చూపులు వేలాడుతున్నప్పుడు
అడుగులు తడబడుతున్నవి
మరకలంటించుకొని జ్ఞానం పుస్తకాల్లోంచి
ఎగిరిపోయింది
ఆలోచనలు చుక్కల దారుల వెంట
నీటి ధారలే కనపడని వింత
దారుల విస్తరణ మరింత ఇరుకవుతుంది
చీకటి వేళ చీకటినే ముట్టించే
కన్ను ఎక్కడో మాయమయ్యింది
చేతుల కింద చురకత్తులు పరిహసించబడి
రాలుతున్న పూలకు ఉరేసుకున్నవి
ఎగురేసుకు పోయిన జెండాలు
పొలిమేరలు దాటంగనే వలలైపోయినవి
ఇప్పుడు చిలుకలకు పలుకులు లేవు
ఎలుకలు వలలు కొరికేది లేదు
చంపుడు పందెం పిల్లల ఆటల్లోనే పురుడు
పోసుకుంది
దీపం తలాపున నవ్వుతుంటే
సంధ్య వేళలు వెక్కిరిస్తున్నవి
గాలికి ఉడుకపోస్తుంటే
తరగతి గదులు తాళాలతో వేలాడుతున్నవి.
– ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్
ఎ : 9849082693