మానవుడు తలుచుకుంటే సాధించలేనిది ఏమి లేదంటారు. అవును ఒక్కొసారి ఇది నిజమే అనిపిస్తుంది. భూమి కాకుండా చంద్రుడి పైకి వెళ్తారని ఎవరైనా అనుకున్నారా.. కానీ చంద్రుడిపై అడుగు పెట్టారు. జాబిలిపై తొలి అడుగుకి జులై 20కి 56 ఏళ్లు. జులై 20, 1969న మానవుడు చంద్రుడిపై అడుగు పెట్టాడు. నాసా 1968లో ‘అపోలో-11’లో వ్యోమగాములు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, మైకెల్ కొల్లిన్స్, ఎడ్విన్ ఇ అల్డ్రిన్లను చంద్రుడి పైకి పంపింది.
మన భూమిపై రోజుకి 24 గంటలు. ఆ ప్రకారమే మనం మన టైమ్ లైన్ సెట్ చేసుకుంటాం. ఎన్ని గంటలు పనిచెయ్యాలి, ఎన్ని గంటలు నిద్రపోవాలి.. అన్నీ 24 గంటల ప్రకారమే జరుగుతాయి. ఐతే.. రోజుకి 25 గంటలు ఉంటే.. అదో థ్రిల్ కదా. ఒక గంట అదనంగా మిగిలింది అని అనుకుంటూ పనులు చేసుకుందాం. ఐతే.. ఈ థ్రిల్ మనం పొందలేం. మనకు ఆ అదృష్టం లేదు. భవిష్యత్ ప్రజలు మాత్రం పొందుతారు. ఎలాగో తెలుసుకుందాం.
భూమి నుంచి చంద్రుడు క్రమంగా దూరమవుతున్నాడని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనిపై ఈమధ్య కొన్ని అధ్యయనాలు చేసి, ఇది నిజమే అని తేల్చారు. భూమి నుంచి చంద్రుడు సంవత్సరానికి సుమారు 3.8 సెంటీమీటర్ల వేగంతో దూరంగా వెళ్లిపోతున్నాడు. ఈ విషయం ఇదివరకే తెలుసు. ఐతే.. ఈ దూరం కొంచమే కదా అని ఇన్నాళ్లూ పట్టించుకోలేదు. కానీ.. రాన్రానూ ఈ దూరం పెరుగుతోంది. ఇది సమస్య కాబోతోంది.
భూమికి చందమామ దూరం అయితే.. భూమిపై కాలంలో మార్పులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంటే.. భూమి ఇప్పుడు తిరుగుతున్నంత వేగంగా కాకుండా.. కొద్దిగా నెమ్మదిగా తిరిగే పరిస్థితి వస్తుంది. అంటే.. అప్పుడు రోజుకి 24 గంటలు కాకుండా.. 25 గంటలు ఉంటాయి. ఐతే.. ఇది ఇప్పుడే జరగదు. ఇలా అవ్వాలంటే.. కొన్ని వందల కోట్ల సంవత్సరాలు పడుతుంది అని అధ్యయనాల ప్రకారం తెలిసింది. అంటే ఫ్యూచర్ ప్రజలకు రోజు 25 గంటలు ఉంటుందన్నమాట.
అసలు భూమి తిరిగే వేగం ఎందుకు తగ్గుతుంది అనేది మనకు వచ్చే డౌట్. మన భూమిపై ఏం జరిగినా.. దాని వెనక చందమామ ఉంటుంది. సముద్రాల్లో వచ్చే అలలకు కారణం చందమామే. అది మనకు దూరంగా ఉంది కాబట్టి.. అలల వేగం తక్కువగా ఉంది. అదే చందమామ.. మనకు చాలా దగ్గర్లోనే ఉంటే.. మనం రోజూ సునామీలను చూసేవాళ్లమే. అలా జరగకుండా.. జాబిల్లి దూరంగా ఉండటం వల్ల.. చిన్న చిన్న అలలను చూస్తున్నాం.
భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది కాబట్టి.. అది చందమామను ఆకర్షించింది. ఐతే.. అదే చందమామను మార్స్, గురుగ్రహం వంటివి కూడా ఆకర్షిస్తూ ఉంటాయి. అలా క్రమంగా వాటి ఆకర్షణ చందమామపై పెరుగుతూ.. చంద్రుడు, భూమికి దూరం అవుతూ.. దూరంగా వెళ్లిపోతున్నాడు. ఐతే.. చందమామకు కూడా గ్రావిటీ పవర్ ఉంటుంది. ఆ పవర్ ప్రభావం భూమిపై ఉంటుంది. ఆ పవర్ని టైడల్ వేవ్స్ అంటారు. ఆ వేవ్స్ ప్రభావం పడి.. భూమి గిరగిరా తిరుగుతోంది.
చందమామ దూరం అయితే.. టైడల్ వేవ్స్ ప్రభావం భూమిపై తగ్గుతుంది. దాంతో.. భూమి ఇప్పుడు తిరుగుతున్నంత వేగంగా తిరగదు. అలా చందమామ దూరం అవుతున్న కొద్దీ.. భూమి వేగం తగ్గిపోతుంది. అలాగే.. అలల జోరు, ఎత్తు, ఉధృతి కూడా తగ్గిపోతుంది. ఈ మొత్తం పక్రియను ‘‘టైడల్ యాక్సిలరేషన్’’ అని పిలుస్తారు. అపోలో మిషన్ల సమయంలో చంద్రుడిపై ఉంచిన రిఫ్లెక్టర్ల ద్వారా లేజర్ కిరణాలను ఉపయోగించి శాస్త్రవేత్తలు.. ఈ దూరాన్ని కచ్చితంగా కొలిచారు. అందువల్ల చందమామ దూరం అవుతోంది అనేది కచ్చితమైన విషయం. ఇందులో ఎలాంటి అనుమానమూ లేదు. కాకపోతే.. చందమామ దూరం అయ్యే కొద్దీ.. మనకు అది మరింత చిన్నగా కనిపిస్తూ ఉంటుంది. అది మనకు ఆవేదన కలిగించే విషయం.
ఈ కొత్త అధ్యయనం ఖగోళ శాస్త్రంలో కొత్త చర్చలకు దారి తీసింది. చంద్రుడు దూర మవడం వల్ల భూమి గురుత్వాకర్షణలో మార్పులు రావచ్చని చెబుతున్నారు. అందువల్ల ఇతర గ్రహాలతో భూమికి ఉండే లింక్, పరస్పర చర్యలపై కూడా ప్రభావం ఏర్పడవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై మరింత పరిశోధన అవసరమనీ, భవిష్యత్ మిషన్ల ద్వారా చంద్రుడి కక్ష్య మార్పులను మరింత కచ్చితంగా అధ్యయనం చేయాలని వారు సూచిస్తున్నారు.
- కె. సత్యప్రసన్న