తేది: 19.02.2026
భూపతి చంద్ర మెమోరియల్ ట్రస్ట్

భూపతి చంద్ర స్మారక కథానికల బహుమతి ప్రదానోత్సవ సభను హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్తులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా భూపతి చంద్ర మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ ఎమ్.లక్ష్మీ కాంతారావు, ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ మృణాళిని, గౌరవ అతిథిగా ప్రముఖ రచయిత, సీనియర్ జర్నలిస్ట్ శ్రీ మహమ్మద్ ఖదీర్ బాబు, విశిష్ట అతిథిగా ఆంధ్రజ్యోతి దినపత్రిక పూర్వ సంపాదకులు శ్రీ కె. శ్రీనివాస్, ఆత్మీయ అతిథిగా సినీ దర్శకుడు, సాంస్క•తిక ప్రతినిధి శ్రీ బి. నరసింగరావు పాల్గొన్నారు. సభా సమన్వయాన్ని శ్రీ సి.ఎస్. రాంబాబు నిర్వహించారు.
సభ ప్రారంభానికి ముందు సారస్వత పరిషత్ తరపున చెన్నయ్య గారు అతిథులకు మహాకవి పంపన రచించిన ‘‘విక్రమార్జున విజయం’’ (పంప భారతం) (తెలుగు అనువాదం: జోష్యుల సదానందశాస్త్రి) పుస్తకాలను బహుకరించారు. ఈ పుస్తకం కాంతారావు గారికి చాలా ఇష్టమైన పుస్తకం. కాంతారావుగారు చెన్నయ్య గారిని సన్మానించారు. అతిథులు భూపతి చంద్ర చిత్ర పటానికి జ్యోతి ప్రకాశన చేశారు. భాస్కర్ రెడ్డి గారు ప్రార్థన శ్లోకం పాడినారు. భాస్కర్ రెడ్డిగారిని నర్సింగరావు గారు శాలువాతో సత్కరించారు.
గత సంవత్సరం భూపతి చంద్ర స్మారక కథానికల పోటీలు నిర్వహించినప్పుడు 150కి పైగా కథలు వచ్చాయి. ఈ సారి 300 పైగా కథలు వచ్చాయి. అందులో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఒరిస్సా, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది కథానికలు పంపడం జరిగింది. వీటిని పదిమంది న్యాయనిర్ణేతలచే స్క్రూటిని చేయడం జరిగింది. వీరు ఎంపిక చేసిన కథలను మరోసారి ఇద్దరు న్యాయనిర్ణేతలతో ఎంపిక చేయించి బహుమతులు ప్రకటించినారు.
ప్రథమ బహుమతి ‘అంతర్ధానం’ శ్రీ సుంకోజి దేవేంద్రాచారి (కడప), ద్వితీయ బహుమతి ‘పులి నెత్తుటి ముగ్గు’ శ్రీ పొత్తూరి సీతారామ రాజు (కాకినాడ), తృతీయ బహుమతి ‘కన్నీటి వసంతం’ శ్రీ పుప్పాల కృష్ణమూర్తి (కోదాడ) లు ఎంపికైనారు. వీటితో పాటు మరో ఐదుగురికి ప్రోత్సాహక పురస్కారాలు లభించాయి. ‘ఒక కొడుకు తీర్పు’ డాక్టర్ ఎం. సుగుణ రావు (విశాఖ), ‘ఇచ్చోటనే కద’ శ్రీ చొక్కార తాతారావు (వైజాగ్), ‘అంబటి తట్ట’ శ్రీ మొయిద శ్రీనివాసరావు (విజయనగరం), ‘రెండో కోణం’ శ్రీమతి ఉయ్యూరు అనసూయ (ఎన్టీఆర్ జిల్లా), ‘కర్టెన్’ శ్రీ మధుసూదనరావు (నెల్లూరు జిల్లా)రాసిన కథలకు ప్రోత్సహక పురస్కారాలు అందించారు.

గౌరవ అతిథి శ్రీ మహమ్మద్ ఖదీర్ బాబు మాట్లాడుతూ… ఇలాంటి గొప్ప సందర్భంలో నన్ను పిలిచి వేదిక నుంచి మీ అందరిని కలిసే అవకాశం ఇచ్చిన పెద్దలు శ్రీ లక్ష్మీ కాంతారావు గారికి కృతజ్ఞతలు. ఈ మధ్య గాయకుడు రఫీ శతజయంతి సందర్భంగా కార్యక్రమం నిర్వహిస్తూ లక్ష్మీ కాంతారావు గారికి ఫోన్ చేశాను. వారికి రఫీ అన్నా, వారి పాటలన్నా విశేషమైన ప్రీతి అన్నారు. అలా లక్ష్మీకాంత్గారితో నేను మొదటిసారి మాట్లాడడం జరిగింది. ఈ సభకు ముందు వేసిన పాటలు విన్న తర్వాత ఒక రకమైన దుఃఖం వచ్చింది. ఆ పాటల్లో మనుషులు ఎంత ప్రేమగా ఉన్నారు, ఎంత సున్నితమైన భావాలు. హృదయాలని పంజరంలో పెట్టి.. ముత్యాలను దానిమ్మ గింజలుగా పెట్టానని పాడిన పాటలు.. మనుషుల సున్నితత్వాన్ని తెలియజేస్తాయి. గురు దత్తుకు బాల్యం నుంచి కంటి చూపు కనపడదు. గజం తర్వాత అసలు ఏమీ కనపడదు. కానీ, ఆయన సినిమాలు అన్నీ అద్దాలు లేకుండా నటించారు. హీరోయిన్ను చౌద్నీక చాంద్ హో.. యా ఆబ్ తాబ్ హో.. అని ఆమెను చూస్తూ పాడుతున్నాడు కానీ… ఆయనకు ఏమీ కనిపించదు. తన కంటికి ఏమీ కనిపించకపోయినా ప్రపంచానికి అందమైనవి.. లాలితమైనవి చూపించారు. నేటి రచయితలు అడంబారాన్ని వీడి సమాజానికి లలితమైనవి, సున్నితమైనవి, ప్రేమ పూరకమైనవి చూపించి మళ్లీ మాములు మనుషులుగా మారాలని, భూపతి చంద్ర స్మారక కథానికల పోటీల్లో బహుమతులు ఇవ్వబోయే కథలు గాని, మనుషులని మనుషులుగా ఉంచే కథలకు ప్రాధ్యానత ఇస్తారని ఆశిస్తున్నాను.
విశిష్ట అతిథి ఆంధ్రజ్యోతి దిన పత్రిక పూర్వ సంపాదకులు శ్రీ కె. శ్రీనివాస్ మాట్లాడుతూ… భూపతి చంద్ర గారి జ్ఞాపకంలో వాళ్ల కుటుంబ సభ్యులు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కథల పోటీలు నిర్వహించడం, దాంతో విజేతలకు బహుమతులు అందజేయడం, గత ఏడాది మొదలు పెట్టిన ఈ అనవాయితీ… సాహిత్య క్యాలెండర్లో ఒక ఈవెంట్‌గా చేరింది. మాములుగా కథల ఎంపిక విషయంలో కథల పోటీలు పెట్టేవారు. తెలుగు సాహిత్యంకు సంబంధించి ఒక కర్తవ్యంతో పోటీలు నిర్వహించడం అనేది మంచి పద్ధతి. ప్రస్తుతం తెలుగు సమాజంలో ఎట్లా ఉందో, ఏ కష్టాల్లో ఉందో, ఏ సుఖాల్లో ఉందో, ఏం ఆలోచిస్తుందో చెప్పే కథలే… ఎంపికకు పోటీలు నిర్వహించడం జరిగిందని నా అభిప్రాయం. అయితే ఏ కథలు రావాలి అనే చెప్పే సందర్భం వచ్చినప్పుడు కవిత సందర్భంలో శీశ్రీ కవితగా చెప్పారు. ఇతిహాసపు, అడుగున పడి కనిపించని చీకటి కోణం కథలు అన్నీ ఇప్పుడు కావాలన్నారు. అంటే ఏ కథలైతే చెప్ప బడలేదో, ఏ కథలైతే వినబడటం లేదో, ఏ కథలు బయటకు రాలేదో, ఏ కథలు చూడలేకపోయామో అలాంటి కథలు పైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో తెలంగాణ సమాజానికి రావాల్సిన కథలు చాలా తక్కువ వచ్చాయి. అనేక కారణాల వల్ల చాలా తక్కువ వచ్చాయి, భిన్నంగా ఉన్న అంశాలను పూర్తి చేయాల్సిన అవసరం కూడా ఉంది. ముఖ్యంగా చారిత్రక కథలు మన దగ్గర తక్కువ వస్తున్నాయి. చరిత్ర అంటే ఇవాళ సాధారణ వ్యక్తుల్లో కూడా చాలా ఆసక్తి పెరిగింది. కాబట్టి తెలంగాణ ప్రాంత చరిత్రలు సృష్టించిన మనుషులు ఉన్నారు. వాళ్ల చరిత్ర మన దగ్గర లేదనిపిస్తుంది. భూపతి చంద్ర కథల పోటీల నిర్వహకులు, తెలుగువారి జీవితాలను, ప్రాంతాలను, విద్యాస్థాయిలను, నివాస ప్రాంతాలను బట్టి వివిధ అంశాలను తెరపైకి తేవాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. ఇలాంటి అనేక అంశాలు తెరపైకి వస్తే తప్ప మన సమజానికి అర్థం కాదు. అన్ని ప్రాంతాల కష్టాలు, ప్రేమలు బయటికి రావాలన్నారు. అందుకు ఇలాంటి పోటీలు ఉపయోగపడుతాయని ఆశిస్తున్నానన్నారు.

ముఖ్య అతిథి ప్రొఫెసర్ సి.మృణాళిని గారు మాట్లాడుతూ… మణికొండ కుటుంబ సభ్యులు ‘భూపతి చంద్ర మెమోరియల్ ట్రస్ట్’ ద్వారా ఎన్నో రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. లక్ష్మీకాంతారావు, నరసింగరావుగారు, వేదకుమార్గారు ముగ్గురు నాకు ఆత్మతీయులు. కాంతారావు గారితో నాకు చాలా కాలా నుండి పరిచయం. ఖదీర్ బాబు అన్నట్టు ఆ స్వర ప్రపంచంలో నుంచి ఆక్షర ప్రపంచంలోకి రావడం నాకు ఆనందంగా అనిపించలేదు. నాకు స్వర ప్రపంచమే ఎక్కువ ఇష్టం. సంగీతం చాలా ఇష్టం. కాబట్టి అందులో నుంచి ఒక్కసారి ఈ అక్షర ప్రపంచంలోకి లాక్కొచ్చారు ఏంటీ అని అనుకునన్నా. ఆ రకమైన సంగీత స్నేహం నాది, కాంతారావు గారిది. కాంతారావు గారితో ఆయన ఇంట్లో హిందీ, తెలుగు పాటలు లాంటి కార్యక్రమాలకు నన్ను పిలిచేవారు. గత పదేళ్లుగా సికింద్రాబాద్‌లో ఉండే రఫీ ఫౌండేషన్‌లో మేమిద్దరం సభ్యులం. ఆఫౌండేషన్ పలు కార్యక్రమాల్లో మేమిద్దరం పాల్గొన్నాం. అలా పాటల స్నేహం కాంతారావు గారితో. నరసింగరావు గారితో సినిమాలే స్నేహం. వారు తన హరివిల్లు సినిమా తీస్తున్నప్పుడు ఆ సినిమా ముగింపు గురించి చిన్న చర్చ జరిగింది. ఇందులో ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే… సినిమా జాబితాల్లో ముందు వేసే పేర్లల్లో నా పేరు కూడా వేశారు. ఇది నేను ఆయనకు చేసింది ఏమి లేదు. ఆయనకు ధన్యవాదములు. వేదకుమార్ గారు దక్కన్ ల్యాండ్, బాల చెలిమి మాసపత్రికల ద్వారా ఆయన చేస్తున్న సేవలు అందరికి తెలిసినవే. ముఖ్యంగా దక్కన్ ల్యాండ్‌లో ఉండే వ్యాసాలు అన్నీ చరిత్రకు సంబంధించిన వ్యాసాలు ఉంటాయి. కథ వస్తువులు కావాలని అనుకుంటే దక్కన్ ల్యాండ్ పత్రికను కొనుక్కుంటే చాలు. అటు వంటి పత్రికను నడపడం అంటే చాలా కష్టం. బాలసాహిత్యం తెలుగులో ఏ స్థాయిలో ఉందో మన అందరికీ తెలుసు. మిగిలిన భారతీయ భాషలతో పోలిస్తే.. తెలుగు భాష వెనుకబడే ఉంది. దీనికి ఆయన బాలచెలిమి ద్వారా పిల్లల కోసం కథలు, పిల్లల్లో ఆలోచన, వారికి జ్ఞానం పెంపొందే వంటి కథలు, విశేషమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్న వేదకుమార్ గారు అంటే చాలా గౌరవం. ఈ ముగ్గురు ఈ కార్యక్రమానికి పిలవడం నేను గౌరవంగా భావిస్తున్నాను. నేటి సమాజంలో కళలు, సాహిత్యం, సినిమాలు, రాజకీయాలు ఇలా అనేకం లోపించాయి. కళలు, సంస్కారం ఈ రెండింటిని ఈ ముగ్గురు పోషిస్తున్నారు. వాళ్లకు వీటి అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు నా కథలు సోషల్ మీడియాలో లేకపోతే ట్విట్టర్లో రాసుకుంటాను. నా కథను ఎక్కడైనా రాసుకోవచ్చు. పది మందికి పంపవచ్చు. దాంట్లో ఎంపిక ఉండదు. నా మిత్రులందరూ చాలా బాగుంది అంటారు. మిత్రులు కాని వారు బాగాలేదని అంటారు. అలా నడుస్తుంది ఇప్పుడు సాహిత్యం వ్యవహారం. అలాంటి సమయంలో నాణ్యత కలిగినటువంటి పోటీలు చాలా అవసరమని నేను అనుకుంటాన్నాను. ఎందుకంటే కథల పోటీలు పెట్టినప్పుడు కథ అంటే ఏమిటి అని చర్చించడం జరుగుతుంది. దానికి వడపోత ఉంటుంది. ఈ వడపోతలో పది మంది న్యాయనిర్ణేతలు పాల్గొన్నారు. ఇద్దరేమో తుది న్యాయనిర్ణేతలుగా ఉన్నారు. ఇంతగా వడ పోత జరిగితే, సహజంగానే న్యాయమైన రచన మన ముందుకు వస్తుంది. ఇటువంటి కథ పోటీల వల్ల మనకు జరిగేదిమిటంటే.. నాకు నేను రాసుకోని, లైకులు కొట్టుకోడమే కాకుండా, నిజంగా ఒక స్థాయి కలిగిన రచనలు సాహిత్యంలో వచ్చే అవకాశం ఉంటుంది. పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి నా అభినందనలు. ఇప్పుడు సాహిత్యం రాస్తున్న వాళ్ళలో కొంచెం నైపుణ్యం తగ్గింది. రాయడంలో ఉండాల్సిన నైపుణ్యం లేదు. తెలుగులో కథ మొదలైనప్పటి నుంచి ఈనాటి వరకు గల ప్రమాణాలు అలాగే నిలుపుకుంటున్నాయి. మన మొత్తం భారతీయ సాహిత్యంతో పోటీ పడగలమో లేదో తెలియదు కానీ.. కథలో ఎవరితోనైనా పోటీ పడే సత్తా తెలుగు సాహిత్యానికి ఉంది. అటువంటి వారసత్వం ఉన్న తెలుగు వాళ్ళు ఇప్పుడు కథని ఎంత ముందుకు తీసుకెళ్తున్నారు. ఎంత మంది న్యాయం చేస్తున్నారు. కథ రచనలు ప్రయోగాన్ని, కొత్త దనం గతంలో వచ్చిన ప్రాధాన్యత ఇప్పుడు రావటం లేదు. అందుకని అప్పటి కథలు ఈ నాటి రచయితలు చదవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. మంచి కథలే వస్తున్నాయి. కానీ కొత్త దనం తీసుకోవాలంటే రచయితలో ఉండాల్సింది పరిశీలన, పరిశోధన. ఈ రెండూ లేకపోతే సాహిత్యం మిగలదు. బుర్ర సుబ్రమణ్యం గారు గొప్ప రచయితగా తెలుగు సాహిత్యంలో ఎప్పుడూ లేరు. ఆయన ‘జేబురు వల్లు’ అనే ఒక కథ రాశాడు. ఆ జేబురు వల్లు కథలో రచయిత ఉన్నాడు. పూర్తిగా సంభాషణ. ఇక ఏమీ ఉండదు. ఈయన చేసిన ఈ కథల్లో మొత్తం సంభాషణలు రాస్తూ… కొంత హీరోయిన్ వైపు నుంచే నడుస్తుంది. నలుగురు అబ్బాయిలు, ఒక్క అమ్మాయి మాత్రమే ఉంటారు. అంటే కథను ఎలా చెప్పవచ్చు, ఎంత గొప్పగా చెప్పవచ్చు, ఎక్కడా రచయిత లేడు. కేవలం అమ్మాయికి అబ్బాయికి నాలుగు డైలాగులు. మళ్లీ రెండు చుక్కలు… మళ్లీ మరో అబ్బాయితో నాలుగు డైలాగులు.. మళ్లీ రెండు చుక్కలు ఇలా ముగుస్తుంది. అలా కథను చెప్పడంలో స్త్రీ, పురుష సంభాషణల మధ్య ఎంత లోతైన అవగాహన ఉంది. వివాహం అనే వ్యవస్ధ మీద ఎటువంటి వ్యాఖ్యానం ఉంది. ఆ రెండు పేజీల కథల్లో ఎన్ని పనులు సాధించారు ఆయన. ఇటువంటి కథలు మన తెలుగు సాహిత్యంలో కూడా ఉన్నాయి. ఇలాంటి కథలు బయటకు రావాలని కోరుకుంటాను. కథల్లో ప్రయోగాలు చేయటం, కథల్లో కావాల్సిన పరిశోధన, పరిశీలన అనేవి కథకులు పెంచుకుంటే బాగుందని నా చిన్న సూచన.

అత్మీయ అతిథి, సినీ దర్శకుడు, సాంస్కృతి ప్రతినిధి నర్సింగరావు గారు మాట్లాడుతూ… ఇలాంటి సందర్భాల్లో మాట్లాడడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే హాలీవుడ్ పర్సన్ గల కృష్ణమోహన్ ఒక్క పాట రాశాడు.. ఆ పాటలో మనం కరిగిపోతాం. జీవిత లోతులోంచి ఒక సముద్ర కెరటంలాగా వస్తుంది. మళ్లీ నదిలోకి వెళ్లిపోతుంది. సాహిత్యంలో కూడా అలాంటి గొప్ప విధానం ఉంటుంది. మిత్రులు చెప్పినట్లు ముందు మా అన్నయ్య సంగీతంతో ప్రారంభించారు. సంగీతంలో ఉన్న సాహిత్యం. ఆ పాటల్లో ప్రేమ ఉంటుంది. ఇప్పుటి పాటలు, ఇప్పటి సినిమాలు దాదాపు చూడలేదు. తెలుగులో చాలా మంది గొప్ప కథకులు ఉన్నారు. నేను, మా అన్నయ్య కాంతారావు గారు 1960వ సంవత్సరంలో పోటాపోటీగా చదివే వాళ్లం. రోజూ రెండు, మూడు పుస్తకాలు చదివేవాళ్లం. కథకులు, గొప్ప గేయకులు, గేయాలు రాసేవారు, పాటలు రాసేవారు, కవితలు రాసే వారు ఉన్నారు. జీవిత అనుభవం అన్నదే ఒక నిధి. పరిశోధన, పరిశీలనలకు మించి ఊహా శక్తి. ఈ అన్ని వస్తువులతో ఊహా శక్తితో ముందుకు వెళ్లినప్పుడు సాహిత్యం సృష్టించబడుతుంది. ఊహా శక్తి అంటే కేవలం గాలిలోంచి కాదు. అంటే, ఇప్పుడు జీవిత అనుభవంతో రాయాలంటే కొంత వరకే పరిమితి. ఊహ శక్తి లేదు. ఊదాహరణ మనకు ఉన్న రకరకాల కళలు, సాహిత్యంతో కలిపి మనం చూస్తే చిత్ర కళ ప్రపంచ వ్యాప్తంగా అత్యంత దశకు వెళ్లిపోయింది. ప్రతి ఆరిస్ట్కు, ప్రతి రచయితకు తనదైన శైలి ఉంటుంది. వీటి ప్రభావం ప్రేక్షకుల మీద ఉంటుంది. అద్భుతంగా ఈ కార్యక్రమం జరగడం సంతోషమన్నారు.

భూపతి చంద్ర మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ ఎమ్.ఎల్.కాంతారావు గారు మాట్లాడుతూ.. నాకు పూర్వ కవులల్లో భాసుడు రాసిన చారుదత్తషోము తర్వాత శూద్రకుడు వ్రాసిన మృచ్ఛకటికం, తర్వాత తరాల్లో శ్రీపాద వారు. శ్రీపాద గారు గొప్ప అద్భుతమై కథను రాశాడు. తర్వాత రచయితల్లో కొడవటిగంటి కుటుంబరావు గారు అంటే చాలా ఇష్టం. ఇక కన్యాశుల్కం నిత్యం పఠించే గ్రంథం. తర్వాత మధురాంతకం రాజారాం గారి వింత ప్రపంచం. దీన్ని 40 ఏళ్ల క్రితం రాశాడు. అది గొప్ప కథానిక. తర్వాత దిద్దుబాటు కథనికలో మూడు పాత్రలు గోపాల్ రావు, కమ్మటిని, రాము, బండారు అచ్చమాంబ గారు రాసిన ధన త్రయోదశి గొప్పది. ఈ రెండింటిలో కూడా స్త్రీ విద్య ముఖ్యమనేది చెప్పబడ్డాయి. నేను చాలా పుస్తకాలు చదువుతాను, కానీ ఇప్పటివరకు ఒక్క పేజీ కూడా రాయలేదు. చాలా మంది చేత పాటలు పాడించాను, కానీ నేను పాడను. 40ఏళ్ల తర్వాత నేను మైక్ ముందు వచ్చాను. 1986లో సంగారెడ్డిలో నిర్వహించిన కార్యక్రమంలో, గతేడాది నిర్వహించిన సభలో మాట్లాడాను.. ఇప్పుడు మాట్లాడుతున్నాను. నాకు కథానికలు బాగా ఇష్టం. కథల్లో నవరత్నాలు అల్లిన కథలు ఉంటాయన్నారు.
శ్రీ కె.పి. అశోక్ కుమార్ గారు మాట్లాడుతూ.. వ్యక్తులు, సంస్థలు ప్రతికలు నిర్వహించే కథల పోటీలకు గత 25 సంవత్సరాలుగా నేను న్యాయ నిర్ణేతగా ఉంటూ వస్తున్నాను. బహుమతులు ఇవ్వడంలో చాలా ఖచ్చితంగా వ్యవహరించడం జరిగింది. నిజానికి ఫలితాలు వచ్చిన తర్వాతే బహుమతులు ఎవరికి వచ్చాయో మాకు తెలిసిందన్నారు.

శ్రీ పొత్తూరి సీతారామరాజు మాట్లాడుతూ… కథలు కొత్తగా రాస్తున్నారు. కథలు కొత్తగా రాయడం వల్లే 350 కథల్లో నాకు ద్వితీయ బహుమతి గెలుచుకున్నాను. ఎక్కడో ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణలో అవార్డు తీసుకోవడం, ఇలాంటి గొప్ప మహనుభావుల చేతుల మీద నుంచే నేను అవార్డు తీసుకోవడం అంటే గొప్ప చరిత్రన్నారు.
శ్రీ పుప్పాల కృష్ణమూర్తి మాట్లాడుతూ.. గొప్ప వ్యక్తులు, సాహిత్య రచయితలు ఉన్న ఈ సభలో మాట్లాడడం అంటే.. నాకు కొద్దిగా భయం, ఇబ్బంది కూడా ఉంది. నెల రోజుల క్రితమే బాల చెలిమి వారు నిర్వహించిన వనదేవత కథకు కూడా శ్రీ వేదకుమార్ చేతుల మీదగా బహుమతిని అందుకోవడం జరిగింది. వేదకుమార్ గారికి నమస్కారాలు తెలిపారు.
శ్రీ చొక్కార తాతారావు మాట్లాడుతూ.. ముందుగా నా కథకు బహుమతిని ప్రకటించిన భూపతి చంద్ర నిర్వాహకులకు.. న్యాయ నిర్ణేతలకు ధన్యవాదములు తెలిపారు.
దక్కన్‌ల్యాండ్, బాల చెలిమి ఎడిటర్ శ్రీ వేదకుమార్ మాట్లాడుతూ.. అతిథులు, అన్నయ్యలు, బహుమతి విజేతలు, న్యాయ నిర్ణేయితలు కూడా ఈ సందర్భంగా మాట్లాడారు. భూపతి చంద్ర ట్రస్ట్ గురించి కూడా రాంబాబు గారు తెలియజేశారు. కథానిక పోటీలు ఎందుకు నిర్వహించాలని పెద్ద అన్నయ్య చాలా ఆలోచించి కథలకు ప్రాముఖ్యత ఇవ్వాలని నిర్ణయానికి రావటం జరిగింది. మాతో సహకరించిన అందరికి కూడ కృతజ్ఞతలు. రచయితలందరికి కృతజ్ఞతలు తెలిపారు. సారస్వత పరిషత్ వారిక ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

చివరిగా శ్రీ కాంతారావు గారిని పలువురు రచయితలు, కవులు, తదితరులను ఘనంగా సన్మించారు. కథల ఎంపిక న్యాయనిర్ణేతలుగా శ్రీ డబ్బీర్కార్ రూప్‌కుమార్, శ్రీమతి నెల్లుట్ల రమాదేవి, శ్రీ వెల్దుండి శ్రీధర్, శ్రీ జుగాష్ విలి, శ్రీ బి.వి.ఎన్. స్వామి, శ్రీ గోపగాని రవీందర్, శ్రీ చింతపట్ల సుదర్శన్, శ్రీ సలీం, శ్రీ డి. లక్ష్మణస్వామి, శ్రీ రాంచందర్‌జీ, శ్రీ ఎమ్.ఆర్.కృష్ణ సహకరించగా… తుది న్యాయనిర్ణేతలుగా శ్రీ కె.పి.అశోక్ కుమార్, ప్రొఫెసర్ ఎస్. రఘు వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో అశ్విన్ కుమార్- సంపాదకులు మిసిమి పత్రిక, బి.ఎస్.రాములు-మాజీ ఛైర్మన్ బీజీ కమీషన్, జూలూరు గౌరీశంకర్ -మాజీ చైర్మన్ సాహిత్య అకాడమీ, డాక్టర్ డి. రాజిరెడ్డి, మణికొండ నర్సింగరావు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్, పంచాయితీ రాజ్, తెలంగాణ, కిషోర్-చైర్మన్ రామనంద తీర్థ ట్రస్ట్, కోట్ల వెంకటేశ్వరరెడ్డి, వనపట్ల సుబ్బయ్య, భీంపల్లి శ్రీకాంత్, గరిపెల్లి అశోక్, అమరవాది నీరజ, బండారు విజయ, లక్ష్మి, పాడి రవి-ఐఆర్ఎస్ హైదరాబాద్, డాక్టర్ కెవి. రమణ-రిటైర్డ్ హెచ్ఓడీ ఉస్మానియా హాస్పిటల్, ఏ.జి.కృష్ణ, తులసీరామ్, నరసింహారావు, రమణ-గాయకుడు, కళాగా కృష్ణమోహన్- రిటైర్డ్ ఆల్ ఇండియా రేడియో, ఎం. రామ్మోహన్రావు, జి. గోపాల్‌రెడ్డి, శ్రీధర్‌రావు- రిటైర్డ్ అడిషనల్ ఏసీపీ, దేవేందర్‌రావు-రిటైర్డ్ ఏసీపీ, ఉండ్రాళ్ళ రాజేశం, బైతి దుర్గయ్య, జనార్దన్‌రావు, రాజలింగం, జాయీయుద్దీన్ – మాజీ వైస్ ఛైర్మన్ గజ్వేల్ మున్సిపాలిటీ, పి. మల్లేశం – గజ్వేల్ జెడ్పీటీసీ, మర్కంటి భాగ్యలక్ష్మి – కనకసేన గజ్వేల్ కౌన్సిలర్, వసీం ఖాన్-మాజీ కౌన్సిలర్ గజ్వేల్, రాజేష్, సమన్వయకర్తలు సయ్యద్ ఖైజర్, కొత్వాల్ సచిన్, ఇంకా తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖ రచయితలు, కవులు, గాయని, గాయకులు తదితరులు పాల్గొన్నారు.
కట్టా ప్రభాకర్, ఎ : 8106721111
