అద్వితీయమైన క్లాసికల్‍, పాపులర్‍ సైన్స్ తెలుగు కంద పద్యమంజరిఅరుణాచలం సృజించిన అపూర్వ విజ్ఞాన సాహిత్య వల్లరి

‘‘… విశాల విశ్వమున భూరి రహస్యములెల్ల విప్ప ఈ మానవజాతి మనుగడకు మంచియగున్‍ గణితమ్ము వల్లనే-’’
‘‘గణితము సౌందర్యమునకు వినియోగమునకు నెలవని వివరింపదగున్‍
వినియోగము సేవక వృత్తిని సౌందర్యమ్ముదాత్త తేజము దెలుపున్‍’’
‘‘పరిశీలన పరిశోధనలిరు తెరుగుల వృద్ధి గోరి హేరాళముగా
వరలను గణిత నమూనాల్‍ కోరముట్లై శాస్త్ర ప్రగతి కొరకిద్దరలో’’

అని ఆచార్య పుదూరు విశ్వనాథ అరుణాచలం (1935-2020) గణిత శాస్త్ర ప్రయోజనాన్నీ, ఇంకా గణితానికుండే సేవక స్వభావాన్ని, సౌందర్య ఉదాత్తతను చాలా స్పష్టంగా చెప్పడమే కాక ఈ శాస్త్రానికి సంబంధించి అబ్జర్వేషన్‍, రీసెర్చ్ విభాగాలలో మ్యాథమెటికల్‍ మోడల్స్ ఎలా దోహదపడతాయో కూడా ఈ ‘సంగవిద’ తొలి పుటల్లోనే వివరిస్తారు.
ఆద్యంతమూ అద్వితీయంగా సాగిన అద్భుతమైన రచన ‘సంగవిద’! ఈ పేరు ‘సంగవిద’ అనగానే ఇదేమిటని అందరికీ సందేహం వస్తుంది. ‘సంక్షిప్త గణిత విశ్వదర్శ’ని అంటే గణిత ప్రపంచాన్ని సంక్షిప్తంగా దర్శింప చేసేదని అర్థం. అయితే ఈ నాలుగు మాటలలోని తొలి అక్షరాలను స్వీకరించి, కొత్త అక్షర సమ్మేళనాన్ని డా. పివి అరుణాచలం సృజించారు. ఇలాంటి పక్రియను ఇంగ్లీషులో అయితే ‘అక్రొనిమ్‍’ అని అంటాం, తెలుగులో దీన్ని ‘హ్రస్వరూపం’ అని అనొచ్చు. అంటే శ్రీరంగం శ్రీనివాసరావుని శ్రీ శ్రీ అనడం లాగా అన్నమాట, లేదా జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రిని జరుక్‍ శాస్త్రి అన్నట్టు! పెద్దలు అరుణాచలం ఇలాంటి ప్రయోగాన్ని తరచూ చేశారు. హైస్కూల్‍ స్థాయిలలో ‘క సా గు’, ‘గ సా భా’ తరహాలోనే వీరు ‘లంబ స్పర్శ రేఖల ఖండన బిందు పథం’ అనే దానిని ‘లస్పథం’ అని వాడారు.
అలాగే ‘వక్ర నాభుల మార్గం’ అనే దానికి ‘వనామార్గం’ అనే ప్రయోగం చేశారు. ఇలాంటివి ఇంకొన్ని ఉండే ఉంటాయి. మన మాతృభాషలో విజ్ఞానం అనే దృష్టీ, ప్రయత్నం అనేవి మనకు తీవ్రంగా ఉంటే కానీ ఆయన తపన మనకు బోధపడదు.
తర్వాత ఈ పుస్తకం పేరులోనే బ్రాకెట్లో గణితము ప్లస్‍ సాహిత్యము అని కూడా కనబడుతోంది. అంటే ఇందులో మ్యాథమేటిక్స్, లిటరేచర్‍ కలిసి ఉంటాయని రచయిత, కాదు కవి సూచిస్తున్నారు. దీన్నే మరో విధంగా చెప్పాలంటే వస్తువు గణితమైతే, వ్యక్తీకరించే విధానం సాహిత్యరూపం అంటే పద్యం. పుస్తకం శీర్షిక క్రింద గణితాత్మకమైన పరిభాషలో కొన్ని చిహ్నాలు కూడా వాడారు. వాటన్నిటిని ఇప్పుడే వివరించి పాఠకులను గాబరా పెట్టాల్సిన అవసరం లేదు. శీశ్రీ పదబంధాలను అనుకరిస్తూ, ఆ స్టాంజాలో ముప్పాతికను స్వీకరిస్తూ ‘‘గణితమ్మొక పద్మవ్యూహం… కవిత్వమొక తీరని దాహం’’ అని పెద్దలు అరుణాచలం అనడమే కాదు, ఆ మాటలను పుస్తకం ఇన్నర్‍ కవర్‍ మీద దర్శింప చేస్తారు. ఇది ఈ పుస్తకం నామకరణపు అంతరార్థం గురించి స్థూలంగా చెప్పే సమాచారం లేదా అది పాఠకులకు కలిగించే పర్సెప్షన్‍.


ఎనిమిదో తరగతిలో సుదీర్ఘమైన ఆల్జీబ్రా లెక్క పూర్తి చేసినాక మా టీచరును నేనే అడిగాను, ‘‘ఇలాంటి క్యాలిక్యులేషన్‍ వల్ల ప్రయోజనం ఏమిటి, ఎక్కడ పనికి వస్తాయి?’’ అని. ఆయన చాలా మంచివారు కనుక చివాట్లు పెట్టలేదు కానీ నాకు సంత•ప్తికరమైన జవాబు మాత్రం ఇవ్వలేకపోయారు. అయితే ఆ విషయాన్ని మేము గమనించినా ఆయన దబాయించలేదు. నేను ఎమ్మెస్సీ ఫిజిక్స్ పూర్తి చేసిన తర్వాత, రీసెర్చ్ కి వెళ్లే ముందు కొన్ని నెలలు హిందూపురం కళాశాలలో పాఠాలు చెప్పినప్పుడు ఇంట్లో ఏడో తరగతి గణిత శాస్త్రం టెక్సట్ బుక్‍ తారసపడింది. ఆ పుస్తకం ముందుమాటలో, ‘‘విశ్వాంతరాళంలోని రెండు వస్తువుల మధ్య దూరాన్నీ, ఆ రెండింటి మధ్య పని చేసే బలాలను లెక్క కట్టడానికి గణిత శాస్త్రం పనికి వస్తుం’’దని వివరించారు. నిజానికి ‘‘ఏమి చదువులో… ఎందుకో’’ అనే మాటలు చాలా తరచుగా అంటూ ఉంటారు. కానీ అలా ఏమీ ఉండవేమో! ఎనిమిదో తరగతి మాస్టరు నాకు అర్థమయ్యేట్టు చెప్పి ఉండేవారు తనకు తెలిసి ఉంటే, అది జరగలేదు. స్కూల్లో పాఠాలు బోధించే టీచర్లు గానీ, ఇంట్లో పిల్లల బాధ్యతను గమనించే తల్లిదండ్రులు కానీ ఆ పుస్తకాల మొదటి పేజీల్లో ఉండే ఉపోద్ఘాతాలు లేదా మున్నుడిగా రాసినవి చదివితే ఇలాంటి ధర్మసూక్ష్మాలు బోధపడతాయి. అలాంటి ధోరణి లేకపోవడం వల్లనే మనకు చాలా చిన్న చిన్న విషయాలు తర్వాత తర్వాత మరీ అర్థం కాని జటిలమైన గందరగోళాలుగా మిగిలిపోతాయి. అంటే మనం నేర్చుకునే విద్య, సాధించే నైపుణ్యం ఎవరికోసం, ఎందుకోసం అనే స్పష్టత తెలిసి ఉండాలి. అప్పుడే చదివిన చదువుకే కాదు, జీవితానికి కూడా అర్థం ఏమిటో కొంచెం సిద్ధిస్తుంది. నాకు గుర్తుంది, ఎమ్మెస్సీలో ఫిజిక్స్ ప్రొఫెసర్‍ ‘‘టెక్సట్ బుక్‍ అంటే ఏమిటి’’, అని ఒక రోజు అడిగారు, మా క్లాస్మేట్స్లో కొందరు కొన్ని కొన్ని జవాబులు చెప్పారు. కానీ వాటినన్నింటిని పక్కకు తోసి Text book is one, which gives the concepts అని ఆయన చాలా సూక్ష్మంగా, అర్థవంతంగా చెప్పారు. గైడ్లు, కొశ్చెన్‍ బ్యాంకులు వంటివి మాత్రమే చదువుకునే ఎంతోమందికి ఇది ఆశ్చర్యంగాను, అర్థం లేని విషయంగానూ అనిపించ వచ్చు.


“imagination is more important than knowledge”అని శాస్త్రలోకపు కుల గురువైన Albert Einstein అంటారు. ఇదే విషయాన్ని అరుణాచలం కవితాత్మకంగా ‘‘జ్ఞానము కన్నను ప్రముఖమైనవి భావమ్ములూహలని నుడివిన ఐన్‍ స్టైను’’ అని పద్యానువాదం ఇందులోనే కనబడుతుంది. దీన్ని లోతుగా పరికిస్తే మరిన్ని విషయాలు మరింత మార్మికంగా మనకే గోచరమవుతాయి. అందుకే ఆ ఐన్‍ స్టైన్‍ మహాశయుడే ‘‘Pure Mathematics is in its way, the poetry of logical ideas’’ అని చెప్పిన విషయాన్ని ముందు పేజీలోనే రచయిత మనకు గుర్తు చేస్తారు. అంతేకాదు, గణిత శాస్త్రజ్ఞుడు సంపూర్ణం కావాలంటే ఎంతో కొంత కవిత్వాంశ ఉండాలని Karl Weierstrass చెప్పిన మాటను కూడా గుర్తు చేస్తారు. ఇంకా Sofia Kovalevskaya మహనీయుడు ‘‘ఆత్మలో కవి కానివాడు గణిత శాస్త్రజ్ఞుడు కానేకా’’డని చెప్పిన సంగతిని ఇక్కడే గుర్తు చేస్తారు. G K Chesterton ఇదే భావనను ఇంకొంచెం సృజనాత్మకంగా, ‘‘కవి స్వర్గలోకంలోకి తల దూర్చాలని ప్రయత్నిస్తే గణిత శాస్త్రవేత్త ఆ స్వర్గాలోకాలనే తన మస్తిష్కంలోకి అమర్చుకోవాలని వాంఛిస్తా’’రని మనం అదిరిపోయేట్టు చెప్పారు. ఒక్క క్షణం ఆలోచన చేయండి. గణితం, కవిత్వం ఈ రెండిటిని సమన్వయం చేసిన మహాతత్వవేత్తలను, ఉత్తమ సాహితీమూర్తులను అన్వేషించి వారు చెప్పిన ఉత్తమ అభిప్రాయాలను మనకందించారు అరుణాచలం. ఒకరికి మించిన రీతిలో మరొకరు చెప్పిన భాషితాలను చూస్తే కొంగ్రొత్త తాత్విక దృక్కోణాలు తరిచి చూచేకొద్దీ తారసపడతాయి. అదే సమయంలో ఆచార్య అరుణాచలం ఎంత కాలంగా ఈ ప్రత్యేకమైన బాణీలో అధ్యయనం చేశారో కొంత అవగాహన కూడా కలిగే అవకాశం ఉంది.


స్థూలంగా ఆయా గణితాత్మకమైన వ్యక్తుల గురించి వివరించడానికి కంద పద్యాలని ఎంచుకున్నారు డా.పి.వి. అరుణాచలం. ఇందులో తెలుగువారు, భారతీయులు, ఆసియా వాసులు, ప్రపంచవాసులు ఇలా ఎంతోమందిని అలాగే ఇప్పుడు ఉన్నవారితో పాటు గతంలో గొప్ప చరిత్రను స•ష్టించి మహనీయులుగా మన మదిలో నిలిచిపోయిన వారి గొప్పతనం లేదా రూపొందించిన పద్ధతి లేదా సూత్రం మొదలైన వాటిని జఠిలమైనవిగా పేరుగాంచిన కందపద్యాలలో సులువుగా వ్యక్తికరించారు ఈ కవి. పద్య నిర్మాణానికి సంబంధించి మాట్లాడినప్పుడు అరుణాచలం గారిని కవి అని మాత్రమే మనం సంబోధించాలి, ఎందుకంటే వారి సాహితీ నైపుణ్యం అలా ఉంది. తెలుగు పద్య నిర్మాణంలో అత్యంత క్లిష్టమైనది అని పేరుగాంచిన కందపద్యాన్నే ఈ రచనలో విస్తృతంగా వాడారు ప్రస్తుత కవి. దీనికంటే ముందు ఆయన ఈ విషయాలను చెప్పడానికి వచనం కాకుండా చందోబద్ధమైన పద్య పక్రియను ఎందుకు ఎంచుకున్నారని కూడా కొంత తర్కించాలి. మాటలు చెప్పలేని మెలో డ్రామాని, మనో సంక్లిష్టతను చెప్పడానికి సినిమాలో పాట అవసరమవుతుందని వేటూరి సుందర రామ్మూర్తి ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్టు గుర్తు. కొందరికి ఐదారు పద్యాలు లేదా ఇంకొంచెం ఎక్కువ రాసి ఉండవచ్చు. అదే సమయంలో ముగ్గురికి, ఆ మాటకొస్తే బెర్నూలి వంశపు శాస్త్రవేత్తలు ఎనిమిది మందికి కలిపి ఒక పద్యం రాసిన సందర్భం వంటివి కూడా ఈ పుస్తకంలో కనబడతాయి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అన్నట్టు వచనమంటే విజ్ఞానమే. దీనినే మనం ఇంకోరకంగా తర్కించి పద్యం అంటే కొంత మార్మికతే అని కూడా చెప్పుకోవాల్సి ఉంది. ఆయా గణిత శాస్త్రపు వ్యక్తుల కృషిలో లేదా ఫలితాల్లో నెలకొన్న జీవనమకరందపు పద్య వ్యక్తీకరణలో ఏదో ఒక రకమైన మేలి ముసుగు వంటి మార్మికత లేకపోతే రక్తి కట్టదు. ఒక పద్యం రాసినా, నాలుగు పద్యాలు రాసినా కవి ఆయా వ్యక్తుల జీవన మర్మాలను అధ్యయనం చేసే ఈ పద్యాలను చెక్కారు. నిజానికి మాట్లాడితే ప్రతి శీర్షికా పద్యానికి లేదా పద్యాల మాలికకు నేపథ్యం, ఉద్దేశం, సాధించిన ఫలితం అని మూడు కోణాలలో పాఠకులకు విశ్లేషించాల్సి ఉంది. మాస్టారు అరుణాచలం గతించిన ఐదు సంవత్సరాలకు ఈ ‘సంగవిద’ ప్రచురణ సాకారం అవుతున్నది. మరి ‘సంగవిద’ ఆధారమైన టీక, తాత్పర్యాలను పోలిన ‘సంగవిద కోశము’ ఎవరు, ఎప్పుడు చేస్తారు? ఇప్పుడైతే మనం కలనైనా దాన్ని ఊహించలేము!


(మా) క్లాస్‍ రూమ్‍ లో యూలర్‍ గా పలకబడిన లియోనార్డ్ ఆయిలర్‍ (Leonhard Euler) శీర్షికన ఏడు పద్యాలు కనబడతాయి. ఈ మహానుభావుడు ఎవరు? 1707-1783 మధ్యకాలం జీవించిన గణిత శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త, ఖగోళవేత్త, తర్కవేత్త, ఇంజనీరు వగైరా! ఇంకా.. గ్రాఫ్‍ థియరీ, టోపాలజీ వంటి విభాగాలను ఆవిష్కరించిన ఈ శాస్త్రవేత్త అనలిటికల్‍ నంబర్‍ థీరీ, కాంప్లెక్స్ అనాలసిస్‍ మొదలైన విభాగాలలో కూడా చెప్పుకోదగ్గ ఆవిష్కరణలను ప్రవేశపెట్టారు. అంతకుమించి ఆధునిక గణిత శాస్త్రంలో సరికొత్త చిహ్నాలనూ పదజాలాన్ని వారు ప్రవేశపెట్టారు. పై (జూ), క్యాపిటల్‍ సిగ్మా (ఆ), క్యాపిటల్‍ డెల్టా(?) వంటి వాటిని తొలిసారి వినియోగించి ప్రాచుర్యంలోకి అర్థవంతంగా తెచ్చిన ఆలోచనాశీలి, సృజనాత్మక మేధావి ఈ శాస్త్రవేత్త. ఇంకా చాలా విషయాలు ఆయన ప్రతిభ గురించి, సాధన గురించి అందుబాటులో ఉన్నాయి. అంతకుమించి ఆయన జీవితం చాలా తృప్తికరంగా, ఆనందంగా సాగింది. ఆయన భార్య మంచి చిత్రకారిణి కూడా. ఆర్కిమెడిస్‍, న్యూటన్‍, గౌస్‍ తర్వాత గొప్ప వ్యక్తిగా అయిలర్‍ ను పండితులు పేర్కోలేదు గానీ, వారికి తీసిపోని మహానుభావుడని అరుణాచలం ఈ తొలి పద్యాల్లో వాకృచ్చారు.
‘‘గణితము శాస్త్రమొ? కళయో? మనకీ మీమాంస వలదు మహిలో శాస్త్రమ్మున కాత్మాయగున్‍, కళకు ఘన భూషణమై చెలంగు’’ అని ‘గణగణ ఘంటా’ అనే పద్యాలలో ఒకచోట అంటారు కవి. దీనిని మనం వివరించనక్కరలేదు. క్రీస్తుపూర్వం 1200 కాలానికి చెందిన లగధ ముని గణిత శాస్త్రపు గొప్పదనాన్ని శ్లోకంగా చెప్పిన పండితుడు, వేదాంగ జ్యోతిష్యాలలో ఘనుడు అంటూ వారికి నమస్సులర్పించి ఈ రచనకు శ్రీకారం చుడతారు. క్రీస్తుపూర్వం 800-740 మధ్యకాలంలో జీవించిన మన భారతీయుడు బౌధాయనుడు ‘సమ కోణత్రిభుజపు సూత్రం’ (ఆధునిక పరిభాషలో పైథాగరస్‍ థీరమ్‍) ప్రతిపాదించినా కూడా ఆ కీర్తి ఆయనకు దక్కలేదంటూ ‘‘చరిత్ర నిటువంటి ఘటనలు కొల్లల్‍’’ అని ఆ పద్యాన్ని ముగిస్తారు. కేరళ ప్రాంతానికి చెందిన క్రీస్తు శకం 1350-1425 కాలానికి చెందిన మాధవ గురించి ఆ ప్రాంతపు గణిత సంబంధమైన కృషికి ఆద్యుడని కొనియాడుతూ, గణిత శాస్త్రంలో మొదటి అనాల్సిస్‍ చేసిన తొలి శాస్త్రజ్ఞుడు భారతీయుల భాగ్యమంటూ గుర్తు చేయడం మనకు మహదానందంగా ఉంటుంది. ఇలా విరహాంక, హేమచంద్ర, గోపాల, నారాయణ పండితుడు, పరమేశ్వర, పింగళాచార్యుడు, ఎల్లయ్య మంత్రి, శ్రీధర, వేదము లక్ష్మీనారాయణ, తడకమళ్ళ వెంకట కృష్ణారావు, మల్లికార్జున సూరి, వల్లభామాత్యుడు, హరిశ్చంద్ర, పిడపర్తి కృష్ణమూర్తి, తెన్నేటి వెంకట సుబ్బారావు, ఆర్‍.సి.గుప్తా, ఆర్‍.వైద్య నాథస్వామి, సి.టీ.రాజగోపాల్‍, గోవిందస్వామి, ఆర్యభట్టు2, ఆర్యభట్ట1, భాస్కర1, ఒమ్మి రామస్వామి, ఎస్‍.మీనాక్షి సుందరం, శ్రీపతి, పీ.సీ.మహల్నబీస్‍, వరాహమిహిరుడు, దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్‍, శంకరనారాయణ, లక్కోజు సంజీవరాయ శర్మ, పావులూరు మల్లన, పి.ఎస్‍.శేషాద్రి, శకుంతలా దేవి, మహా వీరాచార్యుడు, శ్రీనివాస రామానుజన్‍, బ్రహ్మ గుప్త వంటి భారతీయుల గురించి వారి గొప్పతనం గురించి ఖణేల్‍ ఖణేల్‍ అంటూ పద్యాలు పడుతూ ఉంటే మనకు పులకలు రాకమానవు. న్యూటన్‍, టైకోబ్రాహీ, గెలీలియో, లైబ్నిజ్‍, బెర్నోలి, మాక్స్వెల్‍, బాబేజీ, కోపర్నికస్‍, ఐన్‍ స్టీన్‍ మొదలైన వారి గురించి చెప్పనక్కర్లేదు, అద్భుతమైన పద్యాలు ఉన్నాయి. కొందరు అద్భుతమైన శాస్త్రవేత్తల గురించి అమోఘమైన పద్యాలు ఇలా ఉన్నాయి.

పంచాంగపు లెక్కల సవ రించిన గణితజ్ఞుడు, కవి, ఇంకెన్నో సాధించిన ఘటికుడు ఖయ్యామ్మెంచి హృదయపూర్వకముగ నిత్తు నివాళిన్‍ ఎంతో ప్రసిద్ధి చెందిన ‘ది మెన్‍ అఫ్‍ మ్యాథమెటిక్స్’ పుస్తకాన్ని రచించిన స్కాట్లాండ్‍ రచయిత ఈ.టీ.బెల్‍ (1883-1960) గురించి:
గణితజ్ఞుల జీవిత కథలను వారి గణితములను కలగలిపిన విలక్షణమైన పుస్తకము బెల్‍ ప్రణీతము లభించె మనదు భాగ్యము పండెన్‍ మన దేశానికి చెందిన క్రీస్తు శకం 598-670 కాలానికి చెందిన బ్రహ్మగుప్తుడి గురించి:
భారత గణిత పతాకను తారాపథమున నునిచిన ధన్య చరితుడౌ సూరి గద బ్రహ్మగుప్తుడు అరబ్బులు మెచ్చ రతని ఆవిష్కరణల్‍ ఇటలీకి చెందిన 1564-1642 కాలానికి చెందిన గెలీలియో గురించి:
గణితమ్మును గతి శాస్త్రమును వినియోగించి ప్రక•తి మోహన సత్యాలను కనబరచిన మహనీయుని, శాస్త్రజ్ఞుని గలీలెయోను స్తుతింతున్‍ ఆంధప్రదేశ్‍ కడప ప్రాంతం, ప్రొద్దుటూరుకు చెందిన 1907-1998 కాలపు లక్కోజు సంజీవరాయ శర్మ గురించి:
పుట్టుకతో లేవు కనులు దిట్ట గణిత ఖేలనమున – తికమక పరచే గట్టి సమస్యలనెన్నో అట్టే ఎదుర్కొనెను శర్మ అతనిని దలతున్‍ మన గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్‍కు ఇంగ్లండ్‍ లో ఎంతో సాయం చేసిన జి.హెచ్‍.హార్డీ గురించి:
భారత గణిత జ్యోతికి ప్రేరణ గల్పించి పెంచి పెద్దగా జేసెన్‍ కారణజన్ముడు హార్డీ గౌరవపాత్రుడు సతతము గణిత ధరిత్రిన్‍ అంతర్జాతీయంగా స్టాటిస్టిక్స్లో గొప్ప ఖ్యాతి పొందిన భారతీయ, తెలుగు శాస్త్రవేత్త సి.ఆర్‍.రావు గురించి:
కళ, శాస్త్రము, సాంకేతిక తలు ముప్పేటలుగా వికసితమ్మై విజ్ఞానులకు వరము సాంఖ్యకమని పలికే సి ఆర్‍ రావు గారు ప్రాజ్ఞులు మెచ్చన్‍ మన దేశానికి చెందిన, ఏ కాలపు వారో పూర్తిగా తెలియని ఎల్లయ మంత్రి గురించి:
గణితమున కృతులు, వ్యాఖ్యలు గణనీయముగా రచించి ఘనుడయెను తెనుంగున – నెల్లయ మంత్రి వరుడు ప్రణుతించ వలయునతని పరిణిత ధిషణన్‍ అలాగే 12వ శతాబ్దికి చెందిన తెలుగు ఘనుడు ఎలుగంటి పెద్దన గురించి:
తెలుగున గణిత గ్రంథం బులు రచియించుట సకృతు పూర్వము, ధృతితో నెలుగంటి పెద్దనార్యుడు వెలయించే నొక గణిత కృతి- వినతుల తనికిన్‍ తిరుపతివాసి, కెనడాలో గణితవేత్తగా రాణించిన మతుకుమల్లి వెంకట సుబ్బారావు (1921-2006) గురించి:
అంకెల కాననమందు విశృoఖలముగా తిరిగినట్టి సింహమనంగా వెంకట సుబ్బారావ్‍ మోదంకర బోధకుడు, గురువు తలతును ప్రీతిన్‍

ఇలా ఏ పద్యానికాపద్యాన్ని అద్భుతంగా గణిత మనోరంజకంగా ఆచార్య పుదూరు విశ్వనాథ అరుణాచలం తీర్చి సృజించారు. ఎవరికి వారు గణిత శాస్త్రమర్మాలను ఎరిగి విజ్ఞాన సాహిత్యపు లోతులను తనివితీరా ఆనందపు మునకల్లో మేళవించుకోవచ్చు.
ఇక పద్య నిర్మాణంలో పెద్దలు అరుణాచలం ఎంత సంప్రదాయవాదో, అంతకు మించిన రీతిలో ప్రయోగశీలి అని కొన్ని పద్యాలలోని వారి పోకడలు గమనిస్తే బోధపడుతుంది. ఒకటవ ఆర్యభట్టు గురించి రాసిన పద్యంలో జూ (పై) ని అంతర్భాగంగా చేసేశారు. అలాన్‍ టూరింగ్‍ (1912-1954) గురించి రాసిన పద్యం ఇలా సాగుతుంది:
టీ సీ ఎస్‍, ఏఐ లను భాసిల్లగ జేసి తనదు పరిశోధనలన్‍
వాసిగని అలాన్‍ టూరింగ్‍ సూసైడుకు పాల్పడియెను క్షోభ మిగిల్చెన్‍
ఇందులో థీరిటికల్‍ కంప్యూటర్‍ సైన్స్ (టీసీఎస్‍), ఆర్టిఫిషియల్‍ ఇంటెలిజెన్స్ (ఏఐ) అనే మాటలను కుదించిన రూపంలోనూ ఇంకా అలాన్‍ టూరింగ్‍, సూసైడు పదాలను అలాగే కందంలో అందంగా అమర్చేశారు అరుణాచలం గారు. కనుక ఛందోబద్ధమైన పద్యం రాశారు కనుక, వీరు కరుకు సంప్రదాయవాది అని తీర్మానించాల్సిన పనిలేదు. హాయిగా ఇంగ్లీషు అదే సైన్సు పదాల్ని అలాగే తెలుగు పద్యంలో మిళితం చేసేశారు.
ఇది సంక్షిప్త గణిత విశ్వదర్శిని మాత్రమే కాదు, అరుణాచలం మహాశయుడి అమోఘ వైజ్ఞానిక సాహిత్య క్రీడా నైపుణ్యపు ప్రదర్శిని!?

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *