‘చావు ద్వారం వద్ద నిలబడి పిలుస్తుంటే
గేలి చేస్తూ పగలబడి నవ్వేవారెవరు?
కబళించిన చావును తిరిగి, విసిరి
గోడకు దిగ్గొట్టిన వారెవరు?
-సముద్రుడు (అజ్ఞాత విప్లవ కవి)
ఈసారి సరదాగా మనం కొన్ని చావు కబుర్లు చల్లగా చెప్పుకుందామా?
మృత్యువు ముందు ముఖాముఖంగా నిలబడి దాని కళ్లల్లోకి సూటిగా చూస్తూ కాసేపు పరిహాసాలాడుకుందామా?
నేనూ, నా సతీమణి – మా ఇద్దరికీ ఏమీ పని పాటా లేనపుడు ఏమీ పొద్దుపోనపుడు మృత్యువును మజాక్ చేస్తూ కాలక్షేపం కోసం దానిమీద కొన్ని జోకులేసుకుంటూ ఉంటాం. మచ్చుకు మా చావు ముచ్చట్లు కొన్ని మీతో ముచ్చటగా పంచుకుంటాను.
మా ఇద్దరికీ పచ్చిమిరపకాయలు బాగా దట్టించి చేసిన వేడివేడి పెసరగారెలంటే మహా ఇష్టం. మేం చనిపోయాక నరకానికో లేదా స్వర్గానికో ఎక్కడికో అక్కడికి వెళ్తాం కదా! అక్కడి మెస్‌లో గరం గరం పెసర గారెలు దొరుకుతాయో లేదో అని ఇప్పట్నించే బెంగపెట్టుకుంటూ ఉంటాం. ఇక పోతే మా ఇద్దరికీ గాలి వెలుతురూ ధారాళంగా ఉండాలి. గాలి ఆడకపోతే మాకు చచ్చేచావు. మేం బొందలోకి వెళ్లిన తర్వాత దానికి తలుపులు కిటికీలు ఉండవు కదా గాలి ఎట్లా వస్తుందని నేను పరేషాన్ అవుతుంటా. ‘‘ఏం పరవాలేదు. మనం మన బొందలో ఒక ఉషా ఫ్యాన్ ఏర్పాటు చేసుకుందాం’’ అని నా శ్రీమతి నన్ను ఓదారుస్తుంది. బొందలో పడుకున్న తర్వాత కాలక్షేపం ఎలా అవుతుంది. విసుగ్గా ఉంటదేమో అని నేను మళ్లీ కొత్తగా ‘‘కిరికిరి’’ పెడుతుంటే ‘‘అయ్యో అదేమంత ప్రాబ్లెమ్? బొందలోకి కొన్ని లావు లావు పుస్తకాలు తీసుకపోతే సరి’’ అని నా అర్ధాంగి ఆ సమస్యను చిటికెలో పరిష్కరిస్తుంది. నాకు మరో కోరిక కూడా ఉంది. నేను పై లోకాలకు వెళ్లాక అక్కడ సృష్టికర్త కనబడితే ‘‘నువ్వు సృష్టించిన ఈ లోకం ఇంత అస్తవ్యస్తంగా ఎందుకుంది? ఈ కష్టాలు కన్నీళ్లకు ఈ దుర్మార్గాలకు, దౌర్జన్యాలకు కారణాలేమిటి? నువ్వు చిత్రించిన ఈ చిత్రం ఇంత చెత్తగా ఎందుకుంది? You are very bad Artist”క్లాసు పీకాలని నా ఆఖరి కోరిక.
× × ×
రవీంద్రనాథ్ఠాగూర్ తన కవితలో ఒక చోట ఇలా అంటాడు. ‘‘నేను పుట్టినప్పట్నుండి నన్ను నీడలా వెంబడిస్తూనే వున్నావు. నన్ను వెనక నుండి హఠాత్తుగా దొంగదెబ్బ తీయాలని. అ••నా నువ్వంటే నాకు భయం లేదు. మరణించినా మళ్లీ మళ్లీ జన్మిస్తూనే ఉంటాను. పునరపి జననం – పునరపి మరణం’’.
పెద్ద కాళోజీ ‘‘షాద్’’ రామేశ్వరరావుగారు మృత్యువును హుందాగా ఆహ్వానించాడు.
‘‘ఆకుపచ్చ ఆకులు చెట్టుకు అలంకారాలు.
పసుపుపచ్చ పండుటాకులు మోతబరువు
కొమ్మకు అతుక్కుని ఎంతకాలం వేలాడుతావు
ఆకురాలు కాలం వచ్చింది ఇక రాలిపోరాదా’’.
చాలా సంవత్సరాల క్రితం నేను కాకినాడలో ‘‘బ్రహ్మసమాజం’’ ప్రాంగణానికి వెళ్లాను. అక్కడ ఒక వ•లలో సర్ రఫ•పతి వెంకటరత్నం నా•••డు సమాధిపై రాసి ఉన్న ‘‘ఎపిటాఫ్’’ నన్ను ఆకర్షించింది.
‘‘ఇతను జీవించనూ లేదు. మరణించనూ లేదు. ఆది మధ్యాంత రహిత విశ్వవినువీధులలో సంచరిస్తూ రవంత సేపు విశ్రమించటానికి ఈ పుడమి మీద ఆగినారు’’.
బన్సీలాల్‌పేట స్మశానంలోని గోపాల్‌దాస్ మఠం ‘‘కబీర్ పంత్’’ సభ్యులు పాడే ఒక భజన నాకు యాదికొస్తుంది.
‘‘దునియామే ఆయా మనుష్య్ బన్కే
యహాఁ ఫిర్తాహై మూరఖ్ పశూ బన్కే’’
‘‘సమల్ కర్ చలో మేరే మనువా
ఏ ఖిలోనా టూట్ జానే వాలీ హై
సమజ్‌కర్ దేఖో మేరే మనువా
ఏ దునియా ఛూట్ జానే వాలీ హై’’
× × ×
మృత్యువుకు ముందు రాసుకునే వీలునామాలు కూడా చాలా అందంగా ఉంటాయి. నెహ్రు వీలునామా నాకు చాలా ఇష్టం. ఆయన నాస్తికుడు కదా! తన అంత్యక్రియలలో మతప్రమేయం, బ్రాహ్మణ పద్దతులు ఉండకూడదని ఆయన వీలునామాలో రాశాడు. కాని క్యా ఫాయిదా? అప్పటికి ఆయన కూతురు ఒక ‘‘గూంగీ గుడియా’’, అమాయిక. ఆపద్ధర్మ ప్రధాని గుల్జారీలాల్ నందా పుణ్యమా అని కాశీబ్రాహ్మణ పండితుల ఆధ్వర్యంలో ఆయన కర్మకాండ ప్రయాగ సంగమంలో శాస్త్ర ప్రకారం జరిగింది. నెహ్రు రాసిన ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ ప్రభావంతో నేను కూడా 1976లో మా బాపు అంత్యక్రియలను హిందూమత పద్దతులకు వ్యతిరేకంగా చేసి మా పెద్దల ఆగ్రహానికి గురైనాను.
కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావుగారి వీలునామా నాకు కన్నీళ్లను తెప్పించింది.
‘‘నేను నా జీవితాన్ని సంపూర్ణంగా వినియోగించుకున్నాను. నాకు ఆస్తులు లేవు. అప్పులు లేవు. నా తదనంతరం నా దుస్తులు పేదప్రజలకు, నా పుస్తకాలు ఏదైనా లైబ్రరీకి ఇవ్వగలరు’’. సంక్షిప్తంగా ఇదీ ఆ కవ్యనిస్టు యోధుడి వీలునామా.
యస్.వి.ఘాటే కూడా కవ్యనిస్టు నాయకుడు. ‘‘నా మృత్యువు అంత ముఖ్యమైనదేమీ కాదు. మీరెవరూ మీ పనులను వదులుకుని అమూల్యమైన మీ కాలాన్ని వృధా చేసుకుని నా అంత్యక్రియలకు రావద్దని నా విజ్ఞప్తి’’. ఇదీ ఆయన రాసిన వీలునామా.
గొప్పవాళ్లు చనిపోయాక వారి గురించి రాసే జ్ఞాపకాలను ‘‘ఎలిజీలు’’ అంటారు. స్మృతిగీతాలు, స్మృతి వాక్యాలే ఈ ఎలిజీలు.
కొంపెల్ల జనార్ధనరావు చనిపోగా శ్రీశ్రీ ‘‘దొంగలంజ కొడుకులసలే మెసలే ధూర్త లోకంలో నుండి వెళ్లిపోయావా నేస్తం’’ అని కవిత రాసి అంగలార్చాడు.
లోకనాయక్ జయప్రకాశ్ నారాయణ్ మృతి వార్త విని చిన్న కాళోజీ:
‘‘పుటక నీది చావు నీది
బ్రతుకంతా దేశానిది’’ అన్నాడు.
‘‘చివరకు మిగిలేది’’ నవల రాసిన బుచ్చిబాబు చనిపోయినపుడు ఒక కవి ‘‘ఆంధ్రదేశం నిలువుటద్దం భళ్లున బ్రద్దలయి పోయింది అన్నాడు. కృష్ణశాస్త్రి మరణవార్త విని శ్రీశ్రీ ‘‘షెల్లీ మళ్లీ మరణించాడు’’ అన్నాడు. నెహ్రూ హఠాన్మరణ వార్త కె.ఏ. అబ్బాస్‌కు అందింది. అప్పుడు ఆయన బ్లిట్జ్ వారపత్రికలో పనిచేస్తున్నాడు. అప్పటికే పేపరు డెడ్‌లైన్ దగ్గరి కొచ్చింది. మంచి టైటిల్ రెండు పదాలలోనే ఉండాలని పత్రికాధిపతి కరంజియా తొందర పెట్టసాగాడు. అబ్బాస్ ఆలోచించి Nehru Diedఅని కాక Nehru Livesఅని టైటిల్ పెట్టాడు. అంటే ఆయన మరణించినా ఆయన ఆశయాలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పటం. ఇవన్నీ ఎలిజీలే.

చంద్రశేఖర్ ఒకప్పుడు నా ప్రియ మిత్రుడు. పక్కా సోలానా తెలంగాణా వాది. సంస్కృతం చదివిన వాడు. కవిత్వం రాసేవాడు. ఇద్దరం కలిసి తెలంగాణా రచయితల సంఘంలోనూ, తెలంగాణా ఉద్యోగుల సంఘంలోనూ చురుకుగా పని చేసాం. ఆఫీసు పనుల మీద ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలు పర్యటించాం. తెలంగాణా రాకముందేకుటుంబ సమేతంగా తిరుపతికి
వెళ్లుతూ కడప దగ్గర రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ‘‘సార్ ఎక్కువగా చదివి తక్కువగా రాయాలి’’ అని నాతో అనేవాడు. నేను అతని గురించి ఒక ఎలిజీ రాస్తూ: ‘‘చంద్రశేఖర్ నువ్వు చూడలేని తెలంగాణాను మేము చూస్తాం. తెలంగాణా రాగానే నేను ముందు నిన్నే జ్ఞాపకం చేసుకుంటా’’ అన్నాను.
అన్నట్లే తెలంగాణా సిద్దించగానే నేను, నా సహచరి కల్సి నాంపల్లిలోని అమరవీరుల స్థూపం దగ్గరికి వెళ్లి చంద్రశేఖర్‌ను గుర్తు చేసుకుంటూ పుష్పగుచ్చం సమర్పించాం.
మరో మిత్రుడు కాతోజు వెంకటేశ్వర్లు హఠాత్తుగా జరిగిపోయాడు. అతను నిరంతరం కళ్లద్దాలు ధరించేవాడు. ఆయన రంగస్థల నటుడు కూడా. నేను ఆయనపై రాసిన స్మృతిగీతం ఇలా ఉంది.
‘‘కాతోజూ ఇదేమైనా న్యాయంగా ఉందా?
నాటకం నడుస్తుండగానే మధ్యలో
హఠాత్తుగా మాయం అయ్యావ్.
మళ్లీ వస్తాననైనా చెప్పలేదు.
రంగస్థలం ఖాళీగా ఉంది కాతోజూ
కాలేజీలో అటెండెన్స్ రిజిస్టర్ ఖాళీగా ఉంది
ప్లీజ్ ఒకసారి వచ్చి సంతకం చేసి వెళ్లరాదా?
అన్నట్లు కాతోజూ నీ స్కూటర్ ఇక్కడే ఉంది.
మరి దేవలోకంలో నువ్వు ఎలా తిరుగుతావు?
దోస్తులందర్నీ నువ్వు దిల్సుఖ్నగర్ చౌరాస్తాలో వదిలేసి
మంచుపల్లకీ ఎక్కి మౌనంగా నిష్క్రమించావు
కాతోజూ ఇదేమైనా న్యాయంగా ఉందా?
కామ్రేడ్ చండ్రరాజేశ్వరరావుగారి అంత్యక్రియలు పంజాగుట్ట స్మశానంలో జరిగాయి ఆ వీరుడి అంతిమ యాత్రలో అశేష విషాద జనసముద్రాలు అలలు అలలుగా కదిలి స్మశానం దాకా విస్తరించాయి. చితి మంటలు చెలరేగుతున్నపుడు పడమటి ఆకాశంలో సింధూరవర్ణంలో కుంగుతున్న సూర్యుడు కాస్తా వంగి ఆ వీరుడి నుదుటిని ముద్దాడుతున్నట్లు నాకు భ్రమ కలిగింది. మావోయిస్టు నాయకుడు ‘‘ఆజాద్’’ ఎలియాస్ చెరుకూరి రాజ్‌కుమార్ ఎన్కౌంటర్ అయ్యాక ఆయన అంత్యక్రియలు కూడా అదే స్మశానంలో జరుగుతుంటే ఆ రుద్రభూమిలో నేనూ, ఆర్టిస్టు మోహనూ నిలబడి మధ్య ఆసియా చరిత్రను, మోహిత్‌సేన్ స్వీయ చరిత్ర”A travelor and the Road”గురించి హాయిగా గంటసేపు మాట్లాడుకున్నాం. ఆ వీరుడి మరణం మాకు విషాదాన్ని కలిగించలేదు. ఎందుకంటే రావిశాస్త్రి భాషలో వీరులు ఎక్కువ కాలం జీవించరు. పోరాటాలలో త్వరగానే మరణిస్తారు. ఏ వీరుడైనా ఎక్కువ కాలం జీవించాడంటే వాడు దొంగ వీరుడైనా్య ండాలి లేదా అవకాశావాద వీరుడైనా్య ండాలి. ఒకప్పటి వీరులు ప్రస్తుతం తెలంగాణ వచ్చినంక అవకాశా వాదంతో ఎట్లా రంగులు మారుస్తున్నారో ఎట్లా పిల్లి వె•గ్గలు వేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం కదా!
చలం తన చావు గురించి చాలా చిత్రమైన అభిప్రాయం చెప్పాడు. ‘‘నేను చనిపోయాక నా శవం ముందు నిలబడి ఎవరూ ఏడవద్దు. ఎవరైనా ఏడ్చారో జాగ్రత్త పాడెమీద నుండి లేచి చితక తంతాను’’ అన్నాడు.
అమితాబచన్ తండ్రి హరివంశ్ రాయ్ బచన్ ‘‘మధుశాల’’ కావ్యకర్త తన స్వీయచరిత్రలో ఇలా అన్నాడు. ‘‘నేను ప్రతిరోజు రాత్రి పన్నెండు గంటలకు పడుకుని మళ్లీ ఉదయం మూడు గంటలకే నిద్రలేచి త్రివేణీ సంగమంలో స్నానానికి వెళ్తాను. నేను మధ్యాహ్నం కూడా నిద్ర పోను ఎందుకంటె ఆరాం హారాం హై. నేను చనిపోగానే త్వరగా దహనం చేయకండి. నా శవాన్ని రెండు మూడు రోజులు అట్లే పెట్టండి. నేను కంటి నిండా నిద్రపోవాలి’’.
‘‘చావు కూడా పెళ్లిలాంటిదే’’ అన్న సామెత తెలంగాణాలో ఇప్పటికీ సార్థకంగానే ఉన్నది. దళితులు, బహుజన సముదాయాల అంత్యక్రియలు దీనికి నిదర్శనం. మేళతాళాలతో మనిషిని సగౌరవంగా సాగనంపుతారు. అది కూడా పెళ్లిలాంటి హడావుడే. నిరక్షరాసులైన గ్రామీణ తల్లుల అక్కల చెల్లెళ్ల శోకం సుదీర్ఘంగా పోయిన వారి గురించి వైన వైనాలుగా వర్ణిస్తూ, జ్ఞాపకం చేసుకుంటూ బహు కవితాత్మక శోకంగా ఉంటుంది. అది మామూలు శోకంగా కాక రసాత్మక శ్లోకంగా మారుతుంది.
పంజాబీలకు మరణం చాలా తేలికైన విషయం. దేశభక్తులు, వీరులు చనిపోతే ఎవరూ కంటతడి పెట్టరు. అదొక అపచారంగా భావిస్తారు. వారి ఆత్మలను అగౌరవ పరిచినట్లు బాధపడతారు. ‘‘దేశ్ కెలియె ఇస్ రాహ్మె మర్నా సౌ జన్మోంకా సమాన్ హై’’ అని గర్వపడతారు.
మిలీనియంకు ఒకటిరెండు రోజుల ముందు ఎర్రం రెడ్డి సంతోష్‌రెడ్డి, నల్లా ఆదిరెడ్డి, నరేష్‌ల ఎన్కౌంటర్ జరిగింది. నేను కడివెండికి వెళ్లి సంతోష్‌రెడ్డి అంత్యక్రియలలో పాల్గొన్నాను. దొడ్డికొమరయ్య అమరుడైన నేల అది. త్యాగాల పరంపర, వారసత్వం అక్కడ ఆ నేలమీద నేటికీ కొనసాగుతూనే ఉంది. దేశం నలుమూలల్నుండి వచ్చిన వేలాది మంది జనం ‘‘జైబోలో జైబోలో సంతోషన్నకు జైబోలో’’ అంటూ ఆ వీరుడిని పాటల పల్లకీలో ఊరేగిస్తూ ఆకాశం అవతలివైపుకు సాగనంపారు. ఆ దృశ్యాలని చూస్తుంటే నాకు ‘‘కె మర్ కె భీ కిసీ కో యాద్ అయింగే- జీనా ఇసీ కా నామ్ హై’’ పాట జ్ఞాపకం వచ్చింది.
‘‘మరణానంతర జీవితం’’ అని ఒక మాట ఉంది. అంటే లైఫ్ ఆఫ్టర్ డెత్ అన్న మాట. బాడీ డొనేషన్ ఈ కోవకే చెందుతుంది. కాళోజీ సోదరులు, కొండపల్లి కోటేశ్వరమ్మగారు ఇంకా అనేక మంది తమ శరీరాలను మెడికల్ కాలేజీలకు దానంగా ఇచ్చారు. ఎంత గొప్ప ఉదాత్త భావన. చనిపోయినా సమాజానికి ఉపయోగపడటం అంటే ఇదే కదా!
క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ అమెరికాలో చికిత్స పొందుతున్న సినీనటి సోనాలిబింద్రే ఒక మాట అన్నది. ‘‘నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. అందుకే క్యాన్సర్‌తో పోరాడుతున్నా. అయినా జీవితం అంటే ఏమిటి? చివరి క్షణం వరకూ నేర్చుకోవటమే కదా?’’ ఈ మాటలు నాకు అబ్బురమనిపించి జయలలిత జ్ఞాపకం వచ్చింది. ఆమె చెన్నై అపోలో ఆసుపత్రిలో అంపశయ్యపై పడుకుని
ఉన్నా జ్ఞానతృష్ణతో ‘ది ప్రైవేట్ లైఫ్ ఆఫ్ మావో’ పుస్తకాన్ని ఒక డాక్టర్‌తో ప్రతిరోజు చదివించుకుని వినేదట. ఆ వార్త చదివిన నేను ఆమె తప్పులన్నీ ఆ క్షణంలో క్షమించివేశాను. ఈ సందర్భంలో నాకు మళ్లీ సోక్రటీసు, భగత్సింగు జ్ఞాపకం వస్తున్నారు. తెల్లారితే సోక్రటీసుకు గరళపానంతో మరణశిక్ష. ఆయనకు వీధిలో ఏక్తారా సంగీతం వినబడి ఆ కళాకారుణ్ణి తనున్న గదికి రప్పించి ఎంతో ఇష్టంగా ఆ వాయిద్యాన్ని నేర్చుకున్నాడట. దానికి ఆయన శిష్యులు ఆశ్చర్యపడుతుంటే ‘‘జీవితమంటే చివరి క్షణం వరకు నేర్చుకోవటమే కదా’’ అన్నాడు.
భగత్‌సింగ్ కూడా అంతే తెల్లారితే ఉరికంబానికి ఉయ్యాలలూగవలసిన వాడు ఆ రాత్రంతా లెనిన్ పుస్తకాన్ని చదువుతూ కూచున్నాడట. నిజమైన చదువు, జ్ఞానతృష్ణ అంటే అది. ఇంటి ముందు గోడపైన ఎం.ఎ. పి.హెచ్డి బోర్డులు తగిలించుకుని మూరిసిపోవటం కాదు. జాక్ లండన్ ఒక మాట అంటాడు. ‘‘జీవితం అంటే బత్రుకును ఈడుస్తూ బ్రతకటం కాదు. జీవితాన్ని సంపూర్ణంగా చివరి క్షణం వరకూ జీవించటం’’ (Life is to Live not to exists).
ఇదంతా సరేగాని ‘‘బొందల గడ్డ’’ గురించి మరికొంత సేపు మజేదార్ ముచ్చట్లు మాట్లాడుకుందాం. ఎక్కడికి వెళ్లినా ఏ దేశమేగినా సమాధులను సందర్శించటం నాకిష్టమైన వ్యాపకం. ఆ మాటకొస్తే కుష్వత్ సింగ్ కూడా అంతే. తీరిక దొరికినపుడల్లా ఢిల్లీ యమునా తీరంలోని ‘‘నిగం భోద్ ఘాట్’’కు వెళ్లి గంటల తరబడి కూచునేవాడు. ‘‘నేనొక సాయంకాలం ఒకానొక స్మశానానికి వెళ్లాను. ఆ వాతావరణం చాలా ప్రశాంతంగా, అందంగా అనిపించి, అక్కడే ఆగిపోవాలని, ఆ రాత్రి ఆ నీరవ నిశ్శబ్ద నిశిరాత్రి వేళ రాయి-రాయి కరిగే గాంధారి వేళలో ఎవరైనా ఒక స్త్రీతో అక్కడ ఆ రుధ్రభూమిలో రమించాలని నాకు వింత కోరిక లిప్తకాలంపాటు జనించింది. మర్యాదస్తులకు ఈ మాట రుచించదు గాన ఇంతటితో ఈ ప్రస్తావన ముగిస్తాను.
(తరువాయి వచ్చే సంచికలో) (చార్మినార్ కథల పుస్తకం నుండి)
-పరవస్తు లోకేశ్వర్
ఎ:91606 80847
