మహిళా రైతులకు భరోసానిస్తున్న2026 అంతర్జాతీయ మహిళాదినోత్సవ లక్ష్యం..

ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రపంచ దేశాలన్నీ జరుపుకోవడం మనకు తెలుసు. 20వ శతాబ్దం ప్రారంభం నుంచి మహిళలు ఆర్థిక, సామాజిక, రాజకీయ హక్కుల కోసం పోరాటాలు చేస్తున్నారు. 1908లో న్యూయార్క్ నగరంలో 15వేల మంది మహిళలు ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా 1909లో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించారు. వివిధ దేశాలలో వివిధ రూపాలలో మహిళా దినోత్సవాలు ప్రారంభమయ్యాయి. 1914లో పూణేలో తొలి మహిళాదినోత్సవం జరిగింది. 1910లో జరిగిన ఇంటర్‍ నేషనల్‍ కాన్ఫరెన్స్ ఆఫ్‍ ఉమెన్‍ సదస్సు ఈ ఉత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలని ప్రతిపాదించింది…

1975లో ఐక్యరాజ్య సమితి మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది. అప్పటి నుంచి ప్రపంచదేశాలన్నిటా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఐక్యరాజ్యసమితి ప్రతి దినోత్సవానికీ ఒక థీమ్‍ని ప్రకటిస్తుంది. 2026ని అంతర్జాతీయ మహిళా రైతు దినోత్సవంగా ప్రకటించింది. మహిళా రైతులకు భూమి, ఆర్థిక సహాయం, టెక్నాలజీలో శిక్షణ, వారి హక్కుల్ని కాపాడేలా, వ్యవసాయ రంగంలో స్త్రీ, పురుషుల మధ్య వేతనాల తేడాలను తొలగించేలా ప్రభుత్వాలకు పిలుపునిచ్చింది. పుడ్‍ అండ్‍ అగ్రికల్చరల్‍ ఆర్గనైజేషన్‍ దీన్ని అధికారికంగా లాంచ్‍ చేసి ఇతర సంస్థలతో కలిసి దీన్ని ప్రోత్సహిస్తుంది.

మన గ్రామీణ భారతీయ వ్యవసాయరంగంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. మహిళలు లేని వ్యవసాయాన్ని అస్సలు ఊహించలేం. కానీ వాళ్లు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. భూమి యజమాన్య హక్కులు పరిమితంగా ఉండటం, ఆర్థిక సహాయం లేకపోవడం, రుణ సౌకర్యాలు అందకపోవడం, పనిలో, వేతనాల్లో స్త్రీ పురుష వివక్ష, పొలం పనులతో పాటు ఇంటి పని, వంట పని, పిల్లల పెంపకం, వృద్దుల సంరక్షణ వంటి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఏ ప్రకృతి విపత్తు జరిగినా ఆహార అభద్రతకు గురయ్యేది ఎక్కువ మహిళలే. ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల ఆస్తమా, క్యాన్సర్లకు గురయ్యేది కూడా ఎక్కువ మహిళలే. ఐక్యరాజ్యసమితి థీమ్‍ సక్రమంగా అమలు జరిగితే 45 మిలియన్ల మందికి ఆహార భద్రత, 58 మిలియన్ల మహిళలకు ఆదాయం పెరుగుదల సాధ్యమవుతుంది. ఆదాయ పెరుగుదల మహిళల ఆత్మస్థైర్యానికి, గౌరవానికి, స్వావలం•నకు దోహదం చేస్తుంది.

అంతర్జాతీయ దినోత్సవం సభలకు, సంబరాలకు, ఆడంబర ప్రకటనలకు పరిమితం కాకుండా ఐక్యరాజ్య సమితి ఉద్దేశించిన లక్ష్య సాధనకు కృషి చేయాలి.
మహిళా సాధికారతా స్వప్నాలు అప్పుడే నిజమవుతాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *