కర్నూలు జిల్లాలోని ఆదోని ప్రాంతంలో ఎక్కువగా స్టోన్ షెల్టర్స్ను గమనించవచ్చు. అంతేకాదు రాతియుగం నాటి మనుషుల ఆనవాళ్లు. వారి అవశేషాలు వారు ఉపయోగించిన పనిముట్లు వారు గీసిన చిత్రాలు మరియు పెట్రోగ్లిప్స్ మరియు వివిద రకములైన సమాధులను గమనించవచ్చు ప్రత్యేకించి దేవరగట్టు (ఆలూరు దగ్గర) విరూపాపురం మరియు కోసిగి కుండలి యందు రాతియుగం నాటి అవశేషాలను గమనించ వచ్చు.
ఇంతకు కోసిగి ఎక్కడ వుంది? 150 50’ 60’’ చీ రేఖాంశము, 770 16’ 012’’ జు అక్షాంశముల వద్ద కోసిగి అనే గ్రామము కలదు. ఈ గ్రామము తిమ్మప్ప అనే కొండ చుట్టూ ఏర్పాటు కాబడినది. బ్రిటీష్ వారి పాలనలో ముంబాయి నుండి చెన్నైకి వెళ్ళే రైలుమార్గం కోసిగి నుండి ప్రయాణం చేసే విధముగా 1870 సం।।లో ఏర్పాటు చేసి రైల్వే స్టేషన్ నిర్మించడం జరిగినది.

వివిధ ప్రాంతముల నుండి కోసిగికి
దూరము (కిలోమీటర్లలో)
కర్నూలు నుండి 99.3
విరూపాపురం నుండి 80
రాజుల మందగిరి నుండి 70
ఎమ్మిగనూరు నుండి 46.1
ఆదోని నుండి 29.7
మంత్రాలయము నుండి 25.9
కౌతాలము నుండి 17.5
ఉరుకుంద నుండి 11
కోసిగి ప్రత్యేకత:
ఇక్కడి ప్రజలు వ్యవసాయం మీదనే ఆధారపడి జీవనాధారము కొనసాగిస్తారు. కోసిగి అనే గ్రామం తిమ్మప్ప కొండ చుట్టూ ఏర్పడిన విషయం తెలిసినదే. ఈ కొండపై నుండి వచ్చిన మానవ సమూహము గుర్తుగా గేని లేదా గేరి అనే పదములు పెట్టుకోవడం జరిగినది. ఉదాహరణకు 1. చింతలగేని, 2. దుర్నిగేని, 3. పొరసయ్య గేరి, 4. బెండేగేరి, 5. తమని గేని, 6. పోతుల గేని, 7. కట్టల గేని, 8. బుల్లెల్లి గేని, 9. నాడి గేని, 10. మలై గేనిగా పిలువబడ్డారు. ఈ తిమ్మప్ప కొండలో అనేకములైన గుహలు మరియు రాక్ షెల్టర్స్ మాత్రమే కాదు కొండ వెనుక భాగములో అనేకములైన రాతియుగము నాటి సమాధులే కాక వన్య మృగాలు (చిరుతలు, నక్కలు, జింకలు, తోడేళ్లు లాంటి జంతువులు) కూడా కలవు. అంతేకాదు అనేకములైన నీటి దోనెల నుండి ప్రవహించిన నీరు దిగువన వున్న సత్యమ్మ అవ్వ గొందిలోకి చేరుకొని పెద్ద వంకలాగ మారి రైల్వేస్టేషన్ వైపు పరుగులు తీస్తాయి. ఈ తిమ్మప్ప కొండ రమారమి 71.6 హెక్టారుల వైశాల్యము కలిగి 3.2 కి.లో చుట్టు కొలత కలిగివున్నది. అయితే తిమ్మప్ప కొండ వెనుకభాగములోగల చిన్న కొండ 10.41 హెక్టార్ల వైశాల్యములో అనేకములైన రాతియుగము నాటి పనిముట్లు, వారి అవశేషాలు, సమాధులను గమనించవచ్చు.
వివిధములైన రాతియుగం నాటి సమాధులు:
1.రాక్ షెల్టర్ సమాధులు, 2. డాల్మెన్, 3. కెయర్న్, 4. సిస్ట్ సమాధులు, 5. మెన్‍హిర్, 6. స్టోన్ సర్కిల్స్, 7. ప్యాసేజ్ గ్రేవ్స్, 8. చింబర్ గ్రేవ్స్, 9. పిట్‍బరియల్స్, 10. అర్న్ బరియల్స్ను ప్రధానంగా పేర్కొంటారు.
1. రాక్ షెల్టర్ సమాధులు:
- వీటిని రాక్షస గుళ్లు అని కూడా అంటారు.
- సహజ సిద్ధముగా ఏర్పడిన రాక్ షెల్టర్స్ క్రింద ఇటువంటి సమాధులు ఏర్పర్చినారు.
- రాయి క్రింద వున్న రెండు అడుగుల స్థలాన్ని (dry rubble masonry) చిన్న చిన్న రాళ్ళతోను, బండలను మూసివేస్తారు. ఇటువంటి సహజ సిద్ధమైన రాక్‍షెల్టర్ సమాధులను సుంభా ఇండోనేషియాలో గమనించగలము. ఇటువంటి రాక్ షెల్టర్ బరియల్‍ను కోసిగిలో సైతం గమనించవచ్చు.
2. డాల్మెన్ :
- వీటిని రాక్షస గుళ్లు అని కూడా పేర్కొంటారు.
- డాల్‍మెన్ అనేది మెగాలిథిక్ సమాధికి సంబంధించిన సమాధులలో ఒకటి.
- మెగా అనగా పెద్దది అనియు లిథిక్ అనగా రాయి అని అర్థము. అనగా పెద్దదైన రాయి అని అర్థము
- రెండు లేదా అంతకంటే ఎక్కువగా నిలబడి వున్న పెద్దరాళ్ళతో నిర్మించబడతాయి.
- నిలువు బండలపై పెద్ద బండరాయి వేసి కప్పివేయడం జరుగుతుంది.
- ఒక్కోసారి పైకప్పు రాయిలో సైతం రంధ్రాన్ని ఏర్పాటు చేస్తారు.
- రాక్ షెల్టర్స్ సమాధుల తర్వాత డాల్మెన్ సమాధులు ప్రాచుర్యంలోకి వచ్చి ఉండవచ్చు.
అనంతపురం జిల్లాలో కంబదూరు మండలంకు సమీపంగా ఉన్న ఎనుముల దొడ్డి గ్రామంలో ఏనుగుగవిగా గుర్తించబడే గుహలు రాతియుగం నాటి సమాధులు గమనించవచ్చు. అదేవిధంగా కళ్యాణ్ దుర్గంకు సమీపంలో ఉన్న ముల్కనూరు గ్రామంలో అతి పెద్ద డాల్మెన్‍ను సైతం గమనించవచ్చు. రమారమి 25 అడుగల పొడవు మరియు 17 అడుగుల వెడల్పు కలిగి ఆరించుల మందముగల క్యాప్ స్టోన్‍ను గమనించవచ్చు.
కర్నూలు జిల్లాలోని కోసిగి గ్రామం తిమ్మప్పకొండలో అనేకములైన శిథిలావస్థకు చెందిన డాల్మెన్‍లను గమనించవచ్చు. అయితే వీటన్నిటికీ సాక్షిభూతంగా ఒకే ఒక్క డాలమ్మేంట్ సమాధిని 72 హెక్టారుల తిమ్మప్ప కొండ యందు గమనించవచ్చు.
3. క్లోజ్డ్ టేబుల్ డాల్మెన్
- నాలుగు వైపులా నిలువు రాళ్లు ఉండడం జరుగుతుంది.
- ఈ నిలువురాళ్లపైన క్యాప్ట్సోన్‍తో మూసి వేయడం జరుగుతుంది.
- ఈ నిలువురాళ్లను మరియు క్యాట్ స్టోన్ సైతం అదే కొండ నుండే గ్రహించినారు అని తెలుస్తుంది.
- మూడు వైపులా నిలువురాళ్లు కలిగి దానిపైన కాప్ స్టోన్‍ను కలిగి ఉంది ఇక్కడ డాల్మెన్.
- పొడుగు రాళ్లు 10 అడుగుల పొడవు ఆరడుగుల వెడల్పు మూడు ఇంచుల మందంతో రెండు బండలు ఉండడం గమనించవచ్చు.
- వెడల్పురాయి ఆరడుగులు పొడవు మరియు ఆరడుగుల వెడల్పు కలిగి మూడించుల మందంతో ఒక రాయి కలిగి ఉంది.
- క్యాప్ స్టోన్ కొలతలు 13 అడుగుల పొడవు 11 అడుగుల వెడల్పు ఐదు ఇంచుల మందముతో ఉండడం గమనార్హం.

4. మెన్హిర్ (Menhirs):
- వీటిని పాండవగుళ్ళు అని అంటారు.
- నిలువు బండలు కానీ లేక పెద్ద పెద్ద శిలలను ఏర్పరుస్తారు.
- రమారమి పది అడుగుల నుండి 12 అడుగుల ఎత్తు వరకు గల నిలువురాయిని సమాధిపైన నిలబడతారు.
- మూడు నుండి ఐదు అడుగల పొడవు ఒకటి నుంచి ఒకటిన్నర అడుగు వెడల్పు నాలుగించుల మందంతో చక్రాకారంవలె బండలను పాతిపెడతారు.
- మెన్హిర్ మీద రాతియుగం నాటి మనుషుల రేఖా చిత్రాలు సైతం అక్కడక్కడ గమనించవచ్చు.
- ఇటువంటి మెన్హిర్స్ను అనంతపురం జిల్లాలోని కంబదూర్ మండలం సమీపంలో గల హందేపల్లిలో గమనించవచ్చును. అదేవిధంగా ఎనుముల దొడ్డి సమీపంలో ఉన్న ఏనుగు గవి నందు సైతం గమనించవచ్చు.
- ఇటువంటి పాండవ గుళ్ళను కర్నూలు జిల్లాలోని కోసిగి గ్రామంలో తిమ్మప్ప కొండలో గమనించవచ్చును. కొన్ని చోట్ల మెన్హిర్‍లను ధ్వంసం చేసి వాటి ఉనికిని కోల్పోయేటట్లు చేశారు.
5. కేయర్న్ (Cairm) మరియు సర్కులర్ సిస్టస్ (Circular Cists):
‘C’ ఆకారంలో గల కేయర్న్ సమాధులను కోసిగి తిమ్మప్ప కొండల యందు గమనించవచ్చు. కొన్ని చోట్ల రాళ్ళ గుట్టలుగా సైతం పేర్చబడ్డాయి. అలాగే గుండ్రటి వృత్తమాకారంలో గల సమాధులను సైతం ఈ కొండ యందు గమనించవచ్చు. ఈ సమాధి అందలి రాళ్లను సైతం తొలగించడం జరిగినది. ఇటువంటి సమాధులను అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం దగ్గర పాపం పల్లి అన్న గ్రామంలో చూడగలము.
6.పొడవైన ఇరుకైన సమాధులు (Passage Burials):
- ఇటువంటి సమాధులను రెండింటిని కోసిగి తిమ్మప్ప కొండలో గమనించగలము.
- శ్రీ అయితే వీటిని ఇక్కడి ప్రజలు పులిబోను అని పిలుస్తారు. కాని వాస్తవానికి అవి పొడవైన ఇరుకు సమాధులు.
- ఆరడుగుల పొడవుతో, రెండు అడుగుల వెడల్పుతో ఒకటి నుండి ఒకటిన్నర అడుగు ఎత్తుతో ఇటువంటి సమాధులు ఇక్కడ రెండు కలిగి ఉన్నాయి.
- ఈ పొడవైన సమాధిని మూడు భాగములుగా విభజించి దానిని ఛాంబర్స్ సమాధులుగా సైతం మార్చినట్టుగా కనిపిస్తుంది.
- తిమ్మప్ప కొండలో గుంత సమాధులను సైతం గమనించగలము.
7. ఊట సమాధులు (Urn Burials):
భూమి లోపల పాతిపెట్టిన పొడువాటి నల్లకుండలలో ఉంచిన ఎముకల అవశేషాలను ఊట సమాధులు (ఉర్న్ బరియల్స్) అని అంటారు. ఈ ఉర్న్ బరియల్స్ను ఆర్కియాలజికల్ డిపార్టుమెంట్ వారు వారి తవ్వకాలలో బయటికి తీయగలరు.

8. తీర్మానం (Conclusion):
- దాదాపు 15వేల సంవత్సరాల క్రిందటి రాతియుగం నాటి సమాధులన్నింటిని కోసిగి లోని తిమ్మప్ప కొండ నందు గమనించవచ్చును.
- అన్ని రకాలైన సమాధులు ఒకే చోట దొరకడం యాదృచ్ఛికం.
- ఈ ప్రాంతమును హిస్టోరియన్స్, ఆంత్రోపాలజిస్ట్, రీసెర్చ్ స్కాలర్స్ విశేషించి విద్యార్థులు మరియు మేధావులు పర్యటించిన యెడల పాతరేసిన చరిత్రను పైకి తీసుకుని రాగలరు.
- ఏసియాలోనే అతిపెద్దదైన పెట్రోగ్లిఫ్ 80 కిలోమీటర్ల దూరంలో గల విరుపాపురం కొండలలో గమనించవచ్చు. దాని పక్కనే బన్నీ ఉత్సవం (రమారమి రెండు లక్షల మంది పర్యాటకులు ఈ ఉత్సవాన్ని చూసేందుకు వస్తారు) జరిగే దేవరకొండ / దేవరగట్టు యందు సైతం రాతియుగం నాటి చిత్రాలను గమనించవచ్చు.
- విశేషించి ఈ మూడు ప్రాంతాలతో పాటు (విరూపాపురం, దేవరగట్టు/కొండ మరియు కోసిగి) రాజుల మందగిరి (మౌర్యుల శాసనాలు) కలిపి పర్యాటక కేంద్రముగా అభివృద్ధి చేయవచ్చు అని మేధావివర్గం కోరుతున్నది.
- ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారిని ఆదేశించి ఇక్కడి చరిత్రకు రక్షణ కల్పించవలెనని ముక్తకంఠంతో గ్రామ ప్రజలు అలాగే టూరిజం డిపార్ట్మెంట్ వారు, ఈ కోసిగి ప్రాంతమును పర్యాటక ప్రదేశంగా గుర్తించవలెనని కోసిగి యువత, విద్యార్థులు మరియు గ్రామ ప్రజలు కోరుతున్నారు.
- పాఠశాలలో తెలియజేయడమే కాక పాఠ్యాంశాలుగా సైతం చేర్చవలెనని కోరుతున్నారు.
కృతజ్ఞతలు:
కోసిగి నందలి తిమ్మప్ప కొండలో రాతియుగం నాటి సమాధుల అన్వేషణలో సహాయపడిన కోసిగి పోలీస్‍స్టేషన్‍లో పనిచేసే జి.టి.నాగన్న పోలీస్ కానిస్టేబుల్ గారికి, ప్రత్యేకించి కోసిగి గ్రామం యువతకు ధన్యవాదాలు.
-డా।। జి.యస్.రామయ్య
ఇంటాక్ సభ్యులు-కర్నూలు, ఆంధప్రదేశ్
ఎ : 898 555 0007
