జోడునామాల దుబ్బాక చరిత్ర

ఒక వూరికి ఒక పేరుంటుంది. కాని, రెండుపేర్లున్న రెండు గ్రామభాగాలున్న ఒక ఊరే దుబ్బాక. దుబ్బాక గ్రామ చరిత్ర చారిత్రాత్మకమైంది.
దుబ్బాక సిద్దిపేట జిల్లా కేంద్రానికి 25 కి.మీ.ల దూరంలో ఉంటుంది. దుబ్బాక పూర్వపు తాలూకా కేంద్రం, ప్రస్తుతం మండల కేంద్రం. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం కూడా. ఈ గ్రామం 2013లో సమీపంలోని లచ్చపేట, ధర్మాజీ పేట, చేర్వాపూర్‍, చెల్లాపూర్‍, దుంపల పల్లి అనే 5 గ్రామాలను కలుపుతూ నగరపంచాయతీగా రూపాంతరం చెందినది. (తృతీయ శ్రేణి మున్సిపాలిటీ).

కుమ్మరికుంట, మాలకుంట, ఏదుల్లచెరువు, రామసముద్రం, ధర్మాజీపేట చెరువు మీదుగా కూడవెల్లి వాగులోకి అంటే గ్రామానికి ఈశాన్యం వైపు నుండి ఆగ్నేయందాటి నైరుతిమూల చుట్టుకొని, వాయువ్యం మూలనున్న పెద్దచెరువు నుంచి ధర్మాజీపేటచెరువు మీదినుంచి కూడవెల్లి, గ్రామం నలువైపులా ఉన్న గొలుసుకట్టు చెరువుల మధ్య ఉంది దుబ్బాక గ్రామం.

దుబ్బాక ఒక సంస్థానం: దుబ్బాక ఒక స్వతంత్ర సంస్థానం. దీనికింద 41 రెవెన్యూ గ్రామాలు ఏలుబడిలో ఉండేవి. పన్యాల సోమేశ్వర రావు, పన్యాల శ్రీనివాస్‍ రావు-వీరు రెడ్డిలే కానీ రావులుగా పిలువబడ్డారు. సామాన్య ప్రజానీకం వారినిపేర్లతో కాక పెద్దదొర, చిన్నదొర అనే పిలుచుకునే వారు. చిన్నదొర శ్రీనివాస్‍ రెడ్డిగారు తెలంగాణా స్వతంత్ర భారత దేశంలో విలీనం అయిన తొలినాళ్ళలో దుబ్బాక గ్రామసర్పంచ్‍గా కూడా చేశారు. వీరు రాజా ఉమ్మారెడ్డి వారసులు. దోమకొండ సంస్థానం వారు, వారి ఆడపడుచును దుబ్బాక సంస్థానానికి ఇచ్చి వియ్యమందారు.

దుబ్బాక గ్రామం రాజకీయంగా కూడా చైతన్యవంతమైనది. ఈ గ్రామస్తుడైన ఐరెని లింగయ్యగారు ఉమ్మడి ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‍ గా పని చేస్తే, ఇదే గ్రామంలో చదివిన కల్వకుంట్ల చంద్రశేఖర్‍ రావు గారు తెలంగాణకే తొలి ముఖ్యమంత్రిగా ఎదిగారు.
గ్రామం నడిబొడ్డునగల తోరణస్తంభాలకు ఉత్తరంవైపు పాతగడి ఆనుకొని దాదాపు 25, 30అడుగుల ఎత్తుతో బురుజు ఉండేది. అందులోనే ఒకవైపు ప్రైమరీ స్కూల్‍ నడిచేది. ఇంకొక పక్క గ్రామపంచాయతీ ఆఫీసు, గ్రామ రెవెన్యూ రికార్డులు నిర్వహించే కచేరీ ఉండేది. ప్రస్తుతం ఆ చోట కూరగాయల మార్కెట్‍ నిర్వహిస్తున్నారు.

జోడునామాల ఊరు: గ్రామం నడిబొడ్డునగల బొడ్రాయిని ఉన్న స్థలంలోనే ఇటీవల కొత్తగా పునఃప్రతిష్ట చేసారు. దీనికి తూర్పువైపు గ్రామాన్ని దుర్వాస అని, పడమటివైపు భాగాన్ని దుబ్బాక అని పిలుస్తుంటారు. ఇది శైవగురువులకు మూలపురుషుడు దూర్వాసుని పేరు మీద వెలసిన గ్రామం. శైవ తాంత్రికుల కేంద్రం అయింది దుబ్బాక. ఈ బొడ్రాయికి ఎదురుగా ఉన్న ఈ జంటస్తంభాలను దోర్నస్తంభాలు అంటారు (తోరణ స్తంభాలు) వీటి మీద అన్ని వైష్ణవానికి చెందిన ఆనవాళ్లు వున్నాయి. పంచలోహ యంత్రం ఉన్న ఒక స్తంభంమీద శాసనం ఉంది.

దుబ్బాక తోరణస్తంభ శాసనపాఠం
(శో)భకృతు…
సంవత్సర శ్రావ
ణశుద్ద2 శనివారం
నాడు మ….. అగ
సాల లింగోజు మ
యు… డు కర్మ
(శుః)సిచిబళర(తస)
(య)గంభం…..
శాసనసారాంశం: 13వ శతాబ్దానికి చెందిన తెలుగులిపిలో, తెలుగుభాషలో అగసాల(కంసాలి) లింగోజు శుభక•త్‍ సం.ర శ్రావణ శుద్ధ విదియ, శనివారంనాడు వేయించిన స్తంభశాసనం.
తోరణ స్తంభాలకు తూర్పు వైపు ఉన్న రెడ్డి వాడకి చివరన దుంపలపల్లి దర్వాజగా పిలవబడే ఎత్తైన ప్రవేశ ద్వారం వంటిది ఉండేది.
దుబ్బాక నామకరణం: గ్రామానికి 4కి.మీ.ల దూరంలో చౌదరిపల్లెలో ఉన్న దుబ్బ రాజేశ్వరస్వామి (పురాతన శివాలయం)పై భక్తితో ఈ గ్రామానికి ఆ పేరు పెట్టినారంటరు. పొడిబారిన (దుబ్బ) నేలపై ఉన్న ఆవాసప్రాంతం (పాక) కనుక దుబ్బంపాక= దుబ్బాక అయిందేమో. ఉదా: (కొండపాక, కొలనుపాక)
ఐదుగురు అక్క,చెల్లెండ్ల ఊరు: దుబ్బక్క, లచ్చక్క,రాజక్క, రామ్మక్క, ధర్మక్కలు అయిదుగు అక్క చెల్లెళ్ల పేరు మీద దుబ్బాక, లచ్చపేట, రాజక్క పేట, రామక్క పేట, ధర్మాజీ పేట (అన్నీ చుట్టుపక్కల గ్రామాలు) ఏర్పడ్డాయి అని అంటారు. ఆదిలాబాద్‍ జిల్లా బజార్‍ హత్నూరు మండలంలోని కనకాయ్‍, గిరజాయ్‍ పేర్లున్న గ్రామాలు కూడా అక్క,చెల్లెండ్ల పేర్లమీద వెలసినవే.

  1. శ్రీ కాశీ విశ్వనాథ ఆలయం
  2. శ్రీ ఉమామహేశ్వర ఆలయం
  3. పోచమ్మ గుడి
  4. శ్రీ భక్త ఆంజనేయ స్వామి ఆలయం
  5. శ్రీ విఠలేశ్వర ఆలయం
  6. శ్రీ నీలకంఠస్వామి దేవాలయం
  7. శ్రీ బాలాజీ దేవాలయం
  8. రాంబాగ్‍ హనుమాన్‍ ఆలయం
  9. శ్రీ మార్కండేయ ఆలయం
  10. శ్రీ కేదారేశ్వర ఆలయం
  11. గంగమ్మ గుడి
  12. మారెమ్మ గుడి
  13. శ్రీ మహంకాళి ఆలయం

పోచమ్మ గుడి: పోచమ్మగుడివద్ద 9 చాముండ శిల్పాలు, 1 బ్రాహ్మీ శిల్పం, 1 కాలాముఖాచార్యుని శిల్పం, 1 నాగశిల ఉన్నాయి. వీటిలో రాష్ట్రకూటుల కాలానివి, కళ్యాణీచాళుక్యుల కాలానివి విగ్రహాలున్నాయి.
భక్తాంజనేయస్వామి గుడి: చేతులలో తామరపువ్వుతో అంజలి ఘటించి, ఉత్తరాభి ముఖుడైవున్న శిఖాంజనేయస్వామి విగ్రహం ముందర చిన్న శివలింగం ఉన్నది.
ఉమామహేశ్వరాలయం: ఈ గుడిలో చక్ర, శంఖ చిహ్నాలతో, చేతులలో తామర పువ్వుతో అంజలి ఘటించి, ఉత్తరాభిముఖుడైవున్న 16వ శ. శిఖాంజనేయస్వామి విగ్రహం ముందర షోడశలింగప్రతిష్టతో పానవట్టమున్నది. ఇటువంటి లింగప్రతిష్ట అరుదు. వరంగల్‍, కొలనుపాకవంటి చోట్ల ఏకవింశతి లింగ ప్రతిష్ట కనిపిస్తుంది.

కాశీవిశ్వనాథ దేవాలయం: దుబ్బాక గ్రామానికి వాయువ్యం దిశగా ఉన్న పెద్ద చెరువు అనే బతుకమ్మ చెరువు వద్ద చిన్న శ్రీ కాశీ విశ్వనాథ ఆలయముంది. ఈ ఆలయం ముందు మెట్ల బావి ఉండేది, కానీ పూడ్చేశారు. శ్రీ కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రతియేటా వైశాఖ మాసంలో వైశాఖ శుద్ధ ఏకాదశి, ద్వాదశి రెండురోజుల పాటు జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ జాతర లో ఎద్దుల బండ్ల పోటీలు, అగ్ని గుండాలు, చివరి రోజు ఊరంతా రథం ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణలు. గర్భగుడిలో భూమ్మీదున్న పానవట్టంలోశివలింగం, వెనక చతుర్భుజి అన్నపూర్ణ, గణపతి శిల్పాలున్నాయి.
విఠ్ఠలేశ్వరాలయం: పాశుపత శైవం పద్దెనిమిది మంది ఆచార్యులతో దేశమంతా విస్తరించింది, తాత్వికపరమైన భేదాలతో కాపాలిక మరియు కాలాముఖ అనే రెండు ప్రధాన వర్గాలుగా తర్వాత కాలంలో విడిపోయింది. రహస్య పూజావిధానాలతో కాపాలిక ఆరాధన అనేది కొన్నిప్రాంతాలలో విస్తరించింది. ప్రత్యా భిజ్ఞా-వర్గమ్‍ కాలాముఖ ఉపశాఖకు కారణం. కాలాముఖులు సాత్వికమైన ఆరాధనా విధానాలతో దేవాలయాలూ, మఠాలను నిర్మించారు. 6వ నాటికే తెలుగు రాష్ట్రాలలో కాలముఖ ప్రస్థానమ్‍ మొదలైనది.9వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం మధ్యకాలంలో ఆధిపత్యమతంగా కొనసాగింది.

కాలాముఖంలో పరిషత్తులు వాటిలో పర్వతావళి, భుజంగావళి ఉపశాఖలేర్పడ్డాయి. దేవి, శక్తి, దుర్గ, అంబిక, గౌరీ, అపర్ణ, పార్వతి, కాళి ఇత్యాది పేర్లతో మహా శివుని భైరవ రూపానికి పత్నిగా ఆయా దేవీ రూపాలతో ఆరాధించబడ్డ 51 పీఠాల విశేషాల్ని, 42 పవిత్ర ఆలయాల గురించి తంత్ర చూడామణి చెప్తుంది. కాలాముఖుల్ని ప్రస్తావించిన శాసనాలు తెలంగాణాలో చాలా లభించాయి. కాలాముఖుల సంప్రదాయంలో విస్తరించీ తర్వాత ఖిన్నమై కాలానికి శాసనాలతో నమోదు గాక మిగిలిపోయిన ఆలయాలలో ఒకటి కొత్తగా వెలుగుచూసింది. గ్రామంలో విఠలేశ్వరాలయంగా పిలువబడుతున్న శైవాల యంలో పానవట్టంమీద కాళికాదేవీ సమేతంగా ఆసీనుడైన యోగభైరవుని శిల్పముంది. ఈ శిల్పం సుఖాసీనమూర్తులలో భైరవుడు పర(వెనక) హస్తాలలో పరశువు మరియు శ్వానపతాకాన్నీ, నిజ(ముందరి) హస్తాలలో కుడిచేత అక్షమాల ధరించి, ఎడమచేత ప్రసారితహస్తంతో దర్శనమిస్తుంటే, దేవి ఖట్వాంగంతో, ప్రసారిత హస్తముతో కనిపిస్తుందని, ఈ శిల్పం ప్రతిమాలక్షణాల పరంగా యోగభైరవ, కాళికలని కళ్యాణీచాళుక్యులశైలి (10,11వ శ.) శిల్పాలని ప్రతిమా లక్షణవేత్త పి.మహేశ్‍ (సుపర్ణమహి), శ్రీరామోజు హరగోపాల్‍, కన్వీనర్‍, కొత్త తెలంగాణచరిత్రబృందం నిర్ధారించారు. ఈ మూలమూర్తి ముందర చిన్నదైన చతుర్భుజ కుమార స్వామి అర్చామూర్తి వుండడం కూడా విశేషమే. మహాపీఠ నిరూపణలో, కామరూప ఆరాధనలో కనిపించే జంటలలో మొదటిజంటగా కాళీ, యోగీశ భైరవులుంటారని పిదప జయదుర్గతో క్రోధభైరవుడు, మహిష మర్ధినితో వక్త్రనాథుడు, యశోరేశ్వరితో చండభైరవులుంటారని వారు వివరించారు.

ఈ ప్రతిమను పొరపాటుగా వైష్ణవమూర్తి(విఠలుని)గా కొలుస్తున్నారు. ప్రతిమాలక్షణాలెరుగకపోవడంవల్ల జరిగిన తప్పిదం. తెలంగాణాలోనే గతంలో లభించిన ఏదులాబాద్‍ 9తలల చండభైరవుడు, ఇంద్రేశంలో స్వచ్ఛందభైరవుల స్థానాలు గొప్ప భైరవ మంత్రపీఠాలే. ఇపుడు దుబ్బాకలో 3వ భైరవమంత్రపీఠం గుర్తించబడ్డది. నాలుగో పీఠాన్ని అన్వేషించ వలసివుంది. దేశంలో ఇటువంటి భైరవమంత్ర పీఠాలున్న సమాచారంలేదు.

చతుర్ముఖ వీరగల్లులు: దుబ్బాకగ్రామం మొదట్లోగల శ్రీ భక్తాంజనేయస్వామి ఆలయం ఎదురుగా వున్న రావిచెట్టువద్దగల వీరగల్లు శిల్పం ఇది. మూడువైపులా చెక్కిన శిల్పాలు ఉన్నాయి, వెనుకవైపు కూడా ఉన్నట్టున్నాయి. (తడిమిచూస్తే స్పష్టంగా విల్లు పట్టుకున్న శిల్పం
ఉన్నట్టుంది). ఈ వీరగల్లు శిల్పం రాష్ట్రకూటశైలికి (8,9వశ.) చెందింది. గుడికి దక్షిణం వైపున నాగదేవత శిల్పం ఉంది. కాశీవిశ్వనాథాలయం ఆవరణలో రాష్ట్రకూటశైలికే చెందిన మరొక చతుర్ముఖ వీరగల్లు శిల్పం ఇది. నలువైపుల వీరులు యుద్ధంలో పాల్గొన్న దృశ్యాలు ప్రత్యేకం. ఈ వీరగల్లు కనకాయ్‍ గుడిముందరున్న చతుర్ముఖ వీరగల్లు వంటిదే.

  1. కూడవెల్లి శ్రీ రామలింగేశ్వర ఆలయం 8కి.మీ.లు
  2. మోతె వెంకటేశ్వర ఆలయం 5 కి.మీ.లు
  3. ధర్మాజీ పేట రామాలయం,శివాలయం 1 కి.మీ.
  4. మిరుదొడ్డి 12 కి.మీ.లు
  5. పుల్లూరు 18 కి.మీ.లు
  6. ముస్తాబాద్‍ 15 కి.మీ.లు

మాఘమాసంలో వచ్చే మార్కండేయజయంతి సందర్భంగా జరిగే ఊరేగింపులో ఎద్దులబండిపై అమర్చిన మగ్గంమీద ఊరు తిరిగివచ్చేసరికి చీరనేసేవారు. అగ్గిపెట్టెలో పట్టేంత నాజూకుచీర నేసేనైపుణ్యం కలిగిన చరిత్ర వీరిది. ప్రస్తుతం దుబ్బాక లెనిన్‍ చీరలు, వస్త్రాలకు జాతీయస్థాయిలో గుర్తింపు ఉంది. దేశవ్యాప్తంగా ఎన్నుకోబడిన చేనేత వస్త్రాలలో దుబ్బాకలోనేసిన లెనిన్‍ వస్త్రాలు ఎన్నుకోబడి, ఒక వారంరోజులపాటు అయోధ్య బాలరాముడికి అలంకరణలో ఉపయోగించడం అంటే ఇది దుబ్బాక చేనేతల నైపుణ్యానికి మచ్చుతునక అని చెప్పుకోవచ్చు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *