కేంద్ర ప్రభుత్వం యొక్క గనులశాఖ మరియు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ మధ్యకాలంలో క్రిటికల్ మినరల్ ఖనిజాల అన్వేషణపై దృష్టి కేంద్రీకరించింది. క్రిటికల్ ఖనిజాలు అనేవి దేశ అవసరాలను బట్టి అనగా అవసరాలకన్నా నిక్షేపాలు తక్కువగా ఉండటం గాని, అసలు లేకపోవడం వల్ల దిగుమతి చేసుకోవలసిన పరిస్థితి రావడం వల్ల దేశంపై ఆర్థిక భారం పడటం వల్ల అలాంటి ఖనిజాలను క్రిటికల్‌గా నిర్ధారించి త్వరితగతిలో అన్వేషించడం జరుగుతుంది.
ప్రస్తుత పరిస్థితిలో కేంద్ర గనులశాఖ మరియు జి.ఎస్.వి. 30 మూలకాల (ఎలిమెంట్స్)తో కూడిన ఖనిజాలను గుర్తించి వాటిని క్రిటికల్ ఖనిజాలుగా నోటిఫై చేయడం జరిగింది. మన రాజధాని ఢిల్లీలో జి.ఎస్.ఐ. ఆధ్వర్యంలో నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్ట్ (NMET) అనే విభాగం ఏర్పాటు చేసారు. ఈ విభాగం ద్వారా అన్వేషణ జరుపబడుతుంది. ఈ పక్రియలో ప్రభుత్వ సంస్థలే కాకుండా కేంద్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందిన ప్రైవేటు ఎక్స్ప్లోరేశన్ ఏజెన్సీలను కూడా అన్వేషణకు అనుమతించారు. ఇప్పటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం 30 (ముప్పై) మూలకాలతో కూడిన ఖనిజాలను క్రిటికల్ మినరల్స్‌గా గుర్తించి నోటిఫై చేశారు. వాటి జాబితా క్రింద ఇవ్వబడినది.
రేర్ ఎర్త్ మినరల్స్ (REE), లీతియం (Li), కోబాల్ట్ (CO), నికల్ (Ni), యాంటీమోని (Sb), బిస్మత్ (Bi), బెరీలియం (Be), క్యాడమియం (Cd), కాపర్ (Cu), గ్వాలియం (Ga), జర్మేనియం (Ge), గ్రాఫైట్ (G), హాఫ్ నియం (Hf), ఇండియం (Im), మొలిబ్ డి నం (Mo), నియోబియం (Nb), ఫాస్ఫరస్ (P), ఫోటాష్ (K), రీనియం (Re), సెలీనియం (Se), సిలికాన్ (Si), స్ట్రాన్షియం (Sr), టాన్టలం (Ta), టెల్లూరియం (Te), టిన్ (Tn), టైటానియం (Ti), టంగ్స్టన్ (Wo), జిర్కొనియం(Zr), వీటి గురించి ఒక్కొటిగా తెలుసుకుందాము. ప్రతి సంచికలో ఒక క్రిటికల్ మినరల్, వాటి శిలలు, దొరికే ప్రాంతాలు మరియు వీటి ఉపయోగాల గురించి చర్చించుకుందాము. ఈ సంచికలో రేర్ ఎర్త్ మినరల్స్ గురించి తెలుసుకుందాము.

రేర్ ఎర్త్ మినరల్స్ (REE):
రేర్ ఎర్త్ మినరల్స్ (REE) జాబితాలో 17 మూలకాలు కలవు. అందులో 15 లాంతనైడ్స్ మరియు స్కాండియం (SC), ఇట్రియం (Y). పదిహేను లాంతనైడ్స్ వరుసగా లాంతనం (LA), సీరియం (CE), ప్రసియోడినియం (PR), నియోడిమినియం (ND), ప్రొమీతియం (PM), సమేరియం (SM), యురోపియం (EU), గ్వాడొలీనియం (GD), టర్బియం (TB), డిస్ప్రొసియం (DY), హోల్మియం (HO), ఎర్బియం (ER), తూలియం (TM), ఎటర్బియం (YB), లూటియం (LU).
వీటిని రేర్ అని అనటానికి కారణలేంటి అంటే వీటిని వెలికితీసే టెక్నాలజి చాలా కష్టమైనది. మరియు చాలా కాస్ట్లీ కావడం ఒకటైతే. మరొక కారణం ఏంటంటే ఈ మూలకాలు శిలల్లో డైరెక్ట్‌గా కాకుండా వేరే ఖనిజాలలో క్రిస్ట్ల లాటిస్‌లో ఉండటం వల్ల వీటి ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ చాలా క్లిష్టంగా ఉంటుంది. కొన్ని సంవత్సరాల నుండి వీటి ఉపయోగాలు చాలా ఎక్కువ కావడం మరియు ప్రపంచ వ్యాప్తంగా వీటి డిమాండ్ పెరగటం వల్ల వీటి ప్రాముఖ్యత చాలా పెరిగిపోయింది. ప్రస్తుతం మనదేశంలో వీటి నిక్షేపాలు చాలా తక్కువగా, దాదాపు లేకపోవడం వల్ల ఇప్పుడు కేంద్ర గనులశాఖ మరియు జి.ఎస్.ఐ. వీటి అన్వేషణను వేగవంతం చేసింది.
ఈ మూలకాలు కలిగిన ఖనిజాలు ఎల్లానైట్, బ్యాస్ట్ననైట్, మొనజైట్, జినోటైం, ఆల్కలి ఫెల్స్పార్స్, ఎపిడొట్, అపటైట్, కాల్సైట్ బయోటైట్ మొదలైనవి. ముఖ్యంగా ఈ ఖనిజాలతో కూడిన శిలలు ఉన్న ప్రాంతాలను గుర్తించి అన్వేషణ కొనసాగిస్తున్నారు. జి.ఎస్.ఐ, ఎం.ఇ.సి.ఎల్ మరియు ఎన్నో ప్రభుత్వం గుర్తించిన ఏజెన్సీలు, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్వేషణ జరుగుతుంది. మన తెలుగు రాష్ట్రాలలో ప్రకాశం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, వరంగల్, మహబూబాబాద్, ఆదిలాబాద్, నారాయణ్‌పేట జిల్లాలలో జరుపుతున్నారు. ఇంకా ఎన్నో ప్రాంతాలలో జరుపడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ప్రస్తుతం మనదేశంలో రాజస్థాన్, చత్తీస్ఘడ్ రాష్ట్రాలు లీడింగ్‌లో ఉన్నవి.
ఈ మూలకాలు కూడిన ఖనిజాలు ఉన్న శిలలు కార్బొనటైట్స్, సైయనైట్స్, ఆల్కలి ఫెల్స్పార్ గ్రానైట్స్ ఏప్లైట్స్, పెగ్మటైట్స్, లెప్టినైట్స్, పార్ఫిరిటిక్ గ్రానైట్స్, ల్యుకోగ్రానైట్స్ మరియు వీటిలోని శియర్ జోన్స్, ఫాల్ట్జోన్స్ ఉన్న ప్రాంతాలను గుర్తించి వీటి కొరకు అన్వేశిస్తున్నారు.

వీటి ఉపయోగాలు:
REE ఖనిజాలు ఎన్నో హైటెక్ డివైసెస్‌లలో మరియు క్లీన్ ఎనర్జీ అప్లికేషన్లలో ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు స్మార్ట్‌ఫోన్స్ డిజిటల్ కెమరాస్, కంప్యూటర్ హార్డ్‌డ్రైవ్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీలలో. పెట్రోలియం రిఫైనింగ్‌లో క్యాటలిటిక్గా, ఆటోమొటివ్ క్వాటలిటిక్ కన్వర్టర్స్లో మరియు పలు రకాల లైటింగ్ టెక్నాలజీస్‌లో ఉపయోగిస్తారు. వీటి ఉపయోగాల గురించి ఇంకా కొంచం వివరంగా తెలుసుకుందాం.
ఎలక్ట్రానిక్స్ – REE మూలకాలను టీవీ స్క్రీన్స్‌లో ఫాస్ఫర్స్గా, కంప్యూటర్ మానిటర్స్ మరియు స్మార్ట్ ఫోన్స్‌లో ఉపయోగిస్తారు. ఇవి కాకుండా, హెడ్ ఫోన్స్, మైక్రోఫోన్స్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలలో వాడతారు. ఎలక్ట్రిక్ మోటర్స్‌లో వాడే మ్యాగ్నెట్స్ తయా రీలో నియోది మనియంని ఉపయోగిస్తారు. ఇవి కాకుండా హర్డ్డ్రైవ్స్, విండ్టర్బైన్స్లో కూడా ఉపయోగిస్తారు.
ఎలక్ట్రికల్ వెహికల్స్‌లో బ్యాటరీస్‌లో, LED లైట్స్‌లో, గ్లాస్ పాలిశింగ్లో, డిఫెన్స్ అప్లికేషన్స్‌లో, మిస్సైల్, రాడార్ సిస్టమ్స్‌లో, మెడికల్ ఇమేజింగ్, డైయోగ్నిస్టిక్ ఎక్విప్ మెంట్స్‌లో ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజెన్స్లో ప్రపొడిమినియం, మెగ్నిషియంతో కలిపి ఉపయో గిస్తున్నారు.
యురోపియం పాస్ఫరస్లో టెలివిజన్ డిస్ప్లేలో, ఫ్లోరసెంట్ లాంప్స్లో, న్యూక్లియర్ అప్లికేషన్స్‌లో ఉపయోగిస్తారు.
వీటి అన్వేషణలో జియాలజిస్ట్‌లు నిమఘ్నమైనారు. వారి శ్రమ ఫలిస్తే మన దేశానికి రేర్ ఎర్త్ మినరల్స్ యొక్క నిక్షేపాలు పుష్కలంగా దొరికే అవకాశమున్నది. అదే జరుగుతే దేశం ఆర్థికంగా బలపడుతుంది.
- కమతం మహేందర్ రెడ్డి
90320 12955
