క్రీ.శ. 15వ శతాబ్దం చివరిభాగంలోనూ, 16వ శతాబ్దం మధ్యభాగం వరకు భారతదేశంలో పోర్చుగీసులు తుదకంటా లాగి వదిలిన బాణంలా వ్యాపారరంగంలో ముందుకు సాగుతుండేవారు. వ్యాపార పరుగుపందెంలో పోర్చుగల్, స్పెయిన్ దేశాలు పరుగెత్తి, పరుగెత్తి చివరకు చతికిలపడ్డారు. 1588లో స్పెయిన్ నౌకా బలంమీద డచ్ – నెదర్లాండు దేశం ఆధిక్యత సంపాదించింది. అప్పటివరకు పోర్చుగల్ మరియు స్పెయిన్ దేశాలకు మాత్రమే దారిచ్చిన గుడ్‌హోప్ అగ్రం. భారతదేశం చేరటానికి డచ్ నౌకలకు కూడా దారిచ్చింది.
హాలెండుకు చెందిన డచ్ కంపెనీ సుగంధ ద్రవ్యాలతో సంపన్నమైన తూర్పుతీర దీవులు జావా, సుమత్రాలతో వ్యాపారం ప్రయాణపు దారిలో ఒక మజిలీస్థావరం (Halting Centre) అవసర మొచ్చింది. అదే భారతదేశం. ఇంగ్లీషు వర్తకులకు భారతదేశపు తూర్పుకోస్తా చేనేతబట్టల వ్యాపారం మీద కన్నుబడితే, డచ్ వారికి జావా సుమత్రాల సుగంధ ద్రవ్యాల గుబాళింపు మీద కన్నుపడింది.
పోర్చుగల్ స్పెయిన్ దేశంలో విలీనమయ్యే సరికి, తమక్కావలసిన సుగంధద్రవ్యాలు వెతుక్కుంటూ డచ్‌వారు 1595లో నాల్గు డచ్ ఓడల్లో గుడ్హ•ప్ మీదుగా, భారతదేశం బయల్దేరాయి. 1602 సం।।లో ‘డచ్ ఈష్ట్ ఇండియా’ కంపెనీగా ఏర్పడిన డచ్ గుత్తవ్యాపారులు, డచ్ పార్లమెంటు ద్వారా తమ దేశానికి సరిక్రొత్త విదేశీ వ్యాపార భూభాగాలు సంపాదించటానికి, ఆయా భూభాగాల్లో కోటలులాంటి గోదాములు (ఫ్యాక్టరీలు) నిర్మించుకోవటానికి, అవసరమయితే వ్యాపార ప్రత్యుర్ధులతో సాయుధపోరాటం (యుద్ధం) చేయటానికి, యుద్ధసంధులు గావించుకోవటానికి అనుమతులు పొందారు. 1602 సం।।లో డచ్ అడ్మిరల్ ‘వాండర్ హాగన్’ను కంపెనీ డైరెక్టర్లు కంపెనీ నిమిత్తం, భారతదేశ తూర్పుతీరంలో ప్రత్యేకించి చేనేత బట్టల తయారీలో ప్రసిద్ధిచెందిన మసులీపట్నంలో వర్తకస్థావరం సంపాదించమని కోరింది. 1605లో డచ్దేశపు ప్రత్యేక బృందం గోల్కొండ దర్బారును సందర్శించి, మసులీబందరులో డచ్ ఫ్యాక్టరీ స్థాపనకు ఫర్మానా ద్వారా అనుమతి సంపాదించింది. ఫర్మానా ఉత్తర్వు ననుసరించి డచ్ కంపెనీ వారికి రాయితీగా 4శాతం ఎగుమతి / దిగుమతి సుంకం నిర్ణయించబడగా బందరులో డచ్ వ్యాపారం మూడుపువ్వులు, ఆరుకాయల్లా సాగింది.
1605లో గోల్కొండ దర్బారు అధికార్లకు, బందరు ఓడరేవు అధికారి ‘షాబందరు’కు, బందరు కొత్వాల్ – పోలీసు అధికారికి భారీఎత్తు లంచములుయిచ్చి మసులీపట్నం, నిజాంపట్నం రేవులలో వర్తకస్థావరాలు నిర్మించుకోవటానికి డచ్ వారు అనుమతులు పొందారు. గోల్కొండ సుల్తానుల హయాంలో మచిలీబందరు గొప్ప అంతర్జాతీయ పారిశ్రామిక కేంద్రమేకాక, ఓడరేవు కూడా. పోర్చుగీసులు మచిలీపట్నం వ్యాపారరంగంలో డచ్వారికన్నా 50 సం।।రాల ముందుకాలంలో కాలెట్టినా, తూర్పుతీరంలో వారి గుత్తాధిపత్యం విస్తరించనందున – ప్రత్యర్ధులులేని డచ్‌వారు ఆరంగంలో అతి వేగంగా ముందుకుసాగారు. తమ సాయుధ బలగాలకు అవసరమైన తుపాకీ మందు తయారీ పరిశ్రమ నొకదానిని డచ్కంపెనీ పులికాట్లో ఏర్పాటు చేసుకున్నది. ఈ పరిశ్రమ కవసరమైన ముడిసరుకు గంధకం, సూరేకారం మచిలీపట్నం, నిజాంపట్నం పరిసరాల నుండి కొనుగోలు చేసేవారు. స్థానిక ప్రభువులు విదేశీ వ్యాపారం ప్రోత్సహించాలనే పద్ధతిలో మచిలీపట్నం, నిజాంపట్నం, మద్రాసు తేనాంపేటలోని తమ చేనేత సరుకులపై నాల్గుశాతం, పులికాట్ సరుకులపై రెండుశాతం రాయితీపన్నులు విధించగా, స్థానిక వ్యాపారస్తులు అధికమొత్తం సొమ్ము పన్నులుగా చెల్లించి నష్టపడేవారు. డచ్ కంపెనీవారు స్థానిక చేనేత పనివారికి బట్టలనేత సరఫరా నిమిత్తం ముందస్తు చెల్లింపులు చేసి ఆకర్షించేవారు. ఒకొకప్పుడు తమకు కావాల్సిన బట్టలనేతకు నేత, కలంకారీ కార్మికులకు బందరులో కొంతసామ్ము బయానాగా యిచ్చి పనిచేయించేవారు. మసులీపట్నం, పులికాట్లలో రోజువారీ ఒకొక్కచోట 2 నుండి 3 వందలమంది కార్మికులను కలంకారీ అద్దకం నిమిత్తం నియమించి పనిచేయించేవారు. చేనేత కార్ఖానాల (షెడ్ల)పద్ధతి కూడా పప్రధమంగా డచ్‌వారు బందరు పట్టణంలో ప్రవేశపెట్టారు.

డచ్ కంపెనీ వ్యాపారులు తమకు కావల్సిన జలరవాణా సాధనాలయిన ఓడలు, నౌకలు బందరుపట్టణ శివారు నేటి వాడపాలెం (ఓడపాలెం), వాడగొయ్యి (ఓడగొయ్యి)లలో నిర్మింప జేసుకొనేవారు. ఓడలు, నావలకు కావల్సిన కలప ఆరోజుల్లో దివిసీమ అడవుల్లో దొరికేది.
చుట్టూ సముద్రపు ఉప్పునీటితో నిండియుండి, ఆటుపోటులు కల్గియున్న చిత్తడినేలల మధ్య ఖాళీగాయున్న సముద్రం విడిచిన లంకదిబ్బగాయున్న బందరుకోటను ముందుగా గుర్తించి, సముద్ర మార్గాన వచ్చే తమ సరుకులను నిల్వ ఉంచుకోవటానికి గోదాములు నిర్మించి వాటిని వాడింది గోల్కొండ కుతుబ్షాహి సుల్తానులు. అంతకుముందు కాలంలో బహుమనీలు బందరుకోటను రిజర్వు సైనికుల కేంద్రంగా వాడుకొని, ముసల్మాను సైనికుల నిమిత్తం మసీదు – శ్మశానం ఏర్పాటుచేశారు. ఈ మసీదు బందరులో కల్లా ప్రధమ మసీదు క్రింద నమోదై యున్నది. గోదాములు కలిగియున్న ఈ దిబ్బను డచ్‌వారు తమ ఎగుమతిదిగుమతి సరుకులను నిల్వ ఉంచటానికి, తమ వ్యాపార సహజ శతృవులైన ఇంగ్లీషు, ముసల్మాను తదితర శతృమూకల దాటికి రక్షణగా, ఊరిచుట్టూ ఎత్తైన మట్టిగోడలు కట్టి, 11 బురుజులతో పటిష్ఠపరచి సాయుధ కాపలా పెట్టారు. మట్టి బురుజులు, బలమైన ఎత్తైన గోడలమధ్య వ్యాపార భవన సముదాయములతో కోటలా కనబడుతున్న ఈ దీవి దిబ్బ గ్రామాన్ని ‘బందరుకోట’ అని పిల్చారు. బందరు పట్టణంలో కొంతమంది డచ్‌వారికి ‘వలందపాలెం’లో గోదాములు, నివాసగృహములు, చేనేత మరియు కలంకారీ ఖార్ఖానా షెడ్డులుండేవి. వారి నివాసగృహములకు దగ్గర్లో డచ్‌వారి మృతదేహములు ఖననం చేసిన ప్రస్తుతం ‘ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)’ వారి పర్యవేక్షణలో ఆనాటి డచ్ శ్మశానవాటిక (సెమిట్రీ) నేటికి కూడా కలదు. డచ్ వారి రిక్రియేషన్ నిమిత్తం వలందపాలెంలో డచ్ గార్డెన్స్, బోట్క్లబ్బు కూడా ఉండేది.
కిష్ణాజిల్లా మాన్యువల్ రచయిత 1881 నాటికి గమనించి, నమోదు చేసిన అతిపురాతన – పప్రధమ డచ్ కౌన్సిలర్ ‘జాకబ్ డీ డెల్’ సమాధి (మరణం 1624, అగష్టు 29వ తేదీ) బందరుకోట ఓల్డ్ పెరేడ్ గ్రౌండ్ దాటింతర్వాత, స్మాల్ మగజైన్ (చిన్న తుపాకి మందుకొట్టు) ప్రక్కన ఉండేది. స్థానికులు సమాధులు పడగొట్టి, చర్చి తదితర నివాసములు ఏర్పాటు చేసుకున్నారు. జాకబ్ డీడెల్ సమాధి ఫలకం మీద ఈ దిగువ శాసనం ఉండేది.
(In an old Cemetry in the fort outside of which is of a solitary tomb, which bears the following inscription and crust)
HERE LEVY BEGRA
VEN DEN E. JACOB
DE DEL
IN SYN LEVEN RAET VAN
INDIEN ENDE OPPER
డచ్ కంపెనీ వ్యాపారులు బందరు – బందరు చుట్టుప్రక్కల స్థానిక దేశీ వ్యాపారులకు పని అప్పగింత పెట్టేవారు. దేశీ వర్తకులు తమ పెట్టుబడితో చేనేత బట్టలు తయారుచేసి డచ్‌వారికి కావల్సినంత సరుకు, కావల్సినప్పుడల్లా అప్పగించి లాభాలమీద లాభాలు దండుకునేవారు. తమ దగ్గర చేసే కార్మికుల కష్టార్జితాన్ని జలగల్లా పీలుస్తూ అతి తక్కువ కూలీ ముట్ట చెప్పేవారు. దేశీ వర్తకులు 12 మంది చొప్పున సిండికేట్ కడ్తారు కనుక, అనివార్యంగా, ఉన్న చేనేత కార్మికులంతా దేశీ వర్తక సిండికేట్ (మాష్టర్ వీవర్స్) వ్యాపారుల దగ్గర పొట్టకూటి కోసం పనిచేయక తప్పేదికాదు, కాని ఎంతచేసినా పొట్టకూడు జరిగేదికాదు.
1630లో దక్షిణ భారత దేశంలో గొప్ప కర్వు సంభవించింది. కర్వు బారినపడిన సాలెకులం వారు, అద్దకం – కలంకారీ కార్మికులు, చేనేత కార్మికులు, బట్టలను ఉతికి తెలుపు చేసే చాకలివారు, తిండికోసం పని వెతుక్కుంటూ బందరు వదిలి పలు ప్రాంతాలకు వలస వెళ్ళారు. చేనేత, కలంకారీ అద్దకం పరిశ్రమలు మూలనపడే సరికి, డచ్ వారి బందరు వ్యాపారం రికార్డు స్థాయిలో దెబ్బతింది.
డచ్ వారి తూర్పు ఇండియా దీవుల వ్యాపారం విస్తరిల్లింది కాని, డచ్ వ్యాపారులవద్ద కావల్సినంత పెట్టుబడులు లేవు. డచ్ వారికి పెట్టుబడి పెట్టే బందరు పర్షియన్ సంపన్నవ్యాపారి కమాలుద్దీన్ డచ్‌వారి నొదిలేసి పర్షియా, బెంగాలతో స్వంత వ్యాపారం కొనసాగించగా, డచ్ వారికి సరుకుల టోకు సరఫరాదారు బందరు ‘చిన్నన్న’ డచ్‌కు సాయంచేయటం మానివేసి పెగూ, అరకాన్, సింహళంతో సొంత వ్యాపారం కొనసాగించాడు.
1652లో డచ్ వారు పాలకొల్లులో మరో గోదాముల సమూహం నిర్మించుకొన్నారు. ఈ కాలంనాటికి ఇంగ్లీషు, డచ్ తదితర విదేశీ వ్యాపార కంపెనీలలో పనిచేసి పదవీ విరమణ చేసిన యూరోపియన్ ఉద్యోగులు, ఫ్రెంచ్‌వారు,

పోర్చుగీసులు బందరు పట్టణంలో స్థిరనివాసులవటం ప్రారంభించారు. అందుకనే 1670లో బందరు దర్శించిన డొమినికన్ దేశపు సన్యాసి ‘ఫెర్నాండజ్ నావరేట్’ బందరు పట్టణంలో ఇంగ్లీషు, డచ్, డేనిష్, పోర్చుగల్, ముంగ్రేల్ మరియు కొందరు నల్లజాతీయులు నివసిస్తున్నారని వ్రాశాడు.
1650కల్లా డచ్ వారి వ్యాపారం తిరిగి పుంజుకొని 1685 వరకూ కొనసాగింది కాని వారు ఇంగ్లీషువారి గట్టిపోటీ ఎదుర్కొనాల్సి వచ్చింది. డచ్ కంపెనీ బందరులోని ఇంగ్లీష్ ఈష్ట్ ఇండియా కంపెనీ ఫ్యాక్టరీని పట్టుకోవాలని గట్టి ప్రయత్నం చేసింది. వ్యాపారం నిమిత్తం తొలుత మసులీపట్నంలో కాలుపెట్టిన వారు డచ్ కంపెనీ కనుక, తరువాత వచ్చిన ఇంగ్లీష్ తదితర కంపెనీ వ్యాపారులను డచ్‌వారు చొరబాటు దారులుగా, తమ వ్యాపార ఆక్రమణదారులుగానే చూశారు. డచ్, ఇంగ్లీషు ఘర్షణలు సాగాయి. మరోవైపు మహారాష్ట్రుల, మొగలాయి దాడులు మొదలయ్యాయి. 1690 నాటికల్లా, మసులీపటాం మరియు పులికాట్‌లకు బదులు నాగపట్నం డచ్‌వారి ప్రధాన స్థావరమయింది. గోల్కొండ ప్రధానమంత్రి ‘అక్కన్న’ డచ్ వారికి బందరులో నేతవస్త్రాలు అమ్మరాదని నిషేదం విధించి, డచ్‌వారి సరుకుతో నిండిన భారీ పడవలను బందరులో నిర్భంధించాడు. 1687లో గోల్కొండ మొగలాయి పాలనలో కొచ్చింది. ఈ కాలంలోనే ఫ్రెంచ్వర్తకులు బందరు పట్టణంలో ఒక వర్తకస్థావరం నెలకొల్పుకున్నారు. ఫ్రెంచ్‌వారు జింజి పాలకుని వద్ద పుదుఛ్ఛేరిని కొనుగోలు చేసి వ్యాపార ఫ్యాక్టరీ బలపర్చుకున్నారు. 1693లో పుదుఛ్ఛేరిని డచ్‌వారు స్వాధీనం చేసుకున్నారు కాని, 1697లో ఫ్రెంచ్‌వారికి పుదుఛ్ఛేరి (పాండిఛ్ఛేరి) తిరిగి స్వాధీనమైంది.
డచ్‌వారికి రావలసిన అప్పుల వసూళ్ళకు, స్థానికులను కిడ్నాప్ చేసి సముద్రం మధ్యలో ఓడలో బంధించి – బెదిరించి, బ్లాక్ మెయిలింగ్ చేసి డచ్‌వారు అప్పుసొమ్ము తిరిగి పొందే సాయుధ దశకు చేరారు. బందరు హవల్దారు, ఫౌజుదారు డచ్ మరియు ఇంగ్లీష్ కంపెనీల వ్యాపారులను అక్రమ సంపాదనకు వేధించేవారు. స్థానిక హిందూ వ్యాపారులు కూడా డచ్, ఇంగ్లీషు వారివద్ద టోకు – అప్పు వ్యాపారం నిర్వహించి, అప్పు తీర్చే విషయం వచ్చేసరికి ఎగ్గొట్టటానికే ప్రాముఖ్యత ఇచ్చేవారు. పెద్దబాకీల వసూళ్ళ నిమిత్తం ఇంగ్లీష్ డచ్ కంపెనీల అధికార్లు బందరు తీరంవెంట తమ సాయుధ ఓడలను మోహరించి, ఎఱ్ఱసముద్రం – పర్షియన్ గల్ఫ్ దేశాలనుండి మసులీపట్నం రేవుకు ఖరీదైన సరుకులతో, బంగారంతో బయలుదేరే భారీ నౌకలను దారిమళ్ళించి వారివారి కంట్రోలులో ఉన్న రేవులలో సరుకులు బలవంతంగా దించుకొనేవారు.
1679లోకల్లా కోరమండల్ కోస్తాలో మసులీపట్నం డచ్‌వారికి గొప్ప వ్యాపార కేంద్రమయింది. కోస్తాలోని ఇతర డచ్ ఫ్యాక్టరీలయిన పాలకొల్లు, నర్సాపురం వ్యాపార కేంద్రాలను కూడా మసులీపట్నం నుండే డచ్‌వారు పర్యవేక్షించేవారు 1689 నాటికి ఢిల్లీ కేంద్ర మొగలాయి ప్రభుత్వం గోల్కొండ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవటం జరిగింది. చక్రవర్తి ఔరంగజేబు ఉత్తర్వుల మేరకు సైన్యం డచ్, ఇంగ్లీషు కంపెనీలమీద యుద్ధం ప్రకటించేసరికి ఇంగ్లీష్, డచ్, ఫ్రెంచ్ కంపెనీలు కొంతకాలం బందరుపట్టణం విడిచి పోయారు.
బందరుకోటను అభివృద్ధి పరచినవారు డచ్‌వారు మాత్రమే. వీరు తమసైన్యం తుపాకుల మందుగుండు నిమిత్తం బందరుకోటలో స్మాల్ గన్‌ఫౌడర్ మేగజైన్ నిర్మించుకున్నారు. నేడు డచ్కోటగా స్థానికులు – ASI వారు పిలిచే ఆయుధాగారం కూడా డచ్‌వారి నిర్మితమే. దీన్నానుకొని ఉన్న పెద్ద తుపాకి (ఫిరంగి) మందుకొట్టం కూడా డచ్ నిర్మితమే. బందరుకోట సెయింట్జాన్ శ్మశానవాటికలో డచ్ జాతీయుల సమాధులు కలవు. సమాధి శిలాఫలకములు డచ్భాషలోనే కలవు. మసులీపట్నంలోని వలందపాలెంలో డచ్‌వారి సెమిట్రీ (శ్మశానం) మంచి స్థితిలో ASI వారిచే నిర్వహించ బడుతున్నది.
1672లో బందరు దర్శించిన డచ్ మతాచార్యుడు ఫెర్నాండెజ్ నావరెట్ ‘ఈ నగరం (మసులీపటాం) గొప్ప వ్యాపార కేంద్రం. ఇక్కడ డచ్ సరుకులే కాక మొలోగ్యూస్, చైనా మరియు ఇతరదేశాల నుండి దిగుమతి అయిన సరుకులు సరసమైన ధరలకు దొరుకుతాయి. ఇక్కడ కాంభోజ, సూరత్, మొగల్ చక్రవర్తుల అధీనంలోని ప్రదేశముల నుండి, మరియు ఒరిస్సా, బెంగాల్, గోవా, పెగూ దేశాలనుండి వచ్చిన వర్తకులు ఉన్నారు. ఇక్కడ వజ్ర, వైడూర్యముల వ్యాపారం బాగా కొనసాగుతుంద’ని వ్రాశాడు.
(తరువాయి వచ్చే సంచికలో)
-మహమ్మద్ సిలార్
కన్వీనర్, ఇంటాక్ మచిలీపట్నం చాప్టర్, ఆంధప్రదేశ్
ఎ : 998556494
