ప్రపంచ జనాభా పెరుగుతూపోతుంది..మరి ఆరోగ్య భద్రత ఏది?జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం

ప్రపంచ జనాభా నిమిష నిమిషానికి పెరుగుతోంది. 2023 నాటికి 800 కోట్లుగా ఉన్న ప్రపంచ జనాభా, 2025 నాటికి 823.1 కోట్లు దాటిందని అంచనా. ఈ జనాభాలో అత్యధిక జనాభా కలిగిన దేశాలలో భారత్‍, చైనా మొదటి రెండు స్థానాలలో ఉన్నాయి. భారత్‍ ఇటీవలే చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించి మొదటి స్థానంలోకి రాగా, చైనా రెండో స్థానానికి దిగింది.


భారత జనాభా 2025 నాటికి 146.39 కోట్లకు పైగా ఉండగా, చైనా 141.6 కోట్ల జనాభాతో కొనసాగుతుంది. అయితే నానాటికి పెరుగుతూపోతున్న జనాభాతో ప్రయోజనాలు ఏమున్నా, లేకపోయినా సమస్యలు మాత్రం ప్రబలంగా ఉన్నాయి. జనాభాకు సరిపడా వనరులు లేకపోవడం, ఉన్న వనరులు తరిగిపోవడంతో పేదరికం ఎక్కువవుతుంది, ఆకలి బాధలు పెరుగుతున్నాయి.
ప్రతీ ఏడాది జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పెరుగుతున్న ప్రపంచ జనాభా ప్రభావాలు ఎలా
ఉన్నాయి, ముఖ్యంగా ఆరోగ్య రంగంపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుంది. జనాభా నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది మొదలైన విషయాలను తెలుసుకుందాం.

జనాభా పెరుగుదల సమాజంపై, పర్యావరణంపై హానికరమైన ప్రభావాలు చూపుతుంది. అంతేకాదు, ఇది మనుషుల ఆరోగ్యంపై దీని ప్రభావం తీవ్రంగానే ఉంది. మానవ ఆరోగ్యంపై అధిక జనాభా ప్రభావాలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.
జనాభా పెరుగుదల కారణంగా అనేక అంటు వ్యాధులు వ్యాప్తి చెందడం పెరిగింది. కోవిడ్‍ వంటి మహమ్మారి ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. క్షయ, మలేరియా, కలరా, డెంగ్యూ జ్వరం, మరెన్నో వ్యాధుల సంక్రమణ ప్రమాదం ఎక్కువైంది.
నీటి వనరులు కలుషితం అవుతున్నాయి, ప్రజలు కలుషితమైన నీరు తాగాల్సి వస్తుంది. ఫలితంగా నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదం పెరిగింది. వైరస్‍లు మరింత త్వరగా వ్యాప్తి చెందుతాయి, రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రమాదకరమైన ఉత్పరివర్తనలు ఏర్పడతాయి.
వాయు కాలుష్యం పెరిగి శ్వాసకోశ సమస్యలు ఎక్కువయ్యాయి. ప్రజలు ఆస్తమా, ఊపిరితిత్తుల క్యాన్సర్‍, ఛాతీ నొప్పి, గొంతు నొప్పి, గుండె జబ్బులు, ఇతర శ్వాసకోశ వ్యాధుల బారినపడుతున్నారు.
ఆహార పదార్థాల కల్తీ పెరిగింది. నాణ్యమైన ఆహారాన్ని తినలేకపోతున్నారు, ఇది అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఆయుర్దాయం తగ్గిస్తుంది. కొందరికి తినడానికి తిండిలేని పరిస్థితి ఉంది.
ఇతర ఆరోగ్య ప్రమాదాలు పెరిగాయి. భూమిపై పెద్ద పరిమాణంలో వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ఇవి క్యాన్సర్‍, నాడీ సంబంధిత వ్యాధులు, పుట్టుకతో వచ్చే వైకల్యాలు మొదలైన అనేక ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తున్నాయి.

జనాభా పెరుగుదల అనేది నేడు ప్రపంచం ఆందోళన చెందాల్సిన పరిస్థితి. ప్రపంచంలోని అన్ని దేశాలకు తలనొప్పి. అనేక ఆరోగ్య సమస్యలకు మూల కారణం. కాబట్టి ప్రపంచ దేశాలు ఈ సమస్యను గుర్తించి, పెరుగుతున్న జనాభాకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకోవాలి. ఉన్న జనభాకు సరిపడా వనరులు పెంచాలి. వివిధ అవసరాలకు, ఆరోగ్య రంగంపై ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాలి. ప్రజల వ్యక్తిగత హక్కులను గౌరవిస్తూ సామాజిక, ఆర్థిక, పర్యావరణ అంశాలను పరిగణనలోకి తీసుకుని, అధిక జనాభాను పరిష్కరించడానికి సమగ్రమైన, బహుముఖ విధానం అవసరమని గమనించడం ముఖ్యం.

  • కె. సచిన్‍,
    ఎ : 86866 64949

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *