ఆదూర్‍ గోపాలకృష్ణన్‍


భారతీయ సినిమాకు అంతర్జాతీయ కీర్తి పతాకం


సినిమా ప్రంచంలో సృజనాత్మకతకు హద్దులు లేవని నిరూపించిన దర్శకుడు ఆదూర్‍ గోపాలకృష్ణన్‍. మలయాళంలో ఆయన రూపొందించిన చిత్రాలు జాతీయంగానే గాదు, అంతర్జాతీయంగా ప్రశంసంలందుకున్నవి. తన యేభై ఏళ్ల సినీ జీవితంలో పుంఖాను పుంఖాలుగా శతాధిక చిత్రాలు తీసిన దర్శకుడేమీకాదు. కేవలం డజను చిత్రాలు తీసి సత్యజిత్‍రే తరువాత భారతీయ సినిమా కీర్తి ప్రతిష్టలు ఆర్జించిన దర్శక మేధావి ఆయన. 12 సినిమాలేనా? అని మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఆయన ప్రతి చిత్రము తనదంటూ ఒక ప్రత్యేక ముద్రను, విలక్షణతను సంతరించుకుని రూపొందుతుంది. ఆదూర్‍ మలయాళ సినిమా రంగానికో, భారతీయ సినిమాకో పరిమితం కాకుండా ప్రపంచ సినిమా రంగానికి తన చిత్రాల ద్వారా జీవశక్తిని అందిస్తున్నారు. అన్ని అవలక్షణాలను వంటబట్టించుకుని భ్రష్టుపట్టిపోయిన భారతీయ సినిమా రంగాన్ని ప్రక్షాళన చేయడానికి రక్తరహిత యుద్ధాన్ని 50 ఏండ్లుగా కొనసాగిస్తున్నారు. అందుకే ఆయన తీసే ప్రతి సినిమా కోసం ఆతృతగా ఎదురుచూసే ప్రేక్షకులు దేశమంతటా మాత్రమే కాదు ప్రపంచమంతటా ఉన్నారు.


కేరళలోని పథనం తెట్టా జిల్లా ఆదూర్‍లో 1941 జులై 3న భూస్వామ్య కుటుంబంలో గోపాలకృష్ణన్‍ పుట్టారు. తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు కథాకళి నాట్యకళారూపాన్ని ప్రోత్సహించారు. రోజూ తొమ్మిది మైళ్లు నడిచి స్కూలుకు వెళ్లే ఆదూర్‍ ఎనిమిదో యేటనే వీధి నాటకాలాడారు. ఒకసారి తన కుటుంబ సభ్యులే ప్రేక్షకులుగా మారితే తను రాసి దర్శకత్వం వహించిన నాటకాల్ని ప్రదిర్శంచడాన్ని తన బాల్యంలో మరిచిపోలేని జ్ఞాపకంగా చెప్పకుంటారాయన. హైస్కూలు రోజుల్లోనే గ్రంథాయాల్లో తకళి శివశంకర్‍ పిళ్లై, వైకం మహమ్మద్‍ బషీర్‍, కేశవదేవ్‍ వంటి వారి రచనలు ఆదూర్‍ని ప్రభావితం చేసినవి. మధురైలో కాలేజీ చదివారు. 1960లో డిగ్రీ అందుకున్న ఆదూర్‍ కాలేజీ రోజుల్లోనే 10 నాటకాలు రాయడం 20 నాటకాలకు దర్శకత్వం వహించారు. జీవిక కోసం నేషనల్‍ షాంపిల్‍ సర్వేలో ఉద్యోగం చేశారు. సాహిత్యం, కళలు ఆయన్ని ఉద్యోగ జీవితంలో అట్టే ఇమడనీయ లేదు. దాంతో 1962లో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి పూణే ఫిలిం ఇన్‍స్టిట్యూట్‍లో స్క్రిప్టు రచన, డైరెక్షన్‍లో శిక్షణ పొందారు. ఇందుకాయనకు మెరిటో స్కాలర్‍షిప్‍ రావడం గొప్ప విషయం.


పూణేలో శిక్షణ పొంది తిరిగి వచ్చిన తరువాత 1965లో తొలిసారిగా ఫిలిం సొసైటీని ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. చాలా తక్కువమంది ఇందులో చేరారు. ఆయనే ప్రొజెక్టర్‍ ఆపరేట్‍ చేశారు. చాలా మంచి మంచి చిత్రాలు ప్రదర్శించారు. అలా ప్రారంభమైన ఫిలిం సొసైటీల ఉద్యమంలో కేరళలో ఆదూర్‍ నిర్వహించిన భూమిక చారిత్రాత్మకమైంది.


ఈ సందర్భంలో ఆదూర్‍కి ముందు మలయాళీ చిత్రరంగం తీరుతెన్నుల్ని ప్రస్తావించుకోవాలి. 1938లో కేరళలో ‘బాలన్‍’తో టాకీలు మొదలైతే అప్పటి నుండి దాదాపుగా పుక్కటి పురాణ చిత్రాలకు దూరంగా మనగలుగుతూ వచ్చింది. 1950లో తిరువనంతపురంలో మెర్రిలాండ్‍ స్టూడియో రాకతో కొత్త శకం ఆరంభమయినట్లయింది. అప్పటి దాకా తెలుగు, తమిళ భాషల చిత్రాలే కేరళలో ప్రదర్శిత మయ్యేది. అప్పట్లో వచ్చిన ‘నవలోకం’, ‘తిరుమాల’, ‘జీవితనౌక’ వంటి సాంఘికాలతో కేరళీయులకు తమ దర్శక నిర్మాతలపై విశ్వాసంపెరిగింది. సామాజిక ఇతివృత్తం గల జీవితనౌక, కార్మిక సమస్యను ఎత్తిచూపిన నవలోకం వచ్చాయి. కేరళలో నాటి వర్ణ వివక్షతను నిరశిస్తూ ఓ హరిజన యువతి దీనగాథను రామూకారియత్‍ ‘నీలక్కుయిల్‍’గా తీశారు. ఈ మధ్యకాలంలోనే పి.రాందాస్‍ అనే ఔత్సాహికుడు తన సహచరులందరితో కలిసి ప్రయోగాత్మకంగా ‘న్యూస్‍పేపర్‍ బాయ్‍’ తీసి 1955 జూన్‍లో అంటే సత్యజత్‍రే ‘పథేర్‍ పాంచాలి’ కన్నా మూడు నెలల ముందుగా విడుదల చేసారు. ఈ రామూకారియత్‍ ఆ తరువాత ‘మదినాయపుత్రన్‍’, ‘మిన్‍సోనుగ’, మాదుపడు చిత్రాలను అందించి 1965లో ‘‘చెమ్మీన్‍’’తో జాతీయ స్థాయిలో అవార్డు అందుకుని మలయాళీ సినిమా ప్రభావాన్ని ఇనుమడింపజేసారు.


ఈ నేపథ్యంలో ఆదూర్‍ మొదటిసారిగా దర్శకుడై ‘‘చిత్రలేఖ ఫిలిం కోఆపరేటివ్‍’’ని స్థాపించి 1972లో ‘స్వయంవరం’ నిర్మించారు. కేరళ సినిమా పరిశ్రమను మలపు తిప్పిన చిత్రమే గాక స్వయంవరం ఒక మైలురాయిగా నిలిచిపోయిన సిగ్నేచర్‍ ఫిలిం. తూర్పు ఐరోపా దర్శకులు, రిత్విక్‍ ఘటక్‍, సత్యజిత్‍రేల ప్రభావంతో ఈ స్వయం వరాన్ని తీసారు ఆదూర్‍.


స్వాతంత్య్రానికి పూర్వం భూస్వామ్య కదంబహస్తాల్లో కొట్టుమిట్టాడే కేరళ, ఆకస్మికంగా కమ్యూనిస్టుల ప్రాబల్యంలోకి రావడానికి దారితీసిన పరిణామాల్ని స్వయంవరం ప్రతిబింబించింది. ఇలాంటి సమాజంలో ప్రేమ మత్తులో పెళ్లాడి, జీవిత వాస్తవాల కనుగుణంగా బతికేందు కిష్టపడే జంటలోని భర్త అకస్మాత్తుగా మరణిస్తే పరిస్థితి ఏమిటనేదే స్వయంవరం ఇతివృత్తం.


పాత సంప్రదాయాలను పట్టకు వ్రేలాడే పెద్దల అభ్యంతరాలను త్రోసిరాజని తాముగా సమాజంలో స్వంతంగా, స్వయంశక్తితో బ్రతకగలమనే విశ్వాసంతో నగరంలోకి అడుగుపెడతారు సీత-విశ్వం. కానీ ఈ వ్యవస్థలో జీవితం పూలబాట కాదని అనుక్షణం ముళ్లే ఎదురౌతాయని చాలా ఆలస్యంగా గుర్తిస్తారు. విశ్వం తన ఆదర్శాలతో రచయితగా సమాజంలో మనలేకపోతాడు. దాంతో ఆదర్శాలను పక్కకు పెట్టి గత్యంతరంలేక కలప దుకాణంలో కొంతకాలం ట్యుటోరియల్‍ కాలేజీలో లెక్చరర్‍గా కొంత కాలం ఆ తరువాత మరొకటి ఎన్నిచోట్ల చేసిన స్థిరపడలేకపోతాడు. ఈ కష్టాల్లో సీతకు కొడుకు పుడతాడు. వీరి కష్టాలు మరిన్ని పెరుగుతాయి.
వాళ్లచుట్టూ బ్రతుకుతున్న వాళ్లు ఇలా సమస్యలతో జీవిత పోరాటాన్ని ఎంతో కాలంగా కొనసాగిస్తున్నారు. వారిలో ఒక్కొక్కరిదీ ఒక రకమైన జీవితం. వితంతువైన జానకి బియ్యం వ్యాపారం చేయగా, కళ్యాణి వేశ్యగా బతుకీడుస్తుంటంది. వాసు స్మగ్లర్‍. వీరంతా జీవితంలో దగాపడిన వారే.


ఇంతలో విశ్వానికి ఉన్నట్టుండి జబ్బుచేస్తుంది. భర్త బతకాలంటే మందులు కావాలి. వారిని ఆదుకునేవారు ఎవరూ లేరు. ‘స్వయంవరం’లో తానెన్నుకున్న జీవితం ఇలా పరిణమించే సరికి సీతకు దుఃఖించడం మినహా మరో మార్గంలేదు. ఆమె వేదన, దుఃఖం విశ్వాన్ని బ్రతికించలేకపోతాయి. ఇపుడు సీత ఎలా బతకాలి. వాసు, కళ్యాణి, జానకమ్మల లాగా ఏ మార్గాన్ని అనుసరించాలి. ఇలా సమాజాన్నే ప్రశ్నిస్తూ ముగుస్తుంది చిత్రం.


ఈ చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం, ఛాయాగ్రహణం. శారదకు ఉత్తమ నటి అవార్డులతోబాటు నాలుగు కేరళ రాష్ట్ర అవార్డులు అందుకోవడంతో కేరళలో కళాత్మక, వాస్తవిక చిత్రాల నిర్మాణం ఊపందుకుంది.
‘స్వయంవరం’ సాధించిన సంచలనంతో ఒక్కసారిగా మలయాళీ చిత్రరంగ ప్రాభవం జాతీయ స్థాయిలో చర్చనీయాంశ మైంది. ఒక రకంగా ఆదూర్‍ రాకతో మలయాళ చిత్రసీమలో కొత్తశకం ఆరంభమైంది. ఆ తరువాత ఆరవిందన్‍ వంటి ఔత్సాహిక దర్శకులు చిత్రరంగ ప్రవేశం చేసారు.


‘స్వయంవరం’ తరువాత మరో అయిదేళ్లకి 1977లో గాని ఆదూర్‍ రెండో చిత్రం ‘కొడియోట్టం’ వచ్చింది. కొడియోట్టం అంటే ఎదగడం. పేరుకు తగ్గట్టుగానే ఆదూర్‍ ఎదిగిన ఆలోచనలకు దర్పణం ఈ సినిమా. ఐదేళ్లు శ్రమించి తీసిన ఈ చిత్రంలో పాత సంప్రదాయాలకు స్వస్తి చెప్పారు. పేరున్న తారలు లేకుండా తీశారు. సినిమా అంతా కథలు కథలుగా కళ్లముందు జరిగినట్లుంది. విశేషం ఏమిటంటే ఈ సినిమాలో నేపథ్య సంగీతం లేదు. పకృతి పరంగా సహజంగా వినబడే శబ్దాలనే రికార్డ్ చేశారు.


జులాయిగా తిరిగే వ్యక్తి ఇతరులపై ఆధారపడి జీవిస్తూ బాధ్యతా రాహిత్యంగా తిరుగుతుంటాడు. స్వశక్తిమీద జీవించకుంటే సమాజం ఎవరినైనా క్షమించదనే వాస్తవాన్ని తెలుసుకున్న ఆ వ్యక్తి జీవితం ఎలా మారుతుందన్న అంశాన్ని ఆదూర్‍ కొడియెట్టంలో చిత్రీకరించారు. ‘కొడియెట్టం’ పలు అంతర్జాతీయ చిత్రోత్సావాల్లో పాల్గొన్నడమేగాక జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రం, గోపీకి ఉత్తమ నటుడుగు అవార్డులు, కేరళలో మరో అయిదు అవార్డులు అందుకుంది.
ఆదూర్‍ ఇప్పటి దాకా తీస్తున్న చిత్రాలన్నీ ఆత్మకథాత్మకమైనవి. కేరళ సామాజిక, సాంస్కృతిక జీవనంలో స్వాతంత్య్రం రాకముందు నుండి ఆ తర్వాత చోటు చేసుకున్న వివిధ పరిణామాలు ఆ చిత్రాల్లో మనకు స్పష్టంగా కనిపిస్తాయి. కేరళ జీవన మూలాలు ఆయన చిత్రాల్లో ఆవిష్కృత మవుతాయి. అయినా ఈ సినిమాలకు విశ్వ జనీనత ఉండటం విశేషం. నిర్దిష్టతను బలంగా పట్టించుకున్నందునే ఈ చిత్రాలకు విశ్వజనీనత ఉంటోంది. తన సినిమాలకు సంబంధించిన కథల విషయమై ఆదూర్‍ ‘‘నా చుట్టూ జరిగే మార్పులు వింత వింత అనుభవాల్ని, అనుభూతుల్ని మిగులుస్తాయి. ఆ అనుభవాలు, అనుభూతులు కొన్ని జ్ఞాపకాలలోకి వెళ్లిపోతాయి. ‘‘జ్ఞాపకాలు ఆలోచనల్ని రేకెత్తిస్తాయి. ఆ ఆలోచనలే కథా రూపం దాలుస్తాయి’’.


ఆదూర్‍ 1981లో తన మూడవ చిత్రం ‘‘ఎలిపత్తాయం’’ తీసారు. ఇది ఆయన తొలి కలర్‍ చిత్రం. సమాజంలో ఉమ్మడి కుటుంబాలకు కాలం చెల్లుతున్న రోజులవి. భూసంస్కరణ ఫలితంగా గ్రామాల్లో పేదలు చైతన్యవంతులు అవుతున్న తరుణమది. యువకులు ప్రేమవివాహాలు చేసుకుంటున్న కాలమది. మారుతున్న కాలమాన పరిస్థితులతో రాజీపడలేక, సమస్యల్ని పరిష్కరించే ధైర్యంలేక అవి ఎదురైనపుడు పిరికివాడిలా ఎలుకల బోను (ఎలిపత్తాయం)లోకి పరుగెత్తే ఓ భూకామందు కథే ఎలిపత్తాయం.


‘ఎలిపత్తాయాం’లో ముఖ్యపాత్ర పేరు ‘ఉన్ని’ మధ్య వయస్కుడు అవివాహితుడు. అతి నెమ్మదిగా ఆతని జీవన శైలి సాగుతుంటుంది. పెళ్లి వయసు దాటిన ఓ చెల్లెలు. కాలేజీ చదువుతున్న మరో చెల్లెలు. ఇదే ఉన్ని కుటుంబం. మార్పును కొత్త దనాన్ని చూసి తట్టుకోలేని మనస్తత్వం ఉన్నిది. అతనెంత బలహీన మనస్కుడంటే రాత్రివేళ తన గదిలో అలికిడి చేసే ఎలుకలు పెద్ద సమస్య. బద్దకస్తుడు. కాలంతోపాటు కాస్తయినా కదలని అతని మనస్తత్వాన్ని ఇలాంటి సంఘటనలతో చూపుతాడు ఆదూర్‍. పెళ్లయిన పెద్ద చెల్లలు ఆస్తిలో భాగం ఇవ్వమని తరచూ గొడవ పడుతుంది. రెండో చెల్లలు రాజమ్మ పెళ్లివకుండా వయసు దాటిపోతుంటుంది. ఈము ఉన్నితో కాస్త మానసికా అనుబంధం ఉన్న వ్యక్తి. ఈమె పెళ్లి సంబంధాలను ఏదోవిధంగా చెడగొడు తుంటూంది. ఇదంతా గమనిస్తున్న మూడో చెల్లలు ప్రేమించిన అబ్బాయితో పారిపోతుంది. ఇది ఉన్నికి పెద్ద ఎదురుదెబ్బ. చెల్లెలి ద్వారా బాహ్య ప్రపంచంలో ఉన్న కాస్త బంధమూ తెగిపోవడంతో ఒంటరిదైన రాజమ్మ తొందరగా జబ్బుపడిపోతుంది. ఆమెను పట్టించుకోక పోవడంతో అపస్మారక స్థితిలో ఉన్న రాజమ్మను గ్రామస్తులు తీసుకుపోతారు. దీంతో పూర్తిగా ఒంటరివాడైనా ఉన్ని మనసు చెదిరి తన ఇల్లునే బోనులు తలుపులు బాగించుకుని అశాంతిపాలై తిరుగుతుంటాడు.


ఫ్యూడల్‍ వ్యవస్థలో దోపిడికి నలిగిపోయిన రాజమ్మ పాత్ర ఎన్నో ఇళ్లలో మనం చూసిన విధవాడపడచుల పరిస్థితికి స్త్రీలోని వ్యక్తిత్వాన్ని కొన్ని యుగాలపాటు నిర్వీర్యం చేసిన నెమ్మది తనం, నిర్లక్ష్య మనస్తత్వపు బదనికలు ఊపిరాడకుండా చేసి చంపేసినా చక్కని నీడనివ్వగల వృక్షం రాజమ్మ పాత్ర. తన బలహీనతలతో మగవాడు స్త్రీని ఎంత బలంగా అణచివేయగలడనే విజ్ఞానాన్ని సాహిత్యంలో చలం ఎంత తీవ్రంగా చెప్పారో అంత బలంగాను సినిమాలో చెప్పింది ఆదూర్‍. ఆదుర్‍ ఎలిపత్తాయంను వెండి తెరపై ఒక అధి వాస్తవిక కథగా చెప్పుకుంటారు నవ్య సినిమా అభిమానులు.
ఎలిపత్తాయం ఇండియన్‍ పనోరమాలో ప్రదర్శితమవడమే గాక ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు, కేరళలో 6 అవార్డులు, బ్రిటిష్‍ ఫిలిం అవార్డు అందుకొని, కెన్స్, లండన్‍, చికాగో, న్యూయార్క్ ఫిల్మి ఫెస్టివల్స్ పాల్గొన్నది.
ఆదూర్‍ సినిమాల్లో విస్తృతంగా చర్చలకు, విమర్శలకు తెరతీసినది ‘ముఖాముఖం’. దీన్నొక రాజకీయ చిత్రమని, కమ్యూనిస్ట్ వ్యతిరేక చిత్రమని విమర్శలు రేగాయి. కాని 1957లో కేరళలో కమ్యూనిస్ట్ ఉద్యమ ప్రభావం, 1965లో పార్టీ చీలిక ఫలితంగా ప్రజల్లో తలెత్తిన సంఘర్షణలకు సమాధానంగా ముఖాముఖం తీసారు. ఒకరకంగా ఈ సినిమాకు ఆ తరువాత ఆయన తీసిన ‘కథా పురుషన్‍’కు ముందుమాటగా చెప్పుకుంటారు.
కార్మిక వర్గానికి ప్రతినిధి అయిన కమ్యూనిస్ట్ శ్రీధరన్‍ చిత్ర కథలో హీరో. అతనో చిన్న పట్టణంలో ఓ ప్యాక్టరీలో పనిచేసుకుని పొట్ట పోసుకునే కార్మికుడు. ఫ్యాక్టరీ యజమాని హత్యకు గురవడంతో శ్రీధరన్‍ తన కార్మికులతో కలిసి రహస్య స్థారవంలో తలదాచుకుంటాడు. తర్వాత చాలా ఏళ్లు గడుస్తాయి. ఈలోపల పార్టీలో రెండు చీలికలొస్తాయి. చివర్లో శ్రీధరన్‍ మళ్లీ తెరపైకి వస్తాడు.ఈసారి శ్రీధరన్‍లో చాలా మార్పులు కనిపిస్తాయి. ఆ తర్వాత అతను హత్య చేయబడతాడు. ఈ హత్యతో రెండుగా విడిపోయిన పార్టీ మళ్లీ ఒకటిగా రూపొందుతుంది. స్థూలంగా ఇదీ ముఖాముఖం చిత్రకథ. ఈ చిత్రంలో లెనిన్‍ దగ్గర్నుండి జన జీవనంలో ఏర్పడే సరికొత్త మార్పుల్ని గుర్తించి చర్చించారు ఆదూర్‍. ఈ చిత్రంపై విమర్శలకు సమాధానం చెబుతూ ఆదూర్‍ ఒక సందర్భంలో ‘‘నేను కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వానికి వ్యతిరేకం కాదు. ప్రాథమికంగా నేనొక దర్శకుణ్ని. నా చుట్టు జరుగుతున్న దానికి రియాక్ట్ అవుతాను. నేను ఫిలిం మేకర్‍ని కనుక నా చుట్టు జరుగుతున్న దానికి ప్రతిస్పందిస్తాను. ఫిలిం మేకర్‍గా నా ప్రతి స్పందన నా చిత్రాల్లో కనిపిస్తుందంటారు.


ఆదూర్‍ తను 1987లో రూపొందించిన ‘అనంతరం’ మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. అపారమైన తెలివితేటలున్న ఓ వ్యక్తి ఈ వ్యవస్థలో రాజీపడలేక సాధారణ వ్యక్తులతో కలిసి బతకలేక పడే అంతర్మధనాన్ని తెరకెక్కించారు. ఆదూర్‍ చిత్రాల్లో ఆలోచనకు పెద్దపీట ఉంటుంది. దాని ఆవిష్కరణలో విలక్షణత ఉంటుంది.
‘స్వయంవరం’ నుండి ‘అనంతరం’ వరకు తన స్వంత కథలతోనే సినిమాలు తీసిన ఆదూర్‍ తొలిసారిగా తన అభిమాన రచయిత వైకం మహమ్మద్‍ బషీర్‍ రాసిన ‘మతిలుకల్‍’ తీసారు. మానవ సంబంధాల్లోని సున్నితమైన ఆర్తిని, ప్రేమను తపనను అద్భుతంగా తెరకెక్కించారు ఆదూర్‍. జైలు గోడకు ఆవల ఉన్న ఒక మహిళా ఖైది కంఠ స్వరాన్ని విని ఆమెను గాఢంగా ప్రేమించిన ఓ ఖైదీ అంతర్లోకాల సంఘర్షణను ఆత్మీయంగా దర్శింపజేసే చిత్రం ‘మతిలుకల్‍’. సెల్యులాయిడ్‍పై కవిత్వంలా సాగుతుంది ‘మతిలుకల్‍’ చిత్రం. ఈ సినిమా కవి మహమ్మద్‍ బషీర్‍ జైలుజీవితాన్ని చిత్రిస్తుంది. రూపారూపాల ప్రతీకలతో, ఊహాకల్పనలతో స్త్రీ పురుషుల కలయికకు సంబంధించిన సున్నిత మాధుర్యంలో మతిలుకల్‍ సాగుతుంది. సగటు ప్రేక్షకుని స్థాయిని మించిన ఉన్నతి ఈ చిత్రంలో కనిపిస్తుంది.


వైకం మహమ్మద్‍ బషీర్‍ కథతో తీసిన ‘మతిలుకల్‍’కు లభించిన ఆదరణతో ఆదూర్‍ పాల్‍ జకరయ్య రాసిన నవల ఆధారంగా 1993లో ‘విధేయన్‍’ తీసారు. భూస్వామ్య వ్యవస్థలో స్త్రీ పురుష సంబంధాలను విస్తృతంగా విశ్లేషించిన చిత్రం విధేయన్‍. నిర్దాక్షిణ్యంగా ఉండే సంపన్నుడైన యజమాని విధేయుడైన నౌకరు భార్యపై అత్యాచారం చేస్తాడు. లైంగిక సంబంధాన్ని కొనసాగిస్తాడు. అతని దుర్మార్గాన్ని భర్తకు చెప్పాలని, ఎదిరించాలని ఆమె ప్రయత్నించదు ఎందుకంటే వ్యవస్థలో సహజమైన పురుషాధిక్యత వల్లనే తన్ను లైంగికంగా దోపిడీ చేయడం జరుగుతుందని ఆమె భావిస్తుంది. పొగరబోతు యజమానిగా ముమ్మట్టి, నౌకరుగా గోపకముల్‍ నటించారు. ముమ్మట్టికి రాష్ట్రస్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది. ఇండియన్‍ పనోరమాలో ప్రదర్శింపబడింది. కాగా తను రాసిన నవలను చిత్రానికి సంబంధంలేదని రచయిత జకరయ్య విమర్శించడంతో ఆ తర్వాత ఆదూర్‍ స్వంత కథమీదే సినిమాలు తీసారు. ఆ సినిమా ‘కథా పురుషన్‍’.
కథాపురుషన్‍ 1984లో తీసిన ‘ముఖాముఖం’కి కొనసాగింపు. కేరళ సమకాలీన చరిత్రలో అవిభాజ్యమైన కమ్యూనిజానికి రెండో పార్శ్వంగా రూపొందించిన చిత్రం ‘కథా పురుషన్‍’, నేషనల్‍ బ్రాడ్‍ కాస్టింగ్‍ కార్పొరేషన్‍ ఆఫ్‍ జపాన్‍ వారి సహకారంతో తీసిన ‘కథాపురుషన్‍’ గత 50 ఏళ్లలో కేరళలో వచ్చిన రాజకీయ, సాంఘిక మార్పులను ఆవిష్కరించింది.


బడుగుల కోసం ప్రాకులాడే కమ్యూనిస్ట్ నేతల్లో కొందరు పోలీసుల దాడులను భరించలేక ఉద్యమాన్ని విడిచి పోతారు. పోలీసుల నెదిరించి వ్యక్తి పోరాటం చేయడం సులభం కాదు. ప్రతి వ్యవస్థ తన్ను తాను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంది. వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడే ఆత్మవిశ్వాసం ఉద్యమకారులకు ఉండాలి. అపుడే అది సత్ఫలితాలనిస్తుందని ‘కథాపురుషన్‍’లో చర్చిస్తారు. ఆదుర్‍ ఇది జాతీయ ఉత్తమ చిత్రంగా ఎన్నికైంది. టోకియో మోటోరంటో డెన్మార్క్, లండన్‍ చిత్రోత్సవాలలో సహా 26 దేశాల్లో ప్రదర్శితమైంది. ఆదూర్‍ 2002లో తీసిన చిత్రం ‘నిళల్‍కుత్తు’ ఇది స్వంత కథనే. స్వాతంత్య్రానికి పూర్వం తిరువాంకుర్‍ సంస్థానంలో పనిచేసే ఒక తలారి జీవితకథను, రాజహింస తీరుతెన్నులను అత్యంత సున్నితంగా ఆవిష్కరించారు ఆదుర్‍.


నలభైవ దశకం నాటి ఈ కథలో కాళీయప్పన్‍ సంస్థానం నియమించిన తలారి రాజు నియంతగా అమలు చేసే ఉరితీతలకు ఈయన మౌన సాక్షి. ఉరి తీసిన తరువాత తాడును తెచ్చి పూజమందిరంలో ఉంచుతారు. తర్వాత దానిని కాల్చి రోగాలకు మందుగా వాడతారు. ఆయన కొడుకు మాత్రం గాంధేయవాది అతడు రాట్నం వడుకుతుంటాడు. మరోవైపు కాళీయప్ప ఉరి తాడు పేనుతుంటాడు. అలా అహింసకు చరఖా చిహ్నమైతే, రాజ్యహింసకు ఉరితాడు చిహ్నాలైతావి. గొప్ప ప్రతీకాత్మకంగా తీసిన ఈ సినిమాలో ఆదూర్‍ మరింత పరిణితి చెందినట్లు కనిపిస్తారు.
ఆదూర్‍ తరువాతి చిత్రాలు ‘‘నాలు పెన్నుంగళ్‍’’ (2007), ఒరుపెన్నుమ్‍(2008), పెన్నియమ్‍(2016). తకళి శివశంకర పిళ్లె రాసిన 4 కథల ఆధారంగా తీసిన చిత్రం ‘నాలు పెన్నుంగళ్‍’. 1940-1960ల మధ్యకాలంలో రాసిన కథలివి. ఒక వేశ్య, ఒక అవివాహిత, ఒక గృహిణి, ఒక ఎగువ మధ్యతరగతి మహిళల జీవితాలను తెరకెక్కించారు. వాళ్లు తమ తమ స్వంత వ్యక్తిత్వంలో జీవించే శైలిని చిత్రీకరించారు ఆదూర్‍.
చివరి చిత్రం ‘‘పిన్నియమ్‍’’ ఒక క్రైమ్‍ డ్రామాగా తీశారాయన. 80లనాటి వాస్తవ సంఘటన ఆధారంగా నిర్మించారాయన. కావ్యామాధవన్‍, దిలీప్‍, విజయరాఘవన్‍, తదితరులు నటించారు.


‘ఒక సినిమా మన సమకాలీన సమాజం నుంచే వస్తుంది. కానీ తప్పకుండా ఆ సమాజమే దాని ఆడియన్స్ కానవసరంలేదు’’ అని విభిన్నంగా అభిప్రాయపడే ఆదూర్‍ చిత్రాలన్నీ స్త్రీ జీవితాల చుట్టు పరిభ్రమిస్తాయి. స్వయంవరంలో సీత పాత్రతో మొదలు పిన్నియం వరకు ఆయన సినిమాలన్నీ స్త్రీ పాత్రల మనస్తత్వాలను, ఉన్నతంగా, స్వతంత్ర భావాలతో చూపిస్తారు. ఇదంతా తనకు తన తల్లి ప్రభావం వల్లనే సాధ్యమైందని అంటారాయన. శారద కావ్యామాధవన్‍ వంటి తారలు ఆయన పాత్రలకు ప్రాణం పోశారు. నాలు పెన్నుంగళ్‍లో ఆయన స్త్రీ పక్ష పాతం తారాస్థాయికి చేరుకుంటుంది. అందుకే భారతదేశంలో మొయిన్‍స్ట్రీమ్‍ సినిమాలు సాధించిన రికార్డుల ముందు ఆదూర్‍ చిత్రాలు కళాత్మకంగా, సామాజికంగా, అంతర్జాతీయంగా సాధించిన విజయాలు మరింత ఉన్నత స్థానంలో నిలుస్తాయి. ఆయన కథా చిత్రాలే గాకుండా 20 డాక్యుమెంటరీలు నిర్మించారు. ఎ గ్రేట్‍ డే (1965), ఎ డే ఎట్‍ కోవలమ్‍(1966), ది మిత్‍ (1967), యువర్‍ ఫుడ్‍ (1989), రొమాన్స్ ఆఫ్‍ రబ్బర్‍ (1971), గురు చెంగన్నూర్‍ (1974), చోళాహెరిటేజ్‍ (1980) వాటిలో కొన్ని.


50 సంవత్సరాల సినిమారంగ సేవలకు పద్మశ్రీ (1984) మహాత్మాగాంధీ, కేరళ విశ్వవిద్యాలయాల గౌరవ డాక్టరేట్లు, దాదాఫాల్కే 2004 అవార్డు, కేరళ సాహిత్య అకాడమి పురస్కారం, పద్మవిభూషణ్‍ (2006) భూపేన్‍ హజారికా అంతర్జాతీయ పురస్కారం, వారి సినిమాలకు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో లెక్కలేనన్ని అవార్డులు వచ్చినవి. ‘స్వయంవరం’ నుండి ‘పెన్నియమ్‍’ వరకు తీసిన 12 సినిమాలలో కనిపించే ఒరవడి ఒక ప్రత్యేకమైన లయను తలపింపజేస్తుంది. అది ఎక్కడా తప్పినట్లు కనిపించదు. ఆయన పదమూడో చిత్రం కోసం విభిన్న సినిమా అభిమానులు ఎదురు చూస్తున్నారు.

  • హెచ్‍.రమేష్‍బాబు,
    ఎ: 7780736386

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *