నటుడు, దర్శకుడు, ప్రయోక్త ఏఆర్. కృష్ణ ఆధునిక తెలుగు సామాజిక నాటకానికి ఆద్యులు. ఆయన పూర్తిపేరు అడుసుమిల్లి రాధాకృష్ణశాస్త్రి. వేమూరు మండలం పెరవలిలో 1926 నవంబరు 13న జన్మించారు. చిన్ననాటి నుంచే కళల పట్ల ఆసక్తి చూపిన ఆయన, గ్రామీణ జాతరలు, హరిదాసుల కథలు, యక్షగాన ప్రదర్శనలు, పాఠశాల నాటకాల ద్వారా రంగస్థల ప్రపంచానికి ఆకర్షితులయ్యారు. ఆ కాలంలో నాటకం కేవలం వినోద సాధనమే కాకుండా, సామాజిక మార్పు కోసం ఒక శక్తివంతమైన మాధ్యమంగా ఎదుగుతోంది. స్వాతంత్య్రోద్యమ ప్రభావం, సాహిత్య పునరుజ్జీవనం, సామాజిక సంస్కరణల వాతావరణం ఆయన ఆలోచనలకు దారితీసింది. ఈ నేపథ్యం ఆయనను ఒక బాధ్యతాయుత కళాకారుడిగా తీర్చిదిద్దింది. నాటకోద్యమమే ఊపిరిగా జీవించారు. ప్రపంచ నాటకంలో మార్పుల కనుగుణంగా ఎన్నో ప్రయోగాలు చేశారు. జానపద కళలకు ఊపిరి పోశారు. నాట్య విద్యాలయంతో ఎందరినో తీర్చిదిద్దారు. రాష్ట్ర ప్రభుత్వ నాటక విద్యాసంస్థ, నటమండలి (రిపర్టరీ)కి అధ్యక్షుడిగా, దర్శకుడిగా రంగస్థల అభివ•ద్ధికి జీవితకాలం కృషి చేశారు. హైదరాబాద్‌లో ఎల్ఎంఈ చదివి, రాష్ట్ర విద్యుత్ బోర్డులో సూపర్వైజరుగా చేరారు. 1945 ప్రాంతంలో నాటకరంగాన్ని కార్యక్షేత్రంగా చేసుకున్నారు. ‘ఇండియన్ నేషనల్ థియేటర్’తో నాటక ప్రదర్శనల వెల్లువను స•ష్టించారు. ఢిల్లీలోని భారతీయ నాట్యసంఘం సంయుక్త కార్యదర్శిగా ఎంపికయ్యారు. లండన్ డ్రామా లీగ్ నుంచి అధ్యాపక పట్టా పొందారు. ఫోర్డ్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌తో అమెరికాలో నాటకరంగ అధ్యయనం చేశారు.
నాటక రంగంలో ప్రస్థానం
ఎ.ఆర్.కృష్ణ గారి రంగస్థల ప్రస్థానం నటుడిగా ప్రారంభమైంది. ఆయన సహజమైన భావవ్యక్తీకరణ, గంభీరమైన స్వరనాదం, పాత్రలో లీనమయ్యే నైపుణ్యం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేవి. పురాణ, సామాజిక, చారిత్రక నాటకాలలో విభిన్న పాత్రలు పోషించి విశేష ఖ్యాతి పొందారు. ప్రత్యేకంగా కుటుంబ సంఘర్షణలు, నైతిక విలువలు, సమాజంలోని అన్యాయాలపై ఆధారిత పాత్రలను ఎంతో సహజంగా ఆవిష్కరించారు.
తరువాత రచయితగా, దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. కథా నిర్మాణంలో గాఢత, సంభాషణలలో సరళత, భావప్రధానత ఆయన రచనలకు ప్రత్యేకతను తెచ్చాయి. పాటలకే ప్రాధాన్యం ఉన్న పాత శైలిని తగ్గించి, కథానిర్మాణం, పాత్రాభివృద్ధి, భావవ్యక్తీకరణకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. రంగస్థల విన్యాసాలు, కాంతి వినియోగం, వేదిక నిర్మాణం వంటి అంశాలలో కూడా నూతనతను ప్రవేశపెట్టారు.

వృత్తిపరమైన నాటక పద్ధతులు
ఎ.ఆర్.కృష్ణగారు నాటక రంగంలో క్రమశిక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. రిహార్సల్స్‌ను కచ్చితంగా నిర్వహించడం, ప్రతి పాత్రకు సముచితమైన శిక్షణ ఇవ్వడం, వేదికపై సమయపాలన పాటించడం వంటి అంశాలను కచ్చితంగా అమలు చేశారు. నటుడు పాత్రలో పూర్తిగా లీనమవ్వాలని, సంభాషణను అర్థంతో పలకాలని ఆయన ఉపదేశించేవారు. ఈ విధానాల వల్ల తెలుగు నాటక రంగం మరింత ప్రొఫెషనల్‌గా మారింది.
ప్రభావం మరియు మార్గదర్శకత్వం
ఎ.ఆర్.కృష్ణ గారు కేవలం నటుడు మాత్రమే కాకుండా, గొప్ప గురువుగా కూడా నిలిచారు. అనేక యువ కళాకారులకు శిక్షణ ఇచ్చి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు. ఆయన వద్ద శిక్షణ పొందిన పలువురు తరువాత సినీ, టెలివిజన్ రంగాల్లో కూడా విశేష స్థానం సంపాదించారు. భాషా శుద్ధి, భావాల స్పష్టత, సంభాషణలలో సహజత్వం వంటి అంశాలపై ఆయన ఇచ్చిన మార్గదర్శకత్వం తరతరాలకు ఆదర్శంగా నిలిచింది.
సాంస్కృతిక పునరుజ్జీవనంలో పాత్ర
ఆంధప్రదేశ్‌లో జరిగిన సాంస్కృతిక పునరుజ్జీవనంలో ఎ. ఆర్. కృష్ణ గారి పాత్ర విశేషమైనది. నాటకాన్ని ఒక సామాజిక సాధనంగా ఉపయోగించి ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ప్రయత్నించారు. సమాజంలో ఉన్న కుల వివక్ష, మహిళల స్థితి, కుటుంబ విలువల క్షీణత వంటి అంశాలను తన నాటకాల ద్వారా ప్రస్తావించారు. కళ ద్వారా సమాజానికి మార్గనిర్దేశం చేయాలనే ఆయన ధ్యేయం స్పష్టంగా కనిపిస్తుంది.
ప్రతి జిల్లాకు నాట్య సంఘం విస్తరణ
1954లో ఆంధప్రదేశ్ నాట్య సంఘాన్ని ఏఆర్. కృష్ణ స్థాపించి, దాని శాఖల్ని ప్రతి జిల్లాకు వ్యాపింపజేశారు. కన్యాశుల్కం, వీలునామా, రామదాసు, మాలపల్లి వంటి నాటకాలను, మరాఠీ, బెంగాలీ, కన్నడ, తమిళ, మలయాళం భాషల్లోని ఉత్తమ నాటకాలను అనువదింపజేసి, ప్రదర్శింపజేశారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రదర్శనను ఢిల్లీ నాటకోత్సవాలకు పంపుతూ వచ్చారు. తోలుబొమ్మలాటను పునరుద్ధరించి, ఫ్రాన్స్, జర్మనీ, పోలెండ్‌లో ప్రదర్శింపజేశారు. తెలుగు జానపద కళలకు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చారు. యక్షగానానికి రంగస్థలంపై ప్రాణప్రతిష్ట చేశారు. తన సంపాదకత్వంలో వచ్చిన ‘రంగస్థల శాస్త్రం’ తెలుగులో నాటక విద్యాబోధనకు పెద్ద బాలశిక్ష.
నటీనటులకు శిక్షణ
నటీనటులకు శిక్షణ ఆవశ్యకతను గుర్తించి, అందుకు బలమైన పునాది వేశారు. సంస్క•త ప్రకరణం ‘మృచ్ఛకటికం’ను తెలుగు వ్యావహారిక భాషలో ప్రదర్శించారు. చారిత్రాత్మక ‘ప్రతాపరుద్రీయం’లో తాను పేరిగాడిగా నటించి, దర్శకత్వం వహించారు. కుందుర్తి వారి ‘ఆశ’తో కవితా నాటక ప్రయోగం చేశారు. శ్రీశ్రీ ‘విదూషకుడి ఆత్మహత్య’తో అధివాస్తవికవాద రూపకాన్ని ప్రయోగించారు. ‘మాలపిల్ల’ నాటకాన్ని హైదరాబాద్‌లో వరుసగా 40 రోజులు ప్రదర్శించటమే కాదు…ఒకేచోట 12 రంగస్థలాలపై ప్రదర్శింపజేయడం మరో విశేషం. ‘ఆత్మవంచన’ వంటి నాటకం ప్రదర్శనలతో భావితరానికి మార్గనిర్దేశనం చేశారు. శ్యామ్‌బెనగల్ ‘అనుగ్రహం’, మ•ణాల్సేన్ ‘ఒక ఊరికథ’ సినిమాల్లో నటించారు.
నాటకాభివృద్ధికి విశేష కృషి
రాష్ట్ర సంగీత నాటక అకాడెమీ సభ్యుడిగా, యునెస్కో అంతర్జాతీయ నాటక సంస్థ సభ్యుడిగా, మూడో ప్రపంచ నాటక సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్రంలో నాటకాలకు వినోదం పన్ను రద్దు చేయించారు. నాటక బృందాలు ఒక చార్జీతోనే దేశంలో ఏ మూలకై నా రైలులో వెళ్లి రావడానికి కృషి చేసి, సాధించారు. రంగస్థల అభివృద్ధికి ‘నాట్యమిత్ర పథకం’ ప్రవేశపెట్టారు. వృత్తి కళాకారుల కోసం 1971లో ఆంధప్రదేశ్ రంగస్థల కళాకారుల సంఘాన్ని ఏర్పాటుచేయించారు. తనకున్న కొద్దిపాటి ఆస్తిలోనే రూ.75 వేలను నాటకరంగ అభివృద్ధికి కార్పస్ ఫండ్‌గా ఇచ్చారు. ఏఆర్. కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ‘పద్మభూషణ్’తో సత్కరించింది. ఆయన 1992లో మ•తిచెందారు. నాటక రంగంలో ఒకే వ్యక్తి ఇంతటి విజయాలను సాధించడం అపూర్వం.
ఎసికె. శ్రీహరి
ఎ : 9849930145
