పూటకూళ్ళవ్వ

(గత సంచిక తరువాయి)
(జరిగిన కథ: అవ్వ దగ్గరికి వచ్చిన పిల్లలంతా తమను ఇచ్చిన డబ్బులకంటే సరుకులు తక్కువ తెచ్చారని, అమ్మానాన్నలు కొట్టారని అవ్వతో చెప్పుకొని బాధపడతారు. అసలు విషయం ఏమిటో తేల్చుకోవటానికి పిల్లలందరినీ తీసుకొని దుకాణం వద్దకు వెళుతుంది అవ్వ.)
దుకాణం ముందర నిలబడిన పోలీసుతో… ‘‘సారూ… మాకు ఈ దుకాణం గురించి బాగా తెలుసు. ఏదో పొరపాటు జరిగినట్టుంది. ఆ సంగతంతా మేము చూసుకుంటాం బాబూ… దయచేసి మీరు వెళ్లిపోండి’’ అంటూ పోలీసుకు నచ్చ జెప్పి పంపిచేస్తుంది అవ్వ.
పోలీసు వెళ్లిపోగానే పిల్లలంతా అక్కడికే చేరుకున్నారు. ఇదంతా చూస్తున్న యజమాని కొడుకు ఒక్కసారిగా ఏడ్చేసాడు. ఏడుస్తూనే ‘‘తప్పయిపోయింది… ఇంకెప్పుడూ ఇలా చేయను’’ అంటూ భయంతో వాళ్ల నాన్న వైపు చూడసాగాడు. ఒక్కసారిగా అందరూ ఆ బాబు వైపు తిరిగారు.
‘‘ఏంట్రా… ఏం చేశావు నువ్వు?’’ కొడుకుని కోపంగా అడిగాడు యజమాని.
‘‘అదీ… అదీ..’’ అంటూ నీళ్లు నమిలాడు కొడుకు.
‘‘ముందు విషయం ఏమిటో చెప్పు’’ గట్టిగా అడిగాడు యజమాని.
‘‘అది కాదు నాన్నా! నువ్వు ఊర్లో లేనప్పుడు నేను సరుకులు తూకం వేసినప్పుడు వాళ్లకు తెలియకుండా తక్కువ సరుకులు వేసి ఎక్కువ కనబడేటట్టు చేసి అమ్మేవాడిని.’’
‘‘అలా ఎలా చేసావు?… ఎందుకు చేసావు?’’ అడిగాడు తండ్రి.
‘‘నేను నీతో ఒకసారి కూరగాయల మార్కెట్‍కి వెళ్ళినప్పుడు అక్కడ చూసాను… త్రాసుకి ఒకవైపు కింద బరువు ఎక్కువ పెట్టి… కూరగాయలు తక్కువ పెట్టి అమ్మటం చూసాను.’’ ‘‘కొందరు పైసలు మిగుల్చుకోవటానికి ఇలా చేస్తారంటూ నాకు చెబుతూ వాళ్ళని తిట్టావు కూడా.’’ ‘‘మరి నువ్వు అప్పుడప్పుడు నేను ఏమైనా కొనుక్కోవటానికి డబ్బులు ఇవ్వమంటే ఇవ్వడం లేదు’’. ‘‘అందుకే ఇలా చేస్తే ఆ డబ్బులతో ఏమైనా కొనుక్కోవచ్చు అని ఇలా చేసాను. కానీ, ఇంత గొడవ అవుతుందని నేను అనుకోలేదు’’ అన్నాడు కొడుకు.
కోపంగా కొడుకును ఏదో అనబోయే సరికి అవ్వ అడ్డుపడింది. బాబు వైపు తిరిగి ‘‘చూడు నాన్నా… నువ్వు చేసిన పని వల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారో తెలుసా!’’ అంటూ జరిగిన నష్టమంతా వివరించింది.
‘‘సారీ నాన్నా… సారీ ఫ్రెండ్స్… ఇంకెప్పుడూ అలా చేయను ఇంతమంది ఎన్ని కష్టాలు పడతారని అనుకోలేదు’’ అని అంటూనే తండ్రివైపు తిరిగి’’ మరి మీరు నేను అడిగినప్పుడు నాకు అన్నీ కొనిస్తే నేను ఇలా చేయకపోయేవాడిని’’ అంటూ గొణిగాడు.
‘‘బాబూ… నేను నీకు కొనివ్వటం ఇష్టం లేక కాదు నీకు డబ్బులు ఇవ్వనిది…. నువ్వు ఏది పడితే అది కొనుక్కొని తింటే మీ ఆరోగ్యం పాడవుతుందని మాకు బయం.’’ అంతే కాకుండా ఏవైనా బొమ్మలు, వస్తువులు కొనుక్కోవాలన్నా మీకు ఏది అవసరమో ఏది మంచో ఏది చెడో తెలుసుకునే వయస్సు మీకు ఇంకా రాలేదు. అందుకే తల్లిదండ్రులం ఇంత జాగ్రత్తపడుతుంటాం’’ అని బుజ్జగిస్తూ కుమారుడికి వివరించాడు దుకాణం యజమాని.
అర్థమైనట్టు తల ఊపాడు కొడుకు.
‘‘విన్నారుగా పిల్లలూ… జరిగిన విషయం ఇది… ఇక మీరు బాధపడకండి. మీ అమ్మానాన్నలతో నేను చెబుతానులే… మీరంతా మీ ఇళ్లకు వెళ్లండి’’ అంటూ పిల్లలందరినీ ఇంటికి పంపించేసింది అవ్వ.


× × ×
అలా రెండు రోజులు గడిచాయి. తన చిన్న నాటి ముచ్చట్లు అన్నీ తలుచుకుంటూ… ఆ జ్ఞాపకాలతో మురిసిపోతూ గాంధీ విగ్రహం వద్ద ఉన్న బెంచి మీద కూర్చుని ఉంది అవ్వ. అంతలోనే స్కూల్‍ నుండి పిల్లలంతా సరాసరి అవ్వ దగ్గరికి సంతోషంగా పరిగెత్తుకుంటూ వచ్చారు.
ముందే మురిసిపోతున్న అవ్వ పిల్లల్ని అలా చూడగానే ‘‘ఏంటి… ఇంత హుషారుగా ఉన్నారు’’ అని అడిగే లోపల పిల్లలే ఆగకుండా చెప్పేసారు.
‘‘అవ్వా! ఈ నెల 14వ తారీఖు నాడు బాలల దినోత్సవం ఉంది కదా! అందుకని మా స్కూల్లో చాచాజీ గురించి వ్యాసాలు,
ఉపన్యాసాలలో పోటీలు పెట్టారు. మాకు కొంతమందికి ఫస్ట్, సెకండ్‍ ప్రైజులు వచ్చాయి.’’ ‘‘అంతేకాదు మేము కొందరం ఆ రోజు డ్రామాలో కూడా పాల్గొంటున్నాం’’ అంటూ సంబరపడిపోయారు.
అవ్వ కూడా వాళ్ళ సంతోషాన్ని పంచుకుంటూ ఎప్పుడూ పిల్లల కోసం ఏదో ఒకటి రెడీగా పెట్టుకునే అవ్వ ఆరోజు స్వీట్‍ తెచ్చి వాళ్ళందరి చేతిలో పెడుతున్న సమయంలోనే ‘‘హాయ్‍ అవ్వా…’’ అంటూ ఒక ఆత్మీయ స్వరం వినబడింది.
ఎంతో పరిచయం ఉన్న ఆ గొంతు వినపడగానే టక్కున తలెత్తి చూసింది. ఆ మనిషిని చూడగానే సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయింది. వెంటనే తేరుకొని ‘‘రాజారాం… నువ్వా! ఎన్నాళ్లకు కనిపించావు?’’ అంటూ ఆప్యాయంగా పలకరించింది.
అలా అంటూనే పిల్లల వైపు తిరిగి ‘‘చూసారా పిల్లలూ… మీ అందరికీ ఒకరికొకరు స్నేహితులు ఎలా ఉన్నారో… అలాగే ఈ రాజారాం తాత కూడా నా ప్రియమిత్రుడు… నా చిరకాల మిత్రుడు’’ అంటూ రాజారాం తాతను పిల్లలకు పరిచయం చేసింది.
అందరూ రాజారాం వైపు తిరిగి నమస్కరించారు. రాజారాం కూడా ‘హాయ్‍’ అంటూ పిల్లల వైపు చేయి ఊపాడు.
‘‘ఎలా ఉన్నావు అవ్వా!?’’ అవ్వ వైపు చూస్తూ అడిగాడు రాజారాం.
‘‘నేను బాగానే ఉన్నాను కానీ, ఇదేమిటి… నువ్వు కూడా నన్ను ‘అవ్వ’ అని పిలుస్తున్నావు’’ నవ్వుతూ అంది అవ్వ.
‘‘ఎందుకంటే ఇప్పుడు నిన్ను చూస్తుంటే మా అమ్మను చూసినట్టే అనిపిస్తోంది. నువ్వు ప్రేమగా మాట్లాడే తీరు కూడా మా అమ్మలాగే
ఉంది. అమ్మ కూడా అందరితో ఇలాగే మాట్లాడేది. అందుకే అమ్మను అందరూ ఇష్టపడే వాళ్ళు’’ అంటూ వాళ్ళ అమ్మను తలుచుకోవటం చూసి చిన్నప్పటి నుండి అంతే రాజారాం బాగా సున్నిత మనస్తత్వం కలవాడు గారాబంగా పెరిగిన వాడు అనుకుంది అవ్వ.
‘‘ఇంతకీ అమెరికా నుండి ఎప్పుడొచ్చావు రాజారాం తాతా?’’ రాజారాంను ఆట పట్టిస్తూ అడిగింది అవ్వ.
‘‘వామ్మో నన్ను అలా పిలవకు. ఏదో నేను ఇంకా యంగ్‍గా ఫీల్‍ అవుతూ అమెరికాలో నిర్వహించే పోటీలలో కూడా పాల్గొంటూ ఆటలాడుతూ పాటలు పాడుతూ హాయిగా గడిపేస్తున్నా! నువ్వు ఇప్పుడు నన్ను ముసలోన్ని చేయకు’’ అని నవ్వాడు రాజారాం. అలా అంటూనే ‘‘నేను వచ్చి నాలుగు రోజులు అయింది. ఇక్కడి సమయానికి అలవాటు పడగానే నిన్ను చూడటానికి వచ్చాను.’’ ‘‘ఇదిగో మీ మరదలు విజయ నీకోసం ఈ చీర. బ్యాగ్‍ పంపించింది’’ అంటూ అవి అవ్వ చేతికి అందించాడు.
‘‘అయ్యో ఎందుకు రాజారాం ఇవన్నీ… అసలే అమెరికాలో ధరలు బాగా ఉంటాయి కదా’’ తీసుకోవటానికి మొహమాటపడుతూ అంది అవ్వ.
‘‘నీకోసం కూడా నేను, విజయ అలా ధరల గురించి ఆలోచిస్తామా చెప్పు. అయినా మేము కూడా అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోము. ఇండియాలో మన స్వాతంత్ర దినం ఆగస్టు 15 ఎలాగో… అక్కడ అమెరికాలో వారి స్వతంత్ర దినం జులై 4వ తేదీ జరుపుకుంటారు. అప్పుడు ఒక వారం రోజులు, తిరిగి నవంబర్‍లో ‘థాంక్స్ గివింగ్‍ డే’ అని ఉంటుంది. అప్పుడు ఒక నాలుగు రోజులు ప్రత్యేక ఆఫర్లతో, డిస్కౌంట్‍తో చాలా రకాలు సేల్‍కి పెడతారు. మా కోసమైనా, ఎవరికైనా మనం కానుకగా ఇవ్వాలన్నా… అప్పుడే కొని పెట్టుకుంటాం. అవసరమైనప్పుడు అవి ఉపయోగిస్తాం’’ అని అక్కడి విషయాలు వివరంగా తెలిపాడు రాజారాం.
‘‘అవునా… ఇప్పుడు మీరు
ఉండేది ఎక్కడ? ఆ మధ్య మీరు సిటీ మారుతున్నామన్నారు కదా!’’ అడిగింది అవ్వ.
‘‘అవును… ఇప్పుడు ర్యాలీలో
ఉంటున్నాము’’ అన్నాడు రాజారాం.
ఒక్కసారిగా నవ్వింది అవ్వ.
‘‘అదేంటీ… ఎందుకలా నవ్వుతున్నావు?’’ ఆశ్చర్యపోయి అడిగాడు రాజారాం.
‘‘మరి ర్యాలీ ఏమిటీ… మనం ఇండియాలో ధర్నా చేస్తున్నప్పుడు ర్యాలీ తీస్తాం కదా! అలా ఉంది ఆ పేరు’’ అంటూ మళ్ళీ నవ్వింది అవ్వ.
అవ్వ మాటలకు రాజారాం కూడా నవ్వేసాడు. ‘‘అవ్వా… నువ్వు ఇలా అంటుంటే నాకు ఎప్పుడో చదివిన ఒక జోకు గుర్తొస్తుంది. చెబుతా విను’’ అంటూ ఈ విధంగా చెప్పాడు.
ఒకసారి రష్యాలో… అక్కడ సిటిజన్స్ ముగ్గురు వ్యక్తులు ముందు నడుస్తూ వెళ్తున్నారట. వాళ్ళ వెనకాలే మన తెలుగు వాళ్ళు ముగ్గురు పనిమీద వెళుతున్నారట. పక్కన రోడ్డు రిపేర్‍లో ఉంది. నడుస్తూ
వెళ్తున్న మన ముగ్గురు తెలుగువాళ్ళు అనుకోకుండా అక్కడ రిపేర్‍లో
ఉన్న ఒక గుంటలో పడిపోయారు. పడుతూనే వామ్మో… వాయ్యో… ఓరి నాయనో… అని అరుస్తూ పడిపోయారు. వెంటనే ముందు
వెళ్తున్న రష్యా వ్యక్తులు వచ్చి మన వాళ్ళని రక్షించారట. మనవాల్లు వాళ్లకు థాంక్స్ చెబుతూ ముందు వెళ్తున్న మీరు ఎలా మమ్మల్ని రక్షించగలిగారు? అని అడిగారట. మీరే కదా మా పేర్లతో వామ్మో… వాయ్యో… ఓరి నాయనో… అని పిలిచారు. అందుకే మేము వచ్చి రక్షించాం. అని అనగానే మనవాళ్ళు వాళ్ళ పేర్లు ఇలా ఉన్నాయా… అని నోరెళ్ళ పెట్టారట.
‘‘ఇలా ఉంటాయి మరి విదేశాల్లో పేర్లు..’’ అని రాజారాం చెప్పిన జోక్‍కి పిల్లలతో సహా అందరూ పడీ పడీ నవ్వారు.
(మిగతా కథ వచ్చే సంచికలో)

  • మాదారపు వాణిశ్రీ
    ఫోన్‍ : 9247286668
    బొమ్మలు:  కైరం బాబు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *