అప్పటి వరకూ ముడిగా తయారించుకొన్న రాతి పనిముట్ల స్థానంలో, వాటిని అరగదీసి నునుపు చేసి, కొనలు తేలేట్లుగానే కాక నగీషీగా రాతిగొడ్డళ్లను తయారు చేయటాన ఈ యుగాన్ని కొత్తరాతియుగమన్నారు (సా.శ.పూ.4000-2000). జంతువుల్ని మచ్చిక జేసుకొని, వ్యవసాయాన్ని ముమ్మరం చేసి, ఒకచోట స్థిరనివాసం ఏర్పాటు చేసుకొని, చక్రాల బండిని వాడుకలోకి తెచ్చుకొని, జీవన విధానంలో ఊహించని మార్పులకు దోహదం చేసిన ఈ యుగాన్ని గార్డెన్ ఛైల్డ్ ‘కొత్త రాతియుగపు విప్లవం’ అన్నారు. తెలంగాణలో గల గోదావరి, మానేరు, ప్రాణహిత, కృష్ణా, మూసీ తీరాల్లో అనేక కొత్త రాతియుగపు స్థావరాలున్నాయి.

కొత్తరాతియుగపు చివరిదశలో (సా.శ.పూ.1750) రాగి, కంచు వస్తువుల వాడకం కూడా ప్రారంభమైంది. పూర్వపు మహబూబ్‌నగర్ జిల్లా చిన్నమారూరు, చాగటూరులలో ఈ సంస్కృతికి చెందిన రాగి కడియాలు దొరికాయి. అంతేకాదు, గంగానది పరివాహ ప్రాంతంలో విలసిల్లిన రాగి పరికరాల Copper Hoard) నిధి సంస్కృతితో పోలికలు గల మీసాల కత్తులు తెలంగాణాలోని పూర్వ మెదక్‌జిల్లా, గజ్వేలం మండలం, ప్రజ్ఞాపురం పక్క గ్రామమైన రిమ్మన్నగూడెంలో బయల్పడి నైపుణ్యంలో ఉత్తర భారతదేశానికే ఒక సవాలు విసిరాయా అనిపించింది.
1995లో హైదరాబాదు-సిద్దిపేట రహదారిపై నున్న రిమ్మన్నగూడెంలో టెలిఫోన్ కేబుళ్లు వేయటానికి రోడ్డు పక్కనే గుంట తవ్వుతుండగా కూలీల గడ్డపారకు ఖంగుమన్న శబ్దం బదులిచ్చింది. ఏమిటా అని చూస్తే, ఒకటి గాదు, రెండుగాదు, ఒకేసారి నాలుగు రాగి కత్తులు కనిపించాయి. ఖంగుదిన్న కూలీలు, వాటిని అధికారులకు అప్పగించగా, అవి పురావస్తుశాఖకు చేరాయి. గోనెపట్టలో చుట్టుకొచ్చిన ఆ కత్తుల్ని చూచిన పురావస్తుశాఖ అధికారులు (డా.బి. సుబ్రహ్మణ్యం, డా. ఈమని శివనాగిరెడ్డి) విస్తుబోయి, అప్పటి పురావస్తుశాఖ, సంచాలకులు ఎన్‌ఆర్‌వి ప్రసాద్‌గారి దృష్టికి తీసుకెళ్లారు. పరిశీలించిన మీదట అవి మామూలు కత్తులు గాదని, మీసాల కత్తులని తేలింది. నాలుగడుగుల పొడవు, 4 అంగుళాల వెడల్పు, అరంగుళం మందంతో, మధ్యలో ఈనెతోనూ, పిడిభాగంపైన పట్టుకోసం అటూ ఇటూ పిల్లి మీసాల్లా యాంటెన్నాలను పోలిన అమరిక ఉంది. అందుచేత వీటిని మీసాల కత్తులని, యాంటెన్నాస్వోర్డులని పిలిచారు. ఆంధప్రదేశ్‌లోని కర్నూలుజిల్లా బెలుం, గుంటూరుజిల్లా గుత్తికొండ గుహల్లో ఒక్కొక్క మీసాల కత్తి దొరకగా, మెదక్‌జిల్లా రిమ్మన్నగూడెంలో నాలుగు రాగి-రాతి యుగపు మీసాలు కత్తులు దొరకటం తెలంగాణా చరిత్రలో ఒకమైలురాయి!
-ఈమని శివనాగిరెడ్డి-స్థపతి
ఎ : 9848598446