ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో సాధారణంగా పాఠశాల విద్యార్థులు అయినా, కళాశాల విద్యార్థులు అయినా పరీక్షలు వ్రాయవలసిన సమయం. విద్యార్థులు ఆందోళన చెందుతూ పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయం.
గతంలోకంటే పిల్లలపై మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగింది. పిల్లలకంటే పిల్లల తల్లిదండ్రుల పై ఇంకా ఎక్కువ పెరిగింది. మావలే మా పిల్లల భవిష్యత్తు మారకూడదని, మేము చదవని చదువంతా మా పిల్లలు చదవాలని వారిపై తీవ్ర మానసిక ఒత్తిడిని తల్లిదండ్రులే పెంచుతున్నారు.
బాగా చదివే (intelligent) విద్యార్థి కాని, సాధారణంగా చదివే (average) విద్యార్థి కానీ, వెనుకబడిన (dull) విద్యార్థి కానీ దీనికి మినహాయింపు కాదు.
GPA పద్ధతి రాక ముందు పాస్/ఫేయిల్ ఫస్ట్ క్లాస్ 60% సెకండ్ క్లాస్ 50% థర్డ్ క్లాస్ 35% అని ఉంటుండేది. చాలామంది పాస్ అయితే చాలు అనుకునే వారు. పిల్లలపై ఎలాంటి ఒత్తిడి ఉండేది కాదు.
ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే ఉన్నంత వరకు ఒత్తిడి అంతంత మాత్రంగానే ఉండేది. ఎప్పుడైతే ప్రైవేటు విద్యా విధానం వచ్చిందో అప్పటినుంచి ఈ మార్కుల చదువు మొదలైంది. విద్యార్థి 97% మార్కులు సాధించినా ఆ 3% మార్కులు ఎందుకు రాలేదని ఒత్తిడి. పాఠశాలల మధ పోటీ తత్వం పెరిగి ఆ ఒత్తిడి పిల్లలపై రుద్దుతున్నారు. వారి వారి పాఠశాలల మనుగడ కోసం పిల్లలపై ఒత్తిడి పెంచుతూ, విషయ పరిజ్ఞానం కన్నా మార్కులు సాధించే మెళకువలు నేర్పిస్తున్నారు. వెరసి 97 నుండి 100% మార్కులు సాధించినా పిల్లలకు విషయ పరిజ్ఞానం ఉండడం లేదు.
గతంలో చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఉండేది. మానసిక ఒత్తిడిని తట్టుకునుటకు శారీరక వ్యాయామం చాలా సహకరిస్తుంది అందుకే ఆటవిడుపు కావాలంటారు. ప్రస్తుతం మైదానం లేని పాఠశాలలు ఎక్కువ. పాఠశాలలో పిల్లలకు క్రీడలు లేకపోవడం కూడా వారి మానసిక ఒత్తిడిని పెంచుతుంది.’’
ఒక దేశ భవిష్యత్తు తరగతి గది నాలుగు గోడల మధ్య నిర్మాణం అవుతుంది అంటారు. ఈనాటి విద్యార్థులే రేపటి భారత పౌరులు. మంచి సమాజ నిర్మాణం జరగాలన్నా, చెడు సమాజ నిర్మాణం జరగాలన్నా విద్య పాత్ర ముఖ్యం. ఒక దేశ భవిష్యత్తును నాశనం చేయాలంటే ఆ దేశంపై అణుబాంబులు వేయవలసిన పని లేదు, కేవలం ఆ దేశ విద్యా వ్యవస్థను నాశనం చేస్తే ఆ దేశం దానికదే పతనం అవుతుందట.గురువులు విద్యార్థి భవిష్యత్తు నిర్మిస్తున్నప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
పిల్లలు పరీక్షలకు సన్నద్ధమవుతున్నప్పుడు వారికి కావలసిన సౌకర్యాలను, వాతావరణాన్ని కల్పించాలి. మంచి గాలి వెలుతురు ప్రసరించే విధంగా చూసుకోవాలి. వారికి తేలికపాటి బలమైన ఆహారాన్ని అందించాలి. శరీరానికి నిద్ర కూడా అవసరం, రోజుకు శరీరానికి కావాల్సిన కనీస నిద్ర పోయే విధంగ చూడాలి. ఎలాంటి శారీరక మానసిక ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలి. అన్ని రోజులు కష్టపడి చదివిన వారిని, పరీక్ష ముందు రోజు రాత్రి ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా నిద్ర పోయేవిధంగ చూడాలి.
పరీక్ష రోజు మానసిక ఒత్తిడి లేకుండా పరీక్ష కావలసిన పెన్నులు పెన్సిల్స్ ఎరేజర్ షార్పునర్ ముందుగానే సరి చూసుకోవాలి. బయలుదేరే సమయానికి ఇది దొరకడం లేదు, అది దొరకడం లేదు అని గాబర పడితే అప్పటినుండే మానసిక ఒత్తిడి (Tension) మొదలవుతుంది.
రవాణా సౌకర్యం కూడా ముఖ్యం. సమయానికి కొంచెం ముందుగానే బయలుదేరాలి. పొరపాటున కొద్దిగ లేట్ అయినా ట్రాఫిక్‍లో ఇరుక్కు పోయినా ఆందోళన చెందవలసి వస్తుంది. తాను కూర్చోవలసిన గది, కూర్చోవలసిన సీటు ముందుగానే చూసుకుని ప్రశాంతంగా ఉండాలి. పైన చెప్పిన వాటిలో ఏఒకటి లోపించినా విద్యార్థి ఆందోళన చెందుతాడు.
విద్యార్థులు సంవత్సర కాలం కష్టపడి చదివి పరీక్షలు వ్రాసి ఉత్తీర్ణులు కాకపోయినా, ఊహించిన మార్కులు రాకపోయినా పిల్లలు మానసిక క్షోభకు లోనవుతారు. మానసికంగా కూoగిపోయే పిల్లలను ముందుగానే గుర్తించి వారికి మానసిక స్థైర్యాన్ని కల్పించాలి. చదువు జీవితంలో ఒక భాగం, చదువే జీవితం కాదు అని వారిని ఊరడించాలి. చదువుకోకున్నా జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన వాళ్ల గురించి చెప్పాలి.
పిల్లలు చదువులో రాణించకున్నా వారికిష్టమైన రంగంలో ప్రోత్సహించాలి. వారి అభిరుచులకు అనుగుణంగా వారి మానసిక స్థాయికి సరిపోయే రంగాల్లో వారిని ప్రోత్సహించాలి.
-దామెర నర్సయ్య
ఎ: 9849533754
