సూర్యకాంత మణి పేరుకు తగ్గట్టే అస్తమించే సూర్యుడు నీటిపై తేలియాడే వివిధ ఛాయలతో, అక్కడక్కడా మెరిసే మచ్చలు కలిగి సూర్యకాంతి ఘనీభవించినట్టు కనిపిస్తుంది. ఈ లక్షణాల వల్ల దీనికి సన్ స్టోన్ అనే పేరు వచ్చింది. అన్ని సంస్క•తులలో దీనిని సూర్యునికి అనుసంధానం చేయబడిన రత్నంగా భావించ బడింది.
సన్‍స్టోన్‍కు అవెంచురైన్ ఫెల్డ్స్పార్, హెలియోలైట్, ఒలిగోక్లేస్ సన్‍స్టోన్ వంటి అనేక పేర్లు ఉన్నాయి. హెలియోలైట్: వాణిజ్య పరంగా గోల్డ్స్టోన్ లేదా గిరాసోల్ అని కూడా అంటారు. సంస్క•తంలో సూర్య కాంత (సూర్యకాన్త) అని పిలుస్తారు, దీని అర్థం ‘‘సూర్యుని ప్రేమించేది’’, ఇది సూర్యకాంతిలో వేడెక్కుతుందనే పురాణ కథ కూడా ఉంది. హిందీలో సూర్యకాంత్ (సూర్యకాంత) లేదా సూర్య మణి; తెలుగులో సన్‍స్టోన్ లేదా సూర్యకాంతము అంటారు. ఈ రాయి దాని లాక్షణికమైన సూర్యుని లాంటి మెరుపు (అవెంచరెసెన్స్) కాపర్ లేదా హెమటైట్ ఇన్‍క్లూజన్లు కాంతిని ప్రతిబింబించడం వల్ల ఏర్పడుతుంది.
గ్రీకు ‘‘హెలియోస్’’ (సూర్యుడు) పేరు మీద ‘‘హెలియోలైట్’’ అనేవారు; 1801లో ఫ్రెంచ్ మినరాలజిస్ట్ జీన్-క్లాడ్ డెలమెథేరీ దాని మెరిసే సౌర రూపం వల్ల ‘‘సన్‍స్టోన్’’ అని పేరు పెట్టారు. ఆకర్షించే మెరుపు, దాని వెచ్చని ఆరెంజ్-రెడ్ రంగులు మరియు ఇరిడెసెంట్ ఫ్లాష్‍ల వల్ల (షిల్లర్) ఈ ఉపరత్నం లోని రంగులు నీటిపై సూర్యకాంతులు వెదజల్లే అస్తమించే సూర్యుని పోలి ఉంటాయి.

చరిత్రలో సన్ స్టోన్:
‘‘సన్ స్టోన్’’ (sunstone) చారిత్రక నేపథ్యం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది కేవలం ఒక రాయి మాత్రమే కాకుండా, ప్రాచీన కాలం లో నావికులకు దిక్సూచిలా పనిచేసింది.
సన్ స్టోన్ ప్రధానంగా వైకింగ్స్ (vikings) కాలం నాటి చరిత్రతో ముడిపడి ఉంది. క్రీ.శ. 800-1066 మధ్య కాలంలో ఉత్తర ఐరోపాకు చెందిన వైకింగ్స్ సముద్ర ప్రయాణాల్లో దీనిని ఉపయోగించేవారని చరిత్రకారులు చెబుతుంటారు. కానీ ఈ రాయి ఫెల్డస్పార్ రకం సన్ స్టోన్ అయి ఉండదని, ఇది ఐస్లాండ్ స్పార్ కావచ్చని చరిత్ర కారుల అభిప్రాయం. ఈ రెండు కూడా అప్పటిలో ‘‘సన్ స్టోన్’’లుగా వ్యవహరించబడటంవల్ల కొంత అస్పష్టత నెలకొంది. పురాతన కాలం నాటి ఒక మునిగి పోయిన ఓడలో ఐస్లాండ్ స్పార్ అనే రకం కాల్సైట్ దొరికింది.
ఆ కాలంలో దిక్సూచి (compass) అందుబాటులో లేదు. వైకింగ్స్ సముద్రంపై ప్రయాణించేటప్పుడు సూర్యుని స్థానాన్ని బట్టి దిశలను గుర్తించేవారు. అయితే, ఉత్తర అట్లాంటిక్ ప్రాంతంలో తరచుగా మంచు కురవడం లేదా ఆకాశం మేఘావ•తమై ఉండటం వల్ల సూర్యుడు కనిపించేవాడు కాదు. అటువంటి సమయాల్లో సన్ స్టోన్ (ఐస్లాండ్ స్పార్) వారికి పనికివచ్చేది.
1.కాంతి ధ్రువణం (Polarization)
సూర్యకాంత మణి ఒక సహజ సిద్ధమైన పోలరైజింగ్ ఫిల్టర్ లాగా పనిచేస్తుంది. సూర్యుడు మేఘాల వెనుక ఉన్నా లేదా దిగువ క్షితిజ సమాంతర రేఖ (Horizon) కింద ఉన్నా, ఆకాశంలోని కాంతి ఒక ప్రత్యేక పద్ధతిలో వ్యాపిస్తుంది. వైకింగ్ నావికులు ఈ రాయిని ఆకాశం వైపు ఎత్తి పట్టుకుని తిప్పినప్పుడు, ఒక నిర్దిష్ట కోణంలో ఆ రాయి రంగు మారుతుంది లేదా దాని ప్రకాశం (Brightness) పెరుగుతుంది. దీని ద్వారా సూర్యుడు ఎక్కడున్నాడో వారు గుర్తుపట్టేవారు.
2.హైడింగర్స్ బ్రష్ (Haidingerus Brush) గుర్తించడం
సూర్యకాంత మణి గుండా చూసినప్పుడు, కాంతి తీవ్రతలో వచ్చే మార్పులను నావికులు గమనించేవారు.
ఖచ్చితమైన స్థానం: రాయిని తిప్పుతున్నప్పుడు కాంతి అత్యంత ప్రకాశవంతంగా మెరిసే బిందువును వారు గుర్తించేవారు.
ట్రయాంగులేషన్ (Triangulation):
ఆకాశంలోని రెండు వేర్వేరు ప్రాంతాలలో ఈ రాయి సహాయంతో పాయింట్లు గుర్తించి, ఆ రెండు రేఖలు కలిసే చోట సూర్యుడు ఉన్నాడని లెక్కించేవారు.
రాయిలోని మెరుపులు (Inclusions)
ఫెల్డస్పార్ సూర్యకాంత మణిలో ఉండే హెమటైట్ లేదా రాగి రేకుల వల్ల కలిగే మెరుపులు (Aventure scence) నావికులకు బహుశా సహాయపడేవి కావచ్చు. ఈ మెరుపుల వల్ల కాంతిలో వచ్చే చిన్న మార్పులను స్పష్టంగా గమనించే అవకాశం ఉంది.
సూర్యుడి కిరణాలు రాయిపై పడగానే, ఆ లోపల ఉండే రేకులు వెలుగును ప్రతిబింబించి బహుశా సూర్యుడి దిశను సూచించేవి. ఈ లక్షణాలు నావికులకు కొంత ఉపయోగపడ్డా ‘‘ఐస్లాండ్ స్పార్’’ వలె ఖచ్చితమైన నావిగేట్ ఉపయోగాలు ఈ రత్నానికి ఉండదు.
కాల్సైట్ (Iceland spar)
దాని పోలరైజేషన్ మరియు డబుల్ రిఫ్రాక్షన్ స్వభావం ఆధారంగా మబ్బుల్లో ఉన్న సూర్యుడు ఏ దిక్కున ఉన్నది తెలుసుకునే వారు. ఐస్‍లాండ్ స్పార్ (కాల్సైట్) తో పోలిస్తే ఫెల్డస్పార్ సూర్యకాంత మణికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి.
మన్నిక: కాల్సైట్ చాలా మెత్తగా ఉండి త్వరగా పగిలి పోతుంది. కానీ సూర్యకాంత మణి (ఫెల్డ్స్పార్) గట్టిగా ఉండి సముద్ర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.
ఈ కారణాల వల్ల చరిత్రలో వైకింగ్స్ వాడిన సన్ స్టోన్ ‘‘కాల్సైట్’’ కావచ్చు. సూర్యకాంత మణి కూడా నౌకాయానానికి పనికి వస్తుందనే నమ్మకం ఆ రోజుల్లో ప్రబలి ఉండవచ్చు.

భారతీయ సాహిత్యంలో ప్రస్తావనలు:
భారతీయ సాహిత్యంలో సూర్యకాంత మణిని కేవలం ఒక రత్నంగానే కాకుండా, సూర్య శక్తికి ప్రతీకగా వర్ణించారు.
కాళిదాసు ‘అభిజ్ఞాన శాకుంతలం’:
మహాకవి కాళిదాసు తన ప్రసిద్ధ నాటకంలో సూర్యకాంత మణిని ఒక ఉపమానంగా వాడారు. శాంతంగా కనిపించే మునులలో కూడా దాగి ఉన్న క్రోధాన్ని సూర్యకాంత మణితో పోల్చారు. ఈ మణిపై సూర్యకిరణాలు పడగానే అగ్నిని ఎలా వెదజల్లుతుందో, మునులను అవమానిస్తే వారు కూడా అలాగే అగ్ని వలె దహిస్తారని వర్ణించారు.
పురాణాలు:
‘దేవీ భాగవతం’లో మణిద్వీపాన్ని వర్ణించే క్రమంలో సూర్యకాంత మణితో నిర్మించిన ప్రహారీ గోడలు లేదా గదుల ప్రస్తావన ఉంది.
సంస్కృత సాహిత్యం:
జైన గ్రంథాలలో ధనికులు, రాజుల పల్లకీలు మరియు భవనాలు సూర్యకాంత వంటి విలువైన మణులతో పొదగబడేవని పేర్కొన్నారు. దీనిని ‘సూర్యకాంతమణి’, ‘సూర్యోపల’, ‘జ్వలనాశ్మ’ వంటి పేర్లతో పిలుస్తారు.
ఆయుర్వేద గ్రంథాలలో సూర్యకాంత మణి లక్షణాలను వివరించే ముఖ్యమైన శ్లోకాలు ఉన్నాయి.
లక్షణ శ్లోకం (ఆయుర్వేద ప్రకాశం 5/141):
శుద్ధ: స్నిగ్ధో నిర్వ్రణో నిస్తుషోన్తర్యో నిఘష్టోత్యన్తనైర్మల్యమేతి।
య: సూర్యాస్పర్శనిష్ఠ్యూతవహ్నిర్జాత్య: సోయం కథ్యతే సూర్యకాన్త:।।
తాత్పర్యం: ఏ మణి అయితే శుద్ధంగా, నునుపుగా, రంధ్రాలు లేకుండా ఉంటుందో మరియు సూర్యకిరణాలు తగలగానే అగ్నిని పుట్టిస్తుందో దానిని ‘సూర్యకాంత మణి’ అంటారు.
గుణ శ్లోకం (రస తరంగిణి 23/185):
సూర్యకాన్తో మతో మేధ్య ఉష్ణశ్చైవ రసాయన:।
బలాసవాతశమనౌ విశేషేణ చ కీర్తిత:।।
తాత్పర్యం:
సూర్యకాంత మణి బుద్ధిని పెంపొందిస్తుంది (మేధ్యం). ఉష్ణ వీర్యాన్ని కలిగి ఉంటుంది. రసాయనంగా (వ•ద్ధాప్యాన్ని అరికట్టేది) పనిచేస్తుంది. ఇది వాత మరియు కఫ దోషాలను హరిస్తుంది.
ఖనిజ లక్షణాలు;
సన్ స్టోన్ (sunstone) అనేది ఫెల్డ్స్పార్ గ్రూప్‍కు చెందిన ఒక ఖనిజం. ఇది ప్రధానంగా ఒలిగోక్లేస్ (oligoclase) లేదా ఆర్థోక్లేస్ (orthoclase) రకాల ఫెల్డ్స్పార్ రకాల్లో కనిపిస్తుంది.
భౌతిక లక్షణాలు
సన్ స్టోన్‍కు మోస్ హార్డ్నెస్ 6.0-6.5 మధ్య ఉంటుంది. ఇది పారదర్శకం నుండి అర్ధపారదర్శకం వరకు ఉంటుంది. విశిష్ట గురుత్వం 2.64-2.66. రసాయన కూర్పు (Ca,Na) (Al,Si) 2Si2O8.
ట్రైక్లినిక్ క్రిస్టల్ సిస్టమ్ కలిగి ఉంటుంది. ఆప్టికల్ ఎఫెక్ట్:
ఇందులో రాగి, హెమటైట్ లేదా గోథైట్ వంటి చిన్న షీట్ల ఇన్‍క్లూషన్లు (ప్లేట్‍లెట్స్) ఉండటం వల్ల అద్భుతమైన మెరుపు (Aventurescence లేదా Schiller) కనిపిస్తుంది. ఈ ఎఫెక్ట్ కాంతి ప్రతిఫలనం వల్ల వివిధ రంగులు మరియు ఆకారాలు కనిపిస్తాయి. రంగులు: ఎరుపు, ఆరెంజ్, గోల్డెన్, గ్రీన్, బ్లూ వంటివి; కేంద్రంలో గాఢంగా అంచుల్లో పలుచగా ఉంటుంది. స్పటికాలు కణస్వభావం (Granular) లేదా పెద్ద ఆకారంలో ఉంటాయి.
సన్ స్టోన్ ఏర్పడే భౌమ పక్రియలు;
సన్ స్టోన్ ఏర్పడే పక్రియ మాగ్మాటిక్ మరియు మెటామార్ఫిక్ పక్రియలతో ముడిపడి ఉంటుంది.
మాగ్మాటిక్ ఏర్పాటు:
రాతి ద్రవంలో (మాగ్మా) ఫెల్డ్స్పార్ (ఒలిగోక్లేస్ లేదా లాబ్రడారైట్) క్రిస్టల్స్ మెల్లగా చల్లార్చినప్పుడు ఏర్పడుతుంది. ఈ సమయంలో రాగి, హెమటైట్ లేదా గోథైట్ వంటి లోహ షీట్లు (ప్లేట్‍లెట్స్) క్రిస్టల్‍లలోకి చేరి, aventurescence మెరుపును సృష్టిస్తాయి. గ్రానిట్, సైనైట్, పెగ్మటైట్ వెయిన్స్లో ఈ పక్రియ ఎక్కువగా జరుగుతుంది. నీస్ (Gneiss) లేదా ఇతర మెటామార్ఫిక్ రాళ్లలో ఒత్తిడి, వేడి ప్రభావంతో ఫెల్డ్స్పార్‍లో ఇన్‍క్లూషన్లు ఏర్పడి సన్ స్టోన్‍గా మారుతుంది. డెక్కన్ ట్రాప్స్ వంటి బేసాల్ట్ లావా ఫ్లోస్‍లో కూడా చిన్న స్థాయిలో ఈ పక్రియ జరుగవచ్చు. ఈ భౌమ పక్రియలు జరగటానికి లక్షలాది సంవత్సరాలు పడుతాయి, ఫలితంగా పారదర్శకంగా మెరిసే రత్నం ఏర్పడుతుంది. భారతదేశంలో రాజస్థాన్ పెగ్మటైట్లు, తెలుగు రాష్ట్రాల్లో ఈస్టర్న్ ఘాట్స్ గ్రానిట్లలో ఉన్న సన్ స్టోన్ లు ఇలా ఏర్పడినవే.
సహజ లభ్యత (Natural Occurrence)
సన్‍స్టోన్ ప్రపంచవ్యాప్తంగా కొన్ని నిర్దిష్ట ప్రాంతాలలో మాత్రమే లభిస్తుంది.
ఒరెగాన్, అమెరికా:
ప్రపంచంలోనే అత్యుత్తమ నాణ్యత గల ‘రాగి’ (copper) కలిగిన సన్‍స్టోన్లు ఇక్కడ దొరుకుతాయి.
ఇతర దేశాలు: నార్వే, కెనడా, రష్యా మరియు టాంజానియా దేశాలలో కూడా ఇది లభిస్తుంది.
భారతదేశం: ఆంధప్రదేశ్, తమిళనాడు, రాజస్తాన్ మరియు ఒడిశా రాష్ట్రాలలో సహజ సిద్ధమైన సన్‍స్టోన్ గనులు ఉన్నాయి. భారతదేశంలో ఫెల్డ్స్పార్ ఉత్పత్తిలో రాజస్థాన్ అగ్రస్థానంలో ఉంది.

అజ్మీర్ జిల్లా: రాజస్థాన్‍లో ఫెల్డ్స్పార్ ఉత్పత్తికి ఇది అత్యంత ముఖ్యమైన ప్రాంతం. బేవార్ మరియు అజ్మీర్ నగర పరిసర ప్రాంతాల్లో వివిధ రంగుల ఫెల్డ్స్పార్‍లు లభిస్తాయి. ఇందులో సన్‍స్టోన్‍కు ప్రత్యేకతనిచ్చే ‘‘షిల్లర్’’ (schiller) లేదా ‘‘అవెంచురెసెన్స్’’ (aventurescence) మెరుపు ప్రభావం కలిగిన రాళ్లు కూడా ఉన్న… తెలుగు రాష్ట్రాలు (ఆంధప్రదేశ్, తెలంగాణ)లో సన్ స్టోన్‍లు అరుదుగా లభిస్తాయి. ఇవి ప్రధానంగా ఫెల్డ్స్పార్ డిపాజిట్లలో కనిపిస్తుంది.
తెలంగాణలో:
తెలంగాణలో రంగారెడ్డి (కందుకూరు ప్రాంతం), మహబూబ్‍నగర్, హైదరాబాద్ సమీప గ్రానిటిక్ రాళ్ళల్లో పెగ్మటైట్, క్వార్ట్జ్-ఫెల్డ్స్పార్ వెయిన్స్లో ఫెల్డ్స్పార్ డిపాజిట్లు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఫెల్డ్స్పార్ ఒకరకమైన aventurescentఎఫెక్ట్తో లభ్యమవుతుంది.
ఆంధప్రదేశ్‍లో:
ఆంధప్రదేశ్‍లో ఈస్టర్న్ ఘాట్స్ ప్రాంతం (విశాఖపట్నం జిల్లా: పడేరు, చింతపల్లి, నర్సీపట్నం)లో రత్నం గ్రేడ్ ఫెల్డ్స్పార్ సంబంధిత డిపాజిట్లు ఉన్నాయని సమాచారం.
ఓరెగాన్ సన్ స్టోన్ (USA):
అమెరికాలోని ఓరెగాన్ రాష్ట్రం లాబ్‍రాడర్ ఫెల్డ్స్పార్ డిపాజిట్ల నుండి వచ్చే గోల్డెన్-గ్రీన్ అవెంచురెసెంట్ సన్ స్టోన్ ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధమైనది. దీనిని రాజస్థాన్ (భారతదేశం) నుండి వచ్చే రెడ్-గోల్డ్ సన్ స్టోన్‍తో పోల్చవచ్చు.
గ్రీన్ సన్ స్టోన్ చాలా అరుదుగా, ఓరెగాన్‍లో మాత్రమే ప్రధానంగా లభిస్తుంది. రెడ్ సన్ స్టోన్ భారతదేశం, మడగాస్కర్‍లో ఎక్కువగా లభిస్తుంది.
ఉపయోగాలు (Uses)
నగలు:
ఉంగరాలు, హారాలు మరియు చెవి కమ్మల తయారీలో దీనిని విస్తృతంగా ఉపయోగిస్తారు.
ఆయుర్వేద ఉపయోగాలు:
ప్రత్యామ్నాయ వైద్యంలో ఇది ఒత్తిడిని తగ్గించడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి మరియు రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుందని నమ్ముతారు.
అలంకరణ:
విలాసవంతమైన గృహాల అలంకరణలో ఈ రాళ్లను షో-పీస్‍లుగా ఉపయోగిస్తారు.
వీటితోపాటు ఇతర మెటాఫిజికల్ ఉపయోగాలు కూడా ఉన్నాయి.
-చకిలం వేణుగోపాలరావు
డిప్యూటి డైరెక్టర్ జనరల్ జిఎస్సై(రి)
ఎ: 9866449348
శ్రీరామోజు హరగోపాల్,
ఎ : 99494 98698
