(గత సంచిక తరువాయి)
‘‘మేరే మన్ కీ గంగా, తేరే మన్‍కీ జమునాకా’’ పాట దేశాన్ని, పిచ్చిగా ఊపేస్తున్నప్పుడు (1964 సంగం సీన్మా). నేను పదమూడు టీన్ ఏజ్ లోకి ప్రవేశించాను. ఆ పంచరంగుల సీన్మా సుల్తాన్ బజార్ దిల్షాద్ టాకీసులో చూసిన (అదిప్పుడు లేదు) తర్వాత రంగుల లోకాలలోకి ఎగిరి పోవటం మొదలయ్యింది. పెద్దపెద్ద విమానాల అందం, లండన్, రోమ్, ప్యారిస్, స్విట్జర్లాండ్ నగరాల, ఆల్ఫస్ పర్వతాల సౌందర్యం, నయాగారా జలపాత ఉదృతం నన్ను మంత్రించి మాయచేసాయి. నేలమీద కాలు నిలవకుండా పగటి కలలు కనటం మొదలయ్యాయి. తర్వాత్తర్వాత కాలాలలో ఆ విశ్వనగరాలన్నింటినీ దర్శించి ‘కల నిజమాయెగా’ అని పాడుకున్నాను. రాజ్‍కపూర్‍ను యాది చేసుకున్నాను.
నాకు సిగ్గూ షరమూ అస్సలు లేవని మాపెద్దక్క ద్వారా నాకు మొదటిసారి తెలిసివచ్చింది. అదేల అనగా షమ్మీకపూర్ నటించిన ‘‘ఎన్ ఇవినింగ్ ఎన్ ప్యారిస్’’ (1967) విడుదలైన రోజు నా హెచ్‍ఎస్‍సి ఫలితాలు వచ్చి నేను అన్ని సబ్జెక్టులలోనూ విజయవంతంగా విఫలమయ్యాను. నేను ఫెయిల్ కావటం ఖాయం అని పరీక్షలు రాయకముందే నాకు తెలుసు కావున చింత ఏల అని శుభ్రంగా ఆ రోజే విడుదలైన ‘ఎన్ ఇవీనింగ్ ఇన్ ప్యారిస్’’కు క్రిష్ణా టాకీసులో మార్నింగ్ షోకు వెళ్లినాను. ఇంటికి వచ్చాక ‘‘నీకు సిగ్గూ శరమూ లేవారా’’ అన్న మాటల ద్వారా మా పెద్దక్క నాకు జ్ఞానోదయం కలిగించింది. ‘‘నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు’’ టైపు మనిషిని నేను.
‘‘దునియా కీ సైర్ కర్‍లో,
దునియా కీ సైర్ కర్‍లో
దునియా కీ సైర్ కర్ కే
ఇన్సాన్ సే ప్యార్ కర్‍లో’’
(1967 అరౌండ్ ది వరల్డ్, సీన్మా పాట).
ఈ పాట పుణ్యమా అని చెడిపోయిన్నో, బాగు పడిన్నో నాకైతె తెలియదు కాని కెనడా, పశ్చిమ యూరపు దేశాలు, లండన్, మధ్య ఆసియా నాలుగు దేశాలు (ఒకప్పుడు సోవియట్ యూనియన్‍లో భాగం) చైనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండు, బూటాన్ దేశాలను తర్వాత కాలంలో ‘చల్ ఉడ్ జారే పంచీలా’ పర్యటించాను. అందులో నా ‘‘సిల్కురూట్ యాత్ర’’ శీర్షమాణిక్యంలా నిలిచిపోయింది.
‘‘అయ్యయ్యో చేతిల డబ్బులు పోయేనే
అయ్యయ్యో జేబులు ఖాళీ అయెనే’’
(కులగోత్రాలు, 1952)
ఈ పాట ఇప్పుడు, ఈ ఏడుపదులు దాటిన వయస్సులో విన్నా నా పెదవులపై చిర్నవ్వులు చిందుతాయి. మళ్లీ పన్నెండేళ్ల కౌమారదశకు వెళ్లిపోతాను. నవ్వు ఏడుపు కలగలిసి ఏక కాలంలో వస్తాయి. కులగోత్రాలు సీన్మా చూడడటం కోసం నేను పడిన తపన, వేదన కార్చిన కన్నీళ్లు ఒకచిన్న ముచ్చట కాదు. అదేలయనగా….
నా కప్పుడు పదకొండు ఏండ్లు. ఒకరోజు ప్రొద్దున్నే నిద్ర లేచిన కాని పక్క మీద నుండి లేవలేదు. చేదబావి దగ్గర చేసుకుంట అమ్మా బాపు సంతోషంగా మాట్లాడుకుంటున్నారు. కండ్లు మూసుకుని రెండు చెవులూ అటు వైపు అప్పగించాను. చివరాఖరికి తెలిసిందేమనగా క్రితం రాత్రి మేమందరం పిల్లలం నిద్రపోయిన తర్వాత వారిద్దరూ ఆబిడ్స్ దగ్గరున్న సాగర్ టాకీసుకు వెళ్లి (అదిప్పుడు లేదు) ఎన్‍టిఆర్, సావిత్రి నటించిన ‘ఆత్మబంధువు’ సీన్మా చూసొచ్చారని! ఇక అంతే ఒక్కసారిగా నాలో కోపం, ఉక్రోషం, అవమానం, ఆత్మాభిమానం పొంగుకొచ్చాయి. దిగ్గున పక్కమించి లేచి తపతపా అడుగులు నేల మీద కొట్టుకుంటూ వెళ్లి బావి గచ్చుమీద కథాకళి, భరతనాట్యం, శివతాండవం ప్రారంభించాను. ‘‘ఇంత మోసమా’’ మీరిద్దరే టింగురంగా అని దొంగల్లాగ, రహస్యంగ సీన్మాకు పోతరా’’ అని అరుపులు, కేకలు. హఠాత్తుగా వచ్చిన ఈ తిరుగుబాటుకు వాళ్లిద్దరూ భీరిపోయారు. తుఫానులా విరుచుకుపడేసరికి వారి ఆనందమంతా ఆవిరయ్యిపోయింది. తప్పు చేసినట్లు అపరాధభావంతో ఒకరి ముఖాలు మరొకరు చూసుకున్నారు. జన్మకో శివరాత్రి అన్నట్లు వారిద్దరూ కలిసి సీన్మాలకు పోవటమే చాలా అరుదు. పోకపోక పోయినందుకు, దొంగల్లాగ దొరికిపోయి, బావి దగ్గర ‘‘బోనులో ముద్దాయిల్లాగ’’ నిలబడాల్సి వచ్చింది.
‘‘సరే లేరా నిన్ను కూడ తీసు••పోతంలే అని బాపు లైట్‍గ తీసుకుని మత్పరించబోయిండు’’
నేను మొండి ఘటం కదా ‘‘ఎప్పుడు?’’ అని కోర్టు మార్షల్ విచారణ శురూ చేసిన.
‘‘ఎప్పుడంటే ఇప్పుడే ఎట్ల చెప్పను? పైసలు లేవు. జీతాలు రావాలి కదా’’ అని నీళ్లు నములుకుంట సంజాయిషీ ఇచ్చిండు.
ఒకటో తారీఖు ఎప్పుడని మనస్సులనే లెక్కలేసుకున్న, ఇంకా ఇరవైదినాలని తేలింది.
‘‘అమ్మో ఇంకా ఇరవై దినాలే అంత వరకూ ఎట్లా ఆగాలి.’’ అని నా ఓపలేనితనాన్ని తెలియచేసి ‘‘ఎక్కడైనా అప్పు తేరాదా’’ అని పెద్ద మనిషి తరహాలో సలహా ఇచ్చాను.
‘‘అరేయ్ ఈపు పగుల్తది’’ అని అమ్మ కలకత్తా కాళిక అవతారంలో రంగంలోకి దిగింది.
ఇక ఆ సుప్రభాత సమయాన దేహశుద్ది తప్పదని (పూర్వానుభవాలు చాలా వున్నాయి లెండి) ఒకడుగు వెనకకు వేసి రాజీ మార్గం ఆచరించాను.
బొటాబొటా కన్నీళ్లు కారుతుంటే ‘‘తొందగర తీస్కపోవాలె’’ అని ఏడుపు కంఠంతో కీచుగా, దీనంగా అడిగాను.
సర్లే. ముందు పోయి ఆ పాచిపండ్లు తెల్లగ తోముకో అని అమ్మ నిర్దయగ ఒక బోడి సలహా ఇచ్చే సరికి నాకు ఒళ్లు మండి ‘‘జీవితాంతం పండ్లే తోముకోను’’ అని మనసులోపలే శపథం తీసుకున్న. దుఃఖభారంతో తలవంచుకున్న.
ఇదే సందని ఇద్దరూ సడి చప్పుడు చేయకుండా, చల్లగా మనసాలలోకి జారుకున్నారు. దుఃఖంతో వున్న నన్ను ఒంటరిగా వదిలేసి!
‘‘సీన్మా, సీన్మా’’ అని ఆ దినం నుండి మనాది మొదలయ్యింది. బాకీ కోసం సత్యహరిశ్చంద్రుడిని వెంటాడి వేధించిన నక్షత్రకుడి వలె దొరికినపుడల్లా బాపును పట్టుకుని సీన్మా? సీన్మా? ఎప్పుడు? ఎప్పుడు? అని గుర్తు చేస్తున్న. ఇక ఆయనేమొ పురుసత్‍గ దౌడకు పాన్ పెట్టుకుని నములుకుంట నోరు విప్పితే రసం కారి క్రిందకు జారిపడుతుందన్న భయంతో తలపైకెత్తి ‘‘చూద్దాం, చూద్దాం’’ అని ఒకసారి ‘‘పోదాం పోదాం’’ అని మరోసారి, జేబుల ఒక్క చిల్లిపైస కూడ లేదు అని ఇంకోసారి ఆకుకు అందని, పోకకు పొందని మాటలు మాట్లాడసాగాడు. ఇక నా ఓపిక ‘‘బర్దాష్ కే బాహర్’’ వచ్చేసింది. అమ్మ ఏం పని చెప్పినా సహాయ నిరాకరణం, రాత్రి పూట ‘‘బూఖ్ హర్తాల్’’ (నిరాహార దీక్ష) సాగించిన. మా వాళ్ల కఠినమైన రాతి గుండెల ముందు నా గాంధీగారి అహింసాయుధాలన్నీ ఘోరంగా విఫలమైనాయి. ప్రతిరాత్రి నిండా ముసుగు కప్పుకుని ఎవరికీ కనబడకుండా, వినబడకుండా లోలోపలే ఏడ్చి కన్నీళ్లు కార్చి పక్క దిండు తడిపి ఎప్పుడో నిద్రలోకి జారుకునే వాడిని.
నెల గడిచింది. జీతం వచ్చింది. ఆ నెలల దసుర పండుగ. అందరికీ కొత్త బట్టలు కొనాలె. పై నుండి పండుగ ఖర్చులు. ఎట్లరా దేవుడా అని అమ్మాబాపు తసబిస అవుతున్నరు. అన్నింటినీ గమనిస్తున్న అయినా ధైర్యం చేసి ఒక రోజు ‘‘సీన్మా’’ అన్న అంతే అమ్మ ఖఁయ్యిమని అరిచి పొయ్యిల ఊదుతున్న గొట్టం చేతిల బట్టుకుని నా మీదికి లేసింది. ఒక్క అంగల నేను వంటింట్ల నుండి గంతువేసి మనసాలలకు వచ్చిన ఆమె కూడా నా వెనకే వచ్చింది. అప్పుడు నేను చర్మ సంరక్షణా నిమిత్తమై అర్రలకు చొర్రబడ్డ. ఆమెకు కోపం ఇంకా ఎక్కువయ్యింది. అండ్లకు కూడా రాంగనే నేను మెరుపు వీరుడిలా బావి గచ్చుమీదికి దూకి అక్కడ కూడా ఆగకుండా మల్లెపందిరి కింద నుండి ఉరికి పెద్ద దర్వాజా దాటి వాకిట్లకు ప్రవేశించిన. అయినా ఏం లాభం? అప్పటికే ఊదుడు గొట్టం గాలిలో రామబాణంలా రయ్యిఁమని తేలి వచ్చి నా వీపును సాపు చేసింది. సీన్మాసీన్మా అని జిద్దు చేసినందుకు వీపు మీద పెద్ద దద్దు వచ్చింది.

అపుడు నాకు జీవితం మీద విరక్తి ముంచుకొచ్చింది. రెండు రోజుల తర్వాత నేనూ, మా మూడో అక్క అంటే సుశక్క బజారుకు పోతున్నం. మేమిద్దరం జిగ్రీ దోస్తులం. మా మధ్య ఏ రహస్యాలు ఉండకపోయేది. ‘‘అక్కా కొంచెం ఆగు’’ అన్న ఎందిరా లోకి అని ఆగి నా ముఖంల ముఖం పెట్టి చూసింది. ‘‘నేను చచ్చిపోతనే’’ అని
భళ్లున ఏడ్చేసిన. అప్పటికే సుశక్కకు నా బాధ నా మనాది తెలుసు.
‘‘వొద్దురా. నవ్వు చచ్చిపోతే నెనెట్ల బ్రతుకుతరా’’ అని ఆమె కూడా నాకంటె ఎక్కువగా ఎక్కెక్కి ఏడిచింది. ఇద్దరమూ ఒకర్నొకరం పట్టుకుని ఏడ్చేసరికి చేతిల ఉన్న పాలగ్లాసు నేలమీదికి ఒలికి పోయింది.
మరో నాలుగు రోజుల తర్వాత బ్రతుకమ్మ పండుగ వచ్చింది. కొత్త బట్టలు కట్టుకున్నం. గారెలు, పులిహోర, పూరీలు, కోడిమాంసం కడుపునిండా ఆరగించినం. సాయింత్రం ‘‘జమ్మి’’కి పోయి వచ్చినంక బాపు చిర్నవ్వులు చిందించుకుంట మా పిల్లలందర్నీ దగ్గరికి పిలిసిండు.
ఒసే వెంకటమ్మా (మా రెండవ అక్క) రేపు ఈ పిల్లలందర్నీ మ్యాట్నీ ఆట సీన్మాకు తీసు••పోవే అని అన్నడు.
అందరం ‘‘అహా అహా ఒహో ఒహో’’ అని అర్సుకుంట గంతులేసినం చిందులు తొక్కినం. చిరకాల కోరిక నెరవేరుతుందన్న సంతోషంతో నాకు ఆ రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు. తెల్లారి మధ్యాహ్నం భోజనాలయినంక మా రెండో అక్క నాయకత్వాన (అప్పటికే ఆమె టీచర్ ట్రేయినింగ్ చేస్తుంది) నేను, సుశక్క, పెద్ద తమ్ముడు జ్ఞాని కొత్త బట్టలు కట్టుకుని సీన్మాకు బయలు దేరినం. రూప్‍లాల్ బజార్ గల్లీలల్ల నడుసుకుంట శాలిబండ చెట్టు క్రింది రోడ్డుకు వచ్చినం. దీపక్ టాకీస్, నారాయణ గూడాకు ఒక రిక్షా మాట్లాడుకున్నం. సీన్మా కంటె ముందు రిక్షా ప్రయాణమే ఒక అందమైన అనుభవం. రిక్షాలో పురుసత్‍గ చక్లంముక్లం కూచుని రిక్షా వాడి కాళ్ల క్రింద భూమి (సడక్) జర్రుజర్రున జారి వెనుకకు పోతుంటే కళ్లప్పగించి చూస్తూ పట్నాన్ని, దుకాణాలను, వాటి సైన్ బోర్డులను చదువుకుంట, పెద్ద పెద్ద భవంతులను చూడటం చిన్న అనుభవమా? మోఘల్‍పురా దాటంగనే దూరంగ చార్మినార్ నాలుగు చేతులు చాచి మమ్మల్ని, ఆహ్వానించేది. గుల్జార్ హౌజ్, మదీనా హోటల్ దాటి కొత్త పూల్ ఎక్కేవాళ్లం. వంతెన మీద తెల్లటి గుండ్రటి బల్దియా లైటు బుగ్గలు, క్రింద ముచికుందమ్మ నది, గౌలిగూడల శంకర్‍షేర్ హోటల్, కోఠీల అప్పుడే కట్టిన కొత్త ఆంధ్రాబ్యాంక్ భవనం, సుల్తాన్ బజార్, బడీ చావిడీల చీరల దుకాణాలు తిలకిస్తూ కాచీగూడ చౌరస్త దాటంగనే కుడివైపు బసంత్ టాకీసు కనబడింది. (అదిప్పుడు లేదు). అక్కడ ‘‘సిరి సంపదలు’’ సీన్మాబోర్డు కనడింది. అది కూడా అక్కలిద్దరికీ ఇష్టమైన అక్కినేని నాగేశ్వరరావు సీన్మానే. ఒక్క నిముషం రిక్షా ఆపి అక్కలిద్దరు చర్చించుకుని దీపక్‍ల ‘‘కులగోత్రాలు’’ సీన్మానే సెలక్టు చేసుకుని రిక్షాను ముందుకు పొమ్మని చెప్పిండ్రు. నారాయన్‍గూడ చౌరస్తాల మాడపాటి హన్మంతరావు బాలికల ఉన్నత పాఠశాల దాటి సుదీర్ఘ ప్రయాణం తర్వాత దీపక్ టాకీసు దగ్గర రిక్షా దిగినం.
సీన్మాహాలు ప్రవేశద్వారం వద్దే పెద్ద పెద్ద హోర్డింగులు నాగేశ్వరరావు, కృష్ణకుమారిల నిలువెత్తు రంగుల బొమ్మలు. ఎంత చూసినా తనివి తీరని పోస్టర్లు. టిక్కట్లు తీసుకుని లోపలికి వెళ్లాం. పేకాట సీన్‍లో రమణారెడ్డి డబ్బులన్నీ పోగొట్టుకుని తలమీద తడిగుడ్డ వేసుకుని పశ్చాత్తాప భారంతో పాట ప్రారంభించాడు. అతడిని ఓదారుస్తూ రేలంగి. మిగతా బృందం వంత పాడారు.
‘‘అయ్యయ్యో చేతిల డబ్బులు పోయెనే
అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయెనే’’
పాట రాగానే హాలు మొత్తం నవ్వుల పువ్వుల తోటగా మారింది. నేను నా తమ్ముడు జ్ఞాని నవ్వినవ్వి నొప్పితో కడుపులు చేత బట్టుకున్నాం. నాయికా, నాయకులు చేసిన భాంగ్రా నృత్యం మమ్మల్ని ఉర్రూతలూగించింది. సీన్మాలో హీరో అమ్మ చనిపోయే సీన్ రాగానే మా రెండో అక్క వెంకటమ్మ నేను, జ్ఞాని భయపడతామని తన చేరో చేత్తో మా కండ్లు మూసింది.
ఇంటికి వచ్చాక ఒక వారం పాటు ప్రతి ఒక్కరం సీన్మా ముచ్చట్లు, సీన్మా పాటలే. కాలం గిర్రున తిరిగింది.
మా చిన్నప్పుడు మాకు పుస్తకాలు, పాటలు, సీన్మాలను, లోకాన్ని పరిచయం చేసి ప్రభావితం చేసిన మా •వెంకటమ్మ అక్క ఎనభై సం.ల వయసులో కాలం చేసింది. అప్పుడామె హిమాయత్ నగర్‍లో ఉండేది. స్వర్గపురి వాహనంలో మేమందరం ఆమెను అంబర్‍పేటలోని రుధ్రభూమికి తీసుకు పోతున్నాం. సరిగ్గా దీపక్ టాకీసు ముందు నుండే! తలెత్తి చూసాను. అది మూతపడి ఉంది. కాని హాలుమాత్రం శిథిలావస్థలో అట్లనే ఉంది. ఆనాటి మా తీపిజ్ఞాపకాలకు గుర్తుగ! గతించిన కాలానికి జ్ఞాపకంగ!!
మృత్యువును చూసి భయపడతం అని ఆ రోజు మా రెండు కండ్లుమూసిన మా అక్క ఇప్పుడు నిర్జీవంగా ఉన్న తనను చూసి మేం బాధ పడతం అని లేచి మా కండ్లు మూయలేదు కదా!
ఆమె దశదిన కర్మనాడు మా సుశక్క మా అందరికీ రెండు రహస్యాలను విప్పి చెప్పింది. ఒకటి : నేను చచ్చిపోతా అని ఏడ్చిన సంగతి ఆమె ఆ రాత్రే మా వెంకటమ్మ అక్కకు చెప్పితే ఆమె దసుర నాడు ఆ సంగతి అమ్మా బాపుకు చెప్పిందట. రెండు : బొగ్గుల బస్తా (వంట కోసం) కోసం దాచిన డబ్బులను బాపు మాకు ‘‘కులగోత్రాలు సీన్మా’’ చూడటానికి ఇచ్చాడట.
ఆ పాత రహస్యాలను విని అందరం కన్నీళ్లు పెట్టుకున్నాం. మేమందరం ఆ రోజు సంతోషంగా సీన్మాహాల్లో ‘‘చేతిల డబ్బులు పోయెనె’’ పాట విని నవ్వుకుంటున్న సమయంలో సరిగ్గా అదే సమయాన ఇంట్లో మా బాపు ‘‘అయ్యయ్యో బొగ్గుల డబ్బులు పోయెనే’’ అని బాధ పడ్డాడా అని నాకు ఇప్పటికీ తీరని సందేహమే!
ఏం చేస్తాం? వెనక్కి తిరిగి చూస్తే వెయ్యి తప్పులు కనబడతాయి.
-పరవస్తు లోకేశ్వర్, ఎ: 91606 80847
