తెల్లవారుఝామున చదువరుల ఇంటిముందు పత్రికను ప్రతిరోజూ అందించేందుకు, కొన్ని గంటల దాకా సైకిల్ తొక్కుకోవలసిందే. ఎడిటర్ అయ్యే దాకా చిన్నప్పటినుంచే సైకిల్ తొక్కడమే జీవితం. నాన్నకు కడుపులో విపరీతంగా నొప్పి వచ్చేది. కడుపు పట్టుకుని పక్క అరుగుమీద పడి నొప్పి ఆగేదాక నిలబడేది. నొప్పి తగ్గిన తరువాత కాస్సేపు సైకిల్ నడిపేది. నాన్నను తలుచుకోగానే నాకు కళ్లు పొంగేవి. ఆ పోరాటశీలి యం.యస్. ఆచార్య (మాడభూషి శ్రీనివాస ఆచార్య) 3 అక్టోబర్, 1924లో జన్మించారు.
సాధారణంగా జయంతి, తరువాత వర్ధంతి సంవత్సరం సంఖ్యతో సాగిస్తారు. పుట్టిన తరువాతే కదా జీవనం మొదలయ్యేది! మధ్యలో చెప్పవలసింది ఇంకేమీ లేదా? ఇదీ ప్రశ్న. దంపతులిద్దరికీ వివాహ దినోత్సవం కూడా ముఖ్యమే. కాని వారికి కేవలం సొంతమైన వ్యవహారం. చదువు, ఉద్యోగాలు, కష్టాలు ప్రతి వ్యక్తికీ మామూలే. కొందరి వ్యక్తులను గుర్తు చేసుకుంటాం. ఆచార్య దివంగతులైన తరువాత మరిచిపోవడం కూడా సాధారణమే.
నాలుగు దశాబ్దాల పాత్రికేయుడు
నాలుగు దశాబ్దాలకు పైగా జర్నలిస్టుగా పనిచేయడం అంత సులువు కాదు. జిల్లా కేంద్రం వరంగల్ వంటి పట్టణంలో ఆర్థికమైన వెన్నుదన్ను లేకున్నా రెండు పత్రికల సంపాదకుడిగా, నిర్వాహకుడిగా యం.యస్. ఆచార్య అనేక ఆటు పోటులను తట్టుకుంటూ, పత్రికా వ్యాసంగాన్ని నిర్విఘ్నంగా కొనసాగించారు. దాని వెనుక ఎంతటి ప్రతిభా వ్యుత్పత్తులున్నాయో, పత్రికా నిర్వహణ పట్ల ఎంతటి దృఢదీక్ష ఉన్నదో విశ్లేషించబూనటం ఎంతటి వారికైనా సాధ్యం కాకపోవచ్చు. ‘జనధర్మ’, ‘వరంగల్ వాణి’ పత్రికలు ఆయన దీక్షా దక్షతలకు నిదర్శనాలుగా నిలిచాయి.
ఒక పత్రికను నిర్వహించాలంటే ధనంతో పాటూ అనేక వనరులు అవసరం. ఇవేవీ లేకుండా కేవలం సైద్ధాంతికత, నిష్ఠలతో బతుకుదెరువు కోసం సంగీతం, వైద్యాలను ఆశ్రయిస్తూ ‘జనధర్మ’, ‘వరంగల్’ ‘వాణి’ పత్రికలను అకుంరిత దీక్షతో నడిపారు ఆచార్య, నివురు గప్పిన నిప్పులా కనపడే ఆచార్య జీవిత విశేషాలు తెలియని వారు ఆయన్ని చూసి అర్ధం చేసుకోవడం కన్నా అపార్థం చేసుకోవడమే తరుచు జరిగేది.

ఆచార్యకు డిగ్రీలు లేవు. కాని చదువుల తల్లి వారింటి ఇలవేలుపు. వారిది పండితుల కుటుంబం. ఆయన సూర్యాపేటలోని వారి మేనమామల స్వగృహంలో రక్తాక్షి ఆశ్వయుజ శుద్ధ షష్ఠినాడు అంటే 3 అక్టోబర్ నాడు (1924) యం.యస్. ఆచార్య జన్మించారు. బాల్యం స్వస్థానం నెల్లి కుదురులో గడిచింది. అక్కడే 4వ తరగతి వరకు ఉర్దూ మీడియంలో చదివారు. తరువాత తండ్రి ప్రసన్న రాఘవాచార్యుల వద్దనే సంస్కృతం నేర్చుకున్నారు. శబ్ద మంజరి, బాల రామాయణం, ధాతుమంజరి, రఘువంశం, కుమార సంభవం, మేఘసందేశం (పూర్వ మేఘం 67 శ్లోకాల వరకు), పంచోపనిషత్తులు, తిరుప్పావై వంటి వాటిని అధ్యయనం చేశారు. తాతగారి కాలం నుండి కొనసాగుతున్న ఆచారం తండ్రిగారు పాటించి భోజనాలు పెట్టి విద్యార్థులకు విద్యనేర్పే పద్ధతి కొనసాగించే వారు. కొన్నాళ్లకు కుటుంబం గడవటం కష్టమైంది. సంస్కృత పాఠాలు తిండిపెట్టే స్థితి లేదు. దీంతో నారయ్య శాస్త్రి వద్ద నేర్చుకున్న వైద్యం, స్వయంకృషివల్ల అబ్బిన జ్యోతిష, మంత్ర శాస్త్రాలు కొంత కాలం ఆర్జనకు పనికి వచ్చాయి. కొన్నాళ్లు మృదంగం, తబలా, హార్మోనియం వంటి వాటిని వాయించారు. నాటక రచన కూడా చేశారు. అవే ఆయన బతుకు దెరువయ్యాయి.
పల్లెటూరి పాత్రికేయుని ఆకాంక్ష
ఆంధప్రదేశ్లో ఓరుగల్లు మండలానికి విశిష్ట స్థానమున్నది. సాహిత్య కృషికి, సాంస్కృతిక పరివ్యాప్తికి ఈ మండలం పేరెన్నికగన్నది. ఈ మండల ప్రాభవ ప్రాశస్త్యాలను గూర్చి మన కవులు, రచయితలు అనేక చరిత్రలు వ్రాస్తూ వస్తున్నారు.
పత్రికా రచయితల కోవకు చెందిన సారస్వత సేవాభిలాషి శ్రీ యం.శ్రీనివాసాచార్య గారు వీరు 1958 సంవత్సరంలో జనధర్మ పత్రికను స్థాపించి, దాని సంపాదకులుగా వ్యహరించి ఈనాటి గ్రామీణ వ్యవస్థకు సరిపోను అన్ని హంగులతో సమాజానికి ఎనలేని సేవ చేస్తూ వస్తున్నారు. ఈ జనధర్మ పత్రిక ద్వారా రాజకీయ, పారిశ్రామిక సారస్వతంగానే కాకుండా రాజ్యంలో జరుగుతున్న అభ్యుదయ కార్యక్రమాలను గూర్చి ప్రబోధం చేస్తూ వస్తున్నారు. శ్రీ యం. ఎనివాసాచార్యులు గారు జనధర్మ పత్రిక ద్వారా భావితరాల వారికి పూర్వీకుల చరిత్రలను కొంతలో కొంత అందించుటకు ప్రయత్నించుచున్నారు. ఈ దినపత్రిక ద్వారా సాహిత్యంను పరివ్యాప్తి పరచుచూ భావితరాల వారికి ఉత్తేజాన్ని పురికొల్పుటలో ఎనలేని సేవ చేస్తూ నేటి సమాజానికి ఆశాజ్యోతిగా వ్యవహరించుచున్నారు.
ఆచార్య మైలురాళ్లు
- నవంబర్ 1958లో జనధర్మ వార పత్రిక ప్రారంభించారు.
- 1971లో స్వంత ముద్రణాలయం బాలాజీ ప్రెస్‍ను నెలకొల్పారు.
- 1980 జనవరిలో వరంగల్ వాణి దినపత్రిక వ్యవస్థాపన చేసారు.
1994 జులై 12 వాకా చివరి ఊపిరి ఆగిపోయే వరకు 70-71 ఏళ్ల వయసులో పత్రికల ద్వారా చైతన్యం ఆలోచనలను కల్పించారు. అప్పటినుంచి స్ఫూర్తిగా కొనసాగుతున్నారు.
దాదాపు 30 ఏళ్ల కిందట జనధర్మ వారపత్రిక ఆగిపోయినా, చేతులు మారిన వరంగల్ వాణి పత్రిక కొనసాగుతున్నది.
యం.యస్. ఆచార్య….
తెలంగాణ స్వాభిమాన స్వాతంత్య్ర దీప్తికై అక్షరాయుధాలనిచ్చిన వాడు ప్రజానాయకుల వాకిలి కుక్క కాదు పత్రిక ప్రజల పాశుపతమ్మన్న వాడు…
నీలాలకు కాసులకు నియమాలు వదిలి భజన సేయు కొన్ని కలాలకన్న అక్షరాక్షరాన కాకతీయ పౌరుషమ్మునింపి, చురుకైన వాక్యాల చురకలిచ్చి
జనధర్మపు మాటయై బాటయై వరంగల్లు వాణియైబాణియైన పెన్ను…
మనకు స్వాతంత్య్రం ఆగస్టు 15, 1947 నాడు రాలేదు. మరో 13 నెలల తరువాత సెప్టెంబర్ 17న నిజాం అనంతమైన దుర్మార్గాలు అంతమైన రోజు. ఆ నిజాంలపైన పోరాడిన ఆనాటి యువకుడు యం.యస్. ఆచార్య. నిజాం కాలంలో తెలుగు పత్రిక చదవడమే నేరం. అయినా సరే చైతన్యం పెంచడమే తన పని. పత్రికే ఆ చైతన్యానికి ప్రతీక.
ఒక్క పేజీలో సరిపోయే విషయాన్ని మూడు నాలుగు పేజీల్లో విస్తరించి ప్రభుత్వాన్ని మోసం చేస్తూ కోట్లాది రూపాయలు తీసుకొనే అవకాశం ఉంది కాని, యం.యస్. ఆచార్య అందుకు ఒప్పుకోలేదు. పోతే పోయింది. ఇన్నాళ్ల పాటు బతుకున్న నీతిని ధర్మాన్ని జనధర్మాన్ని రక్షించుకోవడానికి అవినీతికి అమ్ముకోవద్దని నిర్ణయించుకున్నారు.
తెలంగాణ సాహిత్యానికి, సాంస్కృతిక వారసత్వానికి సముచిత గౌరవ ప్రాభవాలను కల్పించడానికి ఈ పత్రికల ద్వారా వేదికను ఏర్పరచాడు. సామాజిక సమస్యలను చర్చించడానికి పరిశోధనాత్మక వార్తాంశాలను గుప్పించడానికి, సమకాలీన సంకర విలువలను ఎండగట్టడానికి ఈ పత్రికలు ఎంతో ఉపయోగ పడినాయి. వరంగల్ కోసం, తెలంగాణ కోసం, జన్మభూమి కోసం జీవితమంతా ధారబోసిన యం.యస్. ఆచార్య జీవన పోరాటం వివరిస్తుంది ఈ పుస్తకం.
నిజాల కోసం బతికి, నిజాం దుర్మార్గాలకు బతుకు బలిచేసే దశలో తానే కాక, మొత్తం కుటుంబాన్ని, పత్రికనీ, పత్రికా స్వాతంత్య్రాన్ని బతికించిన వ్యక్తి కథ ఈ పుస్తకం.
పుస్తకం: యం.యస్.ఆచార్య
ప్రచురణ: ఎమెస్కో బుక్స్ ప్రై.లి.
వెల: రూ.300
- కె. సత్యప్రసన్న
