భూపతి చంద్ర మెమోరియల్ ట్రస్ట్ తరుపున మొదటి అవార్డు, రూ.లక్ష నగదు, సన్మానం
తెలుగు రాష్ట్రాల్లో ఇది విలువైన అవార్డు : టీఎస్‍పీఎస్సీ చైర్మన్ ప్రొ.ఘంటా చక్రపాణి
ట్రస్టు సభ్యులకు కృతజ్ఞతలు : అంపశయ్య నవీన్
తెలంగాణలో సాహిత్యానికి చైతన్య బీజాలు వేసిన గొప్ప వ్యక్తి ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్ అని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అన్నారు. నాంపల్లి పబ్లిక్‍గార్డెన్స్లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ‘భూపతి చంద్ర మెమోరియల్ ట్రస్ట్’ తరుపున ప్రఖ్యాత రచయిత అంపశయ్య నవీన్‍కు ‘కీర్తిశిఖర జీవన సాఫల్య’ పురస్కారం 2019 ప్రదానోత్సవం సభ డిసెంబర్ 11న జరిగింది. భూపతి చంద్ర మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షులు మణికొండ లక్ష్మీకాంతారావు అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమీషన్ చైర్మన్, ప్రొఫెసర్ చక్రపాణి, ప్రఖ్యాత దర్శకులు బి.నరసింగరావు, ప్రముఖ రచయిత, నవలాకారుడు అంపశయ్య నవీన్, ప్రముఖ ఆర్టిస్టు ఏలే లక్ష్మణ్, ప్రసిద్ధ జానపద పరిశోధకులు ప్రొ.ఆర్.వి.ఎస్.సుందరం, ప్రొ.మృణాళిని, ట్రస్టు సభ్యులు మణికొండ వేదకుమార్, ఎం. విజయ్‍కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భూపతిచంద్ర మెమోరియల్ ట్రస్టు ముద్రించిన ‘అంపశయ్య’ నవల పదమూడో ముద్రణను ప్రొ.చక్రపాణితోపాటు అతిథులందరూ ఆవిష్కరించారు.
తెలుగు రాష్ట్రాల్లో ‘కీర్తిశిఖర’ అవార్డు ఎంతో విలువైంది : టీఎస్‍పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి
తెలంగాణలో సాహిత్యానికి అవార్డులు లేని సమయంలో ‘కీర్తిశిఖర’ అవార్డును భూపతిచంద్ర మెమోరియల్ ట్రస్టు సభ్యులు ప్రవేశపెట్టడం ఎంతో గర్వకారణం అని టీఎస్‍పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అన్నారు. తెలంగాణ, ఆంధప్రదేశ్ రాష్ట్రాల్లో ‘కీర్తిశిఖర’ అవార్డు అత్యంత ప్రాధానమైందని, అత్యంత విలువైందిగా అభివర్ణించారు. భారతదేశంలో తమిళనాడు, బెంగాల్, కేరళ, మరాఠి భాషల్లో సాహిత్యం, రచయితల పట్ల ఉన్నటువంటి శ్రద్ధ తెలుగులో లేదన్నారు. తెలంగాణలో ఏ రచయితకు ఆ రచయిత ఎవరో ఒకరు పబ్లిష్ చేయడం తప్ప, ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డు లేకపోవడం బాధాకరం అన్నారు. ప్రతిష్టాత్మకమైన సాహిత్య సంస్థలు తెలంగాణలో రాకపోవడం చాలా విచారించదగ్గ పరిణామం అన్నారు. నిజానికి తెలంగాణలో సాహిత్య సంస్థలున్నా ఉమ్మడి ఆంధప్రదేశ్‍లో వాటిని నిర్లక్షం చేసినట్టు చెప్పారు. సురవరం ప్రతాప్‍రెడ్డి కాలంలోనే గొల్కొండ పత్రికలో కవుల సంచిక తీసుకొచ్చినప్పటి నుండి అనేక రకాల ప్రచురణ సంస్థలు తెలంగాణలో ఆవిర్భావించాయన్నారు. కానీ కాలక్రమంలో అవి తెలంగాణ నుండి కనుమరుగైనట్లు చెప్పారు. ఇటువంటి దశలో తెలంగాణ నడిగడ్డ నుండి సాహిత్య కళా పురస్కారాన్ని ఏర్పాటు చేయాలనే ఆశయం కలిగి ఉండటం గొప్ప విషయం అన్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఇటువంటివి ఉండాల్సిన అవసరం ఎంతయినా కూడా ఉందన్నారు. ప్రతి సంవత్సరం రచయితలకు, కవులుకు కళాకారులకు ప్రత్యేక గుర్తింపుతో సత్కరించుకోవడం అవసరమన్నారు. తమిళనాడు నుండి ఇప్పటి వరకు దాదాపు 50కిపైగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు వివిధ రచయితలకు వచ్చాయని, కానీ తెలంగాణలో అతి కొద్ది మందికి మాత్రమే అవార్డు రావడం బాధాకరం అన్నారు. శ్రీశ్రీ సాహిత్యమే ఇంగ్లీష్ భాషలోకి సరిగ్గా పోలేదని, నవీన్ రాసిన అంపశయ్య నవలా కూడా ఇంగ్లీష్ భాషలోకి సక్రమంగా వెళ్లలేదన్నారు. తమిళనాడులో తెలుగు బెస్ట్ ట్రాన్స్లేషన్‍కు బెస్ట్ట్రాన్స్లేషన్ అవార్డులు ఇస్తున్నారని, కానీ తెలుగు సాహిత్యం లేదా తెలంగాణలో అటువంటివి లేవన్నారు. తమిళనాడు రాష్ట్రస్థాయిలో 20కిపైగా తమిళ రచయితలను ప్రోత్సహిస్తూ అవార్డులు ఇవ్వడం గర్వకారణం అన్నారు. లక్ష్మీకాంత్‍రావుగారు ఆ కాలంలోనే మెదక్‍లో జిల్లా పరిషత్ చైర్మన్‍గా ఉండి 1200 ఎకరాలు భూస్వామ్య కుటుంబం, సమాజ సేవ కోసం అంకితం అవ్వడం వల్లే ఉన్న ఆస్తులను పోగొట్టుకున్నారని, అలాంటి కుటుంబాలను చూసైనా మిగతా కుటుంబాలు సమాజ సేవ కోసం ముందుకు రావాలన్నారు. అంపశయ్య నవల వెలువడి 50 యేళ్ళు పూర్తయిన సందర్భంగా ఆ నవల ప్రత్యేక ముద్రణను మంచి బొమ్మలతో ట్రస్టువారు వెలువరించాలని ఆకాంక్షించారు. (పూర్తి వీడియో కొరకు https://youtu.be/-dYT-qJ-02U- Ghanta )
మణికొండ భూపతిరావు గారి నుండి క్రమశిక్షణ, విద్యాబుద్దులు వచ్చాయి : ప్రఖ్యాత దర్శకులు బి.నరసింగరావు
తమ కుటుంబానికి సాహిత్య వారసత్వం ఉందని, తమ తండ్రి గారికి కొన్ని వందల తెలుగు పద్యాలు నోటికొచ్చేవని, తమ తాతగారికి కూడా సాహిత్యంలో ప్రవేశం ఉండేదని, ఆ ప్రేరణ వల్లనే మేమీ సాహిత్య పురస్కారాన్ని తలపెట్టామని ప్రముఖ సినిమా దర్శకులు బి. నర్సింగరావు అన్నారు. మణికొండ లక్ష్మీకాంతారావు తమకు పెద్ద అన్నయ్య మార్గదర్శుకులు. నాటకాలు, సాహిత్యం రాసేవారని, తద్వారా తమకు కూడా ఆ అలవాటు చిన్నప్పటి నుండే అలవడిందన్నారు. ఆంధ్రా ప్రాంతం నుండి చాలా మంది మేధావులను తమ తండ్రి గారు పిలిపించి తమకు పద్యాలు, పాఠాలు ఇంగ్లీషు నేర్పించినట్లు చెప్పారు. ఆ కాలంలో ఏ నాటకాలు వేసే వాళ్లయినా ముందుగా తమ ఇంటికే వచ్చావారని, పాడటం, ఆడడం, అక్కడే తినడం, ధాన్యం మరియు పారితోశికం తీసుకొని ఆనందంగా వెళ్లేవారన్నారు. చిన్నతనంలోనే తమ ఊళ్లో విజ్ఞానవర్దిని లైబ్రరీ పెట్టారని, ప్రతి రోజూ లైబ్రరీకి వెళ్లి బాల అనే పత్రికలో ఉన్న బొమ్మలు చూసి సాహిత్యంపై మమకారం పెంచుకున్నట్లు చెప్పారు. అంపశయ్య నవీన్ రాసిన నవల యాభై సంవత్సరాలు దాటినా సజీవంగా ఉండటం గర్వకారణం అన్నారు. నవీన్ తన జీవితంలో సుమారు యాబై వరకు పుస్తకాలు రాయడం అద్భుతమే అన్నారు.
మేం ఐదుగురు సోదరులం ఈ సంస్థలో భాగస్వాములమని, తెలుగు సాహిత్యంలో 50 యేళ్ళుగా విశేష కృషిచేసిన ‘అంపశయ్య నవీన్’ గారికి ఈ ట్రస్టు తరఫున ప్రథమ పురస్కారంతోపాటు లక్ష రూపాయల నగదు, మరియు ప్రఖ్యాత చిత్రకారులు ఏలె లక్ష్మణ్‍కు విశిష్ట సత్కారం చేసినందుకు చాలా సంతోషిస్తున్నామని చెప్పారు. (పూర్తి వీడియో కొరకు https://youtu.be/Oeh1B5oj_MY- Narsinga RAO )
ఒక నవలను యాభై ఏళ్లపాటు చదివించడం అపురూపమే : ప్రసిద్ధ జానపద పరిశోధకులు ప్రొ.ఆర్.వి.ఎస్.సుందరం
ఒక నవల యాభై ఏళ్లపాటు చదువరులతో చదివించడం, మళ్లీ 13వ ముద్రణగా రావడం నిజంగా అపురూపమేనని, అలాంటి అంపశయ్య నవలను నవీన్ రాయడం గర్వించదగ్గ పరిణామం అని ప్రసిద్ధ జానపద పరిశోధకులు ఆచార్య ఆర్.వి.ఎస్.సుందరం అన్నారు. నవీన్ గారి ఎన్నో గొప్ప నవలల్ని వదిలేసి, అందరూ ‘అంపశయ్య’నే చెబుతున్నారని, ఇది నవలాకారునిగా నవీన్‍కు జరిగిన అన్యాయం అన్నారు. నవీన్ రాసిన నవలల్లో ‘మాగ్నమ్ ఓపస్’ అనతగ్గ నవల ‘కాలరేఖలు’ అని, కాలరేఖల్లో తెలంగాణ గ్రామీణ జీవితం చాలా విస్తృతంగా, లోతుగా చిత్రించబడిందన్నారు. గ్రామీణ జీవితం ఇంత విస్తృతంగా మరే తెలుగు నవల్లోనూ చిత్రించబడలేదు అన్నారు. 13వ శతాబ్దానికి చెందిన పాల్కురి సోమనాథుని కావ్యాల్లోనే గ్రామీణ జీవితం బలంగా, విస్తృతంగా చిత్రించబడిందని, ఆ తర్వాత మళ్ళీ నవీన్ గారి కాలరేఖల్లోనే అంత విస్తృతమైన గ్రామీణ జీవిత చిత్రణ ఉందని చెప్పారు. తను స్వయంగా కాలరేఖల్లోని పాత్రలతో మమేకమయ్యారని, పాత్రలతో పాఠకులు మమేకం కావడమే గొప్ప నవల లక్షణమని అన్నారు. అలాగే నవీన్ రచించిన మిగతా నవలల్లో కూడా పాఠకులను తనవెంట తీసుకువెళ్ళే లక్షణం ఉందని, ఉదాహరణకు ఆయన ఇటీవలనే రచించిన ‘‘ఇల్లు ఇల్లనియేవు….’’ అనే నవలను చదువుతూ నవీన్ గారికి మా ఇంట్లో జరిగిన సంఘటనలు ఎలా తెలిశాయని తాను చాలా ఆశ్చర్యపడ్డానని, ఎందుకంటే తమ ఇంట్లో జరిగిన సంఘటనలే ఈ ‘‘ఇల్లు ఇల్లనియేవు…’’లో ఉన్నాయని చెప్పారు. (పూర్తి వీడియో కొరకు https://youtu.be/TNMv7YYJKxM- Rvs )
‘కీర్తిశిఖర’ అవార్డుకు నవీన్‍ను ఎంపిక చేయడం అభినందనీయం : ప్రొఫెసర్ మృణాళిని
అంపశయ్య నవీన్ గారి కీర్తిశిఖర లైఫ్ టైమ్ అచీవ్‍మెంట్ అవార్డు 2019కు ఎంపిక చేయడం అభినందనీయం అని, మంచి ఎంపిక చేసినందుకు మణికొండ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ప్రొఫెసర్ మృణాళిని తెలిపారు. నవీన్ ప్రధానంగా ప్రయోగశీలి అని, ఆయన రాసిన ప్రతి నవలలోను యేదో ఒక వినూత్న ప్రయోగం ఉంటుందన్నారు. అంపశయ్య నవలను నవీన్ గారు చైతన్యస్రవంతి శిల్పంలో ఒక 16 గంటల యూనివర్సిటీ విద్యార్థి జీవితాన్ని చిత్రించాడని, ఇదివరకెవ్వరూ మొత్తం నవలను చైతన్యస్రవంతి శిల్పంలో రాయలేదని చెప్పారు. అయితే ప్రయోగం అన్నంత మాత్రాన పఠనీయతాగుణం ఉండదని అనుకోవద్దని, నవీన్ నవలల్లో పఠనీయతాగుణం పుష్కలంగా ఉంటుందన్నారు. ఈ పఠనీయతా గుణం కారణంగానే 50 యేళ్ళు గడిచినా ఈనాడు కూడా పాఠకులు అంపశయ్య నవలను చదువుతున్నారని అన్నారు. నవీన్ ‘‘చీకటిరోజులు’’ ఒక గొప్ప నవల అనీ, 1975 ఎమర్జెన్సీ రోజుల్లో ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఎలా ఖూనీ చెయ్యబడిందో ఈ నవల చిత్రించిందన్నారు. ఈ నవలను నవీన్ గారు డైరీ రూపంలో రాయడం ఒక ప్రయోగం అని అన్నారు. నవీన్ రచించిన మరో నవల ‘‘దృక్కోణాలు’’ కూడా ఒక ప్రయోగమేనని, ఒక సంఘటన యొక్క 8 వెర్షన్స్ని ఈ నవలలో నవీన్‍గారు చిత్రించారని మృణాళిని కొనియాడారు. నవీన్ రెండు నవలాత్రయాల్ని రాశారని- ఒకటి: అంపశయ్య, ముళ్ళపొదలు, అంతస్స్రవంతి; రెండోది: కాలరేఖలు, చెదిరిన స్వప్నాలు, బాంధవ్యాలు అనీ, మొదటి త్రయనవలల్లో మూడింట్లో మూడురోజుల జీవితమని, ఒకటి విద్యార్థి దశ, రెండోది నిరుద్యోగ దశ అనీ, మూడోది వైవాహిక జీవితదశ అని అన్నారు. రెండో త్రయనవలల్లో 50 యేళ్ళ తెలంగాణ చరిత్ర నిక్షిప్తమై
ఉందనీ, ఇలాంటి ప్రయోగాలు తెలుగులో మరెవరూ చెయ్యలేదని మృణాళిని గుర్తు చేశారు. ( పూర్తి వీడియో కొరకు https://youtu.be/wk_LO43BeBs- Mrunalini )
అంపశయ్య కంటె గొప్ప నవలల్ని రాశాను : అంపశయ్య నవీన్
ఒక రచయిత రాసిన మొదటి నవల అతనికొక శత్రువుగా (An artist’s first work will be his worst enemy) మారుతుందన్న నానుడి ఇంగ్లీషు భాషలో ఉందని, ఆమాట తనపట్ల నిజమైందని ప్రముఖ నవలాకారుడు, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ అన్నారు. ఆచార్య సుందరం గారు చెప్పినట్లు.. అందరూ తన మొదటి నవల ‘అంపశయ్య’నే చెబుతారని, తాను రాసిన వేరే నవలల గురించి చెప్పరని, నిజానికి తన అంపశయ్య కంటె గొప్ప నవలల్ని- ముఖ్యంగా కాలరేఖలు, చెదిరిన స్వప్నాలు, బాంధవ్యాలు, చీకటిరోజులు, విమెన్స్ కాలేజి, దృక్కోణాలు, రక్తకాసారం లాంటివి ఎన్నో రాశానని చెప్పారు. తన రచనలన్నింటిలోనూ పాఠకులను తమలోకి తాము చూసుకునేలా చేస్తానని, తమలోని చెడును సంహరించుకొని మంచి పెంచుకొని, ఉత్తమ మానవులుగా మారాలని చెప్పడానికే తను నవలలు రాస్తున్నానని చెప్పారు. గొప్ప సాహిత్యంలో సార్వజనీనత, సార్వకాలీనత ఉండాలని, ఎక్కడెక్కడో ఉన్న పాఠకులు తన నవలలు చదివి మా రహస్యాలన్నీ మీకెలా తెలిశాయని అడిగారని, సార్వజనీనత అంటే ఇదేనని చెప్పారు. భూపతిచంద్ర మెమోరియల్ ట్రస్టువారు తనకి కీర్తిశిఖర పురస్కారం ప్రదానం చేసినందుకు తాను చాలా సంతోషించానని, తనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించినప్పుడు ఎంత సంతోషించానో, ఇప్పుడు అంత సంతోషించానని, ట్రస్టు సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. (పూర్తి వీడియో కొరకు https://youtu.be/VSTdJkTQZOk- Naveen)
తెలుగు సాహిత్యం, కళల్లో విశేష కృషి చేసినవారికి ‘కీర్తిశిఖర’ పురస్కారం : ట్రస్ట్ ఛైర్మన్ శ్రీ మణికొండ లక్ష్మీకాంతరావు
తమ తల్లిదండ్రులు భూపతిరావు, చంద్రమ్మ గార్ల పేర్ల మీద భూపతిచంద్ర మెమోరియల్ ట్రస్టును స్థాపించామనీ, ఈ సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం తెలుగు సాహిత్యం, కళల్లో విశేష కృషి చేసిన ఒకరికి ‘కీర్తిశిఖర’ పురస్కారం’ పేరుతో సత్కరించాలని నిర్ణయం చేశామని ట్రస్ట్ ఛైర్మన్ శ్రీ మణికొండ లక్ష్మీకాంతరావు పేర్కొన్నారు. తెలుగు ప్రజలు గర్వించే సాహిత్యం రావాలని, అటువంటి సాహిత్యం వస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.
దర్శకులు బి.నర్సింగరావు ప్రోత్సాహం మరవలేనిది : ప్రముఖ ఆర్టిస్టు ఏలే లక్ష్మణ్
దర్శకులు బి.నర్సింగరావు సినిమాల ప్రభావం తనపై చాలా ఉందని ప్రముఖ ఆర్టిస్టు ఏలే లక్ష్మణ్ అన్నారు. అందరి సమక్షంలో తనను సన్మానం చేయడం గర్వకారణం అన్నారు. 1998లో ప్రజా గాయకులు గద్దర్ అన్న తనను తీసుకెళ్లి నర్సింగరావుకు పరిచయం చేసినట్లు చెప్పారు. తనను నర్సింగరావు ఎంతో ప్రోత్సహించినట్లు చెప్పారు. తనను ఎవ్వరూ ఆర్టిస్టుగా గుర్తించలేదని, ఆ సమయంలో నర్సింగరావు తనను దగ్గరకు తీసి ప్రోత్సహించినట్లు చెప్పారు. తమది గురు శిష్యుల అనుబంధం అన్నారు. తనకు ఎప్పుడైనా ఇన్స్ఫైర్ కావాలంటే ముందుగా ‘మా వూరు’ డాక్యుమెంటరీ చూస్తానన్నారు. తన మొదటి ఎగ్జిబిషన్ చిత్రాలు వేదకుమార్ సార్ కొని సేకరించి ప్రోత్సహించారన్నారు. . (పూర్తి వీడియో కొరకు https://youtu.be/AP-hbs6SEiE- Laxman )
ఈ సందర్భంగా అంపశయ్య నవీన్‍కు భూపతిచంద్ర కీర్తిశిఖర జీవన సాఫల్య పురస్కారాన్ని ఆచార్య ఆర్.వి.ఎస్. సుందరం గారు ప్రదానం చేశారు. దుశ్శాలువ, జ్ఞాపిక, మెమెంటోలతో పాటు లక్ష రూపాయల చెక్కును వారికి అందజేశారు. ఆ తర్వాత ప్రముఖ చిత్రకారుడు ఏలే లక్ష్మణ్‍ను శాలువాతో సత్కరించారు. ఈ సభలో బీసీఎంటీ ట్రస్టీ ఎం. వేదకుమార్ సభకు స్వాగతం పలికి అతిథులందర్నీ పరిచయం చేశారు.
ప్రముఖ సంగీత విద్వాంసులు నందకుమార్ బృందం వారి సితార, తబల, ప్లూట్‍ల సమ్మిళిత సుమధుర సంగీత పరిమళం సభా ప్రారంభానికి అందమైన నేపథ్యాన్నిచ్చింది. ఈ కళాకారులను మణికొండ లక్ష్మీకాంతరావుగారు సముచితంగా సత్కరించారు.బీసీఎం ట్రస్టీ యం. విజయకుమార్ ఒక గేయం వినిపించి వందనసమర్పణ చేశారు. భూపతిచంద్ర కుటుంబానికి చెందిన సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సభలో తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, బీసీ కమిషన్ చైర్మన్ బీ.ఎస్.రాములు, మాజీ ఐఏఎస్ అధికారి పాపారావు, జూలూరి గౌరీశంకర్, వెల్చాల కొండలరావు, పెద్దింటి అశోక్, వాసిరెడ్డి మళ్లీశ్వరి, ప్రొ.రఘు, కోట్ల వెంకటేశ్వర రెడ్డి, పత్తిపాక మోహన్, కె.పి.అశోక్‍కుమార్, జీవన్‍కుమార్, ఆర్టిస్టు జి.వై.గిరి, లాంటి ఎందరో ప్రముఖ సాహితీవేత్తలు పాల్గొన్నారు.
https://youtu.be/LPH_xbxTqVU- Vijay Kumar
https://youtu.be/Dv7yVzdXQ5c- MVK intro Ghanta
https://youtu.be/OAAxUjMvoPk- MVK intro Mrunalini
https://youtu.be/gsql2oxRLGA- MVK intro Laxma
– రామకృష్ణ కాంపాటి, ఎ : 9866168863