ప్రపంచ నదుల దినోత్సవం సందర్భంగా మంజీరా నది తీరంలోని ఏడుపాయల వద్ద ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం, దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్, ప్రభుత్వ సిటీ కాలేజీ సంయుక్తంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాయి. ప్రపంచ నదుల దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో నాలుగో ఆదివారం జరుపు కుంటారు. ఈ కార్యక్రమం 2025 సెప్టెంబర్ 28న ఉదయం 9.30 గంటలకు జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో నదుల ప్రాముఖ్యతను గుర్తుచేసే ఈ దినోత్సవాన్ని రాష్ట్రస్థాయిలో జరపడం స్థానిక ప్రజల్లో అవగాహన పెంచిందని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఫోరం అధ్యక్షులు ప్రొఫెసర్ మణికొండ వేదకుమార్ ‘‘నదితో నడక’’ కార్యక్రమాన్ని ఎడ్వార్డ్ డ్యామ్ వద్ద ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, నదులు మన నాగరికతకు హృదయ స్పందనలని, అవి మన ఆధ్యాత్మికత, వ్యవసాయం, పర్యావరణం, జీవన విధానానికి పునాది అని తెలిపారు. నదులను కాలుష్యం నుంచి దూరంగా ఉంచి స్వచ్ఛంగా కాపాడడం ప్రతి పౌరుడి బాధ్యత అని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో 100కు పైగా దేశాలు ప్రపంచ నదుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయని, ఈ సంవత్సరం మంజీరా నది వేదిక కావడం తెలంగాణకు గర్వకారణమని తెలిపారు. అంతర్జాతీయ నిర్వాహకుడు మార్క్ ఏంజెల్ ఫోరమ్ అధ్యక్షుడు వేదకుమార్ మణికొండ గారికి ఇమెయిల్ ద్వారా అభినందనలు తెలియజేశారు.
కరిపే రాజు, డిప్యూటీ డైరెక్టర్, తెలంగాణ రాష్ట్ర ఆడిట్ విభాగం మాట్లాడుతూ, నదీ సంరక్షణ అంటే మనల్ని మనం కాపాడుకోవడమేనని అన్నారు. మానవ నాగరికత ఆరంభం ఎక్కడైనా నదీ తీరాల నుంచే మొదలైందని గుర్తుచేశారు.
ఫోరం సభ్యుడు వేణుగోపాల్ మాట్లాడుతూ, విదేశీ దేశాల్లో నదులు స్వచ్ఛంగా ఉంచబడుతున్నాయని, అక్కడి ప్రభుత్వాలు వాటి సంరక్షణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్‌లో ముసీ నది తీవ్రంగా కలుషితమైందని, నదులను రక్షించడం జీవనదారాన్ని కాపాడినట్లేనని అన్నారు.
నీటి నిల్వ నిపుణుడు సుభాష్ మాట్లాడుతూ, ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో వరద నియంత్రణ చర్యలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. వర్షపు నీటిని వృథా చేయకుండా ఇంకుడు గుంతల రూపంలో భూగర్భ జలాలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. మంజీరా నది దినోత్సవం వేదకుమార్ గారి సారథ్యంలో జరగడం ఎంతో ప్రాముఖ్యమైందని అన్నారు.

సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎం. వెంకటేశ్వర్లు మంజీరా నదిపై నిర్మించిన ప్రాజెక్టుల చరిత్ర, సాంకేతిక వైశిష్ట్యాలపై వివరించారు. మంజీరా నది రాష్ట్రంలో సుమారు 350 కిలోమీటర్ల మేర ప్రవహిస్తూ మెదక్, సంగారెడ్డి జిల్లాల మీదుగా నిజామాబాద్ జిల్లాలో గోదావరిలో కలుస్తుందని తెలిపారు.
కళాకారుడు అంబటి వెంకన్న నదీ మహిమాన్వితంపై గీతం పాడి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.
కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు బుర్ర సంతోష్ మాట్లాడుతూ, మంజీరా నది మెతుకుసీమకు వరప్రదాయని అని, దాని తీరప్రాంతాల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పురాతన చరిత్ర దాగి ఉందని తెలిపారు. ఆ చరిత్రను వెలికి తీసి ప్రపంచానికి తెలంగాణ పర్యావరణ, సంస్కృతి వైభవాన్ని చూపాలని పిలుపునిచ్చారు.

ఫోరమ్ వైస్ ప్రెసిడెంట్ ఎం.హెచ్. రావు వోట్ అఫ్ థాంక్స్ తెలుపుతూ, నదులను కాపాడటం బాధ్యత గల ప్రతి పౌరుడి విధి అని అన్నారు. ఈ కార్యక్రమంలో డా. రమా, రామ్రాజ్ – ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్, డా. పద్మ, సుతారాపు వెంకటనారాయణ, నరేందర్, కేటీసీబీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నదుల సంరక్షణ, నీటి వనరుల పరిరక్షణపై సామాజిక అవగాహన పెంపొందించాలన్న సంకల్పంతో కార్యక్రమం ముగిసింది.
- కట్టా ప్రభాకర్
ఎ : 8106721111
