ఎర్ర మట్టి దిబ్బలు (ఇ.ఎం.డి) అనేవి భూశాస్త్రీయంగా అత్యంత అరుదైన తీరప్రాంత నిర్మాణాలు. ఇవి చివరి క్వాటర్నరీ కాలంలో, అంటే సుమారు పది వేల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ దిబ్బలు ఉష్ణమండల తీరప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ రకమైన ఎర్ర ఇసుక గుట్టలు కేవలం ఆంధప్రదేశ్, తమిళనాడు మరియు శ్రీలంక దేశాల్లో మాత్రమే కనిపిస్తాయి. ఈ దిబ్బలు గాలి, వర్షం, సముద్ర తరంగాలు, వాతావరణ మార్పులు, మరియు ఖనిజ మార్పులు వంటి సహజ పక్రియల ఫలితంగా ఏర్పడ్డాయి.
ఇవి ఏర్పడటానికి ప్రపంచ వాతావరణ మార్పులు, సముద్ర మట్టం పెరుగుదల మరియు తగ్గుదల, మాన్సూన్ పర్వక్రమంలోని మార్పులు, ఖనిజాల ఆక్సీకరణం మరియు రసాయన మార్పులు, మట్టీ నిర్మాణ పక్రియలు మరియు భూకంప క్రియలు వంటి పలు అంశాలు కారణమయ్యాయి. ఈ దిబ్బల ఎర్రరంగు ప్రధానంగా ఇనుప ఆక్సైడ్‍ల వల్ల వస్తుంది. ఇసుక రేణువులు శతాబ్దాలుగా వాతావరణ ప్రభావం ఎదుర్కొని గట్టిగా కూర్చబడి ఉండటం ఈ ప్రాంతానికి విశిష్ట భూభౌతిక స్వరూపాన్ని ఇస్తుంది.

ఎర్ర మట్టి దిబ్బల శాస్త్రీయ ప్రాముఖ్యతను గుర్తించిన తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయం భూశాస్త్ర విభాగం మరియు ఇంటాక్ (INTACH) సంస్థలు కలిసి 2012లో జాతీయ సదస్సును నిర్వహించాయి. ఈ సదస్సుకు డా. డి. రాజశేఖర్ రెడ్డి మరియు రాణి శర్మ ప్రధాన నిర్వాహకులుగా ఉన్నారు. ఆ సదస్సు సిఫారసులపై భూగర్భ సర్వే ఆఫ్ ఇండియా (GSI) 2014లో ఎర్ర మట్టి దిబ్బలను జాతీయ భూవారసత్వ స్థలంగా ప్రకటించింది. ఆ తరువాత ఆంధప్రదేశ్ ప్రభుత్వం 2016లో దీనిని రక్షిత భూవారసత్వ స్థలంగా గుర్తించి సంరక్షణ చర్యలు ప్రారంభించింది.
ఇ.ఎం.డి. యొక్క ప్రాముఖ్యతను 2022లో ఆంధప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించిన ‘‘విశాఖ అర్బన్ జియోపార్క్’’ ప్రాజెక్టు ప్రతిపాదనలో విశేషంగా ప్రస్తావించారు. ఆ ప్రాజెక్టు లక్ష్యం ఈ ప్రాంతాన్ని శాస్త్రీయ, విద్యా, పర్యావరణ మరియు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం. UNESCO ఆధ్వర్యంలో 2024లో న్యూ ఢిల్లీలో నిర్వహించిన వర్క్షాప్‍లో కూడా ఎర్ర మట్టి దిబ్బల పరిరక్షణ ప్రధాన చర్చాంశంగా నిలిచింది. ఈ చర్చల అనంతరం UNESCO 2025లో ఎర్ర మట్టి దిబ్బలను ప్రపంచ వారసత్వ స్థలాల తాత్కాలిక జాబితాలో చేర్చింది.
అయితే, ఈ అంతర్జాతీయ గుర్తింపులున్నప్పటికీ, మానవ జోక్యం, భూమి దోపిడీ, నిర్మాణ కార్యకలాపాలు, మరియు అక్రమ ఇసుక తవ్వకాలు వంటి అంశాలు ఈ సహజ నిర్మాణాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. భూస్థలనం, వర్షపు నీటి ప్రవాహం మార్పులు, మరియు నియంత్రణలేని పర్యాటక చర్యలు పర్యావరణ సమతౌల్యాన్ని భంగం చేయవచ్చు.
ప్రస్తుతం ఈ ప్రాంత పరిరక్షణ కోసం ప్రభుత్వం మరియు శాస్త్రవేత్తలు పలు చర్యలు చేపడుతున్నారు. మరిన్ని శాస్త్రీయ అధ్యయనాలు నిర్వహించడం, దీని సంరక్షణ మరియు స్థిర అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతోంది. UNESCO తాత్కాలిక జాబితా నుండి ప్రపంచ వారసత్వ స్థాయికి ప్రమోట్ చేయడానికి అవసరమైన వ్యూహాలను ఇంటాక్ విశాఖపట్నం చాప్టర్ కన్వీనర్ డా।। డి. రాజశేఖర్ రెడ్డి మరియు పర్యావరణ పరిరక్షకులు కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు.
ఎర్ర మట్టి దిబ్బలు భూభౌతిక, పర్యావరణ మరియు సాంస్కృతిక పరంగా విశిష్టమైన సహజ సంపద. ఇవి ప్రకృతి వైవిధ్యానికి ఒక ప్రతీక. ఈ అరుదైన సహజ వారసత్వాన్ని సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు ప్రకృతి చరిత్రను సజీవంగా అందించవచ్చు. కాబట్టి ఈ ప్రాంతాన్ని రక్షించడం ప్రతి పౌరుడి బాధ్యతగా గుర్తించి చర్యలు తీసుకోవడం అత్యంత అవసరం.
- దక్కన్‍న్యూస్, ఎ : 9030 6262 88
