మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన వెల్దుర్తి గ్రామం చారిత్రకంగా చాలా ప్రసిద్ధమైనది. అక్కడ పుట్టి పెరిగిన వెల్దుర్తి మాణిక్యరావు స్వాతంత్య్ర సమరయోధులు, ప్రఖ్యాత కవి, రచయిత, నాటకకర్త, ప్రయోక్త, బహుముఖ ప్రజ్ఞావంతులు.

వెల్దుర్తిలో కాకతీయ తోరణద్వారాలను పోలిన ఒక తోరణద్వారముంది. ఈ ద్వారం కాకతీయ తోరణ ద్వారాలకన్నా ముందరిది అనిపిస్తున్నది. దాదాపు 20 అడుగుల ఎత్తున్న ఈ ద్వారంపై కీర్తిముఖాలు చెక్కి వున్నాయి. ఈ ద్వారానికి బ్రాకెట్టు శిల్పాలుగా సింహాలున్నాయి. పైనున్న ఉత్తరాశిపైన రెండువైపుల శిల్పాలు చెక్కిన అర్థవృత్తాకారపు నల్లరాతి ఫలకం వుంది. దానికి ఉత్తరాభిముఖంగా గజలక్ష్మి, కింద క్షీరసాగరమథనం శిల్పాలు, వెనకవైపు దక్షిణాభిముఖంగా శృంగార నారసింహుడు, అతని కాళ్ళకింద రాక్షసుడు (హిరణ్యకశ్యపుడు?) దేవతాదులు చెక్కబడివున్నారు. శిల్పాలకు ఇరువైపుల మకరతోరణాలు చెక్కబడివున్నాయి. ఇవి కాకతీయశిల్పాలతో పోలికలు కల్గివున్నాయి. ఉత్తరాశికి కిందుగా 7 మొగ్గలు చెక్కివున్నాయి. వాటిపైన ఆరు రంధ్రాలున్నాయి. వీటి నుంచి వెళ్ళే సూర్యకిరణాలు ఆరురుతువుల్లో దేవాలయంలోని దేవుని పాదాలపై పడతాయని ప్రజలు చెప్పుకుంటున్నారు.
కాని, నందికందిలో తోరణద్వారానికి ఎదురుగా రామలింగేశ్వరాలయం ఉన్నట్టు వెల్దుర్తిలో అక్కడుండవలసిన శివాలయం లేదు. నంది, ద్వారపాలకుల శిథిల శిల్పాలున్నాయి.
ఈ తోరణద్వారం నందికంది దేవాలయ తోరణద్వారాన్ని పోలివుంది. అక్కడ కూడా ద్వారం ఉత్తరాశిపై గజలక్ష్మి శిల్పం తూర్పు వైపు, లోపలివైపు పడమరదిశగా వున్న తాండవశివుని శిల్పాలతో అర్దవృత్తాకార శిల్పఫలకం వుంది. ద్వారస్తంభాలు కూడా కీర్తిముఖాలతో అలంకరించబడ్డాయి. కాని, బ్రాకెట్టు శిల్పాలు లేవు.
ఆ ద్వారానికి ఆనించి పెట్టిన వినాయకవిగ్రహం రాష్ట్రకూట శైలి శిల్పం. తోరణద్వారం గుండా ఒక చిన్నగుడి కనిపిస్తుంది. ఆ గుడి ఒకే గర్భగుడిని కలిగివుంది. లోపల కొత్తగా కట్టిన గద్దెమీద 4అడుగుల పొడవు, 2అడుగుల ఎత్తైన పద్మనాభ, యోగశయనుని విగ్రహముంది. దాన్నిపుడు విష్ణు దేవాలయంగానే పిలుస్తున్నారు. కాని, యోగశయనుని ఎదురుగా చిన్న నందివిగ్రహం వుంది. అది కళ్యాణీచాళుక్యుల శైలిలో వుంది.
ఈ యోగశయనుడు సప్తఫణిమండల మండిత శేషనాగుపై పవళించివుండగా లక్ష్మీదేవి స్వామి పాదసంవాహన చేస్తున్నది. పక్కన గరుత్మంతుడున్నాడు. చతుర్భుజుడైన యోగశయనుడు పరహస్తాలలో కుడిచేయిని తలదిండుగా, ఎడమచేతిలో శంఖాన్ని ధరించాడు. నిజహస్తాలలో కుడిచేతితో చిన్ముద్ర పట్టి, ఎడమచేయిని ఎత్తిన ఎడమ మోకాలి మీద పెట్టుకున్నాడు. పైన దశావతారాలు చెక్కివున్నాయి. మణికిరీటం, హార, గ్రైవేయకాలు, కేయూరాలు, వక్షబంధం, జంధ్యం, మణిమేఖల, ఉరుడాలు, కంకణాలు, కడియాలు, పాంజీబులు అలంకరించబడ్డాయి.

7అడుగుల ఎత్తున్న శైవద్వారపాలకుని విగ్రహం గుడి బయట పడేసి వుంది. శోభాయమానమైన అలంకృత శిల్పమది. నాలుగుచేతులున్న మూర్తి కుడివైపు ముందుచేతిలో గద, వెనక చేతిలో త్రిశూలం, ఎడమ వెనకచేతిలో ఖట్వాంగం, ముందు చేయి విరిగిపోయి వుంది. బహుశః ఈ శిల్పం గుడికి కుడివైపున నిలిపివుంచే శైవద్వారపాలకుని దయివుంటుంది. త్రిభంగిమలో వున్న ఈ శిల్పం కుడికాలు కొంచెం పైకెత్తి గదమీద నుంచి వేసి నిల్చున్నట్టుగా వుంది. పాదాల నుంచి తలపై కిరీటం దాకా హొయసలశైలి శిల్పమిది. పాదాలకు మంజీరాలు, కడియాలు, పిక్కలపై కీర్తిముఖం, నడుమున దట్టి, కుడిభుజం నుంచి వేసిన కపాలజంధ్యం, కంఠహారాలు, నుదుట మూడోకన్ను, కాకతీయశైలి కిరీటం, కిరీటం మీద త్రిశూల బింబంతో సర్వాంగసుందరంగా వుంది. గద లేకపోతే సాక్షాత్తు శివుని శిల్పమే అనిపిస్తుంది. ఈ శిల్పంతో పోలిన శిల్పాలు మనకు వరంగల్ కోట ప్రాంగణంలో, గణపురం కోటగుళ్ళ వద్ద చూడవచ్చు.

ద్వారానికి కుడివైపున మట్టిలోపల ఈ శిల్పం దొరికిందంట. అయితే రెండో ద్వారపాలకుని శిల్పం ద్వారానికి రెండోవైపున మట్టిలో పూడిపోయి వుంటుంది. ద్వారానికి ఎడమవైపున పదుల సంఖ్యలో నాగశిల్పాలున్నాయి. వాటిలో చాలాప్రాచీనమైనవి కూడా వున్నాయి. అటువైపుననే ఆంజనేయుని గుడి వుంది. గుడిలో హనుమంతుని విగ్రహం, ముందర పిడికెంత లింగం ప్రతిష్టించిన చిన్న పానవట్టం, చిన్ననంది వున్నాయి. ఆ ప్రాంగణంలోనే శిఖరమంటపంలో గరుడుని విగ్రహమున్న 20అడుగుల ఎత్తున్న రాతిధ్వజస్తంభం వుంది. ఈ స్తంభం జైనమానస్తంభాన్ని పోలివుంది. ఇటువంటి స్తంభాలు కొలనుపాక, జనగామ, వేల్పుగొండలలో కనిపిస్తాయి. ఈ స్తంభానికి ఎదురుగా గుడిప్రాంగణం బయట మంటపం కట్టి నిలిపిన మరోస్తంభం వుంది. నాలుగు పలకలుగావున్న 15అడుగుల ఎత్తున్న ఈ స్తంభం ఎవరి విజయస్తంభమోననిపిస్తున్నది. కట్టిన మంటపం నాలుగు మూలలలో నాలుగు బ్రాకెట్లలో నాలుగు సింహాల శిల్పాలున్నాయి. మనకివి తోరణద్వార స్తంభాలకే కనిపిస్తుంటాయి.
వీటన్నింటికి ఉత్తరంగా కొంచెం దూరంలో పదిసోపానాల శిఖరంతో విఠలుని దేవాలయముంది. 16స్తంభాల రంగమంటపం, అంతరాళం, గర్భగుడులతో వున్న ఈ దేవాలయం చాలాసార్లు పునరుద్ధరణకు గురైంది. స్థానికులు చెప్తున్నదాన్ని బట్టి ఈ గుడిలోని మూలవిగ్రహాలు భగ్నమైనవని బయటపెట్టి కొత్తగా (50యేండ్ల కింద) రుక్మిణీ సహిత విఠ్ఠలుని విగ్రహాలను ప్రతిష్టించారని తెలుస్తున్నది. ఈ ఆలయప్రాంగణంలో 4అడుగుల ఎత్తున్న వైష్ణవ శిల్పముంది. ఈ శిల్పానికి తలవైపున దశావతారాలన్ని చెక్కివున్నాయి. ఈ మూర్తి చతుర్భుజుడు. కుడివైపు ముందరిచేయి చేతివేళ్ళమధ్య తామరపువ్వుతో అభయహస్తంగా వుంది. వెనకకుడిచేతిలో శంఖం వుంది. విరిగివున్న ఎడమ ముందరిచేయి వరదహస్తంగా వుండివుండాలి. వెనక ఎడమచేతిలో చక్రమున్నది. తలపై కరండమకుటముంది. కంఠహారాలు, భుజకీర్తులు, పెద్దకుండలాలతో అందమైన శిల్పం. ఇది కేశవమూర్తి శిల్పం.
వెల్దుర్తి మాణిక్యరావు ఇంటివద్ద రాజరాజేశ్వరుని గుడి వుంది. ఆ గుడికి వున్న దక్షిణదిశలో వుండేటి మొదటి రాతిద్వారాన్ని తీసి తూర్పు ఈశాన్యంలో పెట్టారు. లలాటబింబంగా గజలక్ష్మి వుంది. శైవద్వారపాలకులున్నారు. గుడి గోడల్లో పెట్టికట్టిన జైన కలశాలున్న పాత దేవాలయ ద్వార స్తంభాలు కనిపించాయి. గుడిలోపల దుర్గ, శివలింగం, వీరభద్రుడు, వేంకటేశ్వరుడు, వినాయకుడు వున్నాయని ఆలయ పోషకులు చెప్పారు. ఈ దేవాలయానికి దగ్గరలోనే కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువుంది. దానిని గుడిచెరువని పిలుస్తున్నారు. ఈ చెరువు ఆయకట్టు 250 ఎకరాల వరకు
ఉంది.

ఊరి బయటికి వెళ్లే తొవ్వలో ఎత్తైన రాతిగద్దె మీద పోచమ్మ దేవతతో పాటు పలుదేవతలు శిల్పాలున్నాయి. పోచమ్మదేవత చాముండి ప్రతిమా లక్షణాలతో వుంది. కాని, మడిచిన కుడికాలి కింద గొర్రెపోతు, ఎడమకాలి కింద అసురుని తలలున్నాయి. సాధారణంగా చాముండి దేవత ప్రతిమకు కాళ్ళకింద మూడు తలలుంటే కామాక్షి శిల్పమని అంటారు. ఇక్కడున్న శిల్పం ప్రత్యేకం. మరెక్కడా ఇంతకు మునుపు చూడని దేవతాశిల్పమిది. ఈ దేవతకు ఎదురుగా తలలేని రెండుచేతుల చాముండి శిల్పం, నాలుగుచేతులతో మరొక చాముండి శిల్పలున్నాయి. అక్కడున్న చింతచెట్టు వందలయేండ్ల నాటిదట. ఆ చెట్టు మొదట్లో పెట్టివున్న శిథిల మహిషాసురమర్దిని శిల్పం రాష్ట్రకూటశైలిలో చెక్కివుంది.
శాస్త్రుల రఘురామశర్మ రాసిన ‘మెదకుసీమ విజ్ఞాన సర్వస్వము’లో వెల్దుర్తి గురించి రాస్తూ ‘కాకతీయ రుద్రదేవుడు హన్మకొండలో వేయిస్తంభాలగుడి కట్టించిన కాలంలోనే ఇక్కడ శివాలయాన్ని నిర్మించినట్టు తెలిసింద’ ని రాసాడు.
ఇక్కడున్న ద్వారస్తంభాలలో (కుడివైపు స్తంభంపై) ఒకదానిపై చెక్కివున్న శాసనంవల్ల ఈ గుడి కాకతీయులు నిర్మించినట్టు చెప్పవచ్చని భావించారు. (శాసనపాఠం లేదు).
మేం అచ్చు తీసిన శాసన పాఠం:
శాసన లిపి: తెలుగు (13వ శ.)
శాసన భాష: సంస్కృతం
శాసనపాఠం: శాసనపాఠం:
- శ్రీమతు పా
- కేదల మ…
- బూదేవీ దే
- యావ(టు)ర్వ
- (ణ)దొమ్మహ
- సొసపామిన
- పినక …..
- తిచే సిమ
- ….తిటి ని(ర్ణ)
- యం…

శాసన సారాంశం:
శాసనం జీర్ణస్థితిలో ఉంది. స్పష్టంగా శాసనం తెలియడం లేదు. పాకేదల భూదేవి చేసిన నిర్ణయం అని తెలుస్తున్నది. తానెవరన్నది… చారిత్రక ఆధారాలు లభించలేదు.
ధన్యవాదాలు:
వేముగంటి మురళీకృష్ణ, బండి మురళీధర్ రెడ్డి, చంటిలకు
- శ్రీరామోజు హరగోపాల్,
ఎ : 99494 98698
