జాతి చైతన్యానికి నాంది గ్రంథాలయాలు

ఇవాళ పుస్తకాలు ఎవరు చదువుతున్నారు. ఆరోజులు పోయాయి అనేమాటలు మనం తరచూ వింటూ వుంటాం. ప్రస్తుత విద్యావిధానం వల్ల, కెరీర్‍ ఒక్కటే చదువుల లక్ష్యంగా మారిన వేళ పై మాటల్లో సత్యం లేకపోలేదు. అలా తగ్గిపోవడానికి దీనికి ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల్ని పెంచుతున్నతీరు, ఆటలు, పాటలూ లేని బాల్యాన్ని యిస్తన్న తీరు, చిన్నప్పటి నుంచే స్థోమతకు మించి ఆడంబరాలు, విలాసాలు అలవాటు చేస్తున్న తీరు, పిల్లలు సాధించవలసిన లక్ష్యాలను నిర్దేశిస్తున్న తీరు, మంచి భవిష్యత్తు పేరిట వారిని డబ్బు సంపాదించే యంత్రాలుగా తయారు చేస్తున్న తీరు కారణం. పిల్లలు పెద్దయిన తర్వాత తాము సామూహిక జీవితంలో ఒక భాగంగా కాక విడివిడి వ్యక్తులుగా మిగిలిపోతున్న ప్రమాదకర స్థితిని మనం చూస్తున్నాం. ఇది తల్లిదండ్రుల తప్పు కాదు. జీవన భద్రతకు భరోసా యివ్వలేని సామాజిక నిర్మాణమే దీనికి కారణం. ఈ స్థితిని మార్చడానికి సామాజిక అవగాహన, చైతన్యం అవసరం. ఈ అవసరాన్ని తీర్చగలిగే అనేక అంశాలలో గ్రంథాలయాలు ముఖ్య పాత్ర నిర్వహిస్తాయి.

చదవడం, రాయడం వచ్చిన దగ్గర్నుంచీ పుస్తక పఠనం జీవితంలో ఒక భాగమై ఇప్పటికీ కొనసాగుతుంది. జాతీయోద్యమంతో పాటు సమాంతరంగా గ్రంధాలయోద్యమం కూడా సాగింది. జాతి చైతన్యానికి నాంది గ్రంథాలయాలు. తెలుగు ప్రాంతంలో ఆధునిక గ్రంథాలయం మొదటిసారిగా 1886లో విశాఖలో ప్రారంభమైంది. తరువాత గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అనేక గ్రంథాలయాలు ఏర్పాటయ్యాయి. గ్రంథాలయాలు ప్రజలను సమకాలీన పరిస్థితులపై చైతన్య పరిచి కార్యాన్ముఖులను చేయడంలో ప్రధాన పాత్ర పోషించాయి. జాతీయోద్యమానికీ, అనేక సామాజిక, సంస్కరణ ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచాయి. గ్రంథాలయాలు పిల్లల ఆలోచనా శక్తిని, సృజనాత్మక శక్తినీ, వ్యక్తీకరణ నైపుణ్యాలను పెంచుతాయి. వివిధ అంశాలపై అవగాహన పెంచుతాయి. గ్రంథాలయాలల్లో ప్రాచీన గ్రంథాల నుంచి ఆధునిక చరిత్ర వరకు అనేక గ్రంథాలుంటాయి. ఇవి ప్రజలను, విద్యార్థులను, సమాచారంతో పాటు విజ్ఞాన వికాసానికి దోహదం చేస్తాయి. పోటీ పరీక్షలు రాసే వారికి, పరిశోధక విద్యార్థులకు గొప్ప పెన్నిధి గ్రంథాలయాలు.

సాఫ్ట్కాఫీలకు, పిడియఫ్‍లకు అలవాటు పడిన తర్వాత పుస్తక పఠనం తగ్గిపోయిందనే మాట పాక్షిక సత్యమే. చేతిలో పుస్తకం పట్టుకొని చదివినప్పటి అనుభవం, అనుభూతి మధురమైనది.
వేల పుస్తకాలతో స్వంత గ్రంథాలయాలు వున్నవారు అనేక మంది ఉన్నారు. ఇప్పటికీ గ్రంథాలయాలకు వెళ్లే పెద్దలూ వున్నారు. కొత్తతరం యువతీ యువకులు ప్రచురణ రంగంలోకి ప్రవేశించి మంచి మంచి పుస్తకాలు తేవడం తెలుగు సాహితీ రంగంలో నూతన పరిణామం. ఇతర ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ బుక్‍ ఫెయిర్స్, లిటరేచర్‍ ఫెస్టివల్స్ నిర్వహించడం ప్రజలలో, యువతరంలో, విద్యార్థుల్లో పుస్తకాలపట్ల ప్రేమను పెంచడానికి దోహదం చేస్తున్నాయి.
సమాజ మార్పుకి చోదకశక్తి గ్రంథాలయాలు. గ్రంథాలయాల స్థాపన, నిర్వహణ, రక్షణ ప్రభుత్వాలతో పాటు నిరంతరం కొనసాగించవలసిన మనందరి బాధ్యత.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *