కె.ఎం. మున్షీవనమహోత్సవ ఆకాంక్ష

1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని స్వీకరించాక కొద్ది కాలానికి ప్రధాని జవహర్లాల్‍ నెహ్రూ తన మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఈ విస్తరణలో భాగంగా ప్రధాని కె.ఎం.మున్షీని ఆహారం మరియు వ్యవసాయ శాఖ మంత్రిగా తీసుకున్నారు. అప్పటికే మున్షీ పేరెన్నికగన్న న్యాయవాది. బొంబాయిలో న్యాయవాదిగా ఆయనకు ప్రఖ్యాతి ఉంది. అసలు కె.ఎం. మున్షీ వ్యక్తిత్వంలోనే బహుముఖ పార్శ్వాలున్నాయి. ఆయన గుజరాతీ నవలా రచయితగా కూడా ప్రసిద్ధుడే. అంతే కాకుండా జాతీయ రాజకీయాలలో ఎంతో క్రియా శీలకంగానూ ఉన్నాడు. అప్పటికే ఉప ప్రధానిగా ఉన్న సర్దార్‍ వల్లభాయ్‍ పటేల్‍కు సన్నిహితుడిగా కాంగ్రెస్‍ వర్గాలలో పేరుంది. ఆ సాన్నిహిత్యం కారణంగానే పటేల్‍ ప్రోద్బలం వల్ల నెహ్రూ తన మంత్రివర్గంలోకి మున్షీని తీసుకున్నారనే భావన ఉంది.

అయితే మున్షీ తాను ఆహార, వ్యవసాయశాఖ యూనియన్‍ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక 1950లో బొంబాయిని సందర్శించాడు. తన వృత్తి జీవితంలో అధిక భాగం బొంబాయిలోనే గడపటం వలన ఆయన వర్తక, వాణిజ్య రంగంలోని వారితో కూడా పరిచయాలు ఏర్పడ్డాయి. మంత్రి అయ్యాక బొంబాయి సందర్శన సందర్భంగా ఆయన వ్యాపారులను కలిశాడు. అప్పుడు వారితో తాను భారతదేశంలో ఒక సరికొత్త ఉత్సవాన్ని పరిచయం చేసేందుకు ప్రణాళిక వేస్తున్నట్లు చెప్పాడు. అదే వృక్షాల పండుగ వనమహోత్సవం. ఈ ఉత్సవం ఒక వారం రోజులపాటు జరపాలని స్త్రీలు, పిల్లలు మొక్కలు నాటటమే కాకుండా వాటికి నీరుపోసి, ఆలనాపాలనా చూస్తూ పెంచాలని అడవులను బాగు చెయ్యాలని, వృక్షాలను పూజించటంతో పాటుగా వాటిని అధ్యయనం చెయ్యాలని కూడా ఆశించాడు. బృందావనంలోని మురళీ, మృదంగనాదం వినాలని ఆశించే వారందరూ ఈ వనమహోత్సవ దీక్షను చేపట్టాలని ఉద్భోధించాడు.

బొంబాయిలో మున్షీ కలిసిన వ్యాపారులందరూ గుజరాతీ హిందువులు పైగా వైష్ణవులు. కృష్ణారాధకులు. ఈ విషయం బాగా ఎరిగిన వాడిగా ఆయన బృందావన ప్రస్తావన చేశారు. వారితో ఆయన అన్న మాటల్లో మత ప్రస్తావనే కాకుండా కుల ప్రస్తావన కూడా ఉంది. తానొక బ్రాహ్మణుడినని ఈ పేద బ్రాహ్మణుడికి ఏదైనా ఆవైశ్యులు దానం చేయడంలో గర్వపడాలని భావించాడు. ఇంతకూ మున్షీ ఆ వ్యాపారులను కోరిందేమిటి? ప్రతి వ్యాపారి కూడా యాభై మొక్కలు నాటడానికి వితరణ చేయాలి. వీలున్న చోట, తమకు నచ్చిన స్థలంలో బావులు త్రవ్వించాలి. అది బనారస్‍ కావచ్చు, ఢిల్లీ కావచ్చు. మహాత్మాగాంధీ అంత్యక్రియలు జరిపిన చోటు కావచ్చు. ఎక్కడ ఏ విధమైన ఖాళీ జాగా కనిపిస్తే అక్కడ మొక్కలు నాటించే పనికి మద్ధతు యివ్వాలని అర్థించాడు. తాము ఎక్కడ మొక్కలు నాటించే పనికి పూనుకుంటే అది పవిత్ర స్థలమై వెలుగొందాలని అభిలషించాడు. అట్లా, బొంబా•యి వ్యాపారులనుద్దేశించి మాట్లాడిన మూడు నాలుగు వారాల అనంతరం ఆకాశవాణి ద్వారా తన ప్రణాళికను, వనమహోత్సవాన్ని వెల్లడించారు. తన ప్రకటనలో బొంబాయి వ్యాపారులు పదివేల మొక్కలు నాటడానికి వాగ్దానం చేశారని, మొక్కలు నాటేందుకు సన్నాహం జరుగుతుందని తెలియజేశాడు. గుజరాత్‍లోని ప్రశాంత పట్టణమైన సోమనాథ్‍కు సమీపంలోని దేహోత్సర్గ్లో జరుగుతుందని చెప్పాడు. దేహోత్సర్గ్ అనేది తీర్థం. హిందూ భక్తులు అత్యంత పవిత్రమైందిగా భావించే స్థలం హిందూ పురాణాలలో శ్రీకృష్ణుడు స్థానం ఎటువంటిదో మనకు తెలుసు. శ్రీకృష్ణుడు బాణం దెబ్బ తిన్న తర్వాత తుదిశ్వాస విడిచిన ప్రదేశమే దేహోత్సర్గ ఈ ప్రదేశం అత్యంత పవిత్రస్థలమని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ ప్రకటన కేవలం బొంబాయి వ్యాపారుల విషయాన్నే కాకుండా ఇతరమైన విషయాలను కూడా వెల్లడించింది. కె.ఎం. మున్షీ అభ్యర్థన ఏమంటే పవిత్రస్థలమని భావించిన ప్రతిచోటా ఇటువంటి వనమహోత్సవాలు విరివిగా జరగాలని ముఖ్యంగా హిందూ దేవాలయాల పరిసరాలు – తిరుపతి, కాంచీపురం, పూరి లాంటి పుణ్యస్థలాలు ఆయన సూచించాడు. కె.ఎం. మున్షీ అఖిల భారత విశ్వవిద్యాలయ ఉపకులపతులకు కూడా ఒక ఉద్బోధ చేశాడు. విశ్వవిద్యాలయాలలో విద్యనభ్యసిస్తున్న ప్రతి విద్యార్థి కనీసం ఒక్క మొక్కైనా నాటేట్లు చూడాలని మున్షీ తలపెట్టిన ఈ వనమహోత్సవం భారతదేశం ఎడారిగా మారకూడదని. విపరీత వాతావరణ మార్పులు సంభవించకూడదని ప్రకృతి స్థిరంగా ఉంటే పంటలు పండుతాయని. దేశ సంపదతో సమృద్ధమవుతుందని.

నేను వృక్షాలను ఎంతగానో ప్రేమిస్తాను అని చెపుతాడు మున్షీ. వనమహోత్సవం సరైన స్ఫూర్తితో జరుపుకోవటమంటే ప్రతి భారతీయుడు ఆ వారంలో కూరగాయలు, పండ్లు, దుంపలను ఆహారంగా తీసుకోవాలంటాడు. అందువల్ల శాకాహారులుగా మారతారని కాదు. పండ్లు, ఫలాలు, పరిమళాలు ఇచ్చే భూమి పట్ల అనుబంధం ఏర్పడుతుందని కావచ్చు.
1950లలో ప్రారంభమైన వనమహోత్సవం కె.ఎం.మున్షీ దార్శనికతకు నిదర్శనం. జులై మొదటి వారాన్ని మనం తదాదిగా వనమహోత్సవంగా జరుపుకుంటూ ఉండటం ఆనవాయితీగా మారింది.
మున్షీ 4 జులై 1950లో దేహత్సర్గత ప్రసంగించిన మూడు రోజుల తర్వాత దక్షిణ భారతదేశంలోని కాంచిపురం వరదరాజు స్వామి దేవాలయ ప్రాంగణంలో మామిడి మొక్క నాటిన తరువాత మున్షీ ప్రసంగించాడు. ఆ ప్రసంగంలో సంపూర్ణ సంతృప్తిని ప్రకటించాడు. విధేయుడైన పశువుల కాపరి నుండి గణతంత్ర దేశ రాష్ట్రపతి దాకా ప్రతి ఒక్కరికీ వృక్ష చైతన్యం కావాలంటాడు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటటం మత, ధార్మిక విధ్యుక్త కార్యాచరణగా మారాలంటాడు. మొక్క నాటటమే కాదు. ఆ మొక్క పోషణ, పరిరక్షణ కూడా ప్రతి పౌరుడి విధి, బాధ్యతగా గుర్తించాలి. పర్యావరణం అనే పదమే లేని కాలంలో పర్యావరణ స్పృహను కలిగి ఉండటమే కాకుండా పెంపొందింపజేసేందుకు విశేష కృషి చేసినవాడు కె.ఎం. మున్షీ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *