మహాకవి పాలకురికి సోమనాథుని జన్మస్థలమైన తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మినరసింహ స్వామి దేవస్థాన ప్రాంగణంలో 2019 డిసెంబర్ 29 ఆదివారం నాడు సోమనాథ కళాపీఠం పురస్కార ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. సభా కార్యక్రమానికి ముందు ప్రాంగణంలోని బసవేశ్వర, సోమనాథ విగ్రహాలకు నిర్వాహకులు పూలమాలలు వేసి శరణు ఘటించిండ్రు. పీఠం కార్యదర్శి తమ్మి దిలీప్ కుమార్ సమావేశ పరచగా, అధ్యక్షురాలు రాపోలు శోభ రాణి సభాధ్యక్షత వహించిండ్రు. గౌరవ అధ్యక్షుడు డాక్టర్ రాపోలు సత్యనారాయణ సభా సమన్వయం చేసిండ్రు. పూర్వ పార్లమెంట్ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్, తెలంగాణ గిరిజన సహకార సంస్థ మాజీ చైర్మన్ ధరావత్ మోహన్ గాంధీ నాయక్ ప్రత్యేక అతిథులుగా విచ్చేయగా, నేషనల్ బుక్ ట్రస్ట్ తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల కార్యక్రమ అధికారి డాక్టర్ పత్తిపాక మోహన్, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ ఉషా దయాకర్ రావు విశిష్ట అతిథులుగా సభను అలంకరించిండ్రు. 2018 సంవత్సరానికి ఎంపికైన సాహితీ మూర్తులకు, ప్రతిభా వంతులకు అతిథుల చేతుల మీద పురస్కార ప్రదానం జరిగింది.
జమ్మలమడుగుకు చెందిన బసవ పురాణ పరిశోధకుడు ‘డాక్టర్ సత్తెనపల్లి బాబు’ ‘‘సోమనాథ సాహిత్య పురస్కారం’’బీ మహబూబ్ నగర్ కు చెందిన బహుగ్రంథకర్త, విశ్వగురు పత్రిక సంపాదకుడు లింగైక్య ‘కొండ బసవరాజు’ పక్షాన ఆయన కుటుంబ సభ్యులు ‘‘సోమనాథ సామాజిక శోధన పురస్కారం’’బీ పౌరాణిక నటుడు, పరకాల నివాసి ‘ఏరుకొండ రామదాసు’ ‘‘సోమనాథ రంగస్థల పురస్కారం’’బీ వరదన్నపేట కవి, ప్రపంచ రికార్డ్ గీత రచయిత ‘మౌనశ్రీ మల్లిక్’ ‘‘విశేష పురస్కారం’’బీ సిద్ధిపేట రచయిత ‘ఐత చంద్రయ్య’ ‘‘పందిళ్ల శేఖర్ బాబు రాజయ్య శాస్త్రి స్మారక స్వచ్ఛంద భాషా సేవ పురస్కారం’’బీ రాజమహేంద్రవరం సాహితీవేత్త ‘ఎస్ ఆర్ పృథ్వి’ ‘‘వీరమనేని చలపతి రావు ప్రోత్సాహక సాహిత్య పురస్కారం’’బీ రాఘవాపురం శాస్త్రవేత్త ‘డాక్టర్ పెంతల సుధాకర్’ ‘‘డాక్టర్ రాపోలు సోమయ్య స్మారక ప్రతిభా పురస్కారం’’ అందుకొన్నరు. కాగా, విజయవాడ నుంచి వచ్చిన ‘శంఖుల శ్యామ్’ సోమనాథుని సాహిత్యాన్ని ధ్వనిముద్రణ చేయిస్తున్నందుకు ‘‘సోమనాథ ప్రియ’’బీ మంద్ర స్వర మాంత్రికుడు వరంగల్ వాసి ‘పోగుల సాంబయ్య’ ‘‘స్వర సాంద్ర’’ బిరుదులను స్వీకరించిండ్రు.
ఈ పురస్కృతులను శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం, పోల్సాని వేణుగోపాల్ రావు, పందిళ్ల అశోక్ కుమార్ సోదరులు, వీరమనేని శేషగిరి రావు మెమోరియల్ ట్రస్ట్, రాపోలు సుభద్ర, దేవగిరి సోమన్న శర్మ సోదరుల సౌజన్యంతో అందచేసిండ్రు.
రాజ్యసభ మాజీ సభ్యులు రాపోలు ఆనందభాస్కర్ ప్రత్యేక అతిథిగా ప్రసంగిస్తూ, సోమనాథుని భావజాలాన్ని భవిష్యత్ తరాలకు అందించ వలసిన అవసరాన్ని గుర్తు చేసిండ్రు. పండిత భాష ప్రామాణికంగా ఉన్న రోజుల్లో ప్రజల వాణిలో, ప్రజల బాణిలో వ్రాసిన కవి పాల్కురికి సోమనాథుడు అన్నరు. అందుకే సోమనాథుడు కేవలం శివ కవిగా మాత్రమేగాక, ప్రజల కవిగా ప్రసిద్ధి చెందిండని, విప్లవ కవిగా కీర్తి పొందిండని రాపోలు చెప్పిండ్రు. వ్యయ ప్రయాసల కోర్చి ఎంతో దీక్షతో 27 ఏండ్లుగా సోమనాథ కళా పీఠం కార్యకలాపాలను కొనసాగిస్తున్న నిర్వాహకులను ఆయన ఈ సందర్భంగా ఆయన అభినందించిండ్రు.
నేషనల్ బుక్ ట్రస్ట్ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల ఇన్ చార్జ్ డాక్టర్ పత్తి పాక మోహన్ మాట్లాడుతూ, తెలంగాణ సాహిత్య గడ్డ, అడ్డా అన్నరు. సోమనాథుడు తొలి స్వతంత్ర కవి, విజ్ఞాన కవి, విశేష కవి అని అన్నరు. ఇక్కడి పాలకుర్తి ప్రాంతంలో ఏదో తెలియని మహత్తు ఉందని, అందుకే ఇక్కడి నుంచి సోమనాథుడు, బమ్మెర పోతన మొదలు నేటిదాకా అనేక మంది కవులు, రచయితలు పుట్టుక వస్తున్నరని అన్నరు.
ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి ఉషా దయాకర్ రావు మాట్లాడుతూ, సోమనాథ కవి రచనా విశిష్టతలను ఇప్పటి ప్రజలకు అందించ వల్సిన బాధ్యతను కవులు, రచయితలు తీసుకోవాలన్నరు. ఇలాంటి బృహత్తర కార్యక్రమాలను చేపడుతున్న పీఠం కార్యవర్గాన్ని అభినందించిండ్రు. మంత్రి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో బిజీ గా ఉండటం వల్ల తాను వచ్చిన్నని సంతోషం వ్యక్తం చేసిండ్రు.
తెలంగాణ గిరిజన సహకార సంస్థ పూర్వ చైర్మన్ మోహన్ గాంధీ నాయక్, పాలకుర్తి సర్పంచ్ వీరమనేని యాకాంత రావు తదితరులు ప్రసంగించిండ్రు. కార్యక్రమంలో కుమారి పోగుల చైతన్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన, సాంబయ్య శివ పంచాక్షరి గానం అందరినీ అలరించినయి. అంధ కళాకారులు మారోజు భీష్మాచారి, శంకరాచారి సోదరులు వాద్య సహకారం అందించిండ్రు.
ఇంకా ఈ కార్యక్రమంలో ప్రముఖులు గుండేటి శ్రీధర్, ఏ సోమేశ్వర్ రావు, పందిళ్ల అశోక్ కుమార్, డాక్టర్ పల్లేరు కళాధర్, ముస్కు రాంబాబు, మదార్, సర్వర్ ఖాన్, కొండ బసవరాజు కుమారుడు మహేశ్ చంద్ర, సాహితీ వేత్తలు డాక్టర్ లింగంపల్లి రామచంద్ర, డాక్టర్ పల్లేరు వీరస్వామి, జిలుకర వెంకన్న, అవసరాల ప్రసాద శర్మ, సొన్నాయిల కృష్ణవేణి, ఏరుకొండ శశిరేఖ, పత్తిపాక చందన, మాన్యపు భుజేందర్, కూటికంటి సోమయ్య, గందె పుల్లయ్య, దేవస్థాన సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, సిబ్బంది అశోక్, సతీశ్, సుధాకర్, నిరంజన్, అర్చకులు దేవగిరి రామన్న, దేవగిరి లక్ష్మన్న, డివిఆర్ శర్మ, అనిల్ శర్మ, మత్తగజం నాగరాజు, చిక్కమఠం పర్వతప్ప, పీఠం బాధ్యులు ఇమ్మడి దామోదర్, జక్కుల రవీందర్, మార్గం లక్ష్మీ నారాయణ, గుమ్మడి రాజుల సాంబయ్య, వీరమనేని వెంకటేశ్వర్ రావు, మేరుగు మధు, మామిండ్ల రమేశ్ రాజా, గూడూరు లెనిన్, మార్గం సాయి సందీప్ తేజ, శంకరమంచి శ్రీకాంత్, చిలుకమారి వాసుదేవ్, మోకాటి కుమార్ తదితరులు పాల్గొన్నరు.
-డాక్టర్ రాపోలు సత్యనారాయణ
ఎ : 9440163211