శాస్త్రవేత్తలు, ప్రయోగశాలలో ఏదేని కొత్త విషయాన్ని ఆవిష్కరించినపుడు ఎంత ఆనందపడతారో, అలాగే పురావస్తు పరిశోధకులు కూడా మానవ జీవన వికాసక్రమాన్ని ఖచ్చితంగా అంచనా వేయగలిగే ఆధారం లభించినపుడు అంతకంటే ఆనందపడతారు. తెలంగాణాలో జోగులాంబ-గద్వాల జిల్లా, ఐజ మండలంలోని ఉట్నూరు వద్ద ఎఫ్‍ఆర్ ఆల్చిన్, బెండపూడి సుబ్బారావు అనే పురావస్తు పరిశోధకులకు కూడా అలాంటి అనుభూతి కలిగింది. 1960-61లో ఉట్నూరులోని కొత్తరాతియుగపు స్థావరం వద్ద తవ్వకాలు జరుపుతున్న వారికి సమీపంలోని కుటుకునూరు, మాచనపల్లి, ఐజ, ఇంకా ఉట్నూరు వద్ద ఎత్తైన బూడిదదిబ్బలు కనిపించాయి. గమ్మత్తేమిటంటే ఈ బూడిదదిబ్బల్లో కొత్తరాతియుగపు (సా.శ.పూ.2100) నునుపైన, పదునైన మొనలు గల నల్లశానపు రాతిగొడ్డళ్లు, సూక్ష్మరాతి పనిముట్లు, గచ్చకాయ, ఊదారంగు మట్టిపాత్రల ముక్కలు, ఇంకా ఎముకలు కూడా కనిపించి, కొత్తరాతియుగపు జీవన విధానాన్ని తెలుసుకోవటానికి ఉపయోగపడినాయి.
ఉట్నూరు తవ్వకాల్లో ఎఫ్‍ఆర్ ఆల్చిన్, ఆయన భార్య బి.ఆర్. ఆల్చిన్‍లతో పాటు బెండిపూడి సుబ్బారావు పాల్గొన్నారు. గుడారాల్లో కుటుంబ సమేతంగా ఉన్న ఆల్చిన్‍తో పాటు వాళ్ల ముద్దుల కూతురు సుశీల కూడా, వాళ్ళతోపాటే కొత్తరాతియుగపు స్థావరాల్లో, బూడిద దిబ్బల వద్ద బులి బులి నడకలతో కలియదిరిగుతున్న దృశ్యం పరిశోధకుల దృష్టినాకర్షించింది. స్థిరనివాసం, నాణ్యమైన రాతిపనిముట్ల తయారీ, పశువులను మచ్చిక చేసుకోవటం, ముమ్మరవ్యవసాయం లాంటి కొత్త జీవన విధానాన్ని ఆవిష్కరించిన కొత్తరాతియుగాన్ని గార్డెన్‍ఛైల్డ్, విప్లవమన్నాడు. గుడిసెల్లో ఉంటూ సమీపంలో పశువుల కొట్టాలనేసుకొని జీవించేవారు. పొలాల్లో కొంత కాలం పశువులను మేపుతూ, అక్కడే బసచేసేవాళ్లు. ఆ సందర్భంగా పశువుల పేడను, ఒకచోట దిబ్బగా పోగేసేవారు. అలా పోగేసేటప్పుడు, వారు వినియోగించిన పాత్రలు,
రాతిగొడ్డళ్లు, మాంసాహార అవశేషాలను కూడా అందులో విసిరేసేవారు. అలా కొత్తరాతియుగపు వ్యవసాయక జీవులు ఏర్పరచిన పేడ దిబ్బల్ని, కాల్చి, వేడుక చేసుకొనేవారు. ఆ వేడుకలో సంక్రాంతి సందర్భంగా ఇప్పటికీ కొనసాగుతున్న భోగిమంటలు. మన సంక్రాంతి సంబరాలు కొత్తరాతియుగంలోనే ప్రారంభమైనాయనీ, అవి దక్షిణాది రాష్ట్రాలతోపాటు ఇప్పటికి నాలుగువేల ఏళ్ల నాడే తెలంగాణాలోని ఉట్నూరు వద్ద ఆనవాళ్లు లభించటం, తెలంగాణా ఒక చరిత్రలో మైలురాయి.
-ఈమని శివనాగిరెడ్డి-స్థపతి,
ఎ : 9848598446
