ఆమె కోరిక

నేను రాసే కథలు ఎక్కువగా నా అనుభవం నుంచి వచ్చినవే. నేను విన్నవి కూడా కథలుగా రాసాను. అయితే అవి తక్కువే. కథలు రచయితల అనుభవం నుంచి, ఇతరుల అనుభవాల నుంచే ఎక్కువగా వుంటాయి. ఊహించి రాసిన కథలు అంత బలంగా వుండవు. గుండెలకి హత్తుకోవు కూడా. అనుభవాలకి అవసరమైన మలుపుని రచయిత ఇస్తాడు. అప్పుడు అది కథగా మారిపోతుంది. కొన్ని సందర్భాలలో రచయిత జోక్యం లేకుండానే రచయిత అనుభవం కథగా మారిపోతుంది. ‘ఆమె కోరిక’ కథ పూర్తిగా నా అనుభవంలోంచి వచ్చిన కథే. అది కథగా మార్చడానికి నేను ఎలాంటి మలుపుని ఇవ్వలేదు. ఇప్పుడు ‘ఆమె కోరిక’ పేరుతో నా మరో కథల పుస్తకం వస్తుంది. ఈ కథలన్నీ నా అనుభవంలోంచి వచ్చిన కథలే. ఈ కథలన్నీ ‘ఆమె’ చుట్టే తిరుగుతాయి. ఈ కథల్లో నాకు బాగా నచ్చిన కథ ‘ఆమె కోరిక’. ఈ కథ నాకు నచ్చింది. చాలా మందికి నచ్చింది. బాగా సర్క్యులేట్‍ కూడా అయ్యింది.

ప్రముఖ రచయిత్రి దమయిగారికి నచ్చి ఈ కథ మీద వ్యాసం రాశారు. మరో రచయిత్రి సమ్మెట ఉమాదేవిగారు ఈ కథ నచ్చి ఆమె నూరు వరహాలు కథల్లో ఒక కథగా చదివారు. నేను కొత్త ఫేస్‍బుక్‍లో చేరినప్పుడు కథని నా వాల్‍ మీద ప్రచురించాను. అప్పుడు ఈ కథ మీద చర్చ జరిగింది. బోడపాటి పద్మాదేవి గారు ఈ కథ మీద తన అభిప్రాయం రాసి చర్చకు పెట్టారు. ఈ చర్చలో చాలా మంది రచయిత్రులు, పాఠకులు పాల్గొన్నారు. రకరకాల అభిప్రాయాలు వెలిబుచ్చినారు. జ్ఞానేశ్వరరావు గారు ఇది కథే కాదు పొమ్మన్నారు. పితృస్వామిక అణిచివేత ఆర్థిక పరమైన అంశాలు వున్నాయి. కోర్టులో వీటి ప్రస్తావన రాకుండా లాయర్లు వాదించినారని అన్నారు. వనజ తానేని, కొండా మాధవి, సరళ మోహన్‍ లాంటి వాళ్ళు విడాకులు వద్దనడానికి ఎందుకో అర్థం కాదని ఇప్పుడు డైవర్సో అన్న స్వప్నా ఏమీ లేదని అన్నారు.

ఉమామహేశ్వర శర్మ, భార్గవ, శివరామక్రిష్ణ, జయసునాశ్‍ రాజు, రామమోహన్‍ లాంటి వారు చర్చలో పాల్గొన్నారు. వీరందరికీ నేను జవాబు ఇచ్చాను. అది చెబుతాను. అది చెప్పే ముందు కథ గురించి కొంత చెప్పాలి. అదే విధంగా కథ గురించి ఖమ్మం నుంచి ముగ్గురు న్యాయవాదులు వచ్చి ఓ కాపీని తీసుకొని వెళ్ళారు. తీర్పు ప్రతి కూడా కోర్టు నుంచి తీసుకుంటామని చెప్పారు. గొల్లపూడి రామారావు, లక్ష్మీ నరసింహారావు, శ్రీనివాసరావు అన్న న్యాయవాదులకి బాగా నచ్చిన కథ. ఈ కథ వాళ్ళకి నచ్చడానికి కథలోని ముగింపు అని చెప్పారు. కథలో కోర్టు వాతావరణం వుండటం వల్ల వాళ్ళకి బాగా నచ్చి వుండవచ్చు. ఏమైనా ఓ కథ మీద ఇన్ని అభిప్రాయాలు రావడం నాకు చాలా సంతోషం కలిగించింది.

ఇక కథలోకి వెళ్దాం. భార్యా భర్తల కేసులని పరిష్కారం చేయడం చాలా కష్టమైన పని. పార్టీలు చాలా ఎమోషనల్‍గా వుంటారు. నేను నిజామాబాద్‍లో జాయన్‍ అయి వారం రోజులు దాటిన తరువాత ఓ శనివారం రోజు ఈ కుటుంబ వ్యవహారాల కేసులని నా చాంబర్‍లో పరిశీలించడం మొదలు పెట్టాను. చాలా విడాకుల కేసులు ఎన్నో సంవత్సరాలుగా విచారణలో వున్నాయి. క్రిమినల్‍ కేసులు వేరు. ఆస్తి తగాదా కేసులు వేరు. భార్యాభర్తల కేసులు వేరు. రెండు జీవితాల వ్యవహారం. రెండు జీవితాలతో పాటూ మరెన్నో జీవితాలు వాటితో ముడిపడి వుంటాయి. ఈ కేసులకి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాను. ఈ కేసులని పరిష్కరిస్తే వాళ్ళు మరో వివాహం చేసుకోవడమో, కొత్త జీవితాన్ని ప్రారంభించడమో చేస్తారు. వాళ్ళ యవ్వనం కరిగిపోకముందే వారి కేసులని పరిష్కరించాలి. అలా చెయ్యమనప్పుడు వాళ్ళకి అన్యాయం చేసినట్టుగా వుంటుంది.

ఇలా ఆలోచిస్తున్న క్రమంలో చాలా కాలంగా పెండింగ్‍లో వున్న ఓ విడాకుల కేసు దాదాపు పూర్తి అయి, కేసు ఆర్గుమెంట్స్ కోసం వస్తుంది. ఆర్గుమెంట్స్ తర్వాత చెప్పాల్సింది తీర్పు మాత్రమే. కేసుని పరిశీలించాను. భర్త విడాకుల కోసం కేసుని దాఖలు చేశాడు. కేసు దాఖలు చేసి అయిదు సంవత్సరాలు దాటింది. భార్య విడాకులని వ్యతిరేకిస్తుంది. ఆమెకు విడాకులు ఇష్టం లేదు.

ఈ కేసులో విచిత్రమైన విషయం ఏమంటే వాళ్ళిద్దరూ గత 25 సంత్సరాలుగా వేరుగా వుంటున్నారు. మరి ఆమె ఎందుకు వ్యతిరేకిస్తుంది. అతన్ని సాధించడానికా..? వాళ్ళ వయస్సుని చూస్తే అట్లా అన్పించలేదు. ఫైలును పూర్తిగా చదివేశాను. వాదనలు విని  వ్యరీగా తీర్పుని ప్రకటించాలని అనుకున్నాను. సోమవారం రోజు కేసు తేదీ వుంది. ఆ రోజు రానే వచ్చింది. పార్టీలు ఇద్దరూ కాల్‍వర్క్ సమయంలో హాజరైనారు. కేసుని మూడు గంటలకు పిలవాలని ఆమె న్యాయవాది అప్పుడు వస్తారని చెప్పింది.

మధ్యాహ్నం ఇరువురు న్యాయవాదులు వచ్చారు. ఆమె న్యాయవాదికి 75 సంవత్సరాలు దాటి వుంటాయి. ఓ గంట సమయం పడుతుంది అని చెప్పాడు. 25 సంవత్సరాలుగా వాళ్ళిద్దరూ వేరుగా వుంటున్నారు. వారి వివాహంలో ఎలాంటి భావోద్వేగం లేదు. అది పూర్తిగా చచ్చిపోయింది. వారి కొడుకు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆ కేసులో ఇంకా వాదనలు ఏమి వుంటాయి. అనవసర కాలయాపన అన్పించింది. అదే విషయం ఆమె న్యాయవాదితో అన్నాను. ‘‘మీరన్నది నిజమే యువరానర్‍! నా వాదనలు విని మీకు న్యాయబద్దం అయిన తీర్పుని చెప్పండి. మీరు తప్పక నాకు అంత సమయం ఇచ్చి వినాలి’’ అన్నాడు ఆ సీనియర్‍ న్యాయవాది చాలా వినయంగా. ఆ రోజు ఇంకా రెండు కేసుల్లో వాదనలు వినాలి. అయినా ఆ న్యాయవాది అలా అన్నప్పుడు ‘సరే’ అని వాదనలు వినడం మొదలు పెట్టాను. మిగతా రెండు కేసులకి వాయిదా ఇచ్చాను.

‘‘వీళ్ళిద్దరూ టీచర్లు. హిందూ సాంప్రదాయం ప్రకారం వీరి వివాహం అయ్యింది. రెండు సంవత్సరాలు మాత్రమే కలిసి జీవించారు. ఆమె గర్భం దాల్చిన తరువాత ప్రసవానికి తల్లిగారింటికి వెళ్లింది. ఆమె ఓ పిల్లవాడికి జన్మనిచ్చింది. అతను నామకరణానికి వచ్చి అంటి ముట్టనట్టుగా వుండిపోయాడు. రెండు మాసాలు గడిచినా అతను ఒక్కసారి కూడా వాళ్ళని చూడటానికి రాలేదు. పిల్లవాడికి గ్రహణం కారణంగా మూతి మీద మొర్రి ఏర్పడింది. అందువల్ల అతను రావడం లేదని సమాధాన పరుచుకున్నారు. చివరికి తల్లితండ్రులే ఆమెను అతని ఇంటి దగ్గర వదలిపెట్టారు. అతను ముభావంగానే వున్నాడు. ఓ ఆరు నెలల తరువాత అసలు విషయం తెలిసింది. అతను వాళ్ళ స్కూల్లో పని చేస్తున్న ఓ లేడీ టీచర్‍ మోజులో పడి ఇంటికి ఆలస్యంగా రావడం, ముభావంగా వుంటున్నాడని అర్థం అయ్యింది. ఆమె అతన్ని నిలదీసింది. ప్రశ్నించింది. వుంటే వుండు లేకపోతే మీ ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ఈ పరిస్థితుల్లో ఆమె ఇంటి నుంచి వెళ్ళి పోవాల్సి వచ్చింది. ఆమె తనకు తానుగా ఇంటి నుంచి వెళ్ళిపోలేదు. మరో అమ్మాయితో అక్రమ సంబంధం వుండటం వల్ల వెళ్ళి పోవాల్సి వచ్చింది.

అతను ఆమెతోనే వుంటున్నాడు. ఇద్దరు పిల్లలు కూడా. ఈ కేసులో అతని తప్పిదమే వుంది. ఆమె తప్పులేదు. అందుకని అతను విడాకులు పొందడానికి అర్హతలేదు. వారిద్దరిలో ఎమోషనల్‍ కంటెంట్‍ లేదన్న కారణంగా విడాకులు మంజూరు చేయడానికి వీల్లేదు. అంతే కాదు 25 సంవత్సరాలుగా ఆమె ఒక రకమైన జీవితానికి అలవాటి పడింది. అతన్నుంచి ఆమె ఏమీ కోరుకోవడం లేదు. ఆమె తన శేష జీవితాన్ని డైవోర్సీగా అంటే విడాకులు పొందిన మహిళగా జీవించదల్చుకోలేదు’’ ఇలా చెప్పి అతను తన వాదనలని ముగించాడు.

తీర్పు ఎలా వుంటుందో ఊహించుకోవచ్చు. కేసులో మెరిట్‍ ఆమె వైపే వుంది. ఛట్టప్రకారం విడాకులు మంజూరు చేయాల్సిన కేసు కాదు. భర్త దాఖలు చేసిన విడాకుల కేసుని కొట్టివేశాను. కేసులోని మెరిట్‍ ప్రకారమే తీర్పుని ప్రకటించాను. మెరిట్‍ ఆమె వైపు లేకపోయినా తీర్పుని ఆమె వైపే ప్రకటించి వుండేవాడినని అన్పించింది.

ఇదీ జరిగిన సంఘటన. ఇది కథగా మారిపోయింది. కథలు ఎలా వుండాలి. కథలు హృదయాన్ని తాకాలి. ఆలోచనలని కల్గించాలి. మనల్ని కదిలించాలి. ఈ కథలో చర్చించిన మిత్రులు ‘ఆమె’కు చైతన్యం వుండాలని, ఆమె అట్లా వుండటం సరైంది కాదని వాదించినారు. మనం అనుకున్న రీతిలో ఎదుటి వ్యక్తులు వుండరు. ఆమెకు చైతన్యం ఇచ్చే దిశగా నేను ఈ కథను రాయలేదు. విభిన్న కోణాలలో కథని చూసి తమ అభిప్రాయాలని మిత్రులు వెలువరించారు. రచన వరకే నా స్వంతం. ఆ తరువాత పాఠకులది. విమర్శకులది. వాళ్ళు చీల్చి చెండాడవచ్చు. అదే జరిగింది. ఇదే క్లుప్తంగా నా సమాధానం.
కథా రచయిత కొందరిని మెప్పించలేదేమో కానీ న్యాయమూర్తిగా అందరినీ మెప్పించాను.
ఇదీ ఆమె కోరిన కథ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *