దాశరథి సైన్స్,సామాజిక గీతంలో వైవిధ్యం

ఇది మహాకవి దాశరథి కృష్ణమాచార్య జీవితం లాగే లిటరరీ స్పెక్ట్రమ్‍ చాలా విస్తృతమైంది, లోతైంది. 1925 జూలై 22న జన్మించిన దాశరథి నైజాం వ్యతిరేక పోరాటం చేశారు. ఆకాశవాణిలో కొనసాగారు. అంతకుమించి సినిమాల్లో కూడా రాణించారు. ఆకాశవాణి ఉద్యోగానికి రాజీనామా చేసిన దాశరథి కృష్ణమాచార్య కొంతకాలం తర్వాత ఉమ్మడి ఆంధప్రదేశ్‍ ప్రభుత్వ ఆస్థాన కవి పదవి కూడా అలంకరించారు. దాశరథి రంగాచార్య ఇప్పుడు చర్చించుకుంటున్న కృష్ణమాచార్యకు తమ్ముడు.

తెలుగు, సంస్కృతం, ఉర్దూ, ఇంగ్లీషు భాషలలో ప్రావీణ్యం గడించినట్టే, ప్రసంగం, సాహిత్యం మాత్రమే కాక రేడియో, సినిమా మాధ్యమాలలో అపూర్వమైన నైపుణ్యం సాధించారు. అంతే కాదు కవిత్వం మాత్రమే కాక గీతరచనలో కూడా కొత్త ఎత్తులకు పోయారు. ఆకాశవాణి లలిత గీతం, సినిమా గీతం సంబంధించి ఆయన చేసిన కృషి సైతం విలక్షణంగా కనబడుతుంది. అలాగే కవిత్వంలో, పాటలలో భావ చిత్రాలే కాక; సామాజిక, చారిత్రక, సైన్స్ పరమైన విషయాలు ఎన్నో కనబడతాయి. త్రిపురనేని గోపీచంద్‍ రేడియో కార్యక్రమాల సరళి గురించి విశ్లేషిస్తూ దాశరథి కృష్ణమాచార్య రాసిన వ్యాసాన్ని పరిశీలిస్తే రేడియో మాధ్యమం మర్మ, ధర్మసూక్ష్మాలను ఎంత గొప్పగా పట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు. శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరథి వంటి వారే విజ్ఞాన సంబంధమైన విషయాలను ఆ తరం తెలుగు కవిత్వంలో అడపా దడపా చవి చూపించారు. ఈ సందర్భంలో తెలుగువారి హృదయాల్లో చొచ్చుకుని పోయి, ఇప్పటికి హాయిగా నెలకొని తరచూ నినదిస్తున్న ఒక అభ్యుదయ గీతం గురించి ఇప్పుడు చర్చించుకుందాం. ఆంధప్రదేశ్‍లో ‘దేశమును ప్రేమించమన్నా’ గుర్తింపు పొందినట్టే తెలంగాణ ప్రాంతంలో ఇటీవల కాలంలో దాశరథి రాసిన ఈ గీతం అటువంటి గౌరవాన్ని పొందుతోంది.
కొన్ని సంవత్సరాలుగా ఒక విషయం నన్ను వెంటాడుతోంది. ‘‘అ చల్లని సముద్ర గర్భం…’’ పాటలో సైన్స్, చరిత్ర, సామాజిక కోణాల్లో కవి దాశరథి భావనలు ప్రత్యేకంగా దర్శనమిస్తాయి. ఒక పాతిక, ముప్పైయేళ్ళుగా ఈ గీతం తెలుగునేల అన్ని చోట్ల వినబడుతూ వస్తోంది. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మరింత విరివిగా వినబడుతోంది. అయితే, ఈ పాటలో కొన్ని పదాలు, పాదాలు ఒక్కోచోట, ఒక్కో సందర్భంలో వేరుగా వేరుగా వినబడుతున్నాయి. దీంతో మరింత ఆసక్తి కలిగి కొంత పరిశీలన చేశాను. ఇప్పుడు నా వద్ద మూల గీతంతో పాటు నాలుగు వెర్షన్లు ఉన్నాయి. ఇంకా కొన్ని అదనపు వెర్షన్లు కూడా ఉండి ఉన్నా ఆశ్చర్యం లేదు.


ఇరవయ్యేళ్ళలోపునే దాశరథి మంచి కవిత్వం రాయడం, పోలీసుల దృష్టిలో పడటం గమనార్హం. దాశరథి కృష్ణమాచార్య తొలి కవితా గ్రంథం 1949లో వెలువడిన ‘అగ్నిధార’. ఈ సంకలనంలోని కవితలు చాలావరకు తొలుత ప్రచారంలోకి వచ్చి జనుల నోట నానిన తర్వాత ప్రచురింపబడ్డాయి. ‘నా కోటి రతనాల వీణ…’ గీతం ఈ సంకలనం లోనిదే! అంతే కాదు ‘ఈ చల్లని సముద్ర గర్భం…’ గీతం కూడా ‘అగ్నిధార’ లోనిదే. 1988 తర్వాత అక్షరాస్యత, మూఢనమ్మకాల నిర్మూలన, సైన్స్ దృష్టి వంటి విషయాలు కొన్ని సంస్థల ఎజెండాగా మారడంతో ఉదాత్తమైన పాటలు ప్రాచుర్యం పొంది, మళ్ళీ వినిపించడం మొదలైంది. దానికి కొత్తగా వచ్చిన టెక్నాలజి దీనికి ఎంతో దోహదపడింది. ఈ కారణాలతో 1991 నుంచి (నేను అంతకుముందు గోవాలో మూడేళ్లు ఉన్నాను కనుక) చాలా చోట్ల, చాలా సందర్భాల్లో ఈ పాట విన్నాను.


‘అగ్నిధార’లో లభ్యమయ్యే గీతం పల్లవితో పాటు ఆరు చరణాలుగా సాగుతుంది. పల్లవీ, చరణం ప్రతిదీ నాలుగు పాదాలుగా, ప్రతి పాదం 14 మాత్రలుగా సాగుతుంది. పాటకు అవసరమైన దార్శనికత, భావం, లయ, భావుకత పుష్కలంగా ఉన్నాయి. ప్రకృతిని అవలోకింప చేసే పల్లవితో పాటు ఒక చరణం సైన్స్, మరో చరణం చరిత్ర… మిగతా నాలుగూ సామాజిక దర్శనంతో తొణికిస లాడుతాయి.


ఆ చల్లని సముద్రగర్భం
దాచిన బడబానలమెంతో?
ఆ నల్లని ఆకాశంలో
కానరాని భానువులెందరో?
భూగోళం పుట్టుక కోసం
కూలిన సురగోళాలెన్నో?
ఈ మానవరూపం కోసం
జరిగిన పరిణామాలెన్నో
ఒక రాజును గెలిపించుటలో
ఒరిగిన నరకంఠాలెన్నో?
శ్రమజీవుల పచ్చి నెత్తురులు
త్రాగని ధనవంతులెందరో?
అన్నార్తులు అనాధలుండని
ఆ నవయుగ మదెంత దూరమో?
కరువంటూ కాటక మంటూ
కనుపించని కాలాలెప్పుడో?
అణగారిన అగ్ని పర్వతం
కని పెంచిన ‘లావా’యెంతో?
ఆకలితో చచ్చే పేదల
శోకంలో కోపం యెంతో?
పసిపాపల నిదుర కనులలో
ముసిరిన భవితవ్యం యెంతో?
గాయపడిన కవిగుండెల్లో
వ్రాయబడని కావ్యాలెన్నో?
కుల మతముల సుడిగుండాలకు
బలిగాని పవిత్రులెందరో?
భరతావని బలపరాక్రమం
చెర వీడే దింకెన్నాళ్ళకో?
(అగ్నిధార, 1949)

రేడియోలో, వేదికల మీద, యూట్యూబ్‍లో మాత్రమే కాక తెలంగాణ, ఆంధ్ర పల్లె ప్రాంతాలలో నేడు విరివిగా వినబడే పాట ఇది. ఆకాశవాణిలో జాతీయస్థాయిలో ‘సాంగ్‍ ఆఫ్‍ ది మంత్‍’ (ఈ మాసపు పాట) అనే ప్రయోగం చాలా కాలం నడిచింది. ఆయా భాషలలో మంచి ఉదాత్తమైన పాటలనుంచి ఎంపిక చేసి పూర్తి సంగీతపు హంగులతో దీనిని రికార్డు చేసి నెలలో నాలుగు సార్లు వినిపించడం ఆకాశవాణి ప్రణాళిక. దీనితో మంచి ప్రాచుర్యం కూడా సిద్ధిస్తుంది. దేశవ్యాప్తంగా తెలుగు పిల్లల పాట అనగానే ఇతర భాషావాసులకు కూడా ‘‘పిల్లల్లారా..’’ అనే గీతం గుర్తుకొస్తుంది. ఈ పాట కూడా మన దాశరథి రాసిందే. అలా ప్రస్తుత గీతం 1992లో డా. మహాభాష్యం చిత్తరంజన్‍ సంగీత రూపకల్పనలో ఆకాశవాణి హైదరాబాదు స్టూడియోలో ‘ఈ మాసపు పాట’ గా రికార్డయ్యింది. దాన్ని ప్రసిద్ధ గాయకులు కె.బి.కె.మోహన్‍ రాజు (కొండా బాబు కృష్ణమోహన రాజు), విజయలక్ష్మి శర్మ పాడారు. కొన్నేళ్ళ క్రితం కె.బి.కె. మోహనరాజు ఫేస్‍ బుక్‍లో షేర్‍ చేసినపుడు నేను జాగ్రత్తగా విన్నాను. ఇందులో ప్రత్యేకత ఏమంటే పాటలోని మొత్తం ఆరు చరణాలు కాకుండా 1, 3, 5 చరణాలు మాత్రమే ఉన్నాయి.

అయితే ఎక్కువమంది గాయనీ గాయకులు అంటే వందేమాతరం శ్రీనివాస్‍, విమలక్క, వరంగల్‍ శంకర్‍, ప్రజానాట్య మండలి, జన విజ్ఞాన వేదిక ఇంకా పలు సంస్థలు ద్వారా పాడిన, లేదా పాడే గీతంలో మూలంలో మూడింట రెండు వంతులు మనకు వినబడుతోంది. ఖమ్మం నివాసి బూరగడ్డ కందాడై విజయ కుమారాచార్య ఈ గీతానికి ట్యూన్‍ కట్టారు. అదే ప్రాచుర్యంలోకి వచ్చింది. కానీ రెండు చరణాలు కలిపి ఒక చరణంగా పాడటం ఇక్కడ గమనించవచ్చు. మొత్తం ఒకటో చరణం; 2, 6 చరణాలలో కొంత భాగం కలసి ఒక చరణంగానూ; మూడు, ఐదు చరణాలు ఒక చరణంగా ఇక్కడ మనకు వినబడతాయి. ఈ మొత్తం పాటలో నాల్గవ చరణం అసలు కనబడదు. ఎం శశిధర శర్మ పాడిన వెర్షన్లో దాశరథి మొత్తం పాట మనకు లభిస్తుంది. ఈ వెర్షన్స్ అన్నింటిలో ప్రధానమైన తేడా పల్లవిలో ‘కానరాని భానువులెందరో’ ‘ కానరాని భాస్కరు లెందరో’ అనే తేడాను గమనించవచ్చు.
ఇవన్నీ కాకుండా జనవిజ్ఞాన వేదిక తెలంగాణ కొన్ని సంవత్సరాల క్రితం ఈ గీతాన్ని ఒక క్యాలండర్‍గా చాలా ఆకర్షణీయంగా ముద్రించింది. ఇందులో మూలంలో లేని (రెండు చరణాలు నిడివిలో) ఒక చరణంగా మనం గమనించవచ్చు. ఆ పాదాలు ఇలా ఉన్నాయి:

మానవ కళ్యాణం కోసం
పణమొడ్డిన రక్తం యెంతో
రణరక్కసి కరాళనృత్యం
రాల్చిన పసిప్రాణాలెన్నో
కడుపుకోతతో అల్లాడిన
కన్నులలో విషాదమెంతో
ధనవంతుల దుర్మార్గాలకు
దగ్ధమైన బ్రతుకులుయెన్నో…

ఇలా మార్పులు ఎందుకు వస్తాయి? ఆ మార్పులకు కవి ఆమోదం ఉందా? అది ఒక పాట బహుళ ప్రచారమైనపుడు సంభవించే విషయంగా పరిగణించాల్సి ఉంటుందా? అనే విషయాలు ఇప్పుడు తేల్చలేము. కేవలం వినడం ఆధారంగానే గుర్తు పెట్టుకుంటాం, ప్రతిసారి మూలాన్ని సంప్రదించే సౌకర్యం ఉండకపోవచ్చు. అందువల్ల మరింత శ్రావ్యంగా ఉండే పదాలు రావచ్చు లేదా మరింత ఆమోదకరమైన భావంతో కొన్ని పదాలు మార్చబడవచ్చు ‘వ్రాయబడని కావ్యాలెన్నో’ అనే దానికన్నా ‘రాయబడని కావ్యాలెన్నో’ అనడం హాయిగా ఉంటుంది. ఇపుడు యూట్యూబ్‍ లలో చాలామంది పాడిన ఈ పాట చాలా రకాలుగా లభించడం దాశరథి గీతానికున్న ప్రాచుర్యానికి కొలమానం, సాహిత్యానికి బహుమానం!
అదే సమయంలో సీరియస్‍ విషయాలు, నాన్‍ ఫిక్షన్‍ సంబంధించిన అంశాలు అంటూ కాస్త నిరాదరణకు లోనయ్యే సైన్సు, చరిత్ర, సామాజికం వంటి వాటి లోపలి పార్శ్వాల మర్మాలను రమణీయమైన గీతంగా స•జించిన దాశరథి కృష్ణమాచార్య ప్రతిభకు, నైపుణ్యానికి, దర్శనీయతకు జోహార్లు!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *