ప్రకృతి గమనం! 5 ప్రకృతి ధర్మం!!భూగోళం – అంతర్గత, బాహ్యకారకాలు!

చలనం ప్రకృతి ధర్మం! ప్రకృతిలో కేవలం సజీవులైన జంతువర్గమే చలిస్తుందనేది జీవశాస్త్ర పరిభాష! కాని, నిర్జీవులలో కూడా ఈ చలనం వుంటుందనేది భౌతిక, రసాయన శాస్త్ర నిరూపణలు. పదార్థం పరమాణవుల సమూహమని, ప్రతి పరమాణువులో ఒక కేంద్రకం వుంటుందని, ఇందులో ద్రవ్యరాశిని కలిగించే ప్రొటాన్లు, నూట్రాన్లు వుంటాయని, ఈ కేంద్రకం ఆధారంగా ఎలక్ట్రాన్లు భ్రమిస్తాయని మనమంతా రసాయన శాస్త్ర పుస్తకాల్లో చదువుకున్నాం. ఈ విషయాలు మరింత అవగతం కావాలంటే, 19వ శతాబ్దపు ఆవిష్కరణల్ని విధిగా తెలుసుకోవాలి. ముఖ్యంగా డాల్టన్‍, థామ్సన్‍, రూథర్‍ఫోర్డ్, బోర్‍లాంటి శాస్త్రజ్ఞులు ప్రతిపాదించిన పరమాణు నిర్మాణాన్ని తెలుసుకోవాలి. ఈ ప్రతిపాధనలే భౌతిక వాదానికి పునాదులు వేసాయి. సృష్టికి మూలం పదార్థమేనని నిర్ధారించాయి. మార్క్సిజానికి, డార్వినిజానికి దారులు వేసాయి. ఏంగెల్స్ ప్రకృతివాద (dilets of nature)రచనకు దారితీసాయి. చివరికి పదార్థ ధర్మాలు లేని విద్యుచ్ఛక్తి, అణుశక్తి, ఉష్ణశక్తి, కాంతి తదితర శక్తిరూపాలు కూడా ఈ గమన సూత్రాలపైననే పయనిస్తాయి. ప్రసరిస్తాయి. రూపాంతరం చెందుతాయి. ఈ చలన సిద్దాంతాలే న్యూటన్‍ గమన సూత్రాల, ఐన్‍స్టీన్‍ సాపేక్ష సిద్ధాంతాల ఆవిష్కరణకు కారణమయ్యాయి.

ఇలా ఓ శాస్త్రీయ సిద్ధాంతానికి, అవగాహనకు, సృష్టిలోని దృగ్విషయాలకు ఒక శాస్త్రంతో మరో శాస్త్రానికి, ఓ ఆవిష్కరణతో మరో కొత్త సిద్దాంతానికి కారణాలు అయ్యాయి. అవుతూ వుంటాయి. కాని, భారత్‍లాంటి దేశంలో ఈ శాస్త్రపరమైన ఆలోచనలకు పాఠశాల స్థాయిలోనే అడ్డుకట్టలు వేయడం జరుగుతుంది. చివరికి ఉన్నత చదువు చదువుకున్న వారికి కూడా వీటిపట్ల పట్టింపు లేకపోగా, రేపటి తరాన్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయ వర్గానికి, ముఖ్యంగా భౌతిక, రసాయన విషయాల్ని బోధించే వారికి కూడా కనీస అవగాహన, పరిజ్ఞానం లేకపోవడం గుర్తెరిగిందే! మన దగ్గర సైన్సు చదువంతా కేవలం పరీక్షల కోసం, ఉద్యోగాలకోసమే గాని, వాస్తవ శాస్త్రీయ ఆలోచనల్ని పెంపొందించుకోవడం కోసం కాదు. అందుకే ఈ దేశంలో రాళ్లు మాట్లాడుతాయి. పాలు తాగుతాయి. భౌతిక, రసాయన, జీవశాస్త్ర అధ్యాపకులు (అధ్యయనం అనే పదంతో ఏర్పడినా, అధ్యయనం కొరవడిన వారు) బాబాల చుట్టూ, తిరుగుతారు. కుంభమేళాల్లో మునిగి తరిస్తారు.

ఈ సందర్భంగా, ఈ ప్రస్తావనలెందుకు అనే ప్రశ్నలు సహజంగా వస్తాయి. అయితే, అత్యధికులు (చదువురులతో సహా) భూమి భగవత్‍ సృష్టి కాబట్టి, ఎలాంటి ఆపద భూమికి వుండదని భావిస్తారు. మన పాఠ్యపుస్తకాల రచన కూడా ఉపరితల అంశాలకే పరిమితమై, అంతర్గ శాస్త్రీయ అంశాలకు ప్రాధాన్యతను ఇవ్వకుండా వుంటుంది. మన పాఠ్యాంశాలు కేవలం ఓ వర్గ ప్రయోజాన్ని కాపాడడానికే రచించబడుతాయి. వీటిని విడమరిచి చెప్పే ఉపాధ్యాయులు నూటికి ఒకరో, ఇద్దరో వుంటారు. డార్వినిజాన్ని బోధించవద్దని చర్చి ఆదేశించడమేకాక, ఈ పాఠ్యాంశాన్ని పిల్లలకు శాస్త్రీయంగా బోధించినందుకు కేరళలో, పశ్చిమ బెంగాల్‍లో చర్చిల క్రోథానికి గురై ఉద్యోగాల్ని కోల్పోయిన ఉపాధ్యాయు లున్నారు. ఈ నేపథ్యంలోనే, పవిత్రమైన కుట్ర (the holy conspiracy) అనే సినిమా వచ్చింది.

మన నమ్మకాలకు సైన్సు ఎప్పుడు అతీతంగా, ఉన్నతంగా పయనిస్తూనే వుంటుంది. ఎన్నో విశ్వరహస్యాల్ని చేధిస్తూ మానవాళి మనుగడకై బాటలు వేస్తున్నది. ఇది ఇలా వుంటే, ప్రకృతి తనపనిని తాను చేసుకుంటూ పోతున్నది. ఎన్నో ఊహించని మార్పులకు లోనైతున్నది. జీవరాశి పుట్టకకు, ఎదుగుదలకు, రూపాంతరాలకు కారణమైన ఈ భూగోళం కూడా అంతర్గత, బాహ్య కారణాలకు నిరంతరం గురైతూనే వున్నది. విభిన్న కారకాల ప్రభావం భవిష్యత్‍లో ఎలా వుంటుందో ఇదిమిత్తంగా చెప్పలేకున్నా, పెను ప్రమాదానికి భూగోళం గురికాక తప్పదనే సంకేతాలు వస్తున్నాయి. ఇవి నిజాలా, వాస్తవాలా అని అనుకుంటే, జరుగుతున్న పరిణామాలు, విపత్తులు ఈ సంకేతాలకు నిదర్శనంగా వుంటున్నాయి. వీటి కారణంగానే జీవరాశితో పాటు మానవాళి కూడా ప్రాణనష్టాన్ని చూస్తూనే వున్నది. ఈ ఉదంతాలు ఏ ప్రాంతానికో, దేశానికో పరిమితం కాకుండా ప్రపంచవ్యాపిత మయ్యాయి. కాలగమనంలో, రుతు చక్రాల్లో, అనేక మార్పుల్ని చూస్తున్నాం. ఒకప్పుడు వాతావరణ శాఖ ప్రకటనలకు పెద్ద ప్రాధాన్యత వుండేది కాదు. ఇప్పుడంతా ఆ ప్రకటనల ప్రాధాన్యతతో పాటు హెచ్చరికలు మనకు నిద్రపట్టకుండా చేస్తున్నాయి. ఏ విపత్తు ఏ రూపంలో వస్తుందో తెలియడం లేదు.

ఒకప్పుడు ఈ హెచ్చరికలు ఒక ప్రాంతానికి పరిమితంగా చూసే వాళ్ళం. కాని, ఇప్పుడు అన్ని ప్రాంతాలకు ఈ హెచ్చరికలు వర్తిస్తున్నాయి. ప్రకృతి విపత్తులకు ఒకనాడు బడుగు, బలహీన వర్గాలు అత్యధికంగా బలైతే, ఇప్పుడంతా తారుమారై, అందరు బలైపోతున్నారు. సాధారణ వాతావరణ పరిస్థితులు, దూరమై, అతి, అత్యంత భారీ, విపరీత, బలమైన, రెడ్‍ అలర్డ్ అనే పదజాలాన్ని ప్రతీ వాతావరణ హెచ్చరికకు ముందు జోడించాల్సి వస్తున్నది. ఒక వైపు వర్షాభావ స్థితివుంటే, మరోవైపు అత్యంత భారీవర్షాలు దావానలం, అగ్నికీలలు, హిమపాతం, మంచు తుఫానులు, మంచుఖండికలు అస్థిరతకు గురికావడం, ఇసుక తుఫానులు, సముద్ర అలలు సృతిమించడం… ఇలా ఎన్నింటినీ చెప్పుకున్నా ప్రకృతి విషయంగా మానవమేధ మరుగుజ్జుగానే వుంటున్నది.. సుఖవంతమైన అమెరికా, యూరప్‍ దేశాలు కూడా ప్రకృతికి తలొగ్గుతున్నాయి. చీకటి రాత్రులు, నిద్రలేమి, నిరాశ్రయం వారిని వెంటాడుతున్నాయి. అడవుల భస్మీపటలం, ప్రళయ ఘోషలు, మంచులో కూరుకపోవడం వీరికి పీడకలలుగా మారాయి. మానవుడి సాంకేతిక పరిజ్ఞానం కూడా వీటిని ముందస్తుగా పసిగట్టలేని స్థితి. అయినా మనిషి నిరంతర అన్వేషి. కారణాల్ని వెతుకుతున్నాడు. ఈ వెతుకులాటలో భూగోళ సంబంధ కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఈ విషయాలు భవిష్యత్‍కు హెచ్చరికలుగా వుంటున్నాయి.

అఖండ గోండ్వానా (pangea) నుంచి విభిన్న ఖండాలుగా భూమి విడిపోయిందనేది మనకు తెలిసిన భూచరిత్ర. ఇలా విడవడిన ఖండాల మధ్యన మరింతగా ఎడం పెరుగుతున్నదనేది ప్రస్తుత అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఇది కేవలం ఉపరితలంకే కాదని, వందల కిలోమీటర్ల సముద్రాల అడుగులో కూడా భూపొరలు చిధ్రమైతున్నట్లుగా ఆధునిక పరిశోధనలు చూపుతున్నాయి. ఇలా చీలిపోతున్న పొరలతో భూ అంతర్భాగాలలో అనూహ్య మార్పులు జరుగుతున్నట్లుగా పరిశీలకులు గుర్తిస్తున్నారు. ఉపరితల ఖండికలు కదులుతూ ఒకదానితో ఒకటి దూరమైతే వాటితోపాటుగా అనుబంధంగా వుండే ప్రకృతి సంపద, జీవావరణ వ్యవస్థ కూడా విడిపోతూ వుంటాయి. కాని, భూగర్భంలో జరిగే మార్పులు మరో కొత్త భౌగోళిక వ్యవస్థను ఏర్పరుస్తుందా, లేదా యావత్తు భూగోళం ధ్వంసమైతుందా అనేది ఇప్పటికిప్పుడే తేలే అంశం కాదు. ఇలా జరుగుతుందా అని ప్రశ్నించుకుంటే, ఇప్పటి భూగోళం ఇలాంటి చర్యలతోనే పరిణామం చెంది, గుణాత్మకంగా మారింది. హిమాలయ ప్రాంతం ఒకప్పుడు సముద్ర ప్రాంతమని మనం భౌగోళిక అధ్యయనాల్లో చదువుకున్నాం. అలాగే భారత ఉపఖండం టిబెట్టు వైపు సంవత్సరానికి కొన్ని సెంటీమీటర్ల చొప్పున కదులుతున్నట్లు భూగర్భ శాస్త్రజ్ఞులు ప్రస్తావిస్తున్నది తెలిసిందే! ఈ లెక్కన నేటి భూభాగాలు సముద్రాలుగా, సముద్రాలు భూభాగాలుగా రూపాంతరం చెందవచ్చు. పోతే, ఈ మార్పుకు వేలాది సంవత్సరాలు పట్టవచ్చు. ఈ మార్పు ఒక్కసారిగా జరిగే పరిణామం కాదు. ఇది మనం పరిశీలించనంతగా వుంటుంది. అంటే, ఈ పక్రియ ఇప్పటికే మొదలై వుండవచ్చు కూడా! ఈ మార్పును గుర్తించే సామర్థ్యం ఏ సాంకేతికతకు వుండదు.

మరి ఈ అంతర్గత భూపొరల చిరగడంతో, లోపలి పొర అయిన లోపలి కోర్‍ (innercore) నుంచి శిలాద్రవం బడబాగ్ని రూపంలో బయటకు చీల్చుకొని వచ్చే ప్రమాదం వుండవచ్చు. ఇలా జరుగుతే, అగ్ని పర్వతాలు లేని భారత్‍లాంటి (అండమాన్‍ దీవులు తప్ప) ఉపఖండంలో తిరిగి ఇవి పొడసూపవచ్చు! ఇదే కనుక జరుగుతే బడబాగ్ని దావానలంతో భూభాగమంత వ్యాప్తి చెందవచ్చు. యావత్‍ జీవరాశి (మానవుడితో సహా) పెను ప్రమాదంలో పడిపోవచ్చు! ఇది వాస్తవమా అని అనుమానం రావచ్చు. కాని, ఈ ముందస్తు పరిణామాల గూర్చి నేచర్‍ జియో సైన్సు (nature geo science) పత్రికలో కథనాలుగా వచ్చాయి. వస్తూనే వున్నాయి. అమెరికా, కెనడా దేశాల్లోని జియో సైన్సు సెంటర్లు ఈ పరిశోధనల్ని చేపట్టడం, ఊహగానాలు చేయడం చేస్తున్నాయి. అయినా మనం ఈ కథనాల్ని ఊహజనితంగా భావించినా, ప్రపంచవ్యాపితంగా జరుగుతున్న విభిన్న రకాల విపత్తులు వీటికి ఉతాన్నిస్తున్నాయి. వివిధ రకాల విపత్తులను ముందస్తుగా గుర్తించి, జాగ్రత్తలు తీసుకున్నా జరగాల్సిన ప్రాణ నష్టం, విధ్వంసం జరుగుతూనే వున్నాయి. ఇక సముద్రాల్లో జనించే బడబాగ్నిని ఎదుర్కోవడం బహుష మానవుడికి సాధ్యం కాకపోవచ్చు!

‘నీవు భూమికి భారం’ అని దూషించడం తెలిసిందే. అంటే, సదరు వ్యక్తి జీవించడం వ్యర్థమని, పోతే భూమికి కొంత భారం తగ్గుతుందని సగటు మనిషి భావన. ఇదే అవగాహన చాలామంది చదువుకున్న వారికి కూడా కలగడం సహజం. ద్రవ్యనిత్యత్వ నియమం (law of conservation of mass) ప్రకారం ఇలా జరగదు. పోతే ఓ ప్రాంతంలో భారం పెరుగుతే, విధిగా మరో ప్రాంతంలో భారం తగ్గుతుంది. ఇది వాస్తవిక, శాస్త్రీయ ఆలోచన. ఈ విధానాన్ని సర్దుబాటు (adjustment)గా పరిశీలకులు చెపుతారు. కాని, ఈ మధ్యన జరుగుతున్న పరిశోధనలు కొన్ని కొత్త విషయాల్ని బయటకు తెస్తున్నాయి. ఇందులో ప్రధానంగా హైడ్రోజన్‍, హీలియం లాంటి తేలికైన వాయువులు భూ ఉపరితల వాతావరణం నుంచి బాహ్య రోదసి (space)లోకి భూమ్యాకర్షణకు వ్యతిరేకంగా (anti gravitational) వెలుతున్నట్లు, ఇది సుమారుగా ప్రతి సంవత్సరం 50 వేల టన్నుల నుంచి లక్ష టన్నుల భారాన్ని కలిగి వుంటుందని అంచనా. ఉష్ణోగ్రత పెరిగిన కొద్ది, పదార్థంలోని అణువుల మధ్య కదలిక పెరిగి పరమాణవుల చలనం పెరగడం, ఒకదానికి ఒకటి దూరంగా జరగడం తెలిసిందే! కాని, ఉష్ణోగ్రత అధికంగా పెరిగితే ఈ వేగం మరింతగా పెరిగి భూమ్యాకర్షణకు దూరంగా వెళ్ళుతున్నట్లుగా భావిస్తున్నారు. అంటే పరమాణువుల వేగం సెకనుకు 11 కి.మీ. పైగా వుంటున్నట్లుగా గుర్తించాలి. దీనికి గల కారణం, భూమి సాధారణం కంటే, అధిక వేడిని పొందడమే!
ఇదే పద్ధతిలో వాతావరణంలోని నీటి అణువులు కూడా అల్ట్రా వయోలెట్‍ కిరణాలతో విడివిడి, హైడ్రోజన్‍ ఆక్సీజన్‍గా వేరైతే, హైడ్రోజన్‍ బాహ్య రోదసిలోకి వెళ్ళి పోతున్నట్లుగా కూడా పరిశీలనలు తెలుపుతున్నాయి. అలాగే భూమిలో జరిగే రేడియో ఆక్టివిటీ ద్వారా కుల్లింపబడిన పదార్థాల నుంచి వెలువడే హీలియం వాయువు కూడా భూ బాహ్య పరిధిని దాటిపోతున్నట్లుగా భావిస్తున్నారు. అనగా, హైడ్రోజన్‍, హీలియం లాంటి తేలికైన వాయువులు భూకక్ష్య పరిధి నుంచి టన్నుల కొద్ది వెళ్ళిపోతున్నాయి. అంటే, ఇదే మోతాదులో భూగోళం యొక్క ద్రవ్యరాశి (mass) కూడా తగ్గిపోతుందని భావన.

ఈ ప్రకృతి చర్యకు విలోమంగా ప్రతి సంవత్సరం సుమారు 40 నుంచి 50 వేల టన్నుల అంతరిక్ష దూళి, ఉల్కాపాతం భూమిని చేరుతున్నట్లుగా శాస్త్రజ్ఞులు లెక్కలు కడుతున్నారు. అంటే, భూకక్ష్య నుంచి వెళ్లిపోతున్న వాయువుల భారాన్ని బాహ్యరోదసి నుంచి వచ్చే రోదసి పదార్థాలు కొంతమేర సరితూచుతున్నాయి. అయినా సుమూరు 50 వేల టన్నుల భూభారం సంవత్సర సంవత్సరానికి తరుగుతున్నట్లే లెక్క. అయితే, ఈ తరుగుదల భూగోళం యొక్క మొత్తం ద్రవ్యరాశిపై ఏమాత్రం ప్రభావాన్ని చూపవు. అనగా, ఈ 50-60 వేల టన్నులు ప్రతి బిలియన్‍ భూద్రవ్యరాశిలో కేవలం 45వ భాగం మాత్రమే! (ప్రపంచ జనాభా 8 బిలియన్లు అనుకుంటే, ఇందులో కేవలం 360 మంది మాత్రమే తగ్గుతున్నట్లుగా లెక్క).
భూమి ఏర్పడి 4.54 బిలియన్‍ సంవత్సరాలుగా అంచనా వేస్తే, నాటికి నేటికి భూమి ద్రవ్యరాశి కేవలం 10 శాతం పెరిగిందని, ఇది కూడా థియా (theia) అనే అంగారక (mars) గ్రహంతో సమానమైన ఓ గ్రహం భూమిని ఢీకొట్టగా, భూ గోళం నుంచి చంద్రుడు విడివడినా, భూ ద్రవ్యరాశి పెరిగింది కేవలం పదిశాతమే! వీటితో పాటు, మానవ నిర్మిత యాంత్రిక ఉపగ్రహాలు, ప్రయోగించిన తర్వాత తిరిగి భూమికి రానివి సుమారు 65 టన్నులుగా అంచనా. ఈ లెక్కన వీటి ద్రవ్యరాశి భూగోలంపై ఎలాంటి ప్రభావాన్ని చూపవు.

వీటన్నింటి నేపథ్యంలో భూమికి బాహ్యంగా పెద్ద ముప్పు అంటూ ఏమిలేదు. అలాగే అతి దగ్గరలో (వేలాది సంవత్సరాల) కూడా ఎలాంటి ప్రమాదం వుండదని గట్టిగా చెప్పగలం. కాని, భూ అంతర్గత పొరల కదలిక, చిరుగుదల, కేంద్ర భాగంలో వుండే శిలాద్రవం భూమికి భవిష్యత్తులో ఎలాంటి ఉపద్రవాల్ని తెచ్చిపెడుతుందో మన ఆలోచన పరిధిలో లేవు. దీనికి మానవుడిగా చేయాల్సింది, భూమిని విభిన్న కారణాలతో గుల్లబొడవక పోవడమే!

  • సముద్రపు అలలు ఆహ్లాదకరంగా వుంటాయి. కొన్ని అలలు అలా కాదు. అలస్కా దేశంలో జులై 9, 1958 ఏర్పడిన లిటియూ బే సునామి (the lituya baty tsunami) అత్యంత భారీ అలల్ని సృష్టించింది.
  • సుమారు 90 మిలియన్ల టన్నుల భారీ మంచు ఖండికను గిల్‍బర్ట్ సంధిలోకి (gilbert inlet) అత్యంత వేగంతో పడగొట్టింది.
  • దీంతో అన్ని వైపుల భూభాగాలు పెద్దకుదుపుకు గురై భూస్వరూపాలే మారిపోయాయి.
  • ఇవి సునామిలా కాకుండా సముద్రాల అలల కలయికతో ఏర్పడుతాయి.
  • సాధారణ అలలకన్నా ఇవి రెండు, మూడింతలు వుంటాయి.
  • వీటిని గుర్తించలేము.
  • వీటి అలల ఎత్తు సుమారు 1720 అడుగులుగా వుంటాయని గుర్తించారు.
  • ఇవి ఎప్పుడు, ఏ ప్రాతంలో వస్తాయో తెలియదు. కాబట్టి వీటిని తిరుగుబోతు (Rogue) అలలుగా గుర్తించారు.

(వచ్చే సంచికలో.. మహానగరాల్లో కుంగుతున్న నేలను చూద్దాం!)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *