ఐనవోలులో సాంప్రదాయ పునాదులపైకాకతీయ కీర్తి తోరణ నిర్మాణం

కాకతీయుల కాలము నాటి 800 సంవత్సరాలక్రితం చెక్కబడిన కీర్తి తోరణం శిలలను గుర్తించి, యేరి కూర్చి, ఒక దగ్గర చేర్చి, విరిగి పోయిన శిలలను అతికించి జత చేసి ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయ ప్రాంగణములో ఉత్తర దిక్కున నాటి కాకతీయుల కాలములో నిర్మించిన విధముగా నిర్మాణము చేయటము జరిగింది.
రాష్ట్ర పురావస్తు శాఖ సంరక్షణ విభాగము ఈ నిర్మాణ పక్రియను సిమెంట్‍ కాంక్రీట్‍ను వాడకుండా సాంప్రదాయ పద్ధతిలో ప్రకృతి సిద్ధమైన మెటీరియల్స్తో పునాదులను నిర్మించింది. సిమెంట్‍ కాంక్రీట్‍ జీవిత కాలం 100 సంవత్సరాల లోపే ముగుస్తుంది. కాబట్టి నిర్దిష్ట జీవిత కాల పరిమితి లేని ప్రకృతిలో లభించే ఇసుక, మొర్రమ్‍, గ్రానైట్‍ మెటల్‍ మరియు రాతి పొడి మిశ్రమాన్ని కాంపాక్ట్ చేసి కావలసిన నేల సామర్త్యాన్ని వృద్ధి చేసి ఆ పునాదులపై తోరణ నిర్మాణము చేపట్టటం జరిగింది.

శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయము ఐనవోలు (గ్రామము మరియు మండలము)లో వరంగల్‍ పట్టణానికి 19 కిలోమీటర్ల దూరంలో వుంది. ఐనవోలు చరిత్ర పరంగా ఎంతో ముఖ్యమయిన ప్రదేశము. ఇది 12 & 13వ శతాబ్ద కాలానికి చెందిన కాకతీయ దేవాలయము.
మొదట ఈ తోరణానికి సంబందించిన అసంపూర్తిగా తొలచిన శిలలను అప్పటి డైరెక్టర్‍ శ్రీమతి యన్‍.ఆర్‍. విశాలాక్షి గారు ఐనవోలు దేవాలయానికి అర్ధ కిలోమీటరు దూరములో ఔత్సాహిక ఆర్కియాలాజిస్ట్ శ్రీ అరవింద్‍ ఆర్యతో కలసి ఈ 800 సంవత్సరాల క్రితం తొలచిన కాకతీయ కాలానికి చెందిన శిలలను ఇంతవరకు ఎవరు గమనించని స్థితిలో నిర్లక్షానికి గురై ఒక పశువుల పాకలో పడివున్న వాటిని గుర్తించారు. ఈ శిలలు కాకతీయ కీర్తి తోరణానికి సంబంధించినవిగా, ఐనవోలు దేవాలయానికి ఉత్తర దిక్కున తోరణమునకు నిర్దేశించినవిగా గుర్తించి, అక్కడే రాష్ట్ర పురావస్తు తోరణాన్ని నిర్మించింది.

సాధారణంగా కాకతీయ తోరణానికి నాలుగు స్తంభాలు కలిగి ఒక జత ఒకవైపు మరోజత ఇంకోవైపు వుండి వీటిపైన రాతితో చెక్కిన రెండు పెద్ద దూలములు ఒకదానిపై ఒకటి అమర్చబడి ఉంటాయి. ఈ నాలుగు స్తంబాలు కూడా ఒకేరకమైన శిల్పసంపద కలిగి ఉంటుంది. పైన రెండు భుజాలకు చెక్కిన శిలలు అమర్చబడి ఉంటాయి. ఈ మొత్తము కట్టడము చెక్కిన రాళ్లతో ఒక పెద్ద అరుగుపై నిర్మించబడుతుంది. తోరణము మధ్యలో మెట్ల ద్వారము ఉంటుంది.

తోరణానికి సంబంధించి అక్కడ దొరికిన కొన్ని విడిభాగాల శిలలను గమనిస్తే తోరణ నిర్మాణం మధ్యలో ఆగిపోయినట్టు తెలుస్తుంది. ఎక్కడైతే తోరణ నిర్మాణం చేయాలని నిర్ధారించారో అక్కడ కేవలం కొన్ని విరిగిపోయిన విడిభాగాలు, దూలాలు, రెండు స్తంభాలు పడివున్నాయి. మిగిలిన రెండు విరిగిపోయిన స్తంబాలు మరియు ఇతర విడిభాగాలు అర్ధ కిలోమీటరు దూరం ఉన్నాయి. ఈ పరిస్థితి అంత పరిశీలిస్తే అప్పట్లో అంటే కాకతీయుల కాలంలో తోరణ నిర్మాణం అసంపూర్తిగా మిగిలి పోయిందని, విడిభాగాలు కూడా ఎక్కడివి అక్కడే వదిలేశారని, కాలక్రమంలో కొన్ని విరిగాయని అర్థమవుతుంది.

మొత్తం తోరణం బరువు 74.24 టన్నులుగా లెక్కించటం జరిగింది. అంటే ఒకవైపు గల ఒకజత స్తంభాలు మోయవలసిన బరువు 37.12 టన్నులు. ఈ జత స్తంబాలు ఒక పెద్ద రాయి 8।-6।। పొడవు, 3।-6।। వెడల్పు మరియు 2।-6।। మందము రాతిపై అమర్చబడి ఉంటాయి. ఈ పెద్ద రాయి పునాదులపై ఉంటుంది. ఇప్పుడు ఈ పెద్ద రాయి పునాదులపై మోపే బరువు ఒక చదరపు మీటరుకు 13.43 టన్నులు. ఇక్కడ స్థల పరిశీలన జరిపితే చదరపు మీటరుకు 2.5 టన్నుల బరువు కంటే ఎక్కువ మోయదు.

స్ట్రక్చరల్‍ ఇంజనీర్‍ ఇచ్చిన నివేదిక ప్రకారం పునాదుల నిమిత్తం ఒక మీటరు మందం సిమెంట్‍ కాంక్రీట్‍ బెడ్‍ వేయమని సూచించారు. ఈ విషయమై సాధ్యాసాధ్యాలను, సిమెంట్‍ కాంక్రీట్‍ జీవిత కాల పరిమితి 100 సంవత్సరాల లోపే అన్న విషయాలను ద•ష్టిలో ఉంచుకొని ఎన్‍.ఐ.టి. ప్రొఫెసర్స్ శ్రీ పాండురంగారావు, శ్రీ రమణమూర్తి మరియు ఆర్కియాలాజిస్ట్ శ్రీ రంగాచార్యులు గార్లను సైట్‍కు ఆహ్వానించి చర్చింటం జరిగింది. ప్రస్తుతము ఐనవోలులో రెండు తోరణాలు దేవాలయానికి తూర్పున, దక్షిణాన మరియు వరంగల్లు కోటలో నాలుగు తోరణాలు ఎప్పుడో 800 సంవత్సరాల క్రితం నిర్మించినవి ఈరోజుకు కూడా నిల్చొని ఉన్నాయి. కాబట్టి మనము నిర్మించబోయే ఈ తోరణం ఆ స్థాయిలో నిలబడాలని లోతైన చర్చల అనంతరము నిర్ణయించటం జరిగింది.

ఇందుకుగాను సిమెంట్‍ కాంక్రీట్‍ వాడొద్దని, దానికి బదులుగా గచ్చు సున్నం కాంక్రీట్‍ గాని లేదా ప్రక•తిలో లభించే మెటీరియల్స్ను కాంపాక్ట్ చేసి నేలలో సామర్థ్యాన్ని పెంచాలని గాని సూచించటం జరిగింది. కావున పునాదుల జీవిత కాలం పెంచేవిధంగా తోరణం నిర్మించే స్థలంలో 50। ఫీట్ల పొడువు 20। ఫీట్ల వెడల్పు 13। ఫీట్ల లోతులో పెద్ద గోతిని తవ్వి, అందులోకి రోడ్డు రోలర్‍ వెళ్లే విదంగా ఏర్పాటు చెయ్యటం జరిగింది. ఈ గోతిలో 6।। అంగుళాల మందం గ్రానైటు మెటల్‍, ఇసుక, మొర్రమ్‍, రాక్‍ డస్ట్ కలిపిన మిశ్రమాన్ని పరిచి దానిపై నీటిని చల్లి రోడ్డు రోలర్‍ తో 4।। అంగుళాల మందం వచ్చేవరకు కాంపాక్ట్ చేయటం జరిగింది. ఇలా 10 ఫీట్ల ఎత్తు వరకు వరుస క్రమంలో అంటే 30 వరసలు కాంపాక్ట్ చేసాక నేల సామర్థ్యాన్ని పరీక్ష జరుపగా దాని బరువు మోసే సామర్థ్యము చదరపు మీటరుకు 27 టన్నులకు పెరిగింది. మనకు కావలసింది చదరపు మీటరుకు 13.43 టన్నులు మాత్రమే. ఇక్కడ ఫాక్టర్‍ అఫ్‍ సేఫ్టీ కూడా 2 కు చేరింది.

ఇప్పుడు దాని పైన రెండు పెద్ద రాళ్లను కొలతల ప్రకారం అమర్చి వాటి చుట్టూ గ్రానైట్‍ మెటల్‍, ఇసుక, మొర్రమ్‍, రాక్‍ డస్ట్ మిశ్రమాన్ని వరుసల ప్రకారం పేర్చి నీటిని చల్లి రోడ్‍ రోలరుతో వరుస ప్రకారం కాంపాక్ట్ చేయటం జరిగింది. ఈ పెద్ద రాళ్లపై కొలతల ప్రకారం నిలువు స్తంభాలను, ఒక స్తంభానికి 4 స్టెయిన్లెస్‍ స్టీల్‍ రాడ్స్ 1।। అంగుళం వ్యాసం గలవి జాయింటింగ్‍తో నిలబెట్టటం జరిగింది.
నాలుగు స్తంభాలలో మూడు స్తంభాలు మధ్యలో విరిగినవి లభ్యమైనాయి. ఆ విరిగిన స్తంభాలను మధ్యలో నాలుగు రంద్రాలు చేసి 1।। అంగుళం వ్యాసం గల స్టెయిన్లెస్‍ స్టీల్‍ రాడ్స్తో అతికించటం జరిగింది. స్తంభాల చుట్టూ కాకతీయ కళాకృతిలో లభించిన శిలలను ఉపయోగించి అరుగు మరియు మెట్ల ద్వారము నిర్మాణము అయ్యింది.

ఈ నాలుగు స్తంభాల పైన క్షితిజసమాంతర దూలములను ఒకదానిపై ఒకటి ఉంచటం జరిగింది. రెండు భుజాలకు చెక్కిన శిలలను తొలచిన రంధ్రాలలో అమరుచటం జరిగింది.
పునాదులకు సంబంధించి ఎలాంటి సిమెంట్‍ గాని వేరే జాయింటింగ్‍ మెటీరియల్‍గాని వాడలేదు. అరుగు మరియు తోరణం శిలలను గచ్చు సున్నంతో జాయింటింగ్‍ చేయటం జరిగింది. పునాదులను ప్రకృతిలో లభ్యమైన మెటీరియల్స్ను కాంపాక్ట్ చేసి నేల సామర్థ్యాన్ని పెంచి నిర్మాణము జరిగింది. కాబట్టి తోరణము జీవితకాలం 500 సంవత్సరాలకు తగ్గదని భావన. ఈ నిర్మాణం 2017లో జరిగింది. అప్పటి ఆమాత్యులు గౌరవనీయులు శ్రీ కడియం శ్రీహరి గారు ప్రారంభోత్సవం చేసారు. ఈ తోరణ నిర్మాణం డిపార్టుమెంటు ప్రతిష్టను ఎంతో పెంచింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *