ఈ మధ్యకాలంలో సేంద్రియ సాగు, ప్రకృతి వ్యవసాయం, ఆర్గానిక్ ప్రొడక్టస్ అనే మాటలు వింటున్నాం. నిజానికి ఇవి ఇప్పటి తరానికి కొత్త మాటలు కావచ్చు. కానీ ఇవన్నీ మన పాత తరానికి సుపరిచితాలే. మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తూ, ఎలాంటి రసాయన ఎరువులు, జన్యు మార్పిడి విత్తనాలు వాడకుండా, సహజ వనరుల నుండి పోషకాలను, సేంద్రియ ఎరువులను ఉపయోగించి పంటలు సాగు చేయడాన్ని సేంద్రీయ వ్యవసాయం అంటారు.
పురుగులు, తెగుళ్లు తట్టుకొనే మంచి విత్తనాన్ని ఎన్నుకొని, దుక్కి లోతుగా దున్ని, సరైన సమయంలో విత్తనాన్ని నాట వలసి ఉంటుంది. ఎటువంటి రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండా వృక్ష సంబంధిత వ్యర్థాలు, కషాయాలు వాటం ఈ సాగు ముఖ్యఉద్దేశ్యం.
అతి ఖరీదైన రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకపోవడం వలన సాగు ఖర్చు చాలా తగ్గుతుంది. వాతావరణం, నేల, భూగర్భ జలాలు కాలుష్యం నుంచి కాపాడబడతాయి. అందరికీ ఆరోగ్యకరమైన పోషక విలువలు కలిగిన ఆహారం అందించబడుతుంది. ఆహార ధాన్యాలు, పప్పు దినుసులు, నూనె, కూరగాయలు, పండ్లు మొదలైనవి సేంద్రియ సాగు చేస్తున్న రైతులు తమ ఉత్పత్తులకు సేంద్రియ ధ్రువీకరణ పొందవలసి ఉంటుంది. సేంద్రియ ధృవీకరణ సంస్థ రైతు పొలాలను, తోటలను దర్శించి, అక్కడ సాగును పరిశీలించి, సేంద్రియ ఉత్పత్తులను జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తనిఖీ చేసి ధ్రువీకరణ చేస్తుంది.
ఈ ధ్రువీకరణ పొందగోరు రైతులు ఎటువంటి రసాయనక ఎరువులు, పురుగు మందులు వాడకుండా, సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసి ఉత్పత్తి చేయవలసి ఉంటుంది. చీడపీడల నివారణకు జీవ నియంత్రణ పద్ధతులు, వృక్ష సంబంధిత కషాయాలు, గోఆధారిత పోషకాలు వాడవలసి ఉంటుంది. ఈ ధ్రువీకరణ వలన వినియోగదారులకు వారు కొనుగోలు చేసే వస్తువులపై నమ్మకం బరోసా ఏర్పడతాయి. మార్కెట్లో అవకవకలు నియంత్రణలనో ఉంటాయి.
అందరికీ ఆరోగ్యం అనే ఆశయంతో పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ స్ఫూర్తితో, గౌరవ వ్యవసాయ మరియు ఉద్యాన శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి ఆదేశాల మేరకు ఖమ్మం పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా సేంద్రియ రైతు బజార్ (హెల్త్ మార్కెట్) ను ఏర్పాటు చేయడం జరిగింది. ఖమ్మం జిల్లా గత కలెక్టర్ శ్రీ ముజామ్మిల్ ఖాన్, ఐఏఎస్గారి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖల సహకారంతో ఉద్యానన శాఖ ఏర్పాటు చేసిన ఈ సేంద్రియ రైతు బజార్లో ఎటువంటి రసాయనాలు పురుగు మందులు వాడకుండా, సహజ వనరుల నుండి పోషకాలను ఉపయోగించి పంటలు సాగు చేసి ఉత్పత్తి చేసిన ఆహార ధాన్యాలు, పప్పు దినుసులు, నూనెలు, పండ్లు సరసమైన ధరలకు అందుబాటులో ఉంచారు. సేంద్రియ రైతు బజార్ ఏర్పాటుతో జిల్లాలో సేంద్రి విధానాలతో సాగు చేసే రైతులకు కొత్త-ఉత్సాహం వచ్చింది. వ్యవసాయ ఉద్యాన సొసైటీ సలహాదారు శ్రీ నల్లమల వెంకటేశ్వరరావు సేంద్రియ రైతు బజార్ ఏర్పాటు చేయడానికి అటు అధికారులు ఇటు రైతు సోదరులకు వెన్నుదన్నుగా నిలిచారు.
ఉద్యాన శాఖ డైరెక్టర్ శ్రీమతి యాస్మిన్ భాష, ఐఏఎస్ గారి ఆదేశాల మేరకు ఈ రైతు బజార్లో సేంద్రియ విధానాలతో సాగు చేసిన పంటలతో పాటు ఇతర సేంద్రియ ఉత్పత్తులు, గానుగ నూనెలు, కారం, పసుపు, పాలు కూడా విక్రయించడానికి ఉంచినారు.
ప్లాస్టిక్ రహితంగా ఈ సేంద్రియ రైతు బజార్ ఉండాలని ప్రస్తుత జిల్లా కలెక్టర్ శ్రీ అనుదీప్ దురిశెట్టి ఐఏఎస్ గారి ఆశయం మేరకు ప్లాస్టిక్ బదులుగా జూట్ బ్యాగులు, బట్ట సంచులు అమ్మడానికి మహిళా సమాఖ్యల కొరకు స్టాల్లు కేటాయించబడినది.
ఖమ్మం పట్టణ ప్రజలు ఉపయోగించుకుంటున్న ఈ సదవకాశం త్వరలో రాష్ట్రంలోని అన్ని పట్టణాలకు, నగరాలకు కలగాలని ఆశిద్దాం.
సముద్రాల విజయ్ కుమార్
ఎ : 837444992
