బౌద్ధ మత స్ఫూర్తి – బుద్ధారం కీర్తి

వనపర్తి జిల్లా గోపాలపేట మండలంలోని బుద్ధారం ఒక విశిష్ట చారిత్రిక గ్రామం. బుద్ధారం పేరులోనే వేల ఏండ్ల చరిత్ర దాగి ఉన్నది. పాత పాలమూరు జిల్లాకు చెందిన ప్రసిద్ధ సాహిత్య చరిత్రకారులు సురవరం ప్రతాపరెడ్డి తన ‘ఆంధ్రుల సాంఘిక  చరిత్ర’ (పుట 35)లో “బుద్ధాపురం … బుద్ధారెడ్డి పేర కట్టించినదే” అని రాయగా, కపిలవాయి లింగమూర్తి తన ‘పాలమూరు జిల్లా దేవాలయాలు’ (పుట 193)లో “గోన గణపిరెడ్డి తమ తండ్రి గారి పేర… స్ధాపించిన గ్రామానికి బుద్ధవరమని చెరువుకు ‘బుద్ధ సముద్రము’ అని పేరు” అని రాశారు. ఈ ఇరువురూ బుద్దారం గ్రామాన్ని క్రీ.శ. 13 వ శతాబ్దంలో గోన వంశీయులు కట్టించారని చెప్పారు. కాని ఎవరూ ఏ ఆధారాన్ని చూపలేదు. కపిలవాయి లింగమూర్తి ‘గోన బుద్ధారెడ్డి కొడుకు గణపి రెడ్డి తన తండ్రి పేర బుద్దారం గ్రామాన్ని కట్టించాడు’ అనగా, ప్రస్తుత పుస్తక రచయిత రమేశ్ బాబు బుద్ధారెడ్డి కొడుకులైన కాచ, విఠలులు తమ తండ్రి పేర బుద్ధారాన్ని కట్టించారు’ అని రాశారు. ఈయన కూడా ప్రాథమిక ఆధారం చూపలేదు. బుద్దారం గ్రామ చరిత్రపై ప్రాథమిక ఆధారాలు మృగ్యం కావడం వల్లనే పై రచయితలెవరూ ఆధారాలు చూపలేకపోయారనేది స్పష్టమవుతుంది. అయితే శాసనాది లిఖిత ఆధారాలు ఇప్పటి వరకు వెలుగు చూడకపోయినా బుద్ధారం చుట్టుపక్కల గ్రామ నామాలు సూచించే పురావస్తు విశేషాలను సమన్వయం చేసుకుంటే ఈ గ్రామ చరిత్ర సుమారు మూడు వేల ఏళ్ళ నాటిదని అర్థమవుతుంది.

రెండున్నర వేల ఏళ్ళనాటి బుద్ధుడికి పూర్వమే బుద్ధారం ప్రాంతంలో బృహత్ శిలా యుగం లేదా రాక్షస గూళ్ళ యుగం మనుగడ సాగించింది. ఆనాటి మానవులు ఇనుప ధాతువు కలిగిన రాళ్ళను పగులగొట్టి, పిండి చేసి, ఉడకబెట్టి ఇనుమును బయటికి తీశారు. ఇనుమును ఆనాటి భాషలో ‘అయ్’ అనేవారు. దేవత కృప వల్ల అంతటి  శక్తి తమకు వచ్చేది అనే నమ్మకంతో ఆనాటి మానవులు  మమ్మాయి (మమ్మ + ఆయి లేదా మహామాయి) అనే దేవతను కొలిచేవారు. ఆ దేవత పేరుతో బుద్ధారం సమీపంలో ‘మమ్మాయి పల్లె’ అనే గ్రామం ఉంది. బుద్ధారం చుట్టూ ఇనుప ధాతువు కలిగిన గుట్టలున్నాయి కాబట్టి ఇక్కడ ఇనుప పరిశ్రమ ఉండేదని చెప్పడం చరిత్ర విరుద్ధం కాదు. ఇక్కడి గండి హనుమాండ్ల ప్రాంతం రెండు-మూడు వేల ఏళ్ళ కిందట ఇనుప పరిశ్రమ కొనసాగిన ప్రాంతమే. ధైర్య శౌర్యాల స్ఫూర్తి కోసమే తొలుత ‘వీరున్ని’ పూజించేవారు. క్రమంగా ఆ వీరుడు హనుమంతుని రూపాన్ని సంతరించుకున్నాడు.

గట్టి ధాతువు / లోహం ఐన  ఇనుము విరివిగా అందుబాటులోనికి వచ్చిన తరువాత, ఆ ఇనుముతో గొడ్డలి వంటి అనేక పదునైన పనిముట్లు చేసుకున్న తరువాత వాటితో మైదాన ప్రాంతంలో ఉన్న అడవులను నరికి, వ్యవసాయ భూములను సిద్ధం చేసుకుని పంటలు పండించుకున్నారు. వ్యవసాయం చేయని సాధు సన్యాసులు, ఋషులు పంట పొలాలలో పరిగె ఏరుకునేవారని బుద్ధుని సమకాలికుడైన బావరి అనే ఋషి చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఆయన జగిత్యాల జిల్లాలోని గోదావరి నదీ తీర నివాసి కాబట్టి ఆయనకు ఆయన శిష్యుడు పింగియ ద్వారా బుద్ధుడు తన ‘బౌద్ధమతాన్ని ఆవలి తీరం చేర్చండి’ అనే సందేశం పంపాడని బౌద్ధ గ్రంథమైన సుత్తనిపాతలోని ‘పారాయణ వగ్గ’ అనే అధ్యాయం విశదపరిచింది. బుద్ధుని ఆదేశానుసారం బావరి శిష్య ప్రశిష్య పరంపర (500 మంది) బౌద్ధ మతంలోకి మారి బౌద్ధ మతాన్ని గోదావరి తీర ప్రాంతం నుంచి దక్షిణాదిన ఉన్న కృష్ణానదీ తీర ప్రాంతం వైపు ప్రచారం చేశారు.

ఆ సమయానికల్లా బుద్ధారం ప్రాంతం బృహత్ శిలా యుగం లేదా ఇనుప యుగం ప్రభావంతో పాడి పంటలతో విలసిల్లుతున్నది కాబట్టి సరళ భాషలో బౌద్ధ మత బోధనాంశాలైన త్రిరత్నాల గురించి, సమానత్వం గురించి ప్రచారం చేస్తున్న బౌద్ధ సన్యాసులకు బుద్ధారం ప్రాంత ప్రజలు అనురక్తులై ఆశ్రయమిచ్చారు. వారు నివసించిన స్థలాన్ని ఇప్పుడు పాటిగడ్డ (తాండ) అంటున్నారు. వారి ప్రభావంతో ఏర్పడిన గ్రామం ధర్మాపురం. బౌద్ధ ‘ధమ్మం’ ప్రచారం జరిగిన స్థలం కాబట్టి ఆ స్పూర్తితో దానికి ‘ధర్మాపురం’ అనే పేరు వచ్చింది. బుద్ధుడు తొలుత సారనాథ్ సమీపంలోని హరిణవనం (జింకలవనం)లో ధర్మం ప్రచారం చేశాడు కాబట్టి ఆ స్ఫూర్తితో బుద్ధారం సమీపంలో ‘జింకలబీడు’ అనే స్థలనామం వాడుకలోకి వచ్చింది. తదనంతర కాలంలో అక్కడ ‘జింకలబీడు’ అనే ఒక లంబాడి గిరిజన తాండ ఏర్పడింది. ఇక ఈ రెండు ప్రదేశాలకు ఆధారభూతమైంది బుద్ధారం. ఇది మెట్ట (ఎత్తైన) ప్రదేశం కాబట్టి దీనికి మొదట ‘మెట్ట బుద్ధారం’ అనే పేరు పెట్టి ఉంటారు. అదీ బౌద్ధ పవిత్ర స్థలమైన బోధ్ గయలోని ‘మెట్ట బుద్ధారం’ స్ఫూర్తితో. ఈ బౌద్ధ స్థలాలు – మెట్ట బుద్ధారం, ధర్మాపురం, పాటిగడ్డ, జింకలబీడు – అన్నీ క్రీ.శ. 12వ శతాబ్దం నాటి వీర శైవ మతస్థుల విజృంభణలో విధ్వంసానికి గురై ఉంటాయి. బుద్ధారంలోని బుద్ధేశ్వర ఆలయం 12వ శతాబ్ది నాటికి బుద్ధుడి ఆలయమే. పైన పేర్కొన్న స్థలాలలో భారత పురావస్తు శాఖ లేదా రాష్ట్ర వారసత్వ శాఖ తవ్వకాలు జరిపి పరిశోధన చేస్తే తప్పకుండా పైన ప్రస్తావించిన బౌద్ధ మత అవశేషాలు (సుమారు రెండు వేల నాలుగు వందల సంవత్సరాల కిందటివి) వెలుగులోకి వచ్చే అవకాశం మెండుగా ఉంది. పాటిగడ్డతాండలో ఒకప్పటి బౌద్ధ స్థూప – చైత్య – ఆరామ విహార అవశేషాలు బయటపడవచ్చు.

2350 ఏండ్ల కిందటి మౌర్య సామ్రాజ్యంలో గ్రీకు రాయబారిగా ఉన్న మెగస్తనీస్ తన రచన ‘ఇండికా’లో కృష్ణా-తుంగభద్ర తీర ప్రాంతంలో ‘నగ్న యతులు’ సంచారించేవారని రాశాడు. ఇదే ప్రాంతంలో శైవ ‘సిద్ధాంతం’, ‘అన్ధిర లోకం’ అనే అక్షరాలున్న ఇటుకలు వెలుగు చూశాయి కాబట్టి వాటి ఆధారంగా బుద్ధారం ప్రాంతంలో జైన మతం, శైవ మతం కూడా 2400 సంవత్సరాల క్రితం మనుగడలో ఉండేవని, అన్ధ్ర జనపదంలో బుద్ధారం గ్రామం ఉండేదని స్పష్టమవుతుంది. బుద్ధారం సమీపంలోని నందివడ్డెమాను అనే గ్రామం మొదట జైన తీర్థంకరుడైన వర్థమాన మహావీరుని స్ఫూర్తితో ఏర్పడిందని చెప్పవచ్చు. కృష్ణా-తుంగభద్ర నదీ తీరాలకి ఆవలి వైపున్న మరో వడ్డెమానులో సమకాలీన జైన మత ఆధారాలు లభించడం గమనార్హం. సారాంశం ఏమిటంటే, సుమారు 2400 సంవత్సరాల కిందటే బుద్ధారం, దాని సమీప స్థలాలలో బౌద్ధ, జైన, శైవ మతాలు మూడు వర్ధిల్లాయని.

ఇక అంధ్ర జనపద పాలన తరువాత సుమారు 2100 సంవత్సరాల క్రితం బుద్ధారం ఆంధ్ర శాతవాహనుల పాలనలోకి వెళ్ళింది. సాతానికోట, సాతానిపురం అనే సమీప గ్రామాల / కోటల నుంచి బుద్ధారం పాలించబడేది. 1800 సంవత్సరాల కిందట బుద్ధారం శాతవాహన సామంతులై స్వతంత్రించిన విజయపురి (నాగార్జునకొండ) ఇక్ష్వాకుల పాలనలోకి వెళ్ళింది. అనంతరం క్రీ.శ. 4వ శతాబ్దంలో విష్ణుకుండుల పాలనలోకి, 6 వ శతాబ్దంలో వాతాపి (బాదామి) చాళుక్యుల పాలనలోకి, 8వ శతాబ్దంలో రాష్ట్రకూటుల పాలనలోకి, 10 వ శతాబ్దంలో కళ్యాణి చాళుక్యుల పాలనలోకి వెళ్ళింది. కళ్యాణి చాళుక్యుల పాలనా కాలంలో… సుమారు వేయి సంవత్సరాల క్రితం బుద్ధారం సమీప గ్రామమైన ఆవంచ స్థానిక రాజధాని నగరంగా, వ్యాపార వాణిజ్య కేంద్రంగా, ప్రపంచంలో అతిపెద్ద ఏకశిలా వినాయక క్షేత్ర స్థలంగా ఉండేది. ఆ కాలంలో బుద్ధారం ప్రజలు ఆయా సౌకర్యాలను వినియోగించుకునేవారని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు.

కళ్యాణి చాళుక్యుల చివరి కాలంలో … క్రీ.శ. 12 వ శతాబ్దంలో కర్ణాటకలోని కళ్యాణిలో బసవేశ్వరుని ఆధ్వర్యంలో వీరశైవ మతం విజృంభించింది. ఆయన మతాన్ని అనుసరించిన మల్లికార్జున పండితారాధ్యులు, అక్క మహాదేవి, పాల్కురికి సోమన మొదలైన పండిత భక్తుల ప్రచార ప్రభావం బుద్ధారం పైన కూడా పడింది. సుమారు 800 సంవత్సరాల క్రితం వరకు బౌద్ధ మతం వర్ధిల్లిన బుద్ధారంలోని స్థూప-చైత్య స్థలంలో బుద్ధేశ్వర ఆలయం నిర్మించబడింది. సమీపంలోని నందివడ్డెమాను రాజధానిగా పాలించిన గోన బుద్ధారెడ్డి పేరుకు కూడా బుద్ధారంలోని బుద్ధుని పేరే స్ఫూర్తినిచ్చి ఉంటుంది. కాని ఆనాటి వీర శైవ మత ప్రభావం వల్ల బుద్ధారెడ్డియో లేక ఆయన కొడుకులైన గణపిరెడ్డి, కాచరెడ్డి, విఠలరెడ్డి… వీరిలో ఎవరో ఒకరో లేక అందరూ కలిసో  క్రీ.శ. 13వ శతాబ్దంలో బుద్ధారంలోని బౌద్ధ స్థలంలో బుద్ధేశ్వర ఆలయాన్ని కట్టించారు. ఆలయం కట్టించడానికి, కట్టించిన తరువాత విశేష ప్రచారంలో ఉండడానికి కారణం వీరశైవ జంగములు. వీరు బుధ్ధారం గ్రామ సమీపపు జంగమయ్యపల్లెలో నివసించేవారనడానికి నిదర్శనాన్ని ఆ గ్రామం పేరే సూచిస్తున్నది.

బుధ్ధారంలో బుద్ధేశ్వర ఆలయం అనే ఏక కూట ఆలయాన్ని కట్టించిన గోన వంశీయులే వైష్ణవ మతానికి సంబంధించిన రామాయణాన్ని కూడా తెలుగులో రచించారు. గోన బుద్ధారెడ్డి తన తండ్రి పేర ‘రంగనాథ రామాయణం’ రచన ఆరంభించి సింహ భాగాన్ని పూర్తి చేయగా ఆయన కొడుకులు కాచ, విఠలులు పూర్తి చేశారని తెలుస్తున్నది. రంగనాథ రామాయణం తెలుగులో తొలి ద్విపద రామాయణం. ఇందులో వాల్మీకి రామాయణానికి భిన్నంగా పలు స్థానిక కథనాలు ప్రస్తావించబడ్డాయి. ఆ కథనాలు బుద్ధారం ప్రాంతంలోవి కావడం బుద్ధారం ప్రజల రామాయణ విశ్వాసాలను తెలియజేస్తాయి. రంగనాథ రామాయణం ద్వారా బుద్ధారం ప్రాంత రామాయణపు విశ్వాసాలు ఇతర దేశాలకు కూడా వ్యాపించాయి. ఇందుకు నిదర్శనమేమిటంటే, అసలు రంగనాథ రామాయణం తొలి ప్రతి ఆధునికులకు శ్రీలంకలో దొరికిందని ప్రముఖ సాహిత్య చరిత్రకారుడు ఆరుద్ర రాశాడు. ఈ విషయాన్ని మరియు రంగనాథ రామాయణం ప్రచురిత ప్రతిని నేను సాహితీవేత్త సంగనభట్ల నర్సయ్యకు చేరవేయగా ఆయన పరిష్కరణలో ఈ మధ్య తెలుగు విశ్వవిద్యాలయం పరివర్ధిత ప్రచురణ చేసింది. రంగనాథ రామాయణంలో ఆయా కథనాలను ఆనాటి (క్రీ.శ. 13-14 శతాబ్దాలు) తెలంగాణ ఆలయాలలో చిత్రించేవారనే ఆధారాలనూ నేను ఒక పుష్కర కాలం కింద రాచకొండలోని ఒక ఆలయం పై కప్పుకు గుర్తించాను. ఆ వైష్ణవ ఆలయ పై కప్పుకు రంగనాథ రామాలయంలోని పుత్రకామేష్టి యాగం, అశ్వమేధ యాగం సంబంధిత చిత్రాలను చిత్రించారు. ఇలా బుద్ధారం ప్రాంత ప్రజల రామాయణ కథనాలు శ్రీలంక వంటి ఇతర దేశాలకు, రాచకొండ వంటి తెలంగాణ రాజధాని నగరాలకు వ్యాపించాయి.

గోన వంశీయుల సామ్రాట్టులైన కాకతీయుల పతనం (క్రీ.శ. 1323) తరువాత బుద్ధారం కొంత కాలం బహమనీ సుల్తానుల పాలనలోకి, ఆ తరువాత రాచకొండ పద్మనాయకుల పాలనలోకి వెళ్ళింది. అయితే ఆ రేచర్ల పద్మనాయకులు బుద్ధారం సమీప గ్రామాలైన పిల్లలమర్రి, ఆమన్ గల్ (పాత పాలమూరు జిల్లా) నుండే ఎదగడం గమనార్హం. క్రీ.శ. 14, 15 శతాబ్దాలలో రేచర్ల పద్మనాయకుల పాలనలో కొనసాగిన బుద్ధారం 16 వ శతాబ్దారంబం నుండే హైదరాబాద్ ప్రాంతపు గోల్కొండ నుండి తెలుగు దేశాన్ని పాలించిన కుతుబ్షాహీల పాలనలోకి వెళ్ళింది. మూడు వందల ఏండ్ల కింద హైదరాబాద్ అసఫ్జాహీల (నిజామ్) పాలనలోకి వెళ్ళింది. అసఫ్జాహీ వంశపు చివరి (ఏడవ) నిజామ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలన చివరి దశాబ్దంలో (1940 లలో) రజాకార్లు అనే ముస్లిం స్వచ్ఛంద దళాలు హిందువులపై అత్యాచారాలకు పాల్పడగా హిందువులను, పీడిత ప్రజలను కాపాడడానికి ‘ఆర్య సమాజ్’ కార్యకర్తలు, కమ్యూనిస్టులు కృషి చేశారు. ఈ క్రమంలో ఒకసారి ఆర్య సమాజ్ కార్యకర్తలు బుద్ధారం ప్రాంతంలో చైతన్య ప్రచార నిమిత్తమై మోటర్ సైకిల్ పై ప్రయాణిస్తుండగా రజాకార్లు జీపులో వెంబడించి ఆర్యసమాజ్ కార్యకర్తలపై కాల్పులు జరిపారు. ఆర్య సమాజీయులు తృటిలో తప్పించుకున్నారు. కమ్యూనిస్టులేమో బుద్ధారం సమీపపు పాతజంగమయ్యపల్లిలో గాజుల చంద్రయ్య ఆధ్వర్యంలో పేద ప్రజల పక్షాన భూమి హక్కుల కోసం పోరాటం చేశారు. అనంతరం తెలంగాణా రాష్ట్ర సాధన ఉద్యమంలో కూడా బుద్ధారం ప్రజలు ఇతోధిక పాత్రను పోషించారు. ఇలా సుమారు రెండున్నర వేల ఏళ్ళ క్రితం బౌద్ధ మత స్పూర్తితో ఏర్పడిన బుద్ధారం యుగయుగాలలో తన కీర్తిని ఎల్లెడలా చాటుకుంది; చాటుతూనే ఉంటుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *