సెలవురోజు, వీకెండ్ వచ్చిందంటే చాలు.. అందమైన పర్యాటకం.. అనురాగాల ప్రయాణం అంటూ.. నగరవాసులు విహార యాత్రలకు జై కొడుతున్నారు. ఉరుకులు.. పరుగుల జీవన ప్రయాణంలో ఇల్లూ.. ఆఫీసుల మధ్య పనుల ఒత్తిడితో సతమతమయ్యే ఉద్యోగులు.. కాసేపు ప్రకృతి ఒడిలో ఓలలాడుతున్నారు. మరీ కొత్త ప్రదేశాలకు వెళ్లి ఇబ్బందులు పడకుండా.. కాస్త పరిచయం ఉన్న చోట్లకే టూర్లు వేసుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి ఒక్కరోజులో చూడగల పర్యాటక ప్రాంతాలను వీక్షించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
లక్నవరం సరస్సు..

నగర పర్యాటకులను ఆకర్షించే ముఖ్యమైన వాటిల్లో లక్నవరం ఒకటి. హైదరాబాద్ నుంచి 220 కిలో మీటర్లు. ఈ ప్రదేశం చుట్టుపక్కల ఉండే ఏటూరునాగారం అభయారణ్య సందర్శకులను కనువిందు చేస్తున్నది. లేక్ క్రాసింగ్, రోప్ కోర్సులు, కయాకింగ్ వంటివి అందుబాటులో ఉంటాయి. దీనికి సమీపంలో బొగత జలపాతం కూడా కనువిందు చేసే పర్యాటక ప్రాంతం.

నల్లమల అడవులు..
నగరం నుంచి 219 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో క్యాంపింగ్ చేయడం ఎంతో కిక్కిస్తుంది. ప్రకృతివనంలో ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. చుట్టూ ప్రకృతి అందాలతో నిండిన ఈ ప్రాంతంలో పర్యాటకుల సాహసాలను, ఉత్కంఠభరితమైన కార్యకలాపాలను ఆస్వాదించొచ్చు. సాహస భరిత అనుభూతిని పొందేందుకు సరైన డెస్టినేషన్ ఇది. పర్వతారోహణ, శివాలయం, కంబం సరస్సు అందుబాటులో ఉండే ప్రాంతాలు.

రాచకొండ కోట..
నగరం నుంచి 65 కిలో మీటర్ల దూరం. ఇది 14వ శతాబ్దానికి చెందిన కోట. ట్రెక్కింగ్‍కు అనుకూలం. యాదాద్రి-భువనగిరి జిల్లాలో ఉంది. కోట పై నుంచి చూస్తే ఆకుపచ్చని ప్రాంతాల అందాలు కనువిందు చేస్తాయి.
దక్కన్న్యూస్
ఎ : 9030 6262 88