శిథిలాల నుండి పంటకోత వరకు

వినాశకరమైన వరదల వలన గుజరాత్‍ రాష్ట్రంలోని గ్రామాలు కోల్పోయిన వ్యవసాయ భూములు 50 ఏళ్ల తర్వాత తిరిగి జీవం పోసుకున్నాయి.
సంవత్సరాల తరబడి జరిగిన కోత మరియు నష్టం తరువాత, మహినది వెంబడి ఉన్న గ్రామ నివాసులు లోయల తాకిడికి గురైన ఉమ్మడి భూములను పునరుద్ధరించడానికి, వ్యవసాయ క్షేత్రాలను మరియు జీవనోపాధులను తిరిగి తీసుకురావడానికి దశాబ్దాలుగా క•షి చేస్తున్నారు.

  • 1973లో గుజరాత్‍లోని మహి నదీ పరివాహక ప్రాంతంలో సంభవించిన వరదలు, విస్తారమైన వ్యవసాయ భూములను మరియు గ్రామ ఉమ్మడి భూములను కొట్టుకుపోయాయి.
  • దశాబ్దాలుగా ఏర్పడిన లోతైన లోయల వల్ల వేలాది హెక్టార్ల భూమి నాశనమై, సాగుకు పనికిరాకుండా పోయింది.
  • ప్రభుత్వ పథకాలు, స్వచ్ఛంద సంస్థల మద్దతుతో గ్రామస్థులు నేల, నీటి సంరక్షణ ద్వారా భూమిని పునరుద్ధరించడానికి సంవత్సరాలుగా క•షి చేస్తున్నారు.
  • ఒకప్పుడు శాశ్వతంగా కోల్పోయామని భావించిన భూములను ప్రజలు తిరిగి స్వాధీనం చేసుకుంటుండటంతో, నేడు వ్యవసాయం, జీవనోపాధులు పునరుజ్జీవిస్తున్నాయి.

1973లో వరదలు తమ కుటుంబ వ్యవసాయ భూమిని కొట్టుకుపోయినప్పుడు, హరేష్‍భాయ్‍ సోలంకి తాను మళ్లీ దానిలో వ్యవసాయం చేయలేనని అనుకున్నారు. ఐదు దశాబ్దాల తర్వాత, గుజరాత్‍లోని రుస్తంపురా గ్రామంలో ఆయన తన మొదటి పంటను కోశారు. దశాబ్దాలుగా బీడుగా పడి ఉన్న పొలాల నుండి ఈ 33 ఏళ్ల యువకుడు కొన్ని రోజులు పొగాకును కోస్తూ గడిపారు.
అంతా ప్రణాళిక ప్రకారం జరిగితే, ఈ పంట ద్వారా రూ. 2.5-3 లక్షలు లభించవచ్చు. దీంతో తన 1.6 హెక్టార్ల పొలం నుండి అతనికి సుమారు రూ. 1 లక్ష లాభం మిగులుతుంది.

సోలంకికి, ఈ పంట కేవలం దాని ద్రవ్య విలువకు మించిన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఎందుకంటే అతని కుటుంబం ఈ పొలాలను చివరిసారిగా 1973లో సాగు చేసింది. ఖేడా జిల్లాలోని థాస్రా తాలూకాలో కురిసిన అపూర్వమైన వర్షాలు, ఆ ప్రాంతంలో సంభవించిన అత్యంత విస్త•తమైన మరియు వినాశకరమైన వరద సంఘటనలలో ఒకటిగా నిలిచాయి. ఆ వరదలలో సోలంకి తాత, విఠల్‍భాయ్‍, తమ వ్యవసాయ భూమిని కోల్పోయారు.
‘‘ఐదు దశాబ్దాల క్రితం, భారీ వర్షాలు కేవలం ఒక వారంలోనే మా వ్యవసాయ భూమిని కొట్టుకుపోయాయి’’ అని అతను తెలిపాడు. ‘‘వర్షాలు తగ్గిన తర్వాత మేము తిరిగి వెళ్లి చూసేసరికి, అక్కడ ఏమీ మిగల్లేదు.’’

విపత్తు భూమి స్వరూపాన్ని మార్చివేసింది.
ఆగస్టు 26 నుండి సెప్టెంబర్‍ 9 మధ్య కురిసిన భారీ వర్షాల కారణంగా గుజరాత్‍లోని మాహి నదీ పరివాహక ప్రాంతంలో 1973లో సంభవించిన వినాశకరమైన వరదలలో ఈ విధ్వంసం కూడా ఒక భాగం. విస్తారమైన వ్యవసాయ భూములు కోతకు గురయ్యాయి. సోలంకి కుటుంబంతో సహా అనేక కుటుంబాలు తమ భూములను కోల్పోయాయి.
నదీ తీరాన ఉన్న గ్రామాలు కూడా పశువుల మేతకు, వంటచెరుకు సేకరణకు, ఇతర దైనందిన అవసరాలకు ఉపయోగించే విశాలమైన ఉమ్మడి భూములను కోల్పోయాయి.

సెప్టెంబర్‍ 2023లో ఫౌండేషన్‍ ఫర్‍ ఎకలాజికల్‍ సెక్యూరిటీ (FES) వారు ‘కమ్యూనిటీ ఇనిషియేటివ్స్ ద్వారా లోయల పునరుద్ధరణ’ అనే పేరుతో విడుదల చేసిన ఒక నివేదిక, మాహి నదీ పరివాహక ప్రాంతంలోని గ్రామాలలో విస్త•తంగా భూమి క్షీణించిందని పేర్కొంది. ఈ నది దక్షిణ రాజస్థాన్‍లో ఉద్భవించి, పంచమహల్స్, మహిసాగర్‍, వడోదర, ఖేడా మరియు ఆనంద్‍ వంటి జిల్లాల గుండా ప్రవహించి, ఖంభట్‍ గల్ఫ్ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది.

మహిసాగర్‍ జిల్లాలోని వనక్‍బోరి, ఆనంద్‍ జిల్లాలోని ధువరన్‍ మధ్య 120 కిలోమీటర్ల మేర ఉన్న ప్రాంతంలో, 106 గ్రామాలలో ఖీజు• నిర్వహించిన ప్రాథమిక సర్వేలో 17,992 హెక్టార్లకు పైగా ఉన్న ఉమ్మడి, ప్రైవేట్‍ భూములు లోయల వల్ల ప్రభావిత మయ్యాయని తేలింది.
ఇసుకతో కూడిన సారవంతమైన నేల, వృక్షసంపద లేకపోవడం, పదేపదే కురిసిన భారీ వర్షాలు కలిసి తీవ్రమైన కోతకు దారితీశాయి. కాలక్రమేణా, లోతైన, నిరంతర లోయలు ఏర్పడ్డాయి.

నేడు 10 నుండి 70 అడుగుల లోతు ఉండే ఈ లోయలు, ప్రతి వర్షాకాలంతో వ్యవసాయ భూములను, ప్రజా భూములను భారీగా కోసుకుంటూ విస్తరిస్తూనే ఉన్నాయి. ఈ ప్రాంతంలో లోయల విస్తరణ స్థాయి ఇప్పుడు చంబల్‍ నదీ పరీవాహక ప్రాంతం తర్వాత రెండవ స్థానంలో ఉందని భావిస్తున్నారు. ఇది అడ్డంగా మరియు నిలువుగా కూడా భారీ స్థాయిలో విస్తరిస్తోంది.

ఖేడా జిల్లా బ్లాక్‍ టీమ్‍ కోఆర్డినేటర్‍ దేవభాయ్‍ ఘంభాల్య, దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉందని అంటున్నారు. ‘‘ఈ ఉమ్మడి భూములే గ్రామ జీవనానికి వెన్నెముకగా ఉండేవి’’ అని ఆయన వివరిస్తున్నారు. ‘‘ఈ లోయలు పశువుల మేతకు ఆటంకం కలిగిస్తాయి. నేల కోతను వేగవంతం చేస్తాయి. అంతేకాకుండా వనరులను పంచుకోవడానికి ఉపయోగపడే గ్రామాల మధ్య సాంప్రదాయ మార్గాలను కూడా మూసివేస్తాయి.’’
2019లో ఒక రాత్రి కురిసిన దాదాపు 11 అంగుళాల భారీ వర్షం కారణంగా ఆ ప్రాంతంలోని కొన్ని భాగాలలో 10 అడుగుల వరకు సారవంతమైన పైపొర మట్టి కొట్టుకుపోయిందని అతను గుర్తుచేసుకున్నాడు.

భూమిని పునరుద్ధరించడం
అయినప్పటికీ నేడు, సామాజిక కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వేతర సంస్థల సహాయం మరియు కార్పొరేట్‍ నిధుల మద్దతుతో ఈ గ్రామాలు క్షీణించిన భూమిని పునరుద్ధరించడానికి కలిసికట్టుగా పనిచేస్తున్నాయి.
1990ల నుండి ఈ భూములను పునరుద్ధరించడానికి పలు స్థాయిలలో ప్రయత్నాలు జరుగుతున్నాయని సోలంకి చెప్పారు. ‘‘మా తాతగారి కాలం తర్వాత 60 ఏళ్లలో ఈ భూమిలో పొగాకు పండించడం ఇదే మొదటిసారి’’ అని ఆయన అన్నారు.
సార్నాల్‍ జిల్లాలోని సుఖిని మువాడ్‍ గ్రామానికి చెందిన 62 ఏళ్ల గిరీష్‍ చావడా, వరదల సమయంలో తమ గ్రామానికి చెందిన దాదాపు 140 హెక్టార్ల ఉమ్మడి భూమి కోతకు గురైందని గుర్తుచేసుకున్నారు. ‘‘ఆ విపత్తు తర్వాత, సహకార సంఘాల ద్వారా భారతదేశ పాడి రంగాన్ని మార్చివేసిన వర్గీస్‍ కురియన్‍ మా గ్రామాన్ని సందర్శించారు’’ అని ఆయన చెప్పారు.

1987లో జాతీయ పాడి అభివృద్ధి బోర్డు (NDDB) సభ్యులు గ్రామాన్ని సందర్శించినప్పుడు, కురియన్‍ స్వయంగా గ్రామస్తులకు మార్గదర్శనం చేశారు. ‘‘ఒక సమాజంగా ఏకమై, భూమిని పునరు ద్ధరించే బాధ్యతను తీసుకోవాలని ఆయన మమ్మల్ని ప్రోత్సహించారు. మేమందరం అంగీకరించాము,’’ అని సోలంకి చెప్పారు.
చీణణదీ మరియు కార్పొరేట్‍ నిధుల మద్దతుతో లాభాపేక్ష లేని ఫౌండేషన్‍ ఫర్‍ ఎకలాజికల్‍ సెక్యూరిటీ (FES), పునరుద్ధరణ ప్రయత్నాలపై గ్రామస్థులతో కలిసి పనిచేయడం ప్రారంభించింది. 2014-15 నుండి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) ద్వారా చాలా మంది గ్రామస్థులు ఉపాధి కూడా పొందారు. ఇందులో సుమారు 80 శాతం కుటుంబాలు పాల్గొన్నాయి.

నీటి వేగాన్ని తగ్గించడం
ఈ కార్యక్రమాలు క్షీణించిన భూమిని పునరుద్ధరించడానికి, అవసరమైన నేల మరియు నీటి సంరక్షణ పద్ధతుల గురించి గ్రామస్థులు జ్ఞానాన్ని పొందడానికి సహాయపడ్డాయి.
సుఖిని మువాడి గ్రామానికి చెందిన కిరిత్‍భాయ్‍ గణపత్‍శ్రీ ఈ శిక్షణ ఒక సరళమైన సూత్రాన్ని అనుసరించి జరిగిందని చెప్పారు. ‘‘నీరు వేగంగా ప్రవహించి నేలను కోతకు గురిచేసే చోట, దాని ప్రవాహాన్ని తగ్గించాలి. అది నిలకడగా ప్రవహించే చోట, నీటిని నిలిపి ఉంచి, భూగర్భ జలాలను పునరుజ్జీవింప జేయడానికి భూమిలోకి ఇంకనివ్వాలి’’ అని ఆయన వివరించారు. ఈ విధానం కోతకు గురైన ప్రాంతాలలో పూడిక పేరుకుపోవడానికి సహాయపడిందన్నారు.

MGNREGA మరియు FES నేతృత్వంలోని సామర్థ్య నిర్మాణ కార్యక్రమాల కింద, నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించి, నేల కోతను తగ్గించడానికి గ్రామస్థులు గాబియన్‍ గోడలు, చెరువులు, చిన్న కాలువల వంటి నిర్మాణాలను చేపట్టారని గణపత్‍శ్రీ తెలిపారు.
‘‘నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించడం వల్ల, నేల కోతకు గురైన ప్రాంతాలలో పూడిక పేరుకుపోవడానికి కూడా వీలు కలిగింది. వ్యవసాయ క్షేత్రాలలో, ఎత్తును స•ష్టించి నీటిని నిలుపుకునేందుకు నిర్మాణాలు చేపట్టారు. తద్వారా నీటిపారుదల కోసం చిన్న చెరువులు ఏర్పడ్డాయి’’ అని ఆయన తెలిపారు.
పచ్చదనాన్ని పెంచే ప్రయత్నాలకు ఎన్‍డిడిబి కూడా మద్దతు ఇచ్చింది. నీటి నిలుపుదల సామర్థ్యాన్ని మెరుగు పరచడానికి, నేల కోతను నివారించడానికి పొదలు, తీగలు, చెట్లను నాటారు.

జీవనోపాధి తిరిగి వస్తుంది
లిండోరా గ్రామానికి చెందిన 33 ఏళ్ల జ్యోస్నాబెన్‍ చావడా ప్రారంభంలో జరిగిన మెరుగుదలలు గ్రామస్తులలో విశ్వాసాన్ని పెంచడానికి సహాయపడ్డాయని చెప్పారు. ‘‘చెట్లు పెరగడంతో, మహిళలు తోటల నుండి వంటచెరుకును సేకరించడం ప్రారంభించారు. మేము మళ్లీ పశువులను మేపగలిగాము’’ అని ఆమె అన్నారు. ‘‘గతంలో మేము వీటిని మార్కెట్‍ నుండి కొనవలసి వచ్చేది. దీనికోసం నెలకు సుమారు రూ. 2,000 ఖర్చు అయ్యేది. ఇప్పుడు ఆ ఖర్చు తగ్గింది.’’
కాలక్రమేణా, ఈ ప్రయత్నాలను గ్రామాలంతటా పునరావ•తం చేయడం జరిగింది. దీని ఫలితంగా భూమి క్రమంగా పునరుద్ధరించబడింది. 65 గ్రామాలలో, కోత వలన దాదాపు 18,000 హెక్టార్ల భూమి క్షీణించగా, అందులో ఇప్పుడు సుమారు 4,800 హెక్టార్లు పునరుద్ధరించబడ్డాయి.
తన గ్రామంలో ప్రభావితమైన 140 హెక్టార్లలో సుమారు 34 హెక్టార్లను పునరుద్ధరించినట్లు చావడా చెప్పారు. పశుగ్రాసం లభ్యత మెరుగుపడటంతో, గ్రామస్తులు పశుపోషణపై పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు.
‘‘మొదట్లో మా గ్రామం రోజుకు సుమారు 200 లీటర్ల పాలు ఉత్పత్తి చేసేది. ఇప్పుడు అది దాదాపు 800 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తూ ఎన్‍డిడిబికి అందిస్తోంది. దీనివల్ల మా ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది’’ అని ఆయన అన్నారు.

ఈ ఆర్థిక ప్రయోజనాల వల్ల వలసలు తగ్గాయి. ఫలితంగా చాలా మంది గ్రామస్తులు రోజువారీ కూలీ పనులను వదిలి సాంప్రదాయ వ్యవసాయానికి తిరిగి వస్తున్నారు.
ఇటాడా గ్రామానికి చెందిన 51 ఏళ్ల మణిలాల్‍ పర్మార్‍కు ఐదు హెక్టార్ల భూమి ఉంది. 2023లో మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాల వల్ల మరింత నష్టం జరిగిందని ఆయన అంటున్నారు.
‘‘నా పొగాకు పంటను కోల్పోయి దాదాపు రూ. 3 లక్షల నష్టాన్ని చవిచూశాను. నా జీవితంలో ఇదే అత్యంత దారుణమైన నష్టం’’ అని అతను అంటున్నాడు.
పునరుద్ధరణ ప్రయత్నాల తర్వాత, అతను గత ఏడాది పొగాకు పంటపై రూ. 1.5 లక్షల లాభం సంపాదించాడు. అయితే, ఇంకా మరింత అవగాహన, క•షి అవసరమని పర్మార్‍ తెలిపారు.

‘‘సమాజ సభ్యులుగా ఈ లోయ భూములపై.. మాకు స్పష్టమైన యాజమాన్య హక్కులు లేవు. ఉమ్మడి భూమిని పునరుద్ధరించడానికి పెట్టుబడి పెట్టడంపై చాలా మందికి పెద్దగా ఆసక్తి లేదనిపిస్తోంది. దీనివల్ల భూమి క్షీణత కొనసాగుతోంది’’ అని ఆయన అన్నారు. ‘‘గ్రామస్తులు ఉమ్మడి వనరులను పరిరక్షించడం యొక్క విలువను గుర్తించి, దీర్ఘకాలికంగా నిలదొక్కుకునే శక్తిని పెంపొందించుకోవాలి.’’

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *