ప్రపంచంలో లభ్యమయ్యే మంచినీటిలో దాదాపు 68.7 శాతం హిమానీనదాలు, మంచు పొరల్లోనే ఉంది. నీటి వనరుల లభ్యత సుస్థిరంగా సాగేలా చేయడంలో హిమానీనదాలదే కీలక పాత్ర. అయితే, భూతాపం హిమానీనదాల కరుగుదలను వేగవంతం చేస్తోంది. నీటి సరఫరాను క్షీణింపజేస్తోంది. జల భద్రతకు తీవ్రమైన ముప్పును కలిగిస్తోంది. హిమానీనదాల సంరక్షణ అనేది కేవలం భౌగోళిక అంశమే కాదు. ఇది ప్రజల ప్రగతికి, జీవన విధానానికి కీలకం.
నీరు ప్రకృతి ఆస్తి
నీరు ఒక సహజ సిద్ధమైన ప్రకృతి ప్రసాదించిన ఆస్తి. భూమి మీద నివసిస్తున్న సమస్త ప్రాణుల శరీరంలో 50 శాతానికి పైగా నీరు ఉంటుంది. మానవ శరీరంలో సుమారు 70శాతం వరకు నీరు ఉంటుంది. సమస్త జీవ కోటికి తాగునీటితోపాటు మన రోజువారీ కార్యక్రమాలకు, వ్యవసాయం, పరిశ్రమలు, వంట చేయడానికి, ఇతర కార్యక్రమాలకు నీరు చాలా అవసరం. ఈ భూ మండలాన్ని సుమారు 71శాతం నీటితో ఆక్రమితమైనప్పటికీ పనికొచ్చే మంచినీరు కేవలం 2.5% మాత్రమే. ఈ 2.5% మంచినీటిలో దాదాపు 75.2 శాతం ధ్రువ ప్రాంతాలలో మంచుగా స్తంభింపజేసి ఉంది. మరో 22.6 శాతం భూగర్భ జలాలుగా ఉన్నాయి. ప్రపంచంలో దొరుకుతున్న మంచినీటితో సుమారు 72% మనం వ్యవసాయానికి వాడుతున్నాం.
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ, ఆర్థిక అభివ•ద్ధి పేరుతో చేపడుతున్న పారిశ్రామికీకరణ, తరుగుతున్న అడవులు, కాలుష్యం, మితిమీరిన నీటి వినియోగం, వాతావరణ మార్పులు, అతివ•ష్టి లేదా అనావ•ష్టి వలన గత దశాబ్ద కాలంలో ప్రతి వ్యక్తికి సరాసరి సగటున 20% మంచినీటి వనరులు తగ్గినాయి.
ఇది చాలా ఆందోళన కలిగించే అంశం. ఎంతో అత్యంత విలువైన నీటి వనరును తిరిగి పొందలేని స్థితికి మనం తీసుకెళ్తున్నాం. నేడు సుమారు ప్రపంచవ్యాప్తంగా 240 కోట్ల మంది ప్రజలు నీటి లభ్యత తక్కువగా ఉండి తీవ్ర ఒత్తిడికి గురి అవుతున్నారు. నీటివనరుల కోసం పోటీ పెరుగుతోంది.
వేగంగా ఎందుకు కరుగుతున్నాయి?
హిమానీనదాల ఉపరితలం తెల్లగా ఉంటుంది. ఫలితంగా సూర్యకాంతిని తిరిగి పరావర్తనం చెందిస్తుంది. హిమానీనదాల కరుగుదలతో వాటి స్థానంలో నీరు లేదా కాలుష్యంతో నిండిన మంచు ఏర్పడుతుంది. ఇవి సహజంగా తక్కువ పరావర్తనాన్ని కలిగి ఉండటంతో అధికంగా ఉష్ణాన్ని గ్రహిస్తాయి. కరుగుదల మరింత వేగవంతమవుతుంది. ఈ పక్రియను ‘అల్బెడో ఎఫెక్ట్’గా వ్యవహరిస్తారు.
ప్రధాన ప్రభావిత ప్రాంతాలేవీ?
పరిశ్రమల కర్బన ఉద్గారాలు, వృక్షసంపద నష్టం, సహజ వనరుల అధిక వినియోగం వంటి మానవ కార్యకలాపాల పెరుగుదలతో హిమాలయ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు అధిక మవుతున్నాయి. ఈ ప్రాంతాల్లో సగటు ఉపరితల ఉష్ణోగ్రతల పెరుగుదల 1.6 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు మించిపోయింది. దీనివల్ల హిమానీ నదాల కరుగుదల వేగవంతమై సరస్సుల విస్ఫోటనం సంభవించి వరదలు రావడం, కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తులకు దారితీస్తోంది. హిందూకుష్ పర్వతశ్రేణిలో హిమానీనదాలు ఇప్పటికే 65శాతం మేర నష్టపోయాయి. హిమాలయాల మొత్తం మంచు కప్పు 40శాతం తగ్గింది. ఉష్ణోగ్రత ఇలాగే పెరిగితే, ఈ శతాబ్దం చివరి నాటికి హిమానీనదాలు 75శాతం వరకు నష్టపోవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గంగా వంటి నదులు వర్షాకాలంలో వరదలతో, వేసవిలో నీటి కొరతతో సతమతమవుతున్నాయి. వాతావరణ మార్పుల ప్రభావంతో 90శాతం హిమాలయ వ్యవసాయం వర్షాధారానికి పరిమితవుతోంది. ఇది స్థానికుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దానివల్ల దిగువ ప్రాంతాల్లో నివసించే కోట్లమంది దీర్ఘకాలిక సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదముంది.
థీమ్: ‘‘నీరు మరియు లింగం’’ నీరు ఎక్కడ ప్రవహిస్తే, సమానత్వం పెరుగుతుంది అనే ప్రచార నినాదంతో UN-Water సమన్వయంతో,UNICEF మరియు UN Women నేతృత్వంలో, ఈ థీమ్ సురక్షితమైన నీరు మరియు పారిశుధ్యం ప్రాథమిక మానవ హక్కులు, లింగ సమానత్వానికి కీలకంగా దోహద పడతాయని ప్రముఖంగా తెలియజేస్తుంది.
మార్చి 22న ప్రపంచ నీటిదినోత్సవం.
-Subhash
