మంతటిలో లభించిన ఒక శాసనం ఫోటోపంపి, చదువమని అడిగారు దేశపతి శ్రీనివాస్ గారు. హిమజ్వాలగారు తనకు పంపారట.
నేను ఈ శాసనం గురించి ఎంక్వైరీ చేస్తూ మా కొత్త తెలంగాణ చరిత్రబృందం పరిశోధకసభ్యుడు బైరోజు శ్యామసుందర్ ను సంపద్రించినపుడు తాను కపిలవాయిగారి రచనల్లో వెతికి వివరాలు తెలిపారు.
నాగర్ కర్నూలుకు 6కి.మీ.ల దూరంలోవున్న నారాయణకట్ట, వలపట్ల దారిలో ఇటికెలదారిలో మంతటి దగ్గర ఈదెమ్మగుట్ట (బయ్యన్నగుట్ట) మీద ఈ శాసనం, భైరవవిగ్రహం ఉన్నాయి. వలపట్ల వనపట్లగా మారిపోయింది.
మఱ్ఱితాడు, మఱ్ఱితాటి నుంచి పలుకుబడి మారి ‘మంతటి’ పేరొచ్చింది. ఈ వూర్లో బయ్యన్నగుట్ట, ఆ గుట్టమీద భైరవుని విగ్రహం, ఆ భైరవప్రతిష్ట జరిగినపుడు వేసిన శాసనం ఉన్నాయి.
(కపిలవాయి కిషోర్ బాబు-నాగరకర్నూలు తాలూకా గ్రామనామాలు)
మహబూబునగర్ జిల్లా శాసనసంపుటి-1లో శాసనముందని తెలిసింది. అయితే శాసనపరిష్కారంలో తప్పులు దొరలినట్లు గుర్తించి, తిరిగి శాసనపాఠం సవరించనైనది.
శాసనంలో మూడంకెల శకవర్షం రెండంకెలలోనే వుంది. 97తర్వాత ‘త్తద్నేయ’ అనివుంది. మూడవ పంక్తిలో ‘మసవళ’కు బదులు ‘యెగవళ’ అని, ‘భైరవస ప్రతిష్ట వనిపఱెతియ నమ’కి బదులు ‘భైరవన ప్రతిష్టించెని పఱతి యనస’ అని వుంది.
ఆ శాసనపాఠం:
‘‘స్వస్తి సక వరిస 97(9)త్తద్నేయ విళంబి సంవత్స
ర క(న్దూ)ర సంకరగణ్డ నంకకాఱ
మసవళ కేతయన స్త్రిన
అత్తికబ్బయ మాడిసిద
భైరవస ప్రతి(ష్ట) వనిపఱెతి
యనమ।।’’
క్రీ.శ.105(8) విళంబి సంవత్సరంలో అంకకార కందూరు శంకరగండని మంత్రి కేతయ భార్య అత్తియకబ్బె వనిపఱెతిలో భైరవప్రతిష్ట చేయించిందని శాసన సారాంశం. ఈ శాసనం మహబూబునగర్ జిల్లా శాసనసంపుటి-1లో శాసనసంఖ్య 71, పేజి నం.99లో అచ్చైంది.
శ్రీరామోజు హరగోపాల్,
ఎ : 99494 98698
