‘‘నేను (టవర్నియర్) 1652, మే నెల 11వ తేదీన పర్షియా గంబ్రూన్ (బండర్ అబ్బాస్) రేవునుండి మసులీపటానికి తిరుగు ప్రయాణంలో ఉన్న గోల్కొండ రాజుకు చెందిన పెద్ద ఓడ ఎక్కాను. ఈ ఓడ ప్రతి సంవత్సరం మసులీపటాం నుండి మస్లిన్స్, రంగులిద్ది పూర్తిగా చేతితయారీ చింటెజ్‍గా పిలువబడిన రంగుకాలికోలు నింపుకొని పర్షియా వస్తుంది. మసులీపటాం తయారీ కేంద్రాలలో కొన్న ధరమీద పర్షియాలో అతి ఎక్కువధరకు ఈ బట్టలు అమ్ముడవుతాయి. తిరుగు ప్రయాణపు ఓడలో ఆరుగురు డచ్ వారు, వందమంది భారతదేశపు నావికులు ఉన్నారు. మేము బయలుదేరిన మరుసటిరోజు నుండి సముద్రం అల్లకల్లోలంగా ఉండి గాలి తీవ్రత అధికంగా ఉంది. గోవా రేవుకు చేరువైన కొద్దీ ఉరుములు మెరుపులతో కూడిన తుఫాన్ గాలులతో ప్రయాణం సాగలేదు. సగందించిన తెరచాపలతో అతి తక్కువ వేగంతో రోజులకొద్దీ సముద్రంలోనే గడపాల్సివచ్చింది. మాల్దీవుల మీదుగా మా ప్రయాణం సాగింది. మాతోపాటు ఓడలో, పర్షియాదేవపు రాజు, గోల్కొండ రాజుకు పంపుతున్న మేలుజాతి గుర్రాలు 55 ఉన్నాయి. పర్షియన్, ఆర్కేనియన్ జాతి వ్యాపారులు వందమంది భారతదేశం వ్యాపారం నిమిత్తం వెళ్తున్నారు. నలుదిక్కుల నుండి చెలరేగిన గాలులవల్ల వర్షపునీరు ఓడలోకి (ప్రమాదభరిత స్థాయిలో) చేరింది. నీటిని తోడి బయటకు పంపే వంపులు పనిచేయటం లేదు. అదృష్టవశాత్తు భారతదేశంలో అమ్మకం నిమిత్తం శుద్దిచేసిన ఆవు చర్మాలు రెండు బేళ్ళు తీసుకొని వెళ్తున్న ఒక వ్యాపారి ఓడలో ఉన్నాడు. బూట్లు కుట్టే చర్మకారులు అయిదురుగు కూడా ఉండటం తటస్థిఇంచింది. ఓడలోని మా అందరి ప్రాణాలకు ముప్పు కలిగింది కనుక, అందరం కలిసి ఓడలోని నీటిని తోడేందుకు కృషిచేశాము. నాల్గు చర్మాలు కలిపి బక్కెట్లుగా కుట్టి, ఓడకు అనువైన అయిదుచోట్ల బయటకు నీరు తోడిపోయటానికి నాల్గు కంతలు చేసి ఒక గంట – గంటన్నరలోగా ఓడలో చేరిన నీరంతా బయటకు తోడగలిగాము. తుఫాన్ తీవ్రతతోపాటు ఉరుములు – మెరుపులు ప్రారంబమయ్యాయి.

ఒక పిడుగు (thunder bold) ఓడ ముందుభాగంలో ఉన్న తెరచాపమీద పడి – దాన్ని రెండుగా చీల్చి, ఓడ మొత్తం కలియతిరిగి ఓడలోని ముగ్గురు మనుషుల్ని పొట్టన పెట్టుకొంది. మరో రెండుగంటలు గడిచింతర్వాత మరొక్క పిడుగు మరో ఇద్దర్ని చంపింది. భోజనం వడ్డించమంటారా’ అని ఓడ సరంగును అడగవచ్చిన వంటవాడిని, మూడవ పిడుగు పొట్టకు చిన్న రంధ్రం చేసి, అతని శరీరం మీద దూసుకువెళ్ళి నెత్తిమీద జుట్టును కాల్చేసింది. ఇప్పుడతను కాల్చిన పంది రూపంలో ఉన్నాడు. 1652, జూన్ 24 ఉదయం సిలోన్ దేశపు ప్రధానరేపు పట్టణం ‘పాయింట్ డిగల్లి’ కనుచూపు మేరలో కనబడింది… శ్రీలంక నుండి మసులీపటాం వరకు ఓడప్రయాణం ఆహ్లాదకరంగా సాగింది. ఉదయం 7 లేక 8 గంటల ప్రాంతంలో మేము మసులీపటాం చేరుకున్నాం. తీరంలో ఉన్న డచ్ కమాండర్, ఓడ సరంగుద్వారా నేను – నాతోపాటు ఎం. లూయిస్-డు-జార్డిన్ ఓడలో ఉన్నాడని తెలుసుకొని, మాకోసం తీరానికి రెండు గుర్రాలు పంపాడు. మేము అతన్ని చూడటానికి వెళ్లాము. తీరం నుండి డచ్ కమాండరు ఇల్లు సగం దూరంలో ఉంది. డచ్ వ్యాపారులు, కమాండరు మమ్మల్నిద్దరినీ చాలా అదరంతో చూచారు. కమాండర్ మాకు రెండుగదులు కేటాయించగా, మేము ఆరాత్రి అక్కడ గడిపాము. మరుసటిరజు మేము డచ్‍కంపెనీ సర్వీసులో ఉన్న స్వీడిష్ జాతీయుడు ఎం. హెర్కులెస్ ఇంటికి వెళ్ళాము. అతనికి పట్టణంలో స్వంత ఇల్లు ఉంది. తమతోపాటు ఉండమని, తమ ఇంట భోజనం చేయమని బాగా ఒత్తిడి చేశాడు. సరదాగా గడపటానికి మేము అతనింటికి రెండు, మూడుసార్లు వెళ్ళాం. డచ్‍వారిలో ముగ్గురు వివాహితులు. వారి భార్యలు కూడా మాతోపార్టీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మేము వారికి పర్షియా నుండి తెచ్చిన పండ్లు (డైఫ్రూట్స్), ద్రాక్షసారాయి (వైన్) బహుమతులుగా ఇచ్చాం. నాతోపాటు ఉన్న ఎం.డు. జార్డిన్ ‘లూటు’ వాయిద్యం వాయిస్తూ నృత్యంచేసి వారిని ఆనందింపచేశాడు.

ఇంగ్లీషువారు కూడా రెండు మూడుసార్లు చిన్నపార్టీల్లో కలిసి మమ్మల్ని ఆనందింపజేశారు. జులై 18, 19 తేదీల్లో మేము ఒక పల్లకి (palanquin), మూడు గుఱ్ఱాలు, ఆరు ఎడ్లు మమ్మల్ని, మాప్రయాణం లగేజి చేరవేత నిమిత్తం (మసులీపటాంలో) కొనుగోలు చేశాం. మేము పర్షియా నుండి బేరిపండు ఆకారపు (pier shaped) 34 మరియు 35 క్యారెట్ల తూగే మంచిముత్యాలు, పచ్చలు (emeralds) పొదిగిన బంగారు ఆభరణాలు గోల్కొండ రాజుకు అమ్మటానికి వెంటతెచ్చాము. గోల్కొండ ముఖ్యమంత్రి – సైన్యాధ్యక్షుడు మీర్ జుమ్లా చెప్పనిదే, గోల్కొండ రాజు రత్నాలు – ఆభరణాలు కొనడని డచ్‍వారు మాతో చెప్పగా, కర్ణాటక దేశపు గండికోట ముట్టడిలో ఉన్న మీర్‍జుమ్లా వద్దకు మేము వెళ్ళటానికి సిద్ధపడి లక్కవరం మీదుగా కొల్లూరు (పులిచింతల బేసిన్) దారిన ప్రయాణం చేశాము…’’ ఇలా సాగింది టవెర్నియర్ బందరు పట్టణ ప్రయాణం జ్ఞాపకాలు (The route from Goa to Masulipatnam – History of the capture of that own by the Dutch & Travels in India by Jean Baptiste Tavernier, Translatiion by V. Ball, Director oft he Science And art Musuem Dublin).
-మహమ్మద్ సిలార్
కన్వీనర్, ఇంటాక్ మచిలీపట్నం చాప్టర్
ఎ : 998556494
