలు’, అడివి బాపిరాజు ‘నారాయణ రావు’, గణపతి ముని ‘పూర్ణ’, కొడవటిగంటి కుటుంబరావు ‘చదువు’, బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’, మహీధర రామమోహనరావు ‘కొల్లాయిగట్టితేనేమి’ మొదలైనవి ప్రధానంగా గుర్తుకు వస్తాయి. ఆ కోవలో 1937లో కేశవరపు వెంకటశాస్త్రి రాసిన ‘రాజ్యలక్ష్మి’ 1938లో గంటి సుబ్రహ్మణ్యశర్మ రాసిన ‘మాధవాశ్రమము’ నవలలు విశాఖపట్నం, అనంతపురం ప్రాంతపు నవలలుగా చెప్పాలి.
ఇక ఇటీవల కాలంలో పెద్దిభొట్ల సుబ్బరామయ్య, కోడూరి శ్రీరామమూర్తి, కె. సదాశివరావు వంటి ఎందరో కథకులు గాంధీజీ ఆలోచనలు నేపథ్యంగా లోతైన కథలు రాశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి ‘ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధి’ అనే సుప్రసిద్ధమైన పాటను ‘మహాత్మా’ సినిమా కోసం రాశారు. ఇక అనువాదాల విషయానికి వస్తే 1920లోనే గాడిచర్ల హరిసర్వోత్తమరావు మహాశయుడు గాంధీజీ తొలి రచన ‘హిందూస్వరాజ్’ తెలుగులోకి అనువదించారు. ప్రస్తుతం ఈ అనువాద ప్రతి అందుబాటులో లేదు. రోమన్ రోలా రాసిన గాంధీ జీవితచరిత్రను కాటూరి వెంకటేశ్వరరావు అనువదించగా, ఎనిమిది వందల పేజీల ‘గాంధియన్ ఎకనామిక్స్’ను కొడాలి ఆంజనేయులు అనువదించారు.
గుజరాతీ భాషలో గాంధీజీ ఆత్మకథ రాగానే వేలూరి శివరామశాస్త్రి సబర్మతీ ఆశ్రమం వెళ్ళి, గుజరాత్ భాషను అక్కడ నేర్చుకుని ‘మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్’ ను 1929లో తెలుగు వచనంగా అనువదించారు. గుర్రం జాషువా గాంధీజీ జీవితాన్ని పద్యరూపంలో రాశారు. నవజీవన్‍వారు ఆత్మకథను 1994లో తెలుగులో అనువదించి ప్రచురించారు.
1982లో వచ్చిన ‘గాంధీ’ ఆంగ్ల సినిమాను అక్కినేని కుటుంబరావు బృందం తెలుగులో అనువదించి విడుదల చేసింది. ‘ఆంధ్రపత్రిక’ సంస్థ ప్రచురణలు అన్నీ గాంధీ సాహిత్యాన్ని ఎన్నోరకాలుగా వ్యాప్తిచేశాయి. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో అన్ని తెలుగు సాహిత్య పక్రియలు చాలా ఉధృతంగా వచ్చాయి. చిత్రకారులు, శిల్పులు, నాటక కర్తలు కూడా లెక్కకు మించి చిత్రాలు, శిల్పాలు, ఇతర కళారూపాలను సృజించారు. గాంధీజీ శతజయంతికి 1969లో ఎన్నో సంస్థలు ఎన్నో తెలుగు సంచికలను ప్రచురించాయి. దండి సత్యాగ్రహం స్ఫూర్తితో ‘పదండి ముందుకు’ అనే తెలుగు సినిమా 1962లో విడుదలైంది.
అయితే 1970 తర్వాత తెలుగు సాహిత్యంలోనూ, పత్రికలలో దాదాపు గాంధీజీ తెరమరుగయ్యారు. 1922లో ఉన్నవ లక్ష్మీనారాయణ రాసిన ‘మాలపల్లి’లో ‘చరమగీతం’, ‘సమతాధర్మం’ అనే అభ్యుదయ గీతాలు అంటరానితనం, ఆర్థిక అసమానతలను ఖండిస్తూ సాగి ఆ నవలలో అంతర్భాగంగా ఉన్నాయి. అయితే ఈ గీతాలను గుర్తించకుండా తర్వాత కాలంలో శీశ్రీ రాసిన గీతాలను విశేషంగా శ్లాఘించడాన్ని డా. అనుమాండ్ల భూమయ్య తప్పుబడుతూ ‘‘అభ్యుదయ కవిత్వంలో ఆద్యుడు ఉన్నవ’’ అనే వ్యాసంలో విశ్లేషించారు.
ఈ రచన గల ‘లోచూపు’ (2019 ప్రచురణ) వ్యాస సంకలనానికి డా. ఘట్టమరాజు అశ్వత్థ నారాయణ పీఠిక రాస్తూ ‘‘ఉన్నవ లక్మీనారాయణ పంతులు గాంధీపథంలో ముందడుగు వేస్తూ సాగినందువల్ల ఆయన అభ్యుదయ గీతాలకు రావల్సినంత పేరు ప్రఖ్యాతులు రాకుండా పోయాయి’’ అని వ్యాఖ్యానిస్తారు. ఇలా గాంధేయ సాహిత్యాన్ని పట్టించుకోకుండా సాగడమనే, పూర్వపక్షం చేయడమనే ధోరణి తెలుగులో గత అరశతాబ్దంలో బాగా పెరిగిపోయింది. ఇదే ధోరణి తెలుగు పత్రికలు నిర్వహించే వర్గాలలో కూడా నేటికీ పేరుకుని పోయి ఉంది!
అయితే, 1982లో ‘గాంధీ’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గాంధీజీ గురించి పునఃపరిశీలనతో పాటు సమగ్ర అధ్యయనం కూడా పెరిగింది. తెలుగులో గత రెండు దశాబ్దాలలో గాంధీజీ గురించి ఎంతో కొంత మాట్లాడుకోవడం కూడా పెరిగింది. ఇటీవల కాలంలో అలాంటి పుస్తకాలు రావడం కూడా పెరిగింది. తెలుగు సాహిత్యంలో జాతీయోద్యమ ధోరణులపై గాంధీజీ ప్రభావం గురించి విశ్లేషించాలంటే ఆయన నడిపిన పత్రికలు సగం కార్యాన్ని పూర్తి చేస్తే, ఆయన వ్యక్తిగత సౌశీల్యం మిగతా పనిని సంపూర్తి చేసిందనే విశ్లేషణను గుర్తుపెట్టుకోవాలి.
నిజానికి గాంధీజీ మన సమాజంలోని భాషలను అధిగమించి వివిధ ప్రాంతాలను తన ఆకారంతో, ప్రవర్తనతో సమైక్య పరిచి బ్రిటీషు వారితో పోరాడిన గొప్ప నాయకుడు. కానీ ఇపుడు గాంధీజీ సౌశీల్యాన్ని ఉగ్గడించే విషయాలు చెవుల్లో పడకపోగా ఆధునిక కాలపు టెక్నాలజి మార్గంగా విద్వేషం విచ్చలవిడిగా జాతరవుతోంది. అదే సమయంలో గాంధీజీ గురించి ఆశావహంగా ఆలోచించే యువతరం కూడా బాగా పెరిగిందని ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఈ విషయం మీద పరిశోధన చేసి, 2023 మార్చిలో పిహెచ్.డి. పట్టాపొందిన డా. రావిప్రోలు సుబ్రహ్మణ్యం నిఖరంగా తేల్చారు.
- డా. నాగసూరి వేణుగోపాల్
ఎ : 9440732392
