భారత కళా, వాస్తుశిల్ప మరియు సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు కట్టుబడి ఉన్న ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (INTACH) సంస్థ ఆంధప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ చాప్టర్ ప్రారంభంతో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. 2025 అక్టోబర్ 12న విజయవాడలో జరిగిన INTACHప్రారంభోత్సవ వేడుకకు ఇతర రాష్ట్రాలనుండి వచ్చిన ఇంటాక్ సభ్యులు, వారసత్వాభిమానులు, స్థానిక ప్రముఖులు, విద్యావేత్తలు మరియు పరిరక్షణ నిపుణులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం ఉదయం ‘‘City of Caves and Canals’’ పేరుతో ఫ్యామిలీ హెరిటేజ్ డ్రైవ్‍తో ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ద్వారా విజయవాడ లోని చారిత్రక ప్రదేశాలను ప్రజలు, ఇంటాక్ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించడంతో విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ర్యాలీని విజయవాడ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ జి.లక్ష్మీషా, IAS ప్రారంభించగా, INTACH చైర్మన్ అశోక్ సింగ్ ఠాకూర్‍తో కలిసి జెండా ఊపి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సుమారు 125 మంది వారసత్వాభిమానులు, విద్యార్థి వాలంటీర్లు తమ మద్దతుగా పాల్గొన్నారు.
విజయవాడ క్లబ్‍లో INTACH కొత్త శాఖ ప్రారంభించిన సందర్భంగా విచ్చేసిన ముఖ్య అతిథులు, ఇంటాక్ సభ్యులకు ప్రసూన బాలంత్రపు స్వాగతం పలికారు. ముఖ్య అతిథి INTACH చైర్మన్ అశోక్ సింగ్ ఠాకూర్, డైరెక్టర్ (చాప్టర్స్ డివిజన్) కెప్టెన్ అర్వింద్ శుక్లా, కె. చినప్పా రెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు, అనంతపూర్ శాఖ కన్వీనర్ రామ్‍కుమార్, మాజీ ఆంధప్రదేశ్ Mఉమ్మడి రాష్ట్ర ఇంటాక్ కో-కన్వీనర్ వేదకుమార్ మణికొండ, ఆంధప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ ఎస్.వి.ఎస్. లక్ష్మీ నారాయణ పాల్గొనటం తమకు ఎంతో సంతోషంగా ఉందని విజయవాడ ఇంటాక్ చాప్టర్ సభ్యులు తెలిపారు.
అశోక్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ విజయవాడ మరియు పరిసర ప్రాంతాల సాంస్కృతిక, వాస్తుశిల్ప వారసత్వ పరిరక్షణ ప్రాముఖ్యతను వివరించారు. భారతదేశ వ్యాప్తంగా వారసత్వ సంరక్షణలో ఇంటాక్ పోషిస్తున్న కీలక పాత్రను ప్రస్తావిస్తూ, విజయవాడ ప్రజలు వారసత్వ కట్టడాల యొక్క చరిత్ర, చారిత్రకమైన విషయాలను తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తితో ఉన్నారు. తాము ఎల్లప్పుడూ విజయవాడ ప్రజలను ప్రోత్సాహించే దిశగా ఇంటాక్ పనిచేస్తుందని అయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఆయన ఎస్.వి.ఎస్. లక్ష్మీ నారాయణని అధికారికంగా INTACH ఆంధప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్‍గా నియమించి, విజయవాడ చాప్టర్ సభ్యుల కృషిని అభినందించారు.
కెప్టెన్ అర్వింద్ శుక్లా ఇంటాక్ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యాలు, విలువలు మరియు కొత్త శాఖలు అనుసరించాల్సిన మార్గదర్శకాలను వివరించారు. విజయవాడలో INTACH యొక్క 240వ శాఖగా విజయవాడ చాప్టర్‍ను ప్రకటించారు. సాయి పాపినేనిని కన్వీనర్‍గా, ప్రసూన బాలంత్రపును సహ-కన్వీనర్‍గా నియమించారు. ఆయన మాట్లాడుతూ ‘‘ప్రతి నగరం తన సాంస్కృతిక మూలాలను వారసత్వం ద్వారా సజీవంగా ఉంచుకుంటుంది. విజయవాడ శాఖ ఆ వారసత్వ చైతన్యానికి ప్రేరణగా నిలుస్తుంది’’ అని అన్నారు.
ఏపీసీఆర్‍డిఏ డైరెక్టర్ మరియు ఇంటాక్ సభ్యురాలైన ఉమా అడుసుమిల్లి కొత్త శాఖ శాస్త్రీయ రీతిలో వారసత్వ పత్రికీకరణ చేపట్టాలని సూచించారు. ఇంటాక్ సభ్యుడు సతీష్ చాగంటి విజయవాడకు ఇలాంటి సంస్థ అవసరమని పేర్కొంటూ, భవిష్యత్తులో ప్రజా మద్దతు పొందడానికి కృషి చేస్తామని తెలిపారు. సుకీర్తి నిటూర్ ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఇంటాక్ కెపాసిటీ బిల్డింగ్ వర్క్షాప్‍లో పాల్గొన్న అనుభవాలను ఇంటాక్ సభ్యులతో పంచుకున్నారు.
విజయవాడ శాఖ భవిష్యత్ ప్రణాళికల్లో స్థానిక వారసత్వ స్థలాల గుర్తింపు, నమోదు, అవగాహన కార్యక్రమాల నిర్వహణ, పునరుద్ధరణ ప్రాజెక్టులు మరియు యువతను వారసత్వ పరిరక్షణ కార్యకలాపాలలో భాగస్వామ్యులను చేయడం వంటి అంశాలు ఉన్నాయి. సభ్యులు ఈ శాఖ నగర సాంస్కృతిక జీవన శైలికి కొత్త చైతన్యాన్ని తీసుకురావడమే లక్ష్యమని పేర్కొన్నారు.

విజయవాడ శాఖ కన్వీనర్ సాయి పాపినేని మాట్లాడుతూ విజయవాడ శాఖ నగరంలోని వారసత్వ పరిరక్షణ రంగంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఇది కేవలం ఒక సంస్థ కాదు, నగర సాంస్కృతిక గౌరవాన్ని నిలబెట్టే ప్రజా ఉద్యమం అని పేర్కొన్నారు.
ఈ ప్రారంభోత్సవం విజయవాడలో వారసత్వ పరిరక్షణకు కొత్త దిశను చూపించిందని, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో INTACH విజయవాడ శాఖ భవిష్యత్తులో నగర సాంస్కృతిక గుర్తింపును మరింత బలోపేతం చేయనుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇంటాక్ సభ్యులు, వారసత్వ ప్రేమికులు, వాలంటీర్లు, విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు.
- కొత్వాల్. సచిన్
ఎ : 86866 64949
