ఆంధప్రదేశ్‌లోని విశాఖపట్నం సమీపంలో, బంగాళా ఖాతం తీరంలో ఉన్న ఎర్రమట్టి దిబ్బల (రెడ్ సాండ్ హిల్స్)కు ఇటీవల అంతర్జాతీయ గుర్తింపు లభించింది. యునెస్కో రూపొందించిన తాత్కాలిక జాబితాలో భారత్ నుంచి విశాఖ ఎర్ర మట్టి దిబ్బలకు కూడా స్థానం లభించింది. దీనితో పాటుగా తిరుమల కొండల సహజ వారసత్వ, భీమిలి ఎర్రమట్టి దిబ్బలు సహా దేశంలోని ఏడు ప్రాపర్టీలకు చోటు లభించింది. వీటిలో మహారాష్ట్రలోని పంచగాని, మహాబలేశ్వర్ ప్రాంతంలోని డెక్కన్ ట్రాప్స్, కర్ణాటకలోని ఉడిపిలో ఉన్న సెయింట్ మేరీస్ ఐలాండ్ క్లస్టర్ జియోలాజికల్ హెరిటేజ్, మేఘాలయలోని మేఘాలయన్ ఏజ్ గుహలు (ఈస్ట్ ఖాసి హిల్స్), నాగాలాండ్‌లోని నాగా హిల్ ఓఫియోలైట్, కేరళలోని వర్కాల సహజ వారసత్వ సంపద ఉన్నాయి.

భీమిలికి సమీపంలోని ఈ ఎర్రమట్టి దిబ్బల విషయానికి వస్తే, ఆ ప్రాంతం ఇప్పటికే నేషనల్ జియో-హెరిటేజ్ మాన్యుమెంట్ గా నోటిఫై అయింది.అరుదైన ఎర్ర మట్టి దిబ్బలు కావడంతో ఎంతో మంది సందర్శకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. వీటిని మొదటగా వెలుగులోకి తీసుకువచ్చిన ఘనత బ్రిటిష్ అధికారి, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డిప్యూటీ సూపరింటెండెంట్ విలియం కింగ్‌కు దక్కుతుంది. 1886లో ఆయన వీటిని గుర్తించారు. ఈ ఎర్రమట్టి దిబ్బలు సుమారుగా 1500 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. అత్యంత అరుదైన ఇలాంటి ప్రదేశాలు దక్షిణాసియాలో మూడు మాత్రమే ఉన్నాయి. తమిళనాడు లోని చెన్నైలో, శ్రీలంకలో కూడా ఈ తరహా ఎర్రమట్టి దిబ్బలు ఉన్నా భౌగోళికంగా అవి అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు. జనావాసాలకు సమీపంలో ఉన్నవి, ప్రసిద్ధి చెందినవి మాత్రం భీమిలి ఎర్రమట్టి దిబ్బలే అని చెప్పవచ్చు. అందుకే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 2014లో వీటిని భౌగోళిక వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. యునెస్కో జాబితాలో చేర్చాలని ఎన్నో ఏళ్లుగా నిపుణులు డిమాండు చేశారు. ఇటీవలే ఆ కల నెరవేరింది. యునెస్కో వారసత్వ తాత్కాలిక జాబితాలో చోటు దక్కింది.

సుమారుగా 50 వేల ఏళ్ల కిందట విశాఖకు 50 కిలోమీటర్లు దూరంలో 120 మీటర్ల దిగువన సముద్రం ఉండేది. అక్కడి నుంచి వచ్చే గాలులు ఇసుక రేణువులను మోసుకొచ్చేవి. వేల సంవత్సరాల పరిణామ క్రమంలో ఇలా దిబ్బలుగా ఏర్పడ్డాయి. ఆ తరువాత సముద్ర మట్టం పెరగడం, తగ్గడంతోనూ ఇసుక గుట్టలుగా పేరుకు పోయింది. సముద్రం పూర్తిగా వెనక్కి వెళ్లినా, గుట్టలు అలాగే ఉండిపోయాయి. వాటిపై ఎటువంటి ఒత్తిడి లేనందున అవి దిబ్బలుగానే మిగిలిపోయాయి.

పేరుకుపోయిన సముద్రపు ఇసుక ఎరుపు రంగులోకి మారడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. ఇనుప వస్తువులు తుప్పు ఎలా పడుతుందో ఇక్కడా అదే జరిగింది. ఇసుకలోని ఇనుము నీటితో కలిసినప్పుడు కరిగి, ఆక్సీకరణం చెందడం వల్ల, ఈ దిబ్బలు ఎరుపు రంగును సంతరించుకున్నాయి. వేల ఏళ్లుగా వివిధ రకాల శీతోష్ణస్థితి మార్పులను ఇవి తట్టుకోగలిగాయి. నేటికీ తమ పూర్వపు రూపురేఖలతోనే కొనసాగుతున్నాయి.

విశాఖలో భీమిలి తీరం నుంచి 200 మీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 10 నుంచి 90 మీటర్ల ఎత్తున ఈ ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయి. 4 కిలోమీటర్లు పొడవునా 2 కిలోమీటర్ల వెడల్పుతో విస్తరించాయి. బయటకు 10 మీటర్ల మేర వరకు కనిపించినా, కొన్ని చోట్ల 1.3 కిలోమీటర్లు లోతు నుంచి పేరుకున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక్కడ శాస్త్రవేత్తలు తవ్వకాలు చేపట్టారు. ఇక్కడ పురాతన, రాతి యుగానికి చెందిన ఆనవాళ్లు ఉన్నట్లుగా గుర్తించారు. ఈ విషయంలో మరిన్ని అధ్యయనాలు జరగాల్సి ఉంది. ఈ ప్రాంతం కోస్టల్ రెగ్యులేటరీ జోన్ పరిధిలో ఉంది. దాంతో దీనికి కొంతమేరకు రక్షణ లభించినట్లయింది. అయతే, సందర్శకుల అక్కడ వదిలేసే చెత్త మాత్రం బాగా పేరుకుపోతూనే ఉంది. ఎర్రమట్టి దిబ్బలను కాపాడేందుకు వీలుగా ఈ చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాల్సిన అవసరం ఉంది. సినిమా షూటింగులు సైతం ఈ ప్రాంతం ప్రత్యేకతను దెబ్బ తీశాయి.

ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో…
ఉలూరు-కటా ట్జుటా నేషనల్ పార్క్ (ఆస్ట్రేలియా)లో కూడా ఈ తరహా ఎర్ర మట్టి దిబ్బలున్నాయి. ఇది సహజ, సాంస్కృతిక ప్రమాణాల క్రింద ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడింది. అదే విధంగా అమెరికా సౌత్ డకోటాలోని బాడ్లాండ్స్ నేషనల్ పార్క్ లో కూడా ఈ విధమైన ఎర్ర మట్టి దిబ్బలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా షేల్స్, ఇసుకరాయి వంటి పురాతన అవక్షేపణ శిలలతో కూడి ఉంటాయి. భౌగోళికంగా చిన్నవి. ప్రధానంగా గత 20,000-50,000 సంవత్సరాలలో అయోలియన్, ఫ్లూవియో-మెరైన్ పక్రియల నుండి ఏర్పడ్డాయి. ఉత్తర అమెరికాలోని పొడి ఖండాంతర అంతర్భాగాలకు భిన్నంగా, ఎర్ర మట్టి దిబ్బలు ఉన్న ప్రాంతం రుతుపవనాల ప్రభావంతో తేమతో కూడిన, తీరప్రాంత ఉష్ణమండల వాతావరణాన్ని కలిగిఉంటుంది. ఈ విధమైన శీతోష్ణస్థితి దీనిని అరుదైన, విలువైన రకపు భూరూపంగా మారుస్తుంది.

విశాఖ ఎర్రమట్టి దిబ్బలు ఒక అద్భుతమైన ప్రకృతి విశేషంగా చెప్పవచ్చు. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు కూడా లభించడంతో ఈ బాధ్యత మరింత అధికమైపోయింది.
- ఎన్. వంశీమోహన్
ఎ : 98489 02520
