మెరుపు మెరిస్తే,
వాన కురిస్తే,
ఆకసమున హరివిల్లు విరిస్తే,
అవి మీకే అని ఆనందించే కూనల్లారా!! అంటూ బుడి బుడినడకల బుజ్జాయిల స్వచ్ఛమైన మనస్సు గురించి తనదైన శైలిలో వర్ణిస్తారు మహాకవి శ్రీశ్రీ, తన శైశవగీతిలో..!! పసిపిల్లల మనస్సు తెల్లకాగితం లాంటిదని, దానినే ‘‘టబులరసా’’ అంటారని, అలాంటి మనస్సులో ఎలాంటి ఆలోచనలు ప్రవేశపెడితే, అవే అభివృద్ధి చెందుతాయని వివరిస్తుంది మనో విజ్ఞానశాస్త్రం.
జాలి, దయ, ప్రేమ, నిజాయితీ, పరోపకారం, సహకారం, పట్టుదల, ధైర్యం, స్వీయ క్రమశిక్షణ లాంటి విశ్వమానవీయ విలువలను ఔదలదాల్చి, రేపటి పౌరులుగా బలమైన జాతి నిర్మాణానికి ఇరుసుగా మారాల్సిన నేటి బాలలు, అందుకు పూర్తిభిన్నమైన మార్గంలో ప్రయాణించడం శోచనీయం.
సామాజిక మాధ్యమాల విషకౌగిలిలో నేటితరం బాల్యం బందీగా మారిందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. సినిమాలు కూడా అందుకు ఆజ్యం పోస్తున్నాయి. నాణేనికి బొమ్మా, బొరుసూ ఉన్న చందంగా సామాజిక మాధ్యమాల ద్వారా ఒకరి భావాలను మరొకరు పంచుకోవడం, ప్రపంచంలో జరిగే సమస్త విషయాలను క్షణాల్లో తెలుసుకోవడానికీ, ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలను ప్రజల ముంగిట్లోకి తీసుకెళ్ళడం లాంటి అనేక ప్రయోజనాలున్నాయి. కానీ నేటి బాలలు సామాజిక మాధ్యమాల ద్వారా నేర ప్రవృత్తితో కూడిన దృశ్యాలు, కార్టూన్ నెట్‍వర్క్ వీడియోలు, అశ్లీల వీడియోలను వీక్షిస్తూ వాటికి బానిసలుగా మారుతున్నారు. ఇది సరికాదని ఇంట్లో తల్లిదండ్రులు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఎంత మొత్తుకుంటున్నప్పటికీ వారి మాటలు పెడచెవిన పెడుతున్నారు. మరి కొన్ని సందర్భాల్లో వారిపైకే తిరగబడి దాడులు కూడా చేస్తున్నారు.
ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ మాయలో పడి ఏది మంచి, ఏది చెడు అన్నది తెలుసుకోలేనంత దయనీయ స్థితికి నేటి బాలలు దిగజారి, జాతి భవితకు ప్రమాదఘంటికలు మోగిస్తున్నారనడంలో సందేహంలేదు. ఇలాంటి సంధికాలంలో, బాల బాలికల మానసిక వికాసాన్ని పెంపొందించడానికి బాలసాహిత్యం యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇప్పటికే పత్రికలు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు చిన్న చిన్న కథలు, కవితలు, నాటికల వంటి పక్రియల ద్వారా బాలసాహిత్యాన్ని వికసింపచేస్తూ, నేటి బాలల సంపూర్ణ మూర్త్తి మత్వాభివృద్ధికి ఇతోధిక కృషి చేస్తున్నాయి. వ్యక్తిగతంగా కూడా అనేకమంది రచయితలు, కవులు బాలసాహిత్యాన్ని సృజియిస్తూ బాలల భవితను బంగారు మయం చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఆ కోవలోకే వస్తారు కవి, రచయిత పల్లా వెంకటరామారావు.
తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ విద్యార్థులకు నాణ్యమైన బోధన అందిస్తూనే, నేటి బాలల స్థితిగతులను దగ్గరగా పరిశీలించి, వారి ఉజ్వల భవిష్యత్‍ను కాంక్షించి ‘‘చిట్టి చేతులు’’ అన్న పేరుతో ఈ రచయిత ఒక కథల పుస్తకాన్ని ప్రచురించారు. ఇందులో 23 కథలున్నాయి. ఈ కథలన్నీ విభిన్న పత్రికల్లో ప్రచురిత మయ్యాయి. ఆకర్షణీయమైన రంగుల్లో మనస్సును హత్తుకునే విధంగా రూపొందించిన ముఖచిత్రంతో పుస్తకం చూడచక్కగా ఉంది. పరిమాణంలో చిన్నగా ఉన్పటికీ పుస్తకాన్ని తెరిచి అందులోని కథలను చదివిన కొద్దీ ‘‘పిట్ట కొంచెం కూతఘనం’’ అన్న చందంగా ఆ పుస్తకం బాలల మనోవికాసానికి కలిగించే ప్రయోజనాలేంటో మనకు అవగతమవుతుంది.
అనాది నుండి మానవులంతా సమానమేనని ఎంతమంది, ఎన్నిసార్లు చెప్పినప్పటికీ, నేటి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ యుగంలో కూడా కుల, మత, జాతి, వర్గాల పేర్లతో మీరు తక్కువ, మేము ఎక్కువ అంటూ మానవులంతా ఒకరినొకరు కలహించుకోవడం మనం ఎన్నో సందర్భాల్లో చూస్తున్నాం. కానీ ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అని భావించడం సరికాదని, ఎవరి గొప్పదనం వారికుంటుందన్న విషయాన్ని ‘‘అందం’’ అనే కథలో ‘ఉమ్మెత్త మొక్క’ ద్వారా రచయిత తనదైన శైలిలో చాటి చెప్పారు.
మనం చేసే పని ఏదైనా, ఆ పనిలోకి మనం ప్రవేశించడానికి కన్నా ముందే ఒక కట్టుదిట్టమైన కార్యాచరణ ప్రణాళిక, వ్యూహం రూపొందించుకోవాలి. అప్పుడే మనం చేస్తున్న పనిలో మంచి ఫలితాలు సాధించగలం, అలా కానీ పక్షంలో ఫలితాలు నిరాశాజనకంగా ఉంటాయన్న విషయాన్ని ‘‘విజయం’’ అన్న కథలో మంత్రి సుమంతుడి కుమారుడు విజయుడి ద్వారా చక్కగా తెలియజేశారు. పరీక్షల్లో విజయం సాధించలేక, నిర్వేదంలోకి జారిపోతున్న నేటి విద్యార్థి లోకమంతా విజయుడి లాగా నిశిత పరిశీలన, సునిశిత ఆలోచన, కుశాగ్రబుద్ధి, కట్టుదిట్టమైన ఆచరణ లాంటి లక్షణాలు, అలవరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కష్టపడి సంపాదించిన సొమ్ము కలకాలం నిలిచి ఉంటుంది. ఎలాంటి శ్రమ లేకుండా సంపాదించిన సొమ్ము ఎంతో కాలం నిలవదు. అన్న లోకోక్తిని ‘‘దురాశ’’ అన్న కథలో సురేశ్ అన్న పోలీసు పాత్ర ద్వారా కళ్ళకు కట్టినట్లుగా రచయిత విశదీకరించారు. విద్యార్థులైన నేటి బాలబాలికలు కూడా ఎలాంటి శ్రమలేకుండా, తాము ఆశించిన రంగంలో అద్భుతమైన ఫలితాలు రావాలని కోరుకుంటూ ఉంటారు. ఇలా ఆశించడం సరికాదు అన్న విషయాన్ని రచయిత ఈ కథ ద్వారా తెలిపారు.
దేశభక్తి అంటే దేశం కోసం ఆయుధాలు చేతబట్టి సరిహద్దుల్లోకి వెళ్ళి పోరాడడమే కాదు, దేశంలోని వనరులను అవసరమైనంత మేరకే వాడి, భావితరాల వారి సుస్థిర ప్రగతికి బాటలు వేయడం కూడా అన్న విశాల ధృక్పథాన్ని ‘‘నిర్లక్ష్యం ఖరీదు’’ అన్న కథలో వెంకటేశ్, రమేశ్ అన్న పాత్రల ద్వారా రచయిత విపులీకరించారు. నేటి చిన్నారుల్లో కూడా నేను సుఖంగా ఉంటేచాలు అన్న స్వార్థచింతన మొగ్గతొడుగుతూ ఉంది. కానీ అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి’’ అన్న వసుధైక భావన అలవరుచుకోవాల్సిన అవసరం ఉంది.
ఈ భూగోళం కేవలం మానవులొక్కరికే సొంతం కాదు, జంతువులు, పశుపక్ష్యాదులు, క్రిమికీటకాలు.. ఇలా సమస్త జీవరాశికి నిలయం. కాబట్టి ప్రతి జీవరాశికి జీవించే అవకాశం కల్పించాలి, భూతదయను కలిగి ఉండాలి అన్న భావనను ‘‘చిట్టి చేతులు’’అన్న కథద్వారా అభి, అతని మిత్రుల ద్వారా, వారు జంతు సంక్షేమానికి చేపట్టిన చర్యల ద్వారా రచయిత సమాజానికి, బాలబాలికలకు అద్భుత కథా కథనంతో వివరించారు. ఈ కథను సూక్ష్మంగా పరిశీలించినపుడు రచయితలో అంతర్నిహితంగా ఉన్న పర్యావరణ ప్రేమికుడు కనిపిస్తాడు.
మంచి వైపు కన్నా చెడువైపుకు ఆకర్షితులవడం చాలా సులభం. పాఠశాల విద్యార్థులలో కూడా కొద్దిమంది పొగాకు, గుట్కా, గంజాయి, సిగరెట్, మద్యం, ఆన్‍లైన్ బెట్టింగ్ లాంటి దురవ్యసనాలకు అలవాటు పడి తమ బంగారు భవిష్యత్‍ను చేజేతులా బుగ్గిపాలు చేసుకుంటున్నారు. దురలవాట్లకు లోనుకావడం వల్ల పర్యవసానాలు ఎలా ఉంటాయో, వాటిని ఏవిధంగా వదిలించుకోవాలో ‘‘మొక్కై వంగనిది మానై వంగునా’’ అన్న కథలో శివ పాత్ర ద్వారా రచయిత అద్భుతమైన కథనంతో వివరించారు. ఇందులో రచయితకు సమాజహితాన్ని కాంక్షించే సంస్కర్త హృదయం ఉన్నట్లుగా గోచరిస్తుంది.
ఇలా కథలన్నీ కూడా ఎక్కడా పట్టుసడలకుండా, ఏకబిగిన చదవాలన్న ఉత్సాహాన్ని కల్గిస్తాయి. పాఠకుల ఆలోచనా పరిధిని విస్త•తం చేస్తాయి. ప్రతి కథని రాయడంలో రచయిత రామారావు ప్రదర్శించిన నైపుణ్యం, కథా కథనంలో ఆయన తీసుకున్న జాగ్రత్తలు, ప్రతీ కథలో సూక్ష్మంగా, అంతర్లీనంగా నైతిక విలువల బీజాలను పసిమనసులో నాటేందుకు ఆయన చేసిన అధ్యయనం రచయితగా అతడిని ఒక మెట్టు పైన నిలబెడుతుంది.
ఈ కథల్లో ఒక పాఠకుడిగా రచయిత సునిశిత పరిశీలనాశక్తి, విశ్వమానవీయ విలువలను ఎంతో చాకచక్యంతో నైపుణ్యంతో పాఠకుల మనసులలో చొప్పించిన తీరు నన్ను సూదంటు రాయిలా ఆకర్శించాయి. రచయిత స్వయంగా ఉపాధ్యాయుడు కావడం కూడా ఇందుకు కారణం కావచ్చేమో! ఏదేమైనా రాయాలన్న బలమైన తపన, సంకల్పం ఉన్న రచయితలు మాత్రమే ఇంతటి అత్యద్భుతమైన కథలు రాయగలరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
కథలలో రచయిత వాడిన భాషలో సరళత్వం, కథాకథనంలో వైవిధ్యం, సూక్ష్మంలో మోక్షంలా చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా చెప్పే రచనా శైలి లాంటి లక్షణాలు ‘‘చిట్టి చేతులు’’ పుస్తకానికి మరింత వన్నె తెచ్చాయి. ఈ విధంగా తన రచనా కౌశలంతో ‘‘చిట్టిచేతులు’’ పుస్తకం ద్వారా బాల సాహిత్యంలో నూతన ఒరవడి సృష్టించిన రచయిత రామారావు అభినందనీయులు. చిట్టిచేతులు పుస్తకాన్ని చదివి, ఆ పుస్తకంలోని అంతరార్థాన్ని అవగతం చేసుకున్నపుడు ‘‘నదులు, కవులు భూగోళపు రక్తనాళాలు’’ అన్న గుంటూరు శేషేంద్రశర్మగారి మాటలు అక్షర సత్యం అనడంలో ఎలాంటి సందేహం లేదు.
-పుట్టా పెద్ద ఓబులేసు,
స్కూల్ అసిస్టెంట్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
రావులకొలను, సింహాద్రిపురం, కడప,
ఎ : 955029004
